welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Saturday, June 23, 2007

Oka Prema katha

ఆరున్నరకల్లా గ్రీన్ పార్క్ హోటల్ కి వచ్చెయ్. కారుపంపించనా ఆఫీసుకి” అడిగాడు నవీన్.
“వద్దులేరా.నేనే ఆటోలో వచ్చేస్తా!” అని ఫోను పెట్టేసి టైం చూసుకున్నాను.మూడు నలభై కావొస్తోంది.వున