welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Friday, September 12, 2008

తెలు'గోడు' పట్టేదెవరికి?

వచ్చేశాయ్.. వారోత్సవాలు
* నేటి నుంచి వివిధ కార్యక్రమాలు
* మహానగరి మనోగతం విందామా!
చెన్నై, న్యూస్‌టుడే:
నమస్తే!
వణక్కం!!
హలో..
... ఏమిటి ఇన్ని భాషల్లో చెబుతున్నానని అనుకుంటున్నారా? విశ్వనగరాన్ని కదా మరి! మ్.. మళ్లీ వారోత్సవాలు వచ్చేశాయి నాకు. పిల్లలు తనకు చేస్తున్న ఉత్సవాలు చూసి మురిసిపోని తల్లులు ఉంటారా? 369వ వడిలో పడిన నాకూ అది ఆనందమే మరి. ఆ ఉత్సవాల విశేషాలే నేనిప్పుడు మీతో పంచుకోబోతున్నాను. ముందుగా నా గురించి మీతో కొంత పంచుకోవాలని అనుకుంటున్నా. ఫ్రాన్సిస్ డే, ఆండ్రూ కోగన్.. ఈ
ఇద్దరితోనే నేను ఆవిర్భవించాను. అంతవరకు చిన్న జాలరి గ్రామాల మధ్య నిర్మానుష్యంగా ఉన్న ఓ నేలగా ఉన్నానంతే. వాళ్లిద్దరే స్థానిక నాయకుడు దామర్ల వెంకటప్ప నాయకుడి అధీనం నుంచి నన్ను సొంతం చేసుకున్నారు. అందుకోసం ఓ ఒప్పందం(తెలుగులోనే లెండి) రాసుకున్నారు. ఆ ఒప్పంద పత్రంపై ఉన్న తేదీ 1639 ఆగస్టు 22. ఇదిగో ఆ తేదినే నా జన్మదినంగా అందరూ భావిస్తున్నారు. ఆనాటి ఆ బిందువునే.. నేడు
సింధువయ్యాను.

అధైర్యమొద్దు.. ఆదుకుంటాం
* మంత్రి దామోదర రాజనరసింహ హామీ
చెన్నై, న్యూస్‌టుడే: తమిళనాడులో నివసిస్తున్న తెలుగు వారు ఎట్టి పరిస్థితుల్లోనూ అధైర్య పడాల్సిన అవసరం లేదని, వారిని అన్నివిధాల ఆదుకుంటామని ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ హామీ ఇచ్చారు. అస్కాలో అఖిల భారత తెలుగు సమాఖ్య (ఏఐటీఎఫ్) నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఇక్కడి తెలుగు ప్రజల సమస్యల పట్ల ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రభుత్వాలు ఇప్పటివరకు స్పందించకపోయిన మాట వాస్తవేమనన్నారు. అయితే ఇకపై అలాంటిది జరుగకుండా ఇక్కడి ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. ఇందుకోసం తమిళనాడు ప్రభుత్వంతో చర్చిస్తామని, పాఠశాల స్థాయిలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి సభ్యుడు
సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్‌లో ఉత్తమ ప్రతిభ కనబరచిన విద్యార్థులకు ప్రభుత్వం ప్రతిభా అవార్డులను ఇచ్చి ప్రోత్సహిస్తోందని, ఇక్కడ ప్రతిభ కనబరచిన తెలుగు విద్యార్థులకు కూడా ప్రతిభా అవార్డులు ఇచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామని, ఇందుకు ప్రభుత్వం కూడా అంగీకరిస్తుందని తాను నమ్ముతున్నానని చెప్పారు. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన ఏఐటీఎఫ్ అధ్యక్షుడు సీఎంకే రెడ్డి మాట్లాడుతూతమిళనాడు, చెన్నైలో తెలుగు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను మంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీఎఫ్ ప్రధాన కార్యదర్శి ఎంవీ నారాయణ గుప్త, కోశాధికారి నందగోపాల్, అస్కా కోశాధికారి జేకేరెడ్డి, ప్రపంచ తెలుగు సమాఖ్య నుంచి జీవీఎస్ఆర్ కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

తెలు'గోడు' పట్టేదెవరికి?
* అందుకే ఇలా తయారయ్యాం
* మలేషియా కాదు.. చెన్నైలో వారిని చూడండి
* ఆంధ్ర మంత్రి ముందు చెన్నై తెలుగువారి ఆవేదన
చెన్నై, న్యూస్‌టుడే
మద్రాసు.. ఇప్పటి చెన్నై.. ఒకప్పటి తెలుగు ప్రజల సాహిత్య కాణాచి. తెలుగు సాహితీ వనంలో గుబాళించిన కుసుమాలెన్నో ఇక్కడ వికసించినవే. చెన్నపట్టణపు వినువీధుల్లో విలసిల్లిన తెలుగు వైభవం అనంతరం తగ్గిపోయింది. తెలుగు ప్రజల రాశి పెరిగినా, భాష వాసి తగ్గుతోంది. ఇందుకు ఎన్నో కారణాలు. ప్రభుత్వం ఆంక్షలు.. నిబంధనలు.. చెన్నైలో తెలుగు నేర్చుకుంటే ఉద్యోగం రాదనే కారణం.. ఏదిఏమైనా తమిళనాట తెలుగు వారు నోరు తెరవలేకున్నారు. కన్నతల్లి లాంటి ఆంధ్రప్రదేశ్ స్పందించడం లేదు. శుక్రవారం అఖిల భారత తెలుగు సమాఖ్య ఆస్కాలో నిర్వహించిన ముఖాముఖి కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ మంత్రి దామోదర రాజనరసింహ ముందు చెన్నై తెలుగు ప్రజల్లో పెల్లుబుకిన ఆవేదనకు అక్షర రూపమిది...

అడిగే నాథుడేడీ
తమిళనాట తెలుగు వారికి ఇంత దుస్థితి ఏర్పడటానికి ప్రధాన కారణం మా గురించి రాష్ట్ర ప్రభుత్వాన్ని అడిగేనాథుడు లేక పోవడమే. తెలుగు సాంస్కృతిక వైభవానికి చెన్నై వేదిక. ఒకప్పుడు వాగ్గేయకారులు కూడా ఉన్నారు. అప్పుడు మనకు ఏది జరిగినా అడిగే వారొకరుండేవారు. ఇప్పుడు అది లేదు. ఇక్కడ తెలుగు వాళ్లు నోళ్లు తెరిచినా స్పందన రాదు. ఆంధ్ర ప్రభుత్వం పట్టించుకోనంత వరకు ఇదే గతి.
- గొల్లపూడి మారుతీరావు, సినీ నటులు, రచయిత


ఎంతమంది సీఎంలొచ్చినా ఇంతేనా
ఇక్కడి తెలుగు వారి సమస్యల గురించి మేం విజ్ఞప్తి చేయని ముఖ్యమంత్రి అంటూ లేరు. ఒకసారి చంద్రబాబునాయుడికి వినతి పత్రం ఇస్తూ ఇలా విజ్ఞాపనా పత్రం తీసుకున్న ముఖ్యమంత్రుల్లో మీరు ఏడో వారు సర్ అన్నాను. మా సమస్యలపై ఆంధ్ర ప్రభుత్వం ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
- డాక్టర్ సీఎంకే రెడ్డి, అధ్యక్షులు, అఖిల భారత తెలుగు సమాఖ్య

తెలుగు అకాడమీ ఎందుకు ఏర్పాటు చేయరు
రాష్ట్రంలో 42 శాతం తెలుగు వారున్నారు. ఎక్కడో మలేషియాలో ఉన్న తెలుగు వారికోసం ఏదో చేస్తామంటున్నారు. ఇంతమంది తెలుగు జనాభా ఉన్న తెలుగు వారికోసం ఇక్కడ తెలుగు అకాడమీ ఎందుకు ఏర్పాటు చేయరు. తమిళం, తెలుగు రెండూ సోదర భాషలు. మన భాషకు ప్రాచీన హోదా కల్పించడానికి కావాల్సిన అన్ని ఆధారాలూ ఉన్నాయి.
- జీబీఎస్ఆర్ కృష్ణమూర్తి, ప్రపంచ తెలుగు సమాఖ్య

విద్యార్థులు తగ్గిపోతున్నారు
ప్రస్తుతం చెన్నైలోని తెలుగు పాఠశాలల్లో తెలుగు చదివే వారి సంఖ్య తగ్గిపోతోంది. దీంతో ప్రభుత్వం ఉపాధ్యాడు, విద్యార్థుల నిష్పత్తిని 1:15 నుంచి 1:40కి మార్చేసింది. తెలుగు మూడో భాష అయిపోయింది. తమిళనాడులో తెలుగు చదివితే ఏం చేయాలి అనే భయం ఇప్పుడు విద్యార్థుల్లో నెలకొంది. తెలుగు చదివితే ఉద్యోగాలు రావు అనే భయాన్ని తొలగించాల్సిన అవసరం ఉంది.
- చెంగయ్య, ప్రధానోపాధ్యాయులు, ఎస్‌కేపీడీ పాఠశాల

వరాల జల్లు ఇక్కడా కురిపించండి
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి తెలుగు ప్రజల అభివృద్ధి కోసం, రాష్ట్రంలోనూ విదేశాల్లోనూ వరాల జల్లు కురిపిస్తున్నారు. మాపైనా ఆ జల్లు కాస్త కురిపించాలి. మా కష్టాలు తొలగించాలి.
- జేకే రెడ్డి, కోశాధికారి, అస్కా

సహకారమివ్వండి.. సాధించి తీరుతాం
తమిళనాడులో తెలుగువారికేం తక్కువ కాదు. మాకు కావాల్సిందల్లా ఆంధ్ర ప్రభుత్వం నుంచి సహకారం, స్పందన. అది ఇచ్చి చూడండి.. మా సమస్యలు ఇట్టే సాధించుకుని తీరుతాం.
- వంకాలయ సత్యనారాయణమూర్తి, సినీ నటులు

మమ్మల్నీ పట్టించుకోండి
ఒకప్పుడు తెలుగు వైభవాన్ని ఇక్కడ కళ్లారా చూసిన వాడ్ని. ఇప్పుడు సహకారం లేకనే ఈ పరిస్థితి. ఇక్కడి వారినీ ప్రభుత్వం పట్టించుకోవాలి. పొట్టి శ్రీరాములు స్మారక మందిరం నిర్వహణ కూడా ఆంధ్ర ప్రభుత్వం చేపట్టాలి.
- గోటేటి శ్రీరామారావు, సంపాదకులు, ప్రముఖాంధ్ర

No comments: