welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, November 13, 2008

నలుగురి కోసం 'నారాయణ'

నలుగురి కోసం 'నారాయణ'
సామాజిక సంబంధాలకే పెద్దపీట
అందరినీ కలుపుకుపోవడమే ఉత్తమం
మారుతున్న యువత ధోరణి
గుడికి వెళతారు.. కానీ పెద్దగా భక్తి లేదు. అర్చనలు చేస్తుంటారు.. కానీ అంత ఆసక్తితో కాదు. నేటి యువతలో భక్తి కొరవడుతోందని ఓవైపు.. లేదు మళ్లీ పెరుగుతోందని మరోవైపు భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యువతను పలకరిస్తే.. ''భక్తిమాటెలా ఉన్నా 'సంప్రదాయాలను' మాత్రం వదులుకోం'' అని స్పష్టంగా చెబుతుండటం విశేషం!

''దేవునిపై నాకు ప్రత్యేకంగా నమ్మకం లేదు. అలాగని అపనమ్మకమూ లేదు. ఒక రకంగా ఆ విషయానికి నేను అంత ప్రాధాన్యం ఇవ్వను. సెలవుల్లో ఇంటికి వెళ్లినప్పుడు అమ్మానాన్నలతోపాటు పండగలు జరుపుకుంటాను. బంధువులతో కలిసి చర్చికి వెళ్తా'' అని చెబుతారు కేరళకు చెందిన చైత్ర. హైదరాబాద్‌లోని సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ చేస్తున్నారామె. భగవంతునిపై అంతగా నమ్మకం లేనప్పుడు చర్చికి ఎందుకు వెళతారు అని అడిగితే.. అందరితో కలవటం కోసం అని అంటారు! వెళ్లకపోతే అందరికీ దూరంగా విడిగా ఉండాల్సి వస్తుంది, అలా ఉండటం నాకు ఇష్టం లేదని చెబుతున్నారు చైత్ర. నేటి యువత ఆధ్యాత్మిక విషయాలు, ఆచార వ్యవహారాలను వేర్వేరుగా చూస్తున్నారనటానికి చైత్ర ఓ నిదర్శనం. ఈ ధోరణి కొద్దిమందికే, కొన్ని ప్రాంతాలకే పరిమితం కాలేదు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎంఏ ఇంగ్లిష్ చేస్తున్న సంపత్‌ను కదిలించినా ఇలాంటి అభిప్రాయమే వినిపిస్తుంది. ''దేవుని విషయంలో నాకంటూ ప్రత్యేకంగా ఇష్టాయిష్టాలేమీ లేవు. మిత్రులతో కలిసి ఎప్పుడైనా గుడికి వెళ్తుంటా. కాకపోతే గాఢమైన భక్తేమీ లేదు. ఓ పక్కన కూర్చుని వచ్చిపోయే వాళ్లని గమనిస్తూ ఉంటా'' అని అంటారు. పెళ్లి సంప్రదాయబద్ధంగా చేసుకుంటారా? లేక రిజిస్ట్రేషన్‌లాంటి పద్ధతుల్లో పయనిస్తారా? అని అడిగితే మొదటి దానికే తన ఓటు అని ఘంటాపథంగా చెప్పారు. ''పెళ్లంటే అమ్మానాన్నా, బంధువులు, స్నేహితులు... వీరందరితో ముడివడిన అంశం. నా ఒక్కడికే పరిమితమైంది కాదు. వాళ్లందరి అభిప్రాయాలను, నమ్మకాలను కాదని నేను వెళ్లను. అందిరినీ కలుపుకొని పోతేనే ఆనందం కదా'' అని తన దృక్పథాన్ని వివరిస్తారు సంపత్.

మార్పు వస్తోంది
ఇప్పటికీ ఎంతో దీక్షగా పూజలు, ఉపవాసాలు చేసే యువతీయువకులూ కొదవ లేదు. నల్గొండకు చెందిన మనోహర్ పొద్దున్నే సూర్యనమస్కారంతోనే దినచర్య ప్రారంభిస్తారు. ప్రతీ శనివారం తప్పకుండా గుడికి వెళ్తారు. జీవితంలో ఏది జరగాలన్నా భగవంతుని కృప ఉండాలనీ, దానికి మన ప్రయత్నం తోడుగా నిలవాలని చెబుతారు. మరోవైపు 'గాఢ భక్తికి కారణం భయమేనంటారు' నిజామాబాద్‌కు చెందిన ఎంఏ విద్యార్థి శ్రీకాంత్‌రెడ్డి. ''దేవుణ్ణి నమ్మకపోతే ఏమైనా అవుతుందేమోనని భయం. ఇటీవల ఇస్రో శాస్త్రవేత్తలు చంద్రయాన్‌కు ముందు పూజలు చెయ్యలేదా? ఆ ప్రయోగం తప్పకుండా విజయవంతం అవుతుందనే నమ్మకమే వాళ్లకు ఉంటే పూజలు చేసేవారా?'' అని ప్రశ్నిస్తారు. విషయం ఏమిటంటే ఆయన కూడా దేవున్ని నమ్ముతారు. మరి, మీకున్న భయమేమిటి అని అడిగితే, ''జీవితంలో ఎలా స్థిరపడతానో అనే భయం. ఆ తర్వాత అనువైన భార్య దొరకాలని, పిల్లలు పుట్టాలని ఇలా... కోరికలు వాటితోపాటే భయాలు వస్తూనే ఉంటాయి'' అని నిర్మొహమాటంగా తన అంతరంగాన్ని వెల్లడిస్తారు. భయం మాటెలా ఉన్నా.. యువతరం భక్తిలో ఆధ్యాత్మికమైన గాఢత లేకపోవటం మాత్రం కొట్టొచ్చినట్టు కనబడుతున్న వాస్తవం. యువత ఆలోచనల్లో వస్తున్న ఇలాంటి మార్పుల వల్లే భక్తి-సంప్రదాయాలు రెండూ ఇప్పుడు వేర్వేరు దార్లుగా మారిపోయాయి.

దేని దారి దానిదే
గతంలో భక్తి, సంప్రదాయం రెండూ కలిసిపోయే ఉండేవి. గుడికి వెళ్లటంలో, పూజలు చేయటంలో ఎంత ఉత్సాహం కనిపించేదో పండగలు, తంతుల్లోనూ అంతగా మమేకమయ్యేవారు. ఇప్పుడు ఈ రెండింటి మధ్య అవినాభావం తగ్గుతోంది. పరీక్షల సమయంలోనో, ఇంటర్వ్యూకు వెళ్లాల్సి వచ్చినప్పుడో, మరేదైనా సమస్య తలెత్తినప్పుడో తప్ప దైనందిన జీవితంలో దైవానికి తొలిప్రాధాన్యం ఇవ్వటం తక్కువేనంటున్నారు చాలామంది యువకులు. ఆడపిల్లలు మాత్రం ఇందుకు కొద్దిగా భిన్నం. రోజువారీ భక్తిగా ఉండే ఆడపిల్లల సంఖ్య కొంత ఎక్కువగానే కనబడుతోంది. ఈ భక్తి మోతాదు యువతలో ఎలా ఉన్నా.. సంప్రదాయాలకు మాత్రం అంతా పెద్దపీట వేస్తుండటం కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. గుంటూరుకు చెందిన పీహెచ్‌డీ విద్యార్థి శ్రీనివాస్‌నే తీసుకుంటే... తాను దేవున్ని నమ్మనని, నాస్తికుణ్ణని చెబుతారు. ఏడాది క్రితం ఆయన పెళ్లి మాత్రం సంప్రదాయబద్ధంగానే జరిగింది. పెళ్లితంతుపై నమ్మకం లేనప్పుడు ఎందుకు వ్యతిరేకించలేదు అంటే 'అమ్మానాన్న బాధపడతారు, అందరూ నన్ను దూరంగా ఉంచుతారు. అంత రిస్కు తీసుకోవాల్సిన అవసరం ఏముంది? ఆ తంతు కాదంటే పెద్ద రభస. అదే తలూపితే.. అంతా ఎంజాయ్ చేస్తారు కదా' అంటారు.

మొత్తానికి వ్యక్తిగత నమ్మకాలెలా ఉన్నా.. సామాజిక జీవనానికి సంప్రదాయాలే ఆలంబనగా నిలుస్తున్నాయన్న విషయం యువత అభిప్రాయాల్లో వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకూ పాలూనీళ్లలా కలగలిసిపోయిన భక్తి-ఆచారాలను.. నేటి యువత హంసలా నేర్పుగా వేరు చేస్తుండటం విశేషం

No comments: