అతడు.. ఆమె.. డబ్బు! పెరుగుతున్న కలహాలు
అతడు.. ఆమె.. డబ్బు!
పెరుగుతున్న కలహాలు
ఆర్థిక పరిణతి ముఖ్యం
ఒకప్పుడు స్త్రీ ఉద్యోగం చేయడమంటే 'ఏదో వేణ్నీళ్లకు చన్నీళ్లు' అన్నట్టుండేది. కానీ ఇటీవలికాలంలో పరిస్థితి వేగంగా మారిపోతోంది.. నేడు మహిళలు పురుషులతో సమానంగా ఉద్యోగాల్లో రాణిస్తున్నారు, సరిసమానంగా సంపాదిస్తున్నారు. భర్తకంటే అధికంగా ఆర్జిస్తున్న సందర్భాలూ ఉంటున్నాయి. ఈ సరికొత్త ఆర్థిక వ్యత్యాసాలు.. ఇప్పుడు చాలా కుటుంబాల్లో కలహాలకు కారణమవుతున్నాయి. ఇటీవలి కాలంలో రాష్ట్రంలో విడాకుల దరఖాస్తుల సంఖ్య గణనీయంగా పెరగటం వెనక ఈ ఆర్థిక అంశాలూ కారణంగా నిలుస్తున్నాయని విశ్లేషకులు అంటున్నారు. విజయవాడ, రాజమండ్రి, విశాఖ, హైదరాబాద్, సికింద్రాబాద్ ఫ్యామిలీ కోర్టుల్లో మూడేళ్ల క్రితంతో పోలిస్తే ఇప్పుడు విడాకుల కోసం దాదాపు రెట్టింపు కేసులు దాఖలవుతున్నాయి. వీరు పైకి ఏయే కారణాలు చెబుతున్నా విభేదాల వెనక ఆర్థిక అహంభావాలే మూలంగా నిలుస్తున్నాయని పలువురు న్యాయవాదులు చెబుతున్నారు. భార్యాభర్తలు ఆర్థిక వ్యవహారాల్లో పరిణతితో వ్యవహరించటం, పురుషులు తమ పాతకాలపు ఆలోచనలను మార్చుకోవటం అవసరమని వివరిస్తున్నారు.
ఒకప్పుడు మహిళలు ఉద్యోగం చేయడాన్ని నిరసించిన పురుషులే ఇటీవలి కాలంలో ఆర్థిక ఒత్తిళ్ల దృష్ట్యా వారిని బాగా ప్రోత్సహిస్తున్నారు. అయితే నెలతిరిగే సరికి భార్య తెచ్చే జీతం మీద ఉన్న ఆసక్తి.. వారి ఆర్థిక స్వాతంత్య్రాన్ని గౌరవించటం మీద ఉండటం లేదనీ, ఫలితంగానే సమస్యలు పెరుగుతున్నాయని విశ్లేషకులు అంటున్నారు. నేడు ఉద్యోగాల్లో స్త్రీలు వేగంగా పైకెదుగుతున్నారు. ఉదాహరణకు కిందిస్థాయి ఐటీ ఉద్యోగాల్లో చేరిన స్త్రీలు తోటి పురుషులకంటే ముందుగానే టీమ్ లీడర్లుగా ఎదుగుతున్నారని, జీతాల విషయంలోనూ ముందే ఉంటున్నారని కొద్దికాలం క్రితం 'డేటాక్వెస్ట్-జాబ్స్‌హెడ్' నిర్వహించిన సర్వేలో వెల్లడైంది.
నిజానికి భార్యాభర్తలిరువురూ ఇలా ఉద్యోగాలు చేస్తూ 'నాలుగు చేతులా' ఆర్జిస్తుంటే సంసారం మరింత సుఖమయం కావాలి. కానీ ఆర్థిక అవగాహన కొరవడి 'నీ డబ్బు, నా డబ్బు' అన్న ధోరణి పెరగటం వల్లసర్దుబాటు సమస్యలతో తమ వద్దకు వచ్చే కేసులు ఎక్కువగానే ఉంటున్నాయని ఫ్యామిలీ కౌన్సెలర్ వసుప్రదా కార్తీక్ చెబుతున్నారు. ముఖ్యంగా యువ దంపతుల్లో ఈ ఆర్థిక పరమైన అవగాహనలేమి స్పష్టంగా కనిపిస్తోందని ఆమె వివరిస్తున్నారు. ఉద్యోగం చేసే భార్యలు సహజంగానే స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవటానికి, అభిప్రాయాలను నిర్భయంగా వెలిబుచ్చటానికి ప్రయత్నిస్తుంటారు. దీన్ని చాలా కుటుంబాల్లో భర్తలు అర్థం చేసుకోలేకపోతుండటంతో అభిప్రాయభేదాలు తలెత్తుతున్నాయి. ''అన్ని ఖర్చులూ తనతో చెప్పాలని పట్టుబడతారు. చివరికి ఫ్రెండు ఇంట్లో ఫంక్షన్‌కి బహుమతి తీసుకెళ్లాలన్నా సరే చెప్పి తీరాల్సిందే. ఆయన మాత్రం ఏదీ చెప్పరు. ఏం.. నేనే ఎందుకు సర్దుకుపోవాలి?'' అంటున్నారు ఓ ప్రైవేటు కంపెనీ ఉద్యోగిని రాగిణి.
ఇద్దరూ ఉద్యోగం చేసే కుటుంబాల్లో అభిప్రాయభేదాలు ముదిరి పాకానబడితే తీవ్రస్థాయి అనర్థాలు తప్పవు. అంతర్జాతీయ పరిశోధన సంస్థ సైనోవేట్ నిర్వహించిన ఒక అధ్యయనంలో మూడింట ఒకవంతు ఉద్యోగులు 'ఆర్థిక పరమైన విభేదాలు విడాకులకు దారితీసే అవకాశముంద'ని స్పష్టంగా పేర్కొన్నారు. ''మేమిద్దరం విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్లం. నా జీతం డబ్బులను ఆయన తన ఇష్టం వచ్చినట్టుగా ఖర్చుపెడుతుంటే వద్దని చెప్పా. పొరపొచ్చాలు మొదలయ్యాయి. చివరికవే విడాకులకు దారి తీశాయి. ఇప్పుడు మాబాబుతో కలిసి ఇక్కడే ఒంటరిగా ఉంటున్నా'' అంటున్నారు హైద్రాబాద్‌లోని ఓ ఐటీ ఉద్యోగిని శశికళ.
మానసికంగా భరోసా ఉంటుందన్న కారణంతో స్థిరాస్తులు తమ పేరున ఉండాలని కోరుకుంటున్న మహిళలూ లేకపోలేదు. ఇలాంటి వారిని కొందరు పురుషులు ప్రోత్సహిస్తున్నా చాలామంది హర్షించటం లేదు. ఏ విషయమైనా పంతాలకు పోకుండా కలిసి మాట్లాడుకొని ఇంటి బడ్జెట్ వేసుకోవడం, ఎవరు ఖర్చుపెడుతున్నా రెండోవారికి చెప్పటం, ప్రణాళిక ప్రకారం ముందుకు సాగడం అలవరచుకుంటే ఆర్థిక సమన్వయం అసాధ్యమేం కాదని నిపుణులు సూచిస్తున్నారు. ''డబ్బు చాలా సున్నిత అంశమైనందున.. ఖర్చు, పొదుపులపై భార్యాభర్తలు ముందే మాట్లాడుకొని, పరస్పర గౌరవంతో వ్యవహరిస్తుంటే విభేదాలే తలెత్తవు. ఇక్కడ ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనుకోవడానికి వీల్లేదు'' అంటారు ఆర్గనైజేషనల్ సైకాలజిస్టు కవితా గూడపాటి. వృత్తి విజయాల హడావిడిలో పడిపోయి ప్రేమ, అన్యోన్యతలను మరిచిపోవద్దనీ.. అవి దండిగా ఉన్నచోట డబ్బు పొరపొచ్చాలు తేలికగా సర్దుకుంటాయని సూచిస్తున్నారామె!
Wednesday, September 10, 2008
అతడు.. ఆమె.. డబ్బు! పెరుగుతున్న కలహాలు
Labels:
people of andhra
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment