welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Friday, September 12, 2008

తెలు'గోడు' పట్టేదెవరికి?

వచ్చేశాయ్.. వారోత్సవాలు
* నేటి నుంచి వివిధ కార్యక్రమాలు
* మహానగరి మనోగతం విందామా!
చెన్నై, న్యూస్‌టుడే:
నమస్తే!
వణక్కం!!
హలో..
... ఏమిటి ఇన్ని భాషల్లో చెబుతున్నానని అనుకుంటున్నారా? విశ్వనగరాన్ని కదా మరి! మ్.. మళ్లీ వారోత్సవాలు వచ్చేశాయి నాకు. పిల్లలు తనకు చేస్తున్న ఉత్సవాలు చూసి మురిసిపోని తల్లులు ఉంటారా? 369వ వడిలో పడిన నాకూ అది ఆనందమే మరి. ఆ ఉత్సవాల విశేషాలే నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ముందుగా నా గురించి మీతో కొంత పంచుకోవాలని అనుకుంటున్నా. ఫ్రాన్సిస్ డే, ఆండ్రూ కోగన్.. ఈ
ఇద్దరితోనే నేను ఆవిర్భవించాను. అంతవరకు చిన్న జాలరి గ్రామాల మధ్య నిర్మానుష్యంగా ఉన్న ఓ నేలగా ఉన్నానంతే. వాళ్లిద్దరే స్థానిక నాయకుడు దామర్ల వెంకటప్ప నాయకుడి అధీనం నుంచి నన్ను సొంతం చేసుకున్నారు. అందుకోసం ఓ ఒప్పందం(తెలుగులోనే లెండి) రాసుకున్నారు. ఆ ఒప్పంద పత్రంపై ఉన్న తేదీ 1639 ఆగస్టు 22. ఇదిగో ఆ తేదినే నా జన్మదినంగా అందరూ భావిస్తున్నారు. ఆనాటి ఆ బిందువునే.. నేడు
సింధువయ్యాను.

అధైర్యమొద్దు.. ఆదుకుంటాం
* మంత్రి దామోదర రాజనరసింహ హామీ
చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులో నివసిస్తున్న తెలుగు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వారిని అన్నివిధాల ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు. అస్కాలో అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడి తెలుగు ప్రజల సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించకపోయిన మాట వాస్తవేమనన్నారు. అయితే ఇకపై అలాంటిది జరుగకుండా ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చిస్తామని, పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తోందని, ఇక్కడ ప్రతిభ కనబరచిన తెలుగు విద్యార్థులకు కూడా ప్రతిభా అవార్డులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరిస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐటీఎఫ్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి మాట్లాడుతూతమిళనాడు, చెన్నైలో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎంవీ నారాయణ గుప్త, కోశాధికారి నందగోపాల్, అస్కా కోశాధికారి జేకేరెడ్డి, ప్రపంచ తెలుగు సమాఖ్య నుంచి జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తెలు'గోడు' పట్టేదెవరికి?
* అందుకే ఇలా తయారయ్యాం
* మలేషియా కాదు.. చెన్నైలో వారిని చూడండి
* ఆంధ్ర మంత్రి ముందు చెన్నై తెలుగువారి ఆవేదన
చెన్నై, న్యూస్‌టుడే
మద్రాసు.. ఇప్పటి చెన్నై.. ఒకప్పటి తెలుగు ప్రజల సాహిత్య కాణాచి. తెలుగు సాహితీ వనంలో గుబాళించిన కుసుమాలెన్నో ఇక్కడ వికసించినవే. చెన్నపట్టణపు వినువీధుల్లో విలసిల్లిన తెలుగు వైభవం అనంతరం తగ్గిపోయింది. తెలుగు ప్రజల రాశి పెరిగినా, భాష వాసి తగ్గుతోంది. ఇందుకు ఎన్నో కారణాలు. ప్రభుత్వం ఆంక్షలు.. నిబంధనలు.. చెన్నైలో తెలుగు నేర్చుకుంటే ఉద్యోగం రాదనే కారణం.. ఏదిఏమైనా తమిళనాట తెలుగు వారు నోరు తెరవలేకున్నారు. కన్నతల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ స్పందించడం లేదు. శుక్రవారం అఖిల భారత తెలుగు సమాఖ్య ఆస్కాలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముందు చెన్నై తెలుగు ప్రజల్లో పెల్లుబుకిన ఆవేదనకు అక్షర రూపమిది...

అడిగే నాథుడేడీ
తమిళనాట తెలుగు వారికి ఇంత దుస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం మా గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేనాథుడు లేక పోవడమే. తెలుగు సాంస్కృతిక వైభవానికి చెన్నై వేదిక. ఒకప్పుడు వాగ్గేయకారులు కూడా ఉన్నారు. అప్పుడు మనకు ఏది జరిగినా అడిగే వారొకరుండేవారు. ఇప్పుడు అది లేదు. ఇక్కడ తెలుగు వాళ్లు నోళ్లు తెరిచినా స్పందన రాదు. ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోనంత వరకు ఇదే గతి.
- గొల్లపూడి మారుతీరావు, సినీ నటులు, రచయిత


ఎంతమంది సీఎంలొచ్చినా ఇంతేనా
ఇక్కడి తెలుగు వారి సమస్యల గురించి మేం విజ్ఞప్తి చేయని ముఖ్యమంత్రి అంటూ లేరు. ఒకసారి చంద్రబాబునాయుడికి వినతి పత్రం ఇస్తూ ఇలా విజ్ఞాపనా పత్రం తీసుకున్న ముఖ్యమంత్రుల్లో మీరు ఏడో వారు సర్ అన్నాను. మా సమస్యలపై ఆంధ్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
- డాక్టర్ సీఎంకే రెడ్డి, అధ్యక్షులు, అఖిల భారత తెలుగు సమాఖ్య

తెలుగు అకాడమీ ఎందుకు ఏర్పాటు చేయరు
రాష్ట్రంలో 42 శాతం తెలుగు వారున్నారు. ఎక్కడో మలేషియాలో ఉన్న తెలుగు వారికోసం ఏదో చేస్తామంటున్నారు. ఇంతమంది తెలుగు జనాభా ఉన్న తెలుగు వారికోసం ఇక్కడ తెలుగు అకాడమీ ఎందుకు ఏర్పాటు చేయరు. తమిళం, తెలుగు రెండూ సోదర భాషలు. మన భాషకు ప్రాచీన హోదా కల్పించడానికి కావాల్సిన అన్ని ఆధారాలూ ఉన్నాయి.
- జీబీఎస్ఆర్ కృష్ణమూర్తి, ప్రపంచ తెలుగు సమాఖ్య

విద్యార్థులు తగ్గిపోతున్నారు
ప్రస్తుతం చెన్నైలోని తెలుగు పాఠశాలల్లో తెలుగు చదివే వారి సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం ఉపాధ్యాడు, విద్యార్థుల నిష్పత్తిని 1:15 నుంచి 1:40కి మార్చేసింది. తెలుగు మూడో భాష అయిపోయింది. తమిళనాడులో తెలుగు చదివితే ఏం చేయాలి అనే భయం ఇప్పుడు విద్యార్థుల్లో నెలకొంది. తెలుగు చదివితే ఉద్యోగాలు రావు అనే భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.
- చెంగయ్య, ప్రధానోపాధ్యాయులు, ఎస్‌కేపీడీ పాఠశాల

వరాల జల్లు ఇక్కడా కురిపించండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రంలోనూ విదేశాల్లోనూ వరాల జల్లు కురిపిస్తున్నారు. మాపైనా ఆ జల్లు కాస్త కురిపించాలి. మా కష్టాలు తొలగించాలి.
- జేకే రెడ్డి, కోశాధికారి, అస్కా

