welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, November 13, 2008

నేటి తెలుగుకు మేటి వెలుగు - అద్భుత


తెలుగు భాష ప్రాచీనమైందంటూ రాజముద్ర ఎట్టకేలకు పడింది. అసలు అధ్యాయం మొదలైంది. ప్రాచీన హోదా కిరీటమొక్కటే తెలుగుభాషను బతకించజాలదు. అమ్మకు అమ్మ ఉండేదని అంగీకరించినంత మాత్రాన ఒనగూడే ప్రయోజనం నామమాత్రమే. ఆత్మగౌరవం ఆయువు పోసుకుంది- అంతే! ఎంతసేపూ గతంలో గెంతులువేసి బావుకొనేదేం ఉండదు. తాతలు తాగిన నేతి వాసనల్ని చర్చకు పెట్టి లాభంలేదు. చెట్టుపేరు చెప్పుకొని కాయలు అంటగట్టలేం.

ప్రాచీనహోదా ఇచ్చినందుకు మహా అయితే ఏటా కొన్ని కోట్ల రూపాయల నిధులు ముట్టచెబుతారు. ఆ మొత్తంతో ఏం వెలగబెడతారన్నదే అసలు ప్రశ్న. పొరుగు రాష్ట్రంలోలాగా మనకంటూ పకడ్బందీ అనువాద విభాగం లేదు. అముద్రిత గ్రంథాలెన్నో శిథిµలావస్థకు చేరుతున్నాయి. ఆ జాబితా మన చేతుల్లో లేదు. పోనీ అకాడమీలను పునరుద్ధరిద్దామంటే- గతంలోని చేదు అనుభవం మనల్ని వెంటాడుతోంది. రచయితమ్మన్యులు తమ ప్రాపకం కోసం అకాడమీలను భ్రష్టుపట్టించి ఆధిపత్యపోరుకు తెరతీసిన నీచచరిత్ర ఇటీవలి మాటే. సాహిత్య అకాడమీ, సంగీత అకాడమీలను ఎన్టీఆర్ ఉన్నపళంగా రద్దు చేశారనటం నిజం కాదు. వాటి రద్దుకు దారితీసేలా కుళ్లు రాజకీయాలు రాజ్యమేలాయన్నది నిన్నటి సూర్యాస్తమయం అంతటి ఎర్రని నిజం!

ప్రస్తుత శుభసందర్భంలో తెలుగుభాష విశిష్టత గురించి వూరూరా సభలు పెట్టి వూదరకొట్టినందువల్ల ఉపయోగం శూన్యం. ఆంధ్రత్వ మాంధ్రభాషాచ నల్పస్య తపసఃఫలమ్ (ఆంధ్రులుగా పుట్టడం, ఆంధ్రభాష వ్యవహరించడం తపస్సిద్ధి పుణ్యమే) అంటూ ఢిల్లీ పాదుషాను మెప్పించిన గోదావరి వాసి అప్పయ్యదీక్షితులు ఏనాడో తెలుగుభాషకు జేజేలు పలికారు. అంతక్రితమే 'క్రీడాభిరామ' కర్త 'దేశభాషలందు తెనుగులెస్స' అంటూ తెలుగుకు పట్టం కట్టాడు. 'తెనుగు' అన్నమాట పరిమితమైన అర్థంలో భాషాపరంగానే చెలామణిలో ఉన్నందువల్ల దాన్ని తెలుగుగా మార్చి ఆముక్తమాల్యద కర్త 'దేశ భాషలందు తెలుగు లెస్స' అన్నాడు. తమిళకవి సుబ్రమణ్య భారతి 'సుందర తెనుంగు' అన్నాడని మురిసిపోనక్కరలేదు. అచ్చులతో అంతమయ్యే అరుదైన పదసంపద కలిగి- డాంటీ, పెట్రార్క్, బొకాసియోలు మెరుగులు దిద్దిన ఇటాలియన్ భాషతో మన భాషని పోల్చి, 'ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్'గా వినుతికెక్కేట్టు చేసిన నావికుడు నికొలయ్ కోంటి పేరు తలచుకుంటే ఒరిగేదేం లేదు. దేశానికి హిందీ, ఆంగ్లభాషలతో పాటు అధికారభాష కాదగ్గ అర్హత తెలుగుభాషకుందని ఆంగ్లశాస్త్రవేత్త హాల్డేన్ భావిస్తే ఏముంది... మన పాలకులకు ఆపాటి స్పృహ ఉండాలిగాని! పాత అణాలపై ఆనాటి ఆంగ్ల పాలకులు 'ఒక అణా' అంటూ ఆంగ్ల, హిందీ, బెంగాలీ, తెలుగు భాషల్లో ముద్రించిన ముచ్చట్లు స్వపరిపాలకులు మరిచారు.

రాజకీయ గ్రహణం పట్టి భాషల ఉనికి మసకబారిపోతోంది. ప్రపంచీకరణ పుణ్యమా అని ఎన్నో ప్రాంతీయ భాషలు, ముఖ్యంగా ఆఫ్రికన్ భాషలు మట్టికొట్టుకుపోయాయి. ప్రపంచవ్యాప్తంగా అయిదువేల భాషలు వ్యవహారంలో ఉన్నాయని అంచనా. నేడు రమారమి రెండువేల భాషల రెక్కలు విరిగి ప్రపంచభాషల సంఖ్య మూడువేలకు పడిపోయింది.

ఇప్పుడు మనముందున్న సమస్యల్లా- నేటి అవసరాలకు సరిపడేలా తెలుగు భాషను రూపొందించేందుకు త్వరపడటం. ప్రాచీనత విషయం పక్కన ఉంచి ఆధునికతవైపు మనం దృష్టి సారించాలి. ఆధునిక భాషగా తెలుగు మనగలిగేలా మనం నడుం బిగించాలి. తెలుగు మాధ్యమంలో చదివిన సిసలైన భాషాభిమానుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలి. పీజీ స్థాయిలో తెలుగును అభ్యసించిన వాళ్లకు ఉపాధి అవకాశాలు అందివచ్చేలా హామీ ఇవ్వగలగాలి. ప్రహసనంగా మారిన జిల్లాకో విశ్వవిద్యాలయం ప్రణాళికలో ఎం.ఎ. (తెలుగు) కోర్సుకు అంతంతమాత్రం చోటుండటం ఆలోచించాల్సిన విషయం. ఎం.ఎ (తెలుగు)లో పత్రికారచనను రెండు పేపర్లుగా, ప్రస్తుత అవసరాలకు తగ్గట్టు పాఠ్యప్రణాళికను కొత్త విశ్వవిద్యాలయాలు సిద్ధం చేసుకోలేకపోవటం అంతుబట్టని విషయం. ఓవైపు ఆరువేల బడుల్లో ఆంగ్ల మాధ్యమంలో సీబీయస్ఈ కోర్సును ప్రవేశపెడుతున్న మన సర్కారు, ఆధునికభాషగా తెలుగును ఏ మేరకు నిలబెడుతుందన్న విషయంలో సవాలక్ష సందేహాలున్నాయి. యాభైఆరు అక్షరాల తెలుగు వర్ణమాల విషయంలో ప్రామాణికత సాధించాల్సి ఉంది. ప్రాచీన ద్రావిడ మాతృకలో పదహారు హల్లులూ, పది అచ్చులూ మాత్రమే ఉన్నాయి. క్రీ.శ. ఏడో శతాబ్ది తెలుగులో పది అచ్చులూ, ఇరవైఒక్క హల్లులూ ఉండగా కాలక్రమంలో సంస్కృత ప్రభావంతో మహాప్రాణ వర్ణాలు పది (శ, ష, హ...) వచ్చి చేరాయి. ప్రాకృతం నించీ 'ఱ' ప్రవేశించింది. మరీ ఎక్కువగా తెలుగులోకి యాభైవేలకుపైగా సంస్కృత పదాలు చేరి అచ్చతెలుగు కనుమరుగైంది. తెలుగు భాషకు అడ్డుగోడగా ఆంగ్లమే కాకుండా సంస్కృతమూ వచ్చి చేరింది. ఇంటర్మీడియట్ స్థాయిలో కార్పొరేట్ కళాశాలల్లో సంస్కృతం స్థానంలో ద్వితీయభాషగా తెలుగును కనీసమాత్రంగానైనా అధికారభాషా సంఘం ఎందుకని అమలు చేయలేకపోతోందో చూడాలి. తెలుగు మీడియం పొత్తాల్లో తెలుగుపాలు ఎంతన్నది ఓ ధర్మసందేహం. సకశేరుకాలు (వెన్నెముక కలిగిన జీవులు), అకశేరుకాలు (వెన్నెముక లేని ప్రాణాలు)... వంటివి ఏ ఒక్కరికైనా బోధపడతాయా అన్నది ప్రశ్న. తెలుగులో సంతకంచేయని ఆచార్యులున్న భాషమనది. ఆంగ్లమాధ్యమంలో తరించిన సుపుత్రులున్న తెలుగు భాషోద్యమకారులు మనసొత్తు. ఇన్ని వైరుధ్యాల నడుమ తెలుగుభాష నడుం బెణక్కుండా ఆధునిక భాషగా రాణించటానికి పెద్దపెట్టున కృషి జరగాలి. అందుకు మన మనసుల విస్తీర్ణం పెరగాలి.

No comments: