welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Friday, September 12, 2008

పెళ్లికి ముందే పెటాకులు

పెళ్లికి ముందే పెటాకులు
ఒకప్పుడు నిశ్చితార్థమైతే దాదాపు మూడు ముళ్లు పడిపోయినట్టే. ఆ తర్వాత పెళ్లి అనేది కేవలం ఓ వేడుక! ఇప్పుడు కాలం మారిపోయింది. నేటి కంప్యూటర్‌ యుగంలో నిశ్చితార్థానికి మునుపటి ప్రాధాన్యం ఉండటం లేదు. తాంబూలాలు ఇచ్చిపుచ్చుకున్న తర్వాత కూడా 'రాంరాం' చెప్పుకుంటున్న జంటల సంఖ్య ఇటీవలి కాలంలో గణనీయంగా పెరుగుతుండటమే ఇందుకు నిదర్శనం. అభిప్రాయభేదాలొచ్చి వధూవరులు వద్దనుకుంటే.. 'నిశ్చితార్థం' వాళ్లనేం ఆపలేకపోతుండటం తాజా విశేషం!

శరత్‌, స్వాతి ఇద్దరూ సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్లే. ఓ మ్యారేజ్‌బ్యూరో ద్వారా ఒకరికొకరు పరిచయమయ్యారు. పెద్దలు మాట్లాడుకొని నిశ్చితార్థం జరిపించేశారు. రెండు నెలల్లో పెళ్లి. ఏర్పాట్లన్నీ ఘనంగా జరుగుతున్నాయి. ఉరుములేని పిడుగులా ఓ రోజు ఉన్నట్టుండి.. ''ఈ పెళ్లి నాకిష్టం లేదు'' అని స్వాతి ప్రకటించింది. నిశ్చితార్థం కూడా అయిపోయిన తర్వాత ఇదేం మాటని పెద్దలు నెత్తీనోరూ బాదుకున్నారు. అయితే ఏంటన్నది ఆమె వాదన. 'పెళ్త్లెన తర్వాత విడిపోయే కంటే ఇప్పుడే చెప్పా, సంతోషించాల్సిన విషయం' అనే సరికి అంతా కంగుతిన్నారు. అసలేం జరిగిందని అడిగితే.. తనను ఓ ఆర్నెల్ల పాటు సెలవు పెట్టమని శరత్‌ వేధిస్తున్నట్టు చెప్పిందామె. ''ఆ పని చేస్తే నా ఉద్యోగం ఊడుతుంది. ఈ మాత్రం అర్థం చేసుకోలేని వ్యక్తితో కలిసుండేదెలా? నా జీవితం, ఉద్యోగం నాకు ముఖ్యం. అందుకే అసలీ సంబంధమే వద్దు'' అంటుందామె. పెద్దవాళ్లు కూడా ఇద్దరినీ ఒప్పించలేక చేతులెత్తేశారు. ఇప్పుడు శరత్‌, స్వాతి మళ్లీ కొత్త సంబంధాల వేటలో ఉన్నారు.

మారుతున్న సామాజిక పరిస్థితులకు అద్దం పడుతోంది హైదరాబాద్‌లోజరిగిన ఈ ఘటన. ఇప్పుడు నిశ్చితార్థమైనంత మాత్రాన కచ్చితంగా పెళ్లి జరిగి తీరుతుందన్న భరోసా లేదు. అభిప్రాయ బేధాలుంటే పెళ్త్లెన తర్వాత కంటే పెళ్లికి ముందు విడిపోవటమే మంచిదని భావిస్తోంది నేటి యువత. ఒకప్పుడు పెళ్లికి ముందు మాట్లాడుకోవటానికి అమ్మాయికీ, అబ్బాయికీ అవకాశమే ఉండేది కాదు. మాటామంతీ పెళ్త్లెన తర్వాతే. అప్పుడిక ఎలా ఉన్నా సర్దుకుపోక తప్పేది కాదు. కానీ ఇప్పుడు సెల్‌ఫోన్లు, ఈమెయిళ్లు ఎంత దూరంలో ఉన్నవారైనా మాట్లాడుకునే అవకాశాన్నిచ్చాయి. పైగా, నిశ్చితార్థం తర్వాత అబ్బాయిఅమ్మాయి మాట్లాడుకోవటానికి, సరదాగా ఏ సినిమాలకో, షాపింగ్‌లకో వెళ్లటానికి కుటుంబపరంగా, సామాజికంగా అంగీకారం కూడా లభిస్తోంది. దీంతో పెళ్లికి ముందే అమ్మాయీ, అబ్బాయీ ఒకరి గురించి ఒకరు అర్థం చేసుకునేందుకు అవకాశం చిక్కుతోంది. భేదాభిప్రాయాలూ బయటపడుతున్నాయి. అలాగే స్త్రీలు కూడా తమ భవిష్యత్తును తానే నిర్ణయించుకునే సాధికారత సాధిస్తుండటంతో.. ఇష్టం లేకపోయినా తలవంచుకొని తాళి కట్టించుకునే పరిస్థితి లేదిప్పుడు. ఓ కార్పొరేట్‌ బ్యాంకులో పని చేసే దీపకు ఆ మధ్య మంచి సంబంధం వచ్చింది. అబ్బాయి ఇంజినీర్‌. నిశ్చితార్థం కూడా జరిగింది. అయితే, వరుని తరఫు వాళ్లు ప్రతిదానికీ బెట్టుగా ఉంటూ.. దీప తల్లిదండ్రులను చిన్నచూపు చూస్తుండటాన్ని ఆమె జీర్ణించు కోలేకపోయింది. ఓపిక నశించి ఈ పెళ్లి వద్దని స్వయంగా నిర్ణయించుకుంది.

ఇంకా పాత పద్ధతులే
పెళ్లి విషయంలో మన సమాజం ఇప్పుడిప్పుడే పాత పద్ధతులను వదిలించుకుంటున్నా.. వధూవరుల అభిప్రాయాలు, అభిరుచులు, అలవాట్లు, లక్ష్యాలు, ఆదర్శాల వంటివి కలుస్తాయా? లేదా? అన్నది చూడటంలో మాత్రం ఇంకా వెనకబడే ఉంటోంది. ఫలితంగా పెళ్లికి ముందే కొన్ని జంటలు విడిపోతున్నాయి. ఇది పైకి ప్రతికూల అంశంగా కనిపించినా మంచి పరిణామమే అంటున్నారు నిపుణులు. పెళ్లయిన తర్వాత అగచాట్లు పడేకంటే ముందే ఒక నిర్ణయానికి రావటం మంచిదేగానీ.. అసలు నిశ్చితార్థం వరకు కూడా వెళ్లక ముందే ఇద్దరూ అన్ని విషయాల్లోనూ ఓ స్పష్టతకొచ్చి నిర్ణయం తీసుకోవటం అత్యుత్తమం. ''అనూరాధ మంచి వ్యక్తే. కాకపోతే ఒకట్రెండుసార్లు మాట్లాడినప్పుడు డబ్బుకు, ఆడంబరాలకు ఆమె ఇచ్చే ప్రాధాన్యం చూశాక తనకు నేను తగిన వ్యక్తిని కాదనిపించింది. అందువల్లే నిశ్చితార్థం లాంటివేమీ జరగక ముందే గుడ్‌బై చెప్పుకున్నాం'' అంటాడు భాస్కర్‌. ఈ యువ లెక్చరర్‌లాగా కాస్తంత పరిణతి, ముందుచూపు ప్రదర్శించటం మంచిది. ఏమైనా ఇప్పుడిక 'తాంబూలాలిచ్చేశాం.. ఇక తన్నుకు చావండి' అనటానికి లేదు మరి!

No comments: