welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Friday, September 12, 2008

సంతృప్తి మంత్రం ఇదిగో!

సం....తృప్తే మం త్రం! రోడ్డుపక్కన పూరిగుడిసె నుంచి చక్కటి సంగీతం వినిపిస్తూ ఉంటుంది. ఓ క్షణం నిలబడి చూస్తే.. కాలిమీద కాలేసుకొని... సంగీత మాధుర్యంలో తేలియాడుతున్న ఆ వ్యక్తి ఏ పూటకు అ పూట తిండి వెతుక్కొనే నిరుపేద. మరో వ్యక్తికి కోట్ల రూపాయల ఆస్తిపాస్తులున్నాయి. కానీ అతనికి అనునిత్యం.. ప్రతిక్షణం అసంతృప్తే. ఏమిటీ విచిత్రం... ఏదీ సంతృప్తి మంత్రం? ఆధునికకాలంలో అసంతృప్తి సర్వాంతర్యామి. చాక్‌లెట్‌ కొనివ్వలేదని పిల్లలకు అసంతృప్తి. ఇలియానాలా నాజూగ్గా లేనని యువతికి అసంతృప్తి. లక్ష రూపాయల బైక్‌ లేదని యువకుడికి ... కోరిన చీర కొనివ్వలేదని మగువకు... కొడుకులు సరిగా చూసుకోవడం లేదని తల్లిదండ్రులకు... భర్త మంచివాడు కాదని భార్యకు, భార్యకు అణకువ తెలియదని భర్తకు అసంతృప్తి.

పిల్లలకు మంచి మార్కులు రాలేదని, వ్యాపారం సరిగా జరగడం లేదని.. మంచి ఉద్యోగం రాలేదని, వస్తే జీతం తక్కువని అందరిలోనూ... అంతటా అసంతృప్తే!! ఇంతింతై.. వటుడింతై చందంగా పెరిగిపోయి జీవితంలో ఆనందాన్ని హరించివేస్తున్న ఈ అసంతృప్తిని జయించడమెలా? తెలియని వెతుకులాట
ఏది ఇష్టమో.. ఏది అయిష్టమో తెలియని జీవనశైలి. నిలకడ లేని నిర్ణయాలు. సొంత అభిప్రాయాలు లేకపోవడం. ప్రపంచం ఎటుపోతే అటు కొట్టుకుపోవడం, ఊపిరి సలపనివ్వని వస్తు ప్రపంచం. అనేకానేక ప్రత్యామ్నాయాలు మనిషి జీవితంలో సంతృప్తిని మాయం చేస్తున్నాయి అంటున్నారు నిపుణులు. చుట్టూ మనుషులున్నా, కోట్ల రూపాయల డబ్బులున్నా ఏదో తెలియని అసంతృప్తి. పక్కవాడితో పోల్చుకోవడం, పోటీ ప్రపంచంతో పరుగులెత్తడం, అపరిమితమైన కోర్కెలు, ఆకాశానికి నిచ్చెన వేయడం జీవితాన్ని అసంతృప్తితో నింపేస్తున్నాయి. ఒకటి రెండు తరాల కిందటి వరకు జీవితాల్లో ఉన్న సంతృప్తి ఇప్పుడు ఉండడం లేదు. అప్పుడు ఉన్నదాంట్లో తృప్తిపడేవారు. చిన్ని చిన్ని ఆనందాల్లో స్వర్గాన్ని చూడగలిగేవారు. ఇప్పుడు అలా కాదు. కావాల్సినంత డబ్బుంది. కోరుకున్న వస్తువు కళ్లముందు వాలిపోతుంది. అయినా తెలియని వెతుకులాట. అదే ఆధునిక విషాదం. మూలం ఎక్కడ ?


ఎలా జీవించాలనే విషయమై నిర్దిష్ట అభిప్రాయం, అవగాహన లేకపోవడమే అసంతృప్తికి మూలమనేది నిపుణుల వాదన. మనకు ఏది సంతృప్తిని ఇస్తుందో ఏది అసంతృప్తి కలిగిస్తుందో తెలియకుండానే బరువు, బాధ్యతల్లోకి వచ్చిపడిపోతున్నాం. ఫలితంగా ఎన్ని ఉన్నా జీవితం ప్రారంభం నుంచే అసంతృప్తి మొదలవుతుంది. ప్రధానంగా జీవితానికి సంబంధించిన ఒక అభిప్రాయం వేళ్లూనుకునే బాల్యం నుంచే అసంతృప్తి మొదలవుతోంది. ఏం చదవాలో, ఎవరితో స్నేహం చేయాలో, ఎవరిని పెళ్లి చేసుకోవాలో, ఏ ఉద్యోగం చేయాలో అన్నీ తల్లిదండ్రులే నిర్ణయిస్తారు. ఫలితం... పిల్లలకు తమకంటూ వ్యక్తిత్వం అనేది లేకుండాపోతోంది. ఏ కోర్సు చదివితే ఎంత జీతం వస్తుందో చెబుతారు కానీ హాయిగా, తృప్తిగా ఎలా జీవించాలో చెప్పేవారు కరువవుతున్నారు. తనకు తాను నిర్ణయించుకొనే శక్తిలేక, చెప్పేవారు లేక యువత జీవితం అసంతృప్తిమయమవుతోంది. ఆధునిక పోకడలతో సంస్కృతి పునాదులు కదిలిపోతున్నాయి. ఇప్పుడున్న చదువులు, ఉద్యోగాలు, పెళ్లిళ్లు, పిల్లలు, బంధువులు, బాధ్యతలు... ఏవీ జీవితానికి స్థిరమైన అభిప్రాయాన్ని, నమ్మకాన్ని అందించలేకపోతున్నాయి. సంబంధాలు మృగ్యం
మానవ సంబంధాలతోసహా అన్నింటిలోనూ ఆర్థిక కోణమే ప్రధానమైపోయింది. ఇది సమస్త వస్తు ప్రపంచాన్ని చేజిక్కించుకోవడం వైపు దారితీస్తోంది. దీంతో సహజమైన మానవ సంబంధాలు దూరమయ్యాయి. వస్తు ప్రపంచమాయలో సంతృప్తిలేదని తెలిసేసరికి జీవితం గడిచిపోతోంది. ప్రతి విషయంలోనూ పోటీతత్వం, ఇతరులతో పోల్చుకోవడం, అనుకరించడం పెరిగిపోయాయి. ఇష్టమైన సంగీతాన్ని, సాహిత్యాన్ని, స్నేహాన్ని, ఉద్యోగాన్ని, డబ్బును, వృత్తిని, వస్తువును, వినోదాన్ని దేన్నీ ఆస్వాదించలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఎంత సంపాదించినా.. ఏ పని చేసినా.. ఏం సాధించినా... ఎంత దూరం ప్రయాణం చేసినా వెలితి వేలెత్తి చూపిస్తోంది. అంతం కాదిది ఆరంభం అన్నట్లు ఈ రకమైన పోటీతత్వంలో గెలుపు ఓటములు, పరిమితి లేకపోవడం జీవితంలో సంతృప్తి ఎండమావి అయింది. సంతృప్తి మంత్రం ఇదిగో!

ఇతరులతో పోల్చుకోవడం, మితిమీరిన పోటీతత్వం నుంచి బయటపడాలి. కోరుకున్నవి.. అనుకున్నవి.. అడిగినవి దక్కలేనపుడు వాటికి సంబంధించిన వనరులు, శక్తిసామర్థ్యాలు మనకు ఉన్నాయో? లేవో సమీక్షించుకోవాలి. పని ఒక్కటే జీవితం కాదు. కోరుకున్నది దక్కనపుడు మరొకటి. అదికాకపోతే మరొకటి. అంతేకానీ ఏ ఒక్కటో జీవితం అనుకుని, అది దక్కలేదని భావించడమే అసంతృప్తికి మూలం. సంతృప్తి అనేది పెద్ద పెద్ద చదువులు, ఉద్యోగాలు, పదవులు, డబ్బులు, వస్తువుల వల్ల వచ్చేది కాదు. ఎందుకంటే అవే జీవితం కాదు. అవి జీవితంలో ఒక భాగం మాత్రమే. అప్పుడే జీవితంలో ప్రతి క్షణాన్ని సంతృప్తిగా ఆస్వాదించగలం. - ఆంధ్రజ్యోతి క్రియేటివ్‌ సెల్‌ సంతృప్తి ఓ జీవన విధానం
జీవితంలో అణువణువునా సంతృప్తి దాగి ఉంటుంది. దాన్ని ఆస్వాదించే గుణమే మనలో ఉండాలి. ఏదైనా పనిచేయడం వల్లనో, దేన్నయినా సాధించడం వల్లనో జీవితానికి సంతృప్తి దక్కుతుందని అనుకున్నప్పుడు దానికీ ఓ పరిమితి ఉండాలి. లక్ష రూపాయలు సంపాదించాక కోటి... ఆ తరువాత వంద కోట్లు ఇలా అపరిమితమైనపుడు సంతృప్తి దక్కదు. ఏ పనైనా చేయాలనుకుని దాన్ని మొదలుపెట్టి, ముగించేవరకు ప్రతి క్షణంలోనూ సంతృప్తి పొందగలగాలి. అలాకాకుండా చివరిలో సంతృప్తి దక్కుతుందని విలువైన క్షణాలను విస్మరిస్తే అసంతృప్తే మిగులుతుంది. త్వరగా సంతృప్తి చెందకపోవడం మనిషి ఎదుగుదలకు తోడ్పడుతుంది. ఎంతకీ సంతృప్తి చెందకపోవడం జీవితాన్ని నిష్ఫలం చేస్తుంది. - డాక్టర్‌ ఎం.ఎస్‌.రెడ్డి

No comments: