welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Wednesday, August 29, 2012

హనుమంతుడి టి.ఏ. బిల్లు


లంకలో  రామ రావణ యుద్ధం ముగిసింది. లంకేశ్వరుడి మరణం తరువాత రాముడు పుష్పక విమానంపై  అయోధ్యకు తిరిగివచ్చి ఘనంగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ కోలాహలంలో పాత టియ్యే బిల్లులు సకాలంలో క్లెయిం చేసుకోకపోతే ఆ తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని అయోధ్యలో అనుభవశాలి ఒకరు సలహా చెప్పడంతో ఆంజనేయుడు ఎందుకయినా మంచిదని ముందుగానే తన బిల్లును సబ్మిట్ చేసాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు సంజీవని మూలికను తేవడానికి వెళ్ళివచ్చినప్పటి ప్రయాణ భత్యం బిల్లు అది.
టియ్యే బిల్లు సెక్షన్లో పనిచేసే డీలింగ్ అసిస్టెంట్ తన బుద్ధి పోనిచ్చుకోకుండా అలవాటు ప్రకారం మూడు కొర్రీలు వేశాడు.
హనుమంతుడు ఈ టూరుకు ముందుగా అప్పటి రాజయిన భరతుడి  లిఖితపూర్వక అనుమతి తీసుకోలేదన్నది మొదటి అభ్యంతరం కాగాఅంజనీ సుతుడికి తన ఉద్యోగ హోదా రీత్యా విమానంలో (గాలిలో) ప్రయాణించే అర్హత లేదన్నది రెండోది. ముందస్తు అనుమతి తీసుకోకుండా గాలిలో యెగిరి వెళ్లి సంజీవని తీసుకువచ్చాడు. అందువల్ల అతడు సబ్మిట్ చేసిన బిల్లు నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాదు. పోతేఅతడ్నిసంజీవని మూలికను మాత్రమే తీసుకురమ్మని పంపారు. కానీ మొత్తం సంజీవని పర్వతాన్నే అంజనేయుడు తీసుకువచ్చాడు. పై అధికారుల ముందస్తు అనుమతి లేకుండా సొంత నిర్ణయం ప్రకారం తెచ్చిన అదనపు బాగేజ్ అలవెన్సును మంజూరు చేయడానికి రూల్స్ ఒప్పుకోవని  రాసేసి  డీలింగు అసిస్టెంటు ఫైలును  మూసేశాడు.
రామనామం తప్ప వేరేదీ రుచించని వాయునందనుడికి ఈ డీలింగ్ అసిస్టెంట్ వ్యవహారం సుతరామూ  రుచించలేదు. ముడతపడిన మూతిని మరింత ముడుచుకుని గబా గబా  వెళ్లి రామచంద్రులవారికే విషయం వివరించాడు. సాక్షాత్తు రాముడికే నమ్మిన బంటు అయిన తన విషయంలోనే ఇలా జరిగితే రామ పాలనను నమ్ముకున్న షరా మామూలు జనం మాటేమిటని రాజును  నిలదీశాడు.
రాముడికి హనుమంతుడంటే ఎంతో ఇది. కానీ నియమనిబంధనలంటే కూడా ఇంకెంతో ఇది. రూల్స్ ఒప్పుకోకపోతే రాజు మాత్రం ఏం చేస్తాడుఏం చెయ్యలేనని రాంబంటు మొహం మీదే చెప్పేసాడు.
పక్కనవున్న లక్ష్మణుల వారికి రాముడి వైఖరి చూసి వొళ్ళు మండింది. ఆరోజు పవన సుతుడు అమాంతంగా యెగిరి వెళ్లి సంజీవని తీసుకురాకపోతే తానీపాటికి స్వర్గంలో సభ తీరుస్తుండేవాడినన్న వాస్తవం గుర్తుకు తెచ్చుకుని మరింత మండి  పడ్డాడు.
ఆ కృతజ్ఞతతో లక్ష్మణుడు నేరుగా డీలింగ్ అసిస్టెంటుతోనే డీల్ చేసాడు.  ఏదోవిధంగా పని సానుకూలం అయ్యేట్టు చూడమని కోరాడు. బిల్లు శాంక్షన్ చేస్తే బిల్లు మొత్తంలో పది శాతం ఆమ్యామ్యా కూడా ఇస్తానని ప్రలోభపెట్టాడు.
అడుగుతోంది సాక్షాత్తూ రాజుగారి అనుంగు తమ్ముడు. పని చేయమంటోంది కూడా పుణ్యానికి  కాదు. ముట్టాల్సింది కూడా ముడుతున్నప్పుడు పనిచేయకపోవడానికి కారణం ఏముంటుంది కనుక.
డీలింగ్ అసిస్టెంటు మళ్ళీ ఫైల్  బయటకు తీసి  ఇలా తిరగరాసి పైకి పంపాడు.
కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఈ కేసును తిరిగి మరోమారు పరిశీలించడం జరిగింది.
హనుమంతులవారు ఈ టూరుపై  వెళ్ళిన సమయంలో భరతులవారు రాములవారి రాజ ప్రతినిధిగా రాజ్యం చేస్తున్నారు. అప్పటికి ఆయన పూర్తిస్తాయిలో రాజుగారి హోదాలో లేరు. రాములవారి ఆదేశం మేరకే ఆనాడు ఆంజనేయులవారు  ఈ అధికారిక పర్యటన మీద వెళ్లారు. శ్రీవారు స్వయంగా ఆదేశించారు కాబట్టిఅది కూడా అత్యంత జరూరుగా జరగాల్సిన రాచకార్యం కాబట్టిఈ పర్యటనకు మామూలుగా వుండే నిబంధనలు వర్తించవు. కాబట్టి ఈ బిల్లును యధాతధంగా ఆమోదించడమైనది. అలాగే ఆయన క్లెయిం చేసిన  ఎయిర్ ట్రావెల్ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడానికి ముందస్తు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భావించడం జరిగింది.
పోతేఅదనపు బాగేజీకి సంబంధించి చెల్లింపు విషయంలో గతంలో లేవనెత్తిన అభ్యంతరాన్ని సయితం పునః సమీక్షించడం జరిగింది. హనుమంతులవారు గ్రూప్ డి’ కేటగిరీ ఉద్యోగి కనుకన్నూమూలికలను గుర్తించగలిగే సామర్ధ్యం వుండడానికి అవకాశం లేదు కనుకన్నూపొరబాటున తప్పుడు మూలికను తీసుకువచ్చిన పక్షంలో మరికొన్నిసార్లు అక్కడికి వెళ్లి రావాల్సిన పని పడే అవకాశం వుందికనుకన్నూఅలాటి ప్రయాణాల వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం పడే  అవకాశాలు లేకపోనూ లేవు కనుకన్నూ – ఈ అన్ని విషయాలనుఖజానా భారాన్ని  సాకల్యంగాసవివరంగా  పరిశీలించి, ‘ప్రజాప్రయోజనాల’ దృష్ట్యా ఈ బిల్లును పాసు చేయాలని సిఫారసు చేయడం జరిగింది.
అంతే!  ఫైలు ఆఘమేఘాల మీద కదిలింది. అనేక విభాగాలు చుట్టబెట్టింది. బిల్లు ఆమోదానికి అందరూ ఎస్’ అన్నవాళ్ళే. నో’ అన్న వాళ్లు ఒక్కరూ లేరు. అందుకే ఒక్క రోజులోనే టియ్యే డబ్బులు హనుమంతుడి ఖాతాలో   పడ్డాయి.