సహకారమివ్వండి.. సాధించి తీరుతాం
తమిళనాడులో తెలుగువారికేం తక్కువ కాదు. మాకు కావాల్సిందల్లా ఆంధ్ర ప్రభుత్వం నుంచి సహకారం, స్పందన. అది ఇచ్చి చూడండి.. మా సమస్యలు ఇట్టే సాధించుకుని తీరుతాం.
- వంకాలయ సత్యనారాయణమూర్తి, సినీ నటులు

మమ్మల్నీ పట్టించుకోండి
ఒకప్పుడు తెలుగు వైభవాన్ని ఇక్కడ కళ్లారా చూసిన వాడ్ని. ఇప్పుడు సహకారం లేకనే ఈ పరిస్థితి. ఇక్కడి వారినీ ప్రభుత్వం పట్టించుకోవాలి. పొట్టి శ్రీరాములు స్మారక మందిరం నిర్వహణ కూడా ఆంధ్ర ప్రభుత్వం చేపట్టాలి.
- గోటేటి శ్రీరామారావు, సంపాదకులు, ప్రముఖాంధ్ర

సంతృప్తి మంత్రం ఇదిగో!

సం....తృప్తే మం త్రం! రోడ్డుపక్కన పూరిగుడిసె నుంచి చక్కటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఓ క్షణం నిలబడి చూస్తే.. కాలిమీద కాలేసుకొని... సంగీత మాధుర్యంలో తేలియాడుతున్న ఆ వ్యక్తి ఏ పూటకు అ పూట తిండి వెతుక్కొనే నిరుపేద. మరో వ్యక్తికి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. కానీ అతనికి అనునిత్యం.. ప్రతిక్షణం అసంతృప్తే. ఏమిటీ విచిత్రం... ఏదీ సంతృప్తి మంత్రం? ఆధునికకాలంలో అసంతృప్తి సర్వాంతర్యామి. చాక్‌లెట్‌ కొనివ్వలేదని పిల్లలకు అసంతృప్తి. ఇలియానాలా నాజూగ్గా లేనని యువతికి అసంతృప్తి. లక్ష రూపాయల బైక్‌ లేదని యువకుడికి ... కోరిన చీర కొనివ్వలేదని మగువకు... కొడుకులు సరిగా చూసుకోవడం లేదని తల్లిదండ్రులకు... భర్త మంచివాడు కాదని భార్యకు, భార్యకు అణకువ తెలియదని భర్తకు అసంతృప్తి.

పిల్లలకు మంచి మార్కులు రాలేదని, వ్యాపారం సరిగా జరగడం లేదని.. మంచి ఉద్యోగం రాలేదని, వస్తే జీతం తక్కువని అందరిలోనూ... అంతటా అసంతృప్తే!! ఇంతింతై.. వటుడింతై చందంగా పెరిగిపోయి జీవితంలో ఆనందాన్ని హరించివేస్తున్న ఈ అసంతృప్తిని జయించడమెలా? తెలియని వెతుకులాట
ఏది ఇష్టమో.. ఏది అయిష్టమో తెలియని జీవనశైలి. నిలకడ లేని నిర్ణయాలు. సొంత అభిప్రాయాలు లేకపోవడం. ప్రపంచం ఎటుపోతే అటు కొట్టుకుపోవడం, ఊపిరి సలపనివ్వని వస్తు ప్రపంచం. అనేకానేక ప్రత్యామ్నాయాలు మనిషి జీవితంలో సంతృప్తిని మాయం చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. చుట్టూ మనుషులున్నా, కోట్ల రూపాయల డబ్బులున్నా ఏదో తెలియని అసంతృప్తి. పక్కవాడితో పోల్చుకోవడం, పోటీ ప్రపంచంతో పరుగులెత్తడం, అపరిమితమైన కోర్కెలు, ఆకాశానికి నిచ్చెన వేయడం జీవితాన్ని అసంతృప్తితో నింపేస్తున్నాయి. ఒకటి రెండు తరాల కిందటి వరకు జీవితాల్లో ఉన్న సంతృప్తి ఇప్పుడు ఉండడం లేదు. అప్పుడు ఉన్నదాంట్లో తృప్తిపడేవారు. చిన్ని చిన్ని ఆనందాల్లో స్వర్గాన్ని చూడగలిగేవారు. ఇప్పుడు అలా కాదు. కావాల్సినంత డబ్బుంది. కోరుకున్న వస్తువు కళ్లముందు వాలిపోతుంది. అయినా తెలియని వెతుకులాట. అదే ఆధునిక విషాదం. మూలం ఎక్కడ ?


ఎలా జీవించాలనే విషయమై నిర్దిష్ట అభిప్రాయం, అవగాహన లేకపోవడమే అసంతృప్తికి మూలమనేది నిపుణుల వాదన. మనకు ఏది సంతృప్తిని ఇస్తుందో ఏది అసంతృప్తి కలిగిస్తుందో తెలియకుండానే బరువు, బాధ్యతల్లోకి వచ్చిపడిపోతున్నాం. ఫలితంగా ఎన్ని ఉన్నా జీవితం ప్రారంభం నుంచే అసంతృప్తి మొదలవుతుంది. ప్రధానంగా జీవితానికి సంబంధించిన ఒక అభిప్రాయం వేళ్లూనుకునే బాల్యం నుంచే అసంతృప్తి మొదలవుతోంది. ఏం చదవాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఏ ఉద్యోగం చేయాలో అన్నీ తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. ఫలితం... పిల్లలకు తమకంటూ వ్యక్తిత్వం అనేది లేకుండాపోతోంది. ఏ కోర్సు చదివితే ఎంత జీతం వస్తుందో చెబుతారు కానీ హాయిగా, తృప్తిగా ఎలా జీవించాలో చెప్పేవారు కరువవుతున్నారు. తనకు తాను నిర్ణయించుకొనే శక్తిలేక, చెప్పేవారు లేక యువత జీవితం అసంతృప్తిమయమవుతోంది. ఆధునిక పోకడలతో సంస్కృతి పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పుడున్న చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు, బంధువులు, బాధ్యతలు... ఏవీ జీవితానికి స్థిరమైన అభిప్రాయాన్ని, నమ్మకాన్ని అందించలేకపోతున్నాయి. సంబంధాలు మృగ్యం
మానవ సంబంధాలతోసహా అన్నింటిలోనూ ఆర్థిక కోణమే ప్రధానమైపోయింది. ఇది సమస్త వస్తు ప్రపంచాన్ని చేజిక్కించుకోవడం వైపు దారితీస్తోంది. దీంతో సహజమైన మానవ సంబంధాలు దూరమయ్యాయి. వస్తు ప్రపంచమాయలో సంతృప్తిలేదని తెలిసేసరికి జీవితం గడిచిపోతోంది. ప్రతి విషయంలోనూ పోటీతత్వం, ఇతరులతో పోల్చుకోవడం, అనుకరించడం పెరిగిపోయాయి. ఇష్టమైన సంగీతాన్ని, సాహిత్యాన్ని, స్నేహాన్ని, ఉద్యోగాన్ని, డబ్బును, వృత్తిని, వస్తువును, వినోదాన్ని దేన్నీ ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎంత సంపాదించినా.. ఏ పని చేసినా.. ఏం సాధించినా... ఎంత దూరం ప్రయాణం చేసినా వెలితి వేలెత్తి చూపిస్తోంది. అంతం కాదిది ఆరంభం అన్నట్లు ఈ రకమైన పోటీతత్వంలో గెలుపు ఓటములు, పరిమితి లేకపోవడం జీవితంలో సంతృప్తి ఎండమావి అయింది. సంతృప్తి మంత్రం ఇదిగో!

ఇతరులతో పోల్చుకోవడం, మితిమీరిన పోటీతత్వం నుంచి బయటపడాలి. కోరుకున్నవి.. అనుకున్నవి.. అడిగినవి దక్కలేనపుడు వాటికి సంబంధించిన వనరులు, శక్తిసామర్థ్యాలు మనకు ఉన్నాయో? లేవో సమీక్షించుకోవాలి. పని ఒక్కటే జీవితం కాదు. కోరుకున్నది దక్కనపుడు మరొకటి. అదికాకపోతే మరొకటి. అంతేకానీ ఏ ఒక్కటో జీవితం అనుకుని, అది దక్కలేదని భావించడమే అసంతృప్తికి మూలం. సంతృప్తి అనేది పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు, పదవులు, డబ్బులు, వస్తువుల వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే అవే జీవితం కాదు. అవి జీవితంలో ఒక భాగం మాత్రమే. అప్పుడే జీవితంలో ప్రతి క్షణాన్ని సంతృప్తిగా ఆస్వాదించగలం. - ఆంధ్రజ్యోతి క్రియేటివ్‌ సెల్‌ సంతృప్తి ఓ జీవన విధానం
జీవితంలో అణువణువునా సంతృప్తి దాగి ఉంటుంది. దాన్ని ఆస్వాదించే గుణమే మనలో ఉండాలి. ఏదైనా పనిచేయడం వల్లనో, దేన్నయినా సాధించడం వల్లనో జీవితానికి సంతృప్తి దక్కుతుందని అనుకున్నప్పుడు దానికీ ఓ పరిమితి ఉండాలి. లక్ష రూపాయలు సంపాదించాక కోటి... ఆ తరువాత వంద కోట్లు ఇలా అపరిమితమైనపుడు సంతృప్తి దక్కదు. ఏ పనైనా చేయాలనుకుని దాన్ని మొదలుపెట్టి, ముగించేవరకు ప్రతి క్షణంలోనూ సంతృప్తి పొందగలగాలి. అలాకాకుండా చివరిలో సంతృప్తి దక్కుతుందని విలువైన క్షణాలను విస్మరిస్తే అసంతృప్తే మిగులుతుంది. త్వరగా సంతృప్తి చెందకపోవడం మనిషి ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎంతకీ సంతృప్తి చెందకపోవడం జీవితాన్ని నిష్ఫలం చేస్తుంది. - డాక్టర్‌ ఎం.ఎస్‌.రెడ్డి

పెళ్లికి ముందే పెటాకులు

పెళ్లికి ముందే పెటాకులు
ఒకప్పుడు నిశ్చితార్థమైతే దాదాపు మూడు ముళ్లు పడిపోయినట్టే. ఆ తర్వాత పెళ్లి అనేది కేవలం ఓ వేడుక! ఇప్పుడు కాలం మారిపోయింది. నేటి కంప్యూటర్‌ యుగంలో నిశ్చితార్థానికి మునుపటి ప్రాధాన్యం ఉండటం లేదు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత కూడా 'రాంరాం' చెప్పుకుంటున్న జంటల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. అభిప్రాయభేదాలొచ్చి వధూవరులు వద్దనుకుంటే.. 'నిశ్చితార్థం' వాళ్లనేం ఆపలేకపోతుండటం తాజా విశేషం!

శరత్‌, స్వాతి ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. ఓ మ్యారేజ్‌బ్యూరో ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. పెద్దలు మాట్లాడుకొని నిశ్చితార్థం జరిపించేశారు. రెండు నెలల్లో పెళ్లి. ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఉరుములేని పిడుగులా ఓ రోజు ఉన్నట్టుండి.. ''ఈ పెళ్లి నాకిష్టం లేదు'' అని స్వాతి ప్రకటించింది. నిశ్చితార్థం కూడా అయిపోయిన తర్వాత ఇదేం మాటని పెద్దలు నెత్తీనోరూ బాదుకున్నారు. అయితే ఏంటన్నది ఆమె వాదన. 'పెళ్త్లెన తర్వాత విడిపోయే కంటే ఇప్పుడే చెప్పా, సంతోషించాల్సిన విషయం' అనే సరికి అంతా కంగుతిన్నారు. అసలేం జరిగిందని అడిగితే.. తనను ఓ ఆర్నెల్ల పాటు సెలవు పెట్టమని శరత్‌ వేధిస్తున్నట్టు చెప్పిందామె. ''ఆ పని చేస్తే నా ఉద్యోగం ఊడుతుంది. ఈ మాత్రం అర్థం చేసుకోలేని వ్యక్తితో కలిసుండేదెలా? నా జీవితం, ఉద్యోగం నాకు ముఖ్యం. అందుకే అసలీ సంబంధమే వద్దు'' అంటుందామె. పెద్దవాళ్లు కూడా ఇద్దరినీ ఒప్పించలేక చేతులెత్తేశారు. ఇప్పుడు శరత్‌, స్వాతి మళ్లీ కొత్త సంబంధాల వేటలో ఉన్నారు.

మారుతున్న సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది హైదరాబాద్‌లోజరిగిన ఈ ఘటన. ఇప్పుడు నిశ్చితార్థమైనంత మాత్రాన కచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుందన్న భరోసా లేదు. అభిప్రాయ బేధాలుంటే పెళ్త్లెన తర్వాత కంటే పెళ్లికి ముందు విడిపోవటమే మంచిదని భావిస్తోంది నేటి యువత. ఒకప్పుడు పెళ్లికి ముందు మాట్లాడుకోవటానికి అమ్మాయికీ, అబ్బాయికీ అవకాశమే ఉండేది కాదు. మాటామంతీ పెళ్త్లెన తర్వాతే. అప్పుడిక ఎలా ఉన్నా సర్దుకుపోక తప్పేది కాదు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్లు, ఈమెయిళ్లు ఎంత దూరంలో ఉన్నవారైనా మాట్లాడుకునే అవకాశాన్నిచ్చాయి. పైగా, నిశ్చితార్థం తర్వాత అబ్బాయిఅమ్మాయి మాట్లాడుకోవటానికి, సరదాగా ఏ సినిమాలకో, షాపింగ్‌లకో వెళ్లటానికి కుటుంబపరంగా, సామాజికంగా అంగీకారం కూడా లభిస్తోంది. దీంతో పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయీ ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునేందుకు అవకాశం చిక్కుతోంది. భేదాభిప్రాయాలూ బయటపడుతున్నాయి. అలాగే స్త్రీలు కూడా తమ భవిష్యత్తును తానే నిర్ణయించుకునే సాధికారత సాధిస్తుండటంతో.. ఇష్టం లేకపోయినా తలవంచుకొని తాళి కట్టించుకునే పరిస్థితి లేదిప్పుడు. ఓ కార్పొరేట్‌ బ్యాంకులో పని చేసే దీపకు ఆ మధ్య మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఇంజినీర్‌. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, వరుని తరఫు వాళ్లు ప్రతిదానికీ బెట్టుగా ఉంటూ.. దీప తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తుండటాన్ని ఆమె జీర్ణించు కోలేకపోయింది. ఓపిక నశించి ఈ పెళ్లి వద్దని స్వయంగా నిర్ణయించుకుంది.

ఇంకా పాత పద్ధతులే
పెళ్లి విషయంలో మన సమాజం ఇప్పుడిప్పుడే పాత పద్ధతులను వదిలించుకుంటున్నా.. వధూవరుల అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు, లక్ష్యాలు, ఆదర్శాల వంటివి కలుస్తాయా? లేదా? అన్నది చూడటంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంటోంది. ఫలితంగా పెళ్లికి ముందే కొన్ని జంటలు విడిపోతున్నాయి. ఇది పైకి ప్రతికూల అంశంగా కనిపించినా మంచి పరిణామమే అంటున్నారు నిపుణులు. పెళ్లయిన తర్వాత అగచాట్లు పడేకంటే ముందే ఒక నిర్ణయానికి రావటం మంచిదేగానీ.. అసలు నిశ్చితార్థం వరకు కూడా వెళ్లక ముందే ఇద్దరూ అన్ని విషయాల్లోనూ ఓ స్పష్టతకొచ్చి నిర్ణయం తీసుకోవటం అత్యుత్తమం. ''అనూరాధ మంచి వ్యక్తే. కాకపోతే ఒకట్రెండుసార్లు మాట్లాడినప్పుడు డబ్బుకు, ఆడంబరాలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యం చూశాక తనకు నేను తగిన వ్యక్తిని కాదనిపించింది. అందువల్లే నిశ్చితార్థం లాంటివేమీ జరగక ముందే గుడ్‌బై చెప్పుకున్నాం'' అంటాడు భాస్కర్‌. ఈ యువ లెక్చరర్‌లాగా కాస్తంత పరిణతి, ముందుచూపు ప్రదర్శించటం మంచిది. ఏమైనా ఇప్పుడిక 'తాంబూలాలిచ్చేశాం.. ఇక తన్నుకు చావండి' అనటానికి లేదు మరి!

Wednesday, September 10, 2008

అతడు.. ఆమె.. డబ్బు! పెరుగుతున్న కలహాలు

అతడు.. ఆమె.. డబ్బు! పెరుగుతున్న కలహాలు

అతడు.. ఆమె.. డబ్బు!
పెరుగుతున్న కలహాలు
ఆర్థిక పరిణతి ముఖ్యం
ఒకప్పుడు స్త్రీ ఉద్యోగం చేయడమంటే 'ఏదో వేణ్నీళ్లకు చన్నీళ్లు' అన్నట్టుండేది. కానీ ఇటీవలికాలంలో పరిస్థితి వేగంగా మారిపోతోంది.. నేడు మహిళలు పురుషులతో సమానంగా ఉద్యోగాల్లో రాణిస్తున్నారు, సరిసమానంగా సంపాదిస్తున్నారు. భర్తకంటే అధికంగా ఆర్జిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యత్యాసాలు.. ఇప్పుడు చాలా కుటుంబాల్లో కలహాలకు కారణమవుతున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో విడాకుల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరగటం వెనక ఈ ఆర్థిక అంశాలూ కారణంగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టుల్లో మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు విడాకుల కోసం దాదాపు రెట్టింపు కేసులు దాఖలవుతున్నాయి. వీరు పైకి ఏయే కారణాలు చెబుతున్నా విభేదాల వెనక ఆర్థిక అహంభావాలే మూలంగా నిలుస్తున్నాయని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. భార్యాభర్తలు ఆర్థిక వ్యవహారాల్లో పరిణతితో వ్యవహరించటం, పురుషులు తమ పాతకాలపు ఆలోచనలను మార్చుకోవటం అవసరమని వివరిస్తున్నారు.

ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేయడాన్ని నిరసించిన పురుషులే ఇటీవలి కాలంలో ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా వారిని బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే నెలతిరిగే సరికి భార్య తెచ్చే జీతం మీద ఉన్న ఆసక్తి.. వారి ఆర్థిక స్వాతంత్య్రాన్ని గౌరవించటం మీద ఉండటం లేదనీ, ఫలితంగానే సమస్యలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నేడు ఉద్యోగాల్లో స్త్రీలు వేగంగా పైకెదుగుతున్నారు. ఉదాహరణకు కిందిస్థాయి ఐటీ ఉద్యోగాల్లో చేరిన స్త్రీలు తోటి పురుషులకంటే ముందుగానే టీమ్ లీడర్లుగా ఎదుగుతున్నారని, జీతాల విషయంలోనూ ముందే ఉంటున్నారని కొద్దికాలం క్రితం 'డేటాక్వెస్ట్-జాబ్స్‌హెడ్' నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.

నిజానికి భార్యాభర్తలిరువురూ ఇలా ఉద్యోగాలు చేస్తూ 'నాలుగు చేతులా' ఆర్జిస్తుంటే సంసారం మరింత సుఖమయం కావాలి. కానీ ఆర్థిక అవగాహన కొరవడి 'నీ డబ్బు, నా డబ్బు' అన్న ధోరణి పెరగటం వల్లసర్దుబాటు సమస్యలతో తమ వద్దకు వచ్చే కేసులు ఎక్కువగానే ఉంటున్నాయని ఫ్యామిలీ కౌన్సెలర్ వసుప్రదా కార్తీక్ చెబుతున్నారు. ముఖ్యంగా యువ దంపతుల్లో ఈ ఆర్థిక పరమైన అవగాహనలేమి స్పష్టంగా కనిపిస్తోందని ఆమె వివరిస్తున్నారు. ఉద్యోగం చేసే భార్యలు సహజంగానే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవటానికి, అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చటానికి ప్రయత్నిస్తుంటారు. దీన్ని చాలా కుటుంబాల్లో భర్తలు అర్థం చేసుకోలేకపోతుండటంతో అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. ''అన్ని ఖర్చులూ తనతో చెప్పాలని పట్టుబడతారు. చివరికి ఫ్రెండు ఇంట్లో ఫంక్షన్‌కి బహుమతి తీసుకెళ్లాలన్నా సరే చెప్పి తీరాల్సిందే. ఆయన మాత్రం ఏదీ చెప్పరు. ఏం.. నేనే ఎందుకు సర్దుకుపోవాలి?'' అంటున్నారు ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని రాగిణి.

ఇద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాల్లో అభిప్రాయభేదాలు ముదిరి పాకానబడితే తీవ్రస్థాయి అనర్థాలు తప్పవు. అంతర్జాతీయ పరిశోధన సంస్థ సైనోవేట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో మూడింట ఒకవంతు ఉద్యోగులు 'ఆర్థిక పరమైన విభేదాలు విడాకులకు దారితీసే అవకాశముంద'ని స్పష్టంగా పేర్కొన్నారు. ''మేమిద్దరం విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లం. నా జీతం డబ్బులను ఆయన తన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చుపెడుతుంటే వద్దని చెప్పా. పొరపొచ్చాలు మొదలయ్యాయి. చివరికవే విడాకులకు దారి తీశాయి. ఇప్పుడు మాబాబుతో కలిసి ఇక్కడే ఒంటరిగా ఉంటున్నా'' అంటున్నారు హైద్రాబాద్‌లోని ఓ ఐటీ ఉద్యోగిని శశికళ.

మానసికంగా భరోసా ఉంటుందన్న కారణంతో స్థిరాస్తులు తమ పేరున ఉండాలని కోరుకుంటున్న మహిళలూ లేకపోలేదు. ఇలాంటి వారిని కొందరు పురుషులు ప్రోత్సహిస్తున్నా చాలామంది హర్షించటం లేదు. ఏ విషయమైనా పంతాలకు పోకుండా కలిసి మాట్లాడుకొని ఇంటి బడ్జెట్ వేసుకోవడం, ఎవరు ఖర్చుపెడుతున్నా రెండోవారికి చెప్పటం, ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం అలవరచుకుంటే ఆర్థిక సమన్వయం అసాధ్యమేం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ''డబ్బు చాలా సున్నిత అంశమైనందున.. ఖర్చు, పొదుపులపై భార్యాభర్తలు ముందే మాట్లాడుకొని, పరస్పర గౌరవంతో వ్యవహరిస్తుంటే విభేదాలే తలెత్తవు. ఇక్కడ ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనుకోవడానికి వీల్లేదు'' అంటారు ఆర్గనైజేషనల్ సైకాలజిస్టు కవితా గూడపాటి. వృత్తి విజయాల హడావిడిలో పడిపోయి ప్రేమ, అన్యోన్యతలను మరిచిపోవద్దనీ.. అవి దండిగా ఉన్నచోట డబ్బు పొరపొచ్చాలు తేలికగా సర్దుకుంటాయని సూచిస్తున్నారామె!