welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, November 13, 2008

చక్కని తెలుగుకు చాంగుభళా!

చక్కని తెలుగుకు చాంగుభళా!
- రావూరి ప్రసాద్
మేడలా, మిద్దెలా, కరెన్సీ నోట్లా, కనకాభరణాలా... ఏది నిజమైన ఆస్తి?

ఆరుద్ర మాటల్లో చెప్పాలంటే-
'ఎవరికైనా ఆస్తిఏముంటుంది?
సంగీతంలో సప్తస్వరాలు
సాహిత్యంలో యాభైరెండు అక్షరాలు!'

నిజం. అసంఖ్యాకమైన రాగాలకు ఊపిరిలూదిన ఏడంటే ఏడు స్వరాలకంటే, అసమానమైన రసరమ్య కావ్యాలెన్నింటికో రెక్కలు తొడిగిన యాభైరెండు అక్షరాలకంటే వేరే కలిమి ఎవరికైనా ఏముంటుంది?

అవును. అజరామరమైన ఆ సప్తస్వరాలే తెలుగువాడిగా నా ఆస్తి! అక్షయమైన ఆ యాభైరెండు అక్షరాలే తెలుగువాడిగా నా ఆస్తి!

పట్టుతేనెలోని మధురిమను చిలకరించే నా తెలుగు అక్షరాలకు సాటిరాగల మేడలేవి?

వెన్నెల జలపాతాన్ని కురిపించే నా తెలుగు పదం వన్నెచిన్నెలకు ఏ కనకాభరణాల మిలమిలలు సరితూగగలవు?

నింగీ, నేలా నడుమ నిలువెత్తు సంతకమై నిలిచిన నా తెలుగు వాక్యం ఠీవికి ఏ ఆకాశహర్మ్యం సొగసులు దీటు కాగలవు?

ఆమని సౌందర్యాన్ని తన అక్షరాల్లో సాక్షాత్కరింపజేసే నా తెలుగు 'సరస్వతమ్మ' పలుకుల కలరవాలకు ఎన్ని కరెన్సీ నోట్ల రెపరెపలు సరిపోలగలవు?

రామకథా 'రాగసుధాపానముచేసి' తెలుగు మనసు రంజిల్లడానికి త్యాగయ్య నాదమయం చేసిన సంగీతార్ణవంలోని సప్తస్వరాల క్షీరధారలు నా తెలుగు అక్షరాలు-

తెలుగునేల చీకట్లను పారదోలడానికి వేల సంకీర్తనల్లో అన్నమయ్య వెలిగించిన 'వెన్నెలవంటి శ్రీవేంకటేశు మంత్రము'లోని మణిదీప్తులు నా తెలుగు అక్షరాలు-

మాధవస్వామికి క్షేత్రయ్య అలదిన మధుర పద భక్తిచందనంలోని పరిమళాలు నా తెలుగు అక్షరాలు-

ప్రభువులు సాక్షాత్తు దైవాంశ సంభూతులేనని భావించే కాలంలోనే 'ఇమ్మనుజేశ్వరాధములు' అంటూ 'పాలక దేవుళ్ల' నిజరూపాన్ని బయటపెట్టిన పోతన ధిక్కార గళంలోని రణన్నినాదాలు నా తెలుగు అక్షరాలు-

'రాజుల్ మత్తులు' అంటూ ఆ రోజుల్లోనే ఎలుగెత్తిన ధూర్జటి ఘంటారావంలోని గర్జనలు నా తెలుగు అక్షరాలు-

'మనుష్యుడే నా సంగీతం, మానవుడే నా సందేశం' అని చాటి దోపిడీలకు, అసమానతలకు, దౌర్జన్యాలకు తావులేని 'మరో ప్రపంచం' వైపు పదండి ముందుకు అంటూ శ్రీశ్రీ క్రాంతి గానం మీటిన కత్తి అంచులమీది తళతళలు నా తెలుగు అక్షరాలు-

'ఆధునిక మహిళ చరిత్రను తిరగరాస్తుంది' అంటూ వైతాళికుడు గురజాడ వందేళ్ల క్రితమే నినదించిన భవిష్య వాక్కులు నా తెలుగు అక్షరాలు-

నన్నెచోడుని నుంచి నవయుగ కవిచక్రవర్తి జాషువా దాకా, కవిత్రయం నుంచి కృష్ణశాస్త్రి దాకా, వేమన నుంచి విశ్వనాథ దాకా ఎందరెందరో సాహితీ సారస్వతమూర్తులు తమ అమృత కరస్పర్శతో సుసంపన్నం చేసిన తెలుగు అక్షర భాండాగారం మన ఆస్తి!

ద్వారం వెంకటస్వామి నుంచి జనార్దన్ వరకు, ఈమని శంకరశాస్త్రి నుంచి షేక్ చినమౌలానా వరకు; బాలమురళీకృష్ణ నుంచి నూకల చినసత్యనారాయణ వరకు ఎందరో నాద, గాన యోగులు తమ వేళ్ల కొసలతో, గాత్రమాధుర్యంతో సంపద్వంతం చేసిన సంగీత రసధుని మన ఆస్తి!

ఈ ఆస్తిని కాపాడుకోవాలంటే నిరంతరం తెలుగు అక్షరాలు వెలుగుతుండాలి. తెలుగు పదాలు పల్లవిస్తుండాలి. తెలుగు శబ్దాలు వేదాలై, నాదాలై ప్రతి గుండెలో ప్రతిధ్వనిస్తుండాలి. 'జాను తెనుగే మేము- జాతి ఘనతే మేము' అంటూ మల్లాది రామకృష్ణశాస్త్రి మోగించిన తెలుగు జయభేరిని సగౌరవంగా అందుకుంటూ తెలుగువారిలో ప్రతి ఒక్కరూ సగర్వంగా ముందుకు సాగాలి

No comments: