welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Wednesday, March 21, 2007

అక్షర బ్రహ్మ వేటూరి సుందర రామ మూర్తి.

అక్షర బ్రహ్మ వేటూరి సుందర రామ మూర్తి.

'సంధ్యారాగం చంద్ర హారతి పడుతున్న వేళలో మసక చీకట్లు పాడే మధ్యమావతి రాగాన్నీ ఆయన మనకోసం తీసుకువస్తాడు! 'చీరలన్ని దోచి దేహ చింతలన్ని తీర్చినాడే' అని కృష్ణతత్వాన్ని మనోహరంగా వివరిస్తాడు! పదాల సుమాలతో ఆమని పాటను చైత్ర సుగంధంలా వెదజల్లుతాడు! 'మర్మస్థానం కాదది నీ జన్మస్థానం' అని శీలవంతంగా, సొగసుగా చెప్పగలిగిన కలం వారిది... ఆయనే సరస్వతీ కటాక్షం పొందిన అక్షర బ్రహ్మ వేటూరి సుందర రామ మూర్తి.

సినిమాలోని ఒక సన్నివేశ సారాన్ని మధించి, కుదించ్*, ముచ్చటైన పాటగా రాసి ప్రేక్షకుల హృదయాలను స్పృశించి, ఆ హృదయాలలోనే తిష్టవేసుకొని కూర్చునేలా ఎంతో గొప్పగా, రమణీయంగా సినీ గీతాలను వ్రాసిన ప్రముఖ కవులలో వేటూరి సుందర రామ మూర్తి పేరు వినని వారుండరు. మంచి ట్యూనుకు గొప్ప సాహిత్యం తోడైతే బంగారానికి తావి అబ్బినట్ట్లే. వేటూరి తొలి పాటకు సరిగమలు దిద్దింది పెండ్యాలగారయితే, తొలి సినిమా పాటకు స్వరాలు అద్దింది శ్రీ కె.వి.మహదేవన్*.

1972లో నిర్మించిన 'ఓ సీతకధ ' (ఇదే చిత్రంతో విజయంతీ మూవీస్* అధినేత సి.అస్వనీదత్* నిర్మాతగా పరిచయం అయ్యారు) చిత్రంలో "భారతనారీ చరితము - మధుర కధా భరితము " అనే పాట ద్వారా సినీ రంగ ప్రవేసం చేసి గత నాలుగు దశాబ్దాలుగా మహాకవిగా, రచయితగా ప్రథమ తాంబూలం అందుకుంటూనే వున్నారు. పదాల ఒరవడి, పొందిక, సదర్భ ప్రాధాన్యం కలిగిన సినీగీతాలను అందించిన సహితీ భోగిని స్మరించకుండా ప్రస్తావించకుండా వుండని వారెవ్వరు? నీటిధారలుగా మారి, గాగై, ఈరై, నదీఇ, సాగరమైనట్ట్లు ఇప్పటి వరకు వేటూరి కలం నుండి జాలువారిన పాటలు ఎనిమిదివేల పైచిలుకే. ' మాత్రుదేవోభవ ' అనే చిత్రంలో ' రాలిపోయే పువ్వానీకు రాగాలెందుకే .. ' అనే పాటతో 1995 ఫిబ్రవరి 2న జాతీయ ఆవార్డును అందుకున్నా.. ఎంత ఎదిగినా ఒదిగి వుండగల వినయం వేటూరి హృదయం. వేటూరి వారు రాచిన ప్రతి పాటలోనూ సాహిత్య గంధం గుభాళిస్తూనే వుంటుంది.

"కృషి వుంటే మనుషులు ఋషులవుతారు, మహా పురుషులౌతారు " , "మనిసై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ పట్టుదలే వుంటే కాగలడు మరో బ్రహ్మ" అని ఆయన రాచిన పంచి లైనులు ఇప్పటికి అందరినోట వినిపిస్తూనే వుంటాయి. ఓ కవి చెప్పినట్లు వెన్నెల, చిరుగాలి, సెలయేరు ఎప్పుడూ ఒకేలా వుంటాయి. చూసే కన్నుల్లోనే తేడా వసుంది. అక్షరాలు, పదాలు, వాక్యాలు, ఎప్పుడూ ఒకేలా వుంటాయి . రాసే పెన్నులోనే తేడా వసుంది. వెన్నెలలో పన్నీరు పారబోసి, చిరుగాలిలో మల్లెలు ఆరబోసి, సెలయేటిలో మృదంగనాదం కలబోసి కొత్త అందాలు చూసే కన్ను వున్నవాడు వేటూరి సుందర రామ మూర్తి.

హిందిలో ఆనంద్* బక్షీకి , తమిళంలో కణ్ణదాస లకు ప్రతిరూపంగా తెలుగులో వేటూరి ప్రత్యేక స్థానాన్ని అందుకున్నారు. వేటూరికి బొంబాయిలో 'అంధ్రాబక్షి ' అని బిరుదునామం వుంది. నటుడు జితేంద్ర, బప్పీలహరి ఆయనను ఆ పేరుతో పిలవడం పరిపాటి. అలాగే ఎం.ఎస్*.విస్వనాధ్* గారికి వేటూరిని తెలుంగు కణ్ణదాసన్* అని పిలవడం అలవాటు.

ఆయన రాసిన ప్రతి అక్షరం, ఆ అక్షరాలు కలసిన పదం, పదాన్ని అందుకున్న చరణం అన్నీ ఆచితూచి వాడిన వేటూరి, బాపు దర్సకత్వంలో రూపొందిన "మిస్టర్* పెళ్ళాం " చిత్రంలో ఈ గీతాన్ని సానబట్టిన వజ్రంగా మలిచారు ...

"కురులు దువ్వినా జడలు అల్లినా
మరులు రువ్వినా మతులు పొయినా
అందమే సుమా ఆమె భంగిమా.. " అని ఆయన కలం సమాధాన పడక
.
" అరుగు మీద నిలబడి నీ కురులను దువ్విన వేళ
చేజారిన దువ్వెనకు బేజారుగా వంగినపుడు
చిరుకోపం చీరగట్టి సిగ్గును చెంగున దాచి
ఫక్కుమన్న చక్కదనం పరుగో పరుగెతినప్పుడు.... ఆ సొగసు చూడ తరమా" అనుకుంటే గాని తృప్తి చెందలేదు. 'సొగసు చూడతరమా..." అనే పల్లవిని ఎన్నుకోవాలని స్ఫురించడం ఒక్క వేటూరికే సాధ్యం.....
.
జంధ్యాల దర్శకత్వంలో రూపొందిన "రెండు జళ్ళ సీత " సినిమాలో వేటురి ఒక పాట రాశారు అది...
"మాగాయే మహా పచ్చడి
పెరుగేస్తే మహత్తరి
అదివేస్తే అడ్డవిస్తరి
మానిన్యాం మహా సుందరి " ఇలా ఎందుకు చెప్పాలని అనిపించింది అని ఒక పత్రికా విలేఖరి అడిగిన ప్రశ్నకు వేటూరి ఇలా అన్నారు.
ఇదొక పేరడీ పద్యం. దీని ఒరిజినల్* వేరే వుంది. ఓ సారి మా అమ్మమ్మ సరదాగా నాతో ఓ పద్యం చెప్పారు..
శ్రీకాకుళే మహాక్షేత్రే
కడేరే మహానదీ
అంకినీడే మహాప్రభూ
ఈతముల్లే ప్రాణహానీ
ఈ పద్యాన్నే నేను మాగాయే మహాపచ్చడిలా మలచుకున్నాను అన్నారు వేటూరి. పద్యాన్ని పేరడీగా మార్చగల నైపుణ్యం ఆయన సొత్తు. ఆత్రేయ నా సొంత మనిసి - వింత మనిషి - ఋషి. ఒక జీవితకాలం పాటు తన గుండె గుట్టుగా చేసిన చప్పుళ్ళే ఆత్రేయ పాటలు .. అని ఆత్రేయ గురించి వేటూరి చెబుతూ వుంటారు.
అలాంటి అత్రేయను ఒక సందర్భంలో వేటూరి మెప్పించారు.' ఆడది మెచ్చిందే అందం ' అన్నారు పెద్దలు. అలాగే 'తోటి కవి మెచ్చిందే కవిత్వం ' అనాల్సిన రోజులివి. ఓ సారి వేటూరి సాగరసగమం లోని ఓ పాటలో ఈశ్వరుని వర్ణిస్తూ అతని త్రినేత్రాలను భూత భవిష్యత్* వర్తమానాలతో పోల్చారు. అది విన్న ఆత్రేయ - 'కాళ్ళులాగ, చేతుల్లాగ కాకుండా కళ్ళు ముఖంలో స్థిరంగా వుండి కదలలేవు కదా! వాటిని గమించే స్వభావంగల త్రికాలాలతో ఎందుకు పోల్చావు? " అని అడిగారు. దానికి వేటూరి - ' కనులకు గమించే స్వభావం లేక పోయినా, రెప్పలకు ఓ లయ వుంది. వాటితోనే తాళం సమయం ముడి పడి వున్నాయి. కాలనిర్ణయానికి మూలమైన 'లిప్త ' పాటు కాలం (కనురెప్పల కాలం) కనురెప్పల కదలికలోనించి పుట్టిందే! కనుక ఈ మూడుకన్నులను త్రికాలాలతో పోల్చాను. మీరు ఎడమ నుండి కుడికిగాని, కుడి నుండి ఎడమకు గాని కన్నులను త్రికాలాలకు కేటాయించుకుంటే మూడో కన్ను ఖచ్చితంగా భవిష్యత్తుకి సంబంధించినదై తీరుతుంది. ఆ కన్ను తెరిస్తే అంతా భస్మం. భవిష్యత్తు తెలుసుకోవాలంటే కూడా అదే మిగులుతుంది. అందుకే ఆ కన్ను మూసి వుంటుంది. అందుకే మనకు భవిష్యత్తు అగోచరంగానే వుంటుంది " అని విశ్లేషించి చెప్పారు. దానికి ఆత్రేయ సంతోషించారు. అలాగే ఆత్రేయకు నచ్చిన వేటూరి పాట.


'ఎవరికెవరు ఈ లోకంలో ఎవరికి ఎరుక
ఏదారెటుపోతుందో ఏరినీ అడుగక ... 'వేటూరి సూక్ష్మదృస్ఠి వున్నవారు.

ఒక అర్ధాన్ని ఎంతో ఆకళింపు చేసుకొని పదాలను సృస్ఠిస్తారు. పదాలను స్థూలదృస్ఠితోకాక సూక్ష్మదృస్ఠితో చూడాలి అని తెలుసుకుంది ఆయన పెదనన్న గారయిన కీ.శే. వేటూరి ప్రభాకర శాస్త్రి గారి వల్ల అదెలానో చూద్దాం ...

"వాగర్ధా వివసంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తాయే
జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ "

'సాగర సంగమం ' చిత్రంలో విన్న ఈ శ్లోకం కాళిదాసు రచించిన రఘువంశ కావ్య సంపుటిలోనిది ఇది అందరికి గురుండే వుంటుంది. ఈ శ్లోకాన్ని వేటూరి చిన్న తనంలో వల్లె వేస్తుండగా ప్రభాకరశాస్త్రి గారు వచ్చి "చివరి చరణం అర్ధం ఏమిటో తెలుసా? " అని అడిగారు.

' ఈ జగత్తుకి తల్లి తండ్రులైన పార్వతీ పరమేస్వరులకు నమస్కారిస్తున్నాను అని అర్ధం " అన్నారు వేటూరి.
"పితరౌ" అంటే తల్లి దండ్రులు అనే ఎందుకు కావాలి? పెతరౌ అంటే తండ్రికి ద్వివచనంగ అంటే తండ్రులు అని అర్ధం అన్నరు ప్రభాకరశాస్త్రి.
.
అలోచనలో పడ్డారు వేటూరి."కాళిదాసు రాస్తున్నది విస్ణువుకు సంబంధించిన రఘువంశ కావ్యం. అందునుంచి విస్ణువునే స్తుతించాలి, కానీ సహజంగా కాళిదాసు శివభక్తుడు కావటం చేత శివుడు, విస్ణువు ఇద్దరూ జగతికి తండ్రులు అని అన్నాడు" అని పెదనన్న ప్రభాకరశాస్త్రి వివరించారు.
.
"మరి పార్వతీ పరమేస్వరౌ " అని అన్నడు కదా ?" అని తన సందేహాన్ని వెలిబుచ్చాడు వేటూరి.
.
"దానిని ఇలా విడతీసుకో, 'పార్వతీపా అంటే పార్వతి భర్త ఐన శివుడు, రమేశ్వరుడు అంటే రమ (లక్ష్మి) భర్త ఐన విస్ణువు అని అర్ధం కావచ్చుగా " అని విశ్లేషించారు ప్రభాకర శాస్త్రి.

అప్పుడు పదాన్ని దివదీసి సూక్ష్మదృస్ఠితో చూడటంలో గల విజ్ఞత అర్ధమయింది వేటూరికి. ఈ సంఘటన ఫలితమే 'సాగరసంగమం ' చిత్రంలోని ఆ శ్లోకం.

వేటూరిని సరసకవి అని కూడా సంభోదిస్తుంటారు...
తెలుగు సినీ సాహిత్య చరిత్రలో ఇంతగా స్త్రీల హృదయాలకు దగ్గరగా వెళ్ళిన కవి లేడు. నీలంగా నిశబ్దంగా ఉండే ఆకాశానికి చక్కిలిగింతలు పెట్టి మెరుపులను నవ్వించగ సాహిత్యం, గానమై పిలిచి, కలలతో అలసి గగనమై ఎగసిపోయే విశ్వాసం గల కవి అంతరాత్మవేటూరిది.

"చినుకులా రాలి.. నదులుగా సాగి ..
వరదలై పోయి ... కడలిలా పొంగు
నీ ప్రేమా నా ప్రేమా...

నిన్నటి దాక శిలనైనా
నీ పదము శోకి నే గౌతమినైనా..

ఏ కులము నీదంటే గోకులము నవ్వింది
మాధవుదు ఆదవుదు మా కులమే లెమ్మంది ...
పాటలు ఆశువ్గా పాడుకోవడానికి హృదయంలో కదలాడుతుంటాయి.

మనసా తుళ్ళి పడకే .. అతిగా ఆశపడకే
అతనికి నీవు నచ్చావో లేదో ఆ శుభ ఘడియ వచేనో రాదో
తొందర పడకే మనసా అలుసే తెలుసా ?!
సమాజంలో పెళ్ళి చూపులు పేరుతో గాయపడిన స్త్రీ హృదయాన్ని ఈ పాటలో ఆవిష్కరించారు వేటూరి.
వేటూరి వంటి కవికి తన కవితావేశాన్ని నిగ్రహించుకొని మాసు పాటలు, మసాలా పాటలు రాయడం ఎంతో బాధను కలిగించే విషయం. అంతరంగ మధనం ఆనందాన్ని హరించే సంఘర్షణలో వున్నా.. తన భావావేశాన్ని భరించి సమర్ధించి ప్రోత్సహించగలిగే దర్శకుడు, నిర్మాత ఎదురైనప్పుదు తన కవితా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూనే వుంటారు.

వేటూరి సాహిత్యంలో మానసికంగా సేదతీర్చుకునే అభిమానులు ఎందరో .. ఎలా చెప్పుకుంటూ పోతే ఆయన రచన విధానంపై ఒక పెద్ద గ్రంధమే తయారవుతుంది ........--రాగలహరికి క్రృతజ్ఞతలతో

2 comments:

S said...

Thats a very well written article. Thanks.

Anonymous said...

Maadhavudu aadavudhu ...is wrong

Maadhavudu Yaadavudu -- is write please correct it..