welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, November 13, 2008

విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?


సంస్కృతం,తమిళం తో పాటు తెలుగు కన్నడ భాషలను కూడా ప్రాచీన భాషలు గా కేంద్రం ప్రకటించింది. ప్రాచీన హోదాతో వచ్చే నిధుల్ని ఆధునిక అవసరాలకు వినియోగించాలనే వాదనలు అప్పుడే మొదలయ్యాయి.చైనా భాష తమిళం కంటే ప్రాచీనం.వారు లిపిఆధునిక అవసరాలకు అనువుగాలేదని చాలా సార్లు సంస్కరించుకున్నారు.మనం కుండపెంకుల మీద, బండరాళ్ల మీద రాసుకుంటున్న రోజులలో ఒక లిపి సహితం లేని రష్యా వాళ్లు, జపాన్ వాళ్లు వారి భాషలను ఆధునిక అవసరాలకు అనువుగా మార్చారు.మన లిపిని మనం ఎందుకు మార్చుకోలేము? జాతి ఎదుగుదలకు కావలసింది వారి భాష ప్రాచీనహోదాతో పాటు ఆభాషను ఆధునిక అవసరాలకు కూడా సరిపడేలా తీర్చిదిద్దుకోవటం.భాషాభిమానంతో పాటు ప్రజల నిత్య జీవి తానికి సంబంధించిన పాలనా వ్యవహారాలలో స్వభాష పెత్తనం చేయాలి.

తెలుగు అధికార భాష చట్టం 1966లో వచ్చింది.ఉర్దూ హైదరాబాద్, అనంత పురం, కర్నూలు, కడప, గుంటూరు, మెదక్, నిజామాబాద్, రంగారెడ్డి జిల్లాలలో రెండవ అధికార భాష అన్న సవరణ 1996లో జారీ అయింది. ప్రభుత్వం జారీ చేసే చట్టాలూ ఆదేశాలూ నియమాలూ, ప్రభుత్వం ఇతర సంస్థలతో జరిపే ఉత్తరప్రత్యుత్తరాలూ అధికార భాషలలోనే ఉండాలనీ చట్టంలో ఉంది,కానీఉర్దూలోకానీ తెలుగులోకాని అనే అమలు కావటంలేదు.ఇద్దరికీ ఇంగ్లీషే శరణ్యమయ్యింది.1988 నవంబర్ 1 నుంచి అన్ని ప్రభుత్వ ఉత్తర్వులూ ఉత్తర ప్రత్యుత్త రాలూ తెలుగులోనే ఉండాలనీ, ఇంగ్లీష్ కేవలం కేంద్ర ప్రభుత్వంతో, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడే భాష అని జీవో జారీ అయ్యింది. ప్రభుత్వ ఉత్తర్వులు ఉత్తర ప్రత్యుత్త రాలు ప్రజలకు అందుబాట్లో ఉంచాలని, వారి అభిప్రాయాలు అభ్యంతరాలు వినడానికి బహిరంగ విచారణ జరపాలనీ చట్టం అంటుంది. కానీ అవి ప్రజలకర్థమయ్యే భాషలో ఉండటంలేదు. ఎన్నిసార్లు మొత్తుకున్నా ఆ పని మాత్రం చేయటంలేదు.అలాగే న్యాయస్థానాలలో స్థానిక భాష వాడటంలేదు.తెలుగు ప్రజల జీవితాలు, ఆస్తులు, కుటుంబ వ్యవహారాలకు సంబం ధించిన వ్యాజ్యాలలో విచారణ, వాదోపవాదాలు తమకు అర్థం కాని భాషలో జరుగుతుంటే తెలుగు ప్రజలు నోరు వెళ్ల బెట్టుకొని చూస్తున్నారు.ఇది మన జాతికి అవమానకరం. తమిళులు 1976 నుంచి క్రిమినల్ కేసులు సెషన్స్ కోర్టు దాకా,1982 నుంచి సివిల్ కేసులు పూర్తిగా తమిళంలోనే జరుపుతున్నారు.

హిందీ రాష్ట్రాలు హిందీలోనూ గుజరాత్, బెంగాల్ రాష్ట్రాలుహైకోర్టుల్లో తప్ప మిగతా అన్ని కోర్టుల్లో తమ తమ భాషలలోనే న్యాయవ్యవస్థను నడుపుతున్నాయి. మనకు మెజిస్ట్రేట్ కోర్టులలో కూడా ఇంగ్లీషే.తమిళం ఇంగ్లీష్తో పోటీపడి ఎదుగుతున్నది .వత్తులు గుణింతాలు అన్నీ పక్కపక్కనే ఇంగ్లీష్లో లాగా ఒక వరసలో యంత్రానికి అనుకూలంగా తమిళ లిపి వారికి వరంగా మారింది."అరవమున డెమ్మీ ఫారము ముద్రణకు నాలుగు రూపాయలు చార్జి చేయగా తెలుగునకదేమాదిరి ఫారమునకు ఎనిమిదిరూపాయలు చార్జి చేయుచున్నారు.ఇట్లు ధర తక్కువయగుటకు కారణము అరవ లిపిలో సంకేతముల సంఖ్య మిక్కిలి తక్కువగా నుండుట.తెలుగచ్చును కంపోజిటర్లు నేర్చుకొనుటకు ఆరునెలలు పడితే అరవము ఒక నెలలో నేర్చుకొన వచ్చును.తెలుగు లిపిని గూర్చుట జాల జాగగును.గంటకు ఒక గాలీ అరవము కూర్చగలుగగా తెలుగున అరగాలీ మాత్రమే కుర్చగలము.అచ్చునకే ఇన్ని చిక్కులుండగా నింక టైపురైటింగు కుదురునా?" అని వేటూరి ప్రభాకర శాస్త్రి వాపోయారు.ఇంగ్లీషున అరవమున ఉన్నట్లు లిపి సంకేతములు ప్రక్కప్రక్కనే (ఒకదానిక్రిందనొకటి యుండకుండుట) యుండవలెనని ఆయన కోరారు.రాజీవ్ గాంధీ హత్య కేసు కూడా తమిళంలోనే జరి గిందట. అప్పీలును విచారించే సుప్రీంకోర్టు తమిళంలో ఉన్న పత్రాలన్నిటినీ ఇంగ్లీష్‌లోకి అనువాదం చేయించుకొని అప్పీల్ వింది. ఇంగ్లీష్ వచ్చిన వారికే మంచి ఉద్యోగాలు వస్తున్నందు వల్ల ప్రభుత్వ పాఠశాలలలో కూడ ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడుతున్నారు.పిల్లలు కొత్త భాషలు సునాయాసంగా నేర్చుకుటారని వాదిస్తున్నారు.మాతృభాషలో విద్యా బోధనే పిల్లల కు మంచిదంటే హేళనచేస్తున్నారు.మీపిల్లలు ఏ మాధ్యమం లో చదువుకుంటున్నారని ఎదురు ప్రశ్నిస్తున్నారు.పిల్లలందరినీ ఆంగ్ల మాధ్యమం లో పడేస్తే నిజంగానే గొప్పఅవకాశాలొస్తాయా? ఉద్యోగాలు వస్తున్నది ఇంగ్లీష్ భాషా పరిజ్ఞానం వల్లనా లేక విషయవిజ్ఞానం వల్లనా? ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళలోకూడా విషయ పరిజ్ఞానం లేని శుంఠలకు కూడా ఉద్యోగాలు వస్తాయా?భాష నేర్చుకోవడం వేరు, భాషలో చదువు నేర్చుకోవడం వేరు.పర భాషలో చదువుపిల్లలకు హింసే. పిల్లలందరినీ ఇంగ్లీష్ మీడియంలోకి నెట్టడంకంటే ప్రైవేట్ పాఠశాలలు కూడా మాతృభాషలోనే చదువు నేర్పటం తప్పనిసరి చేయాలి. ఇంగ్లీష్‌ను కేవలం ఒక భాషగా నేర్పాలి.

No comments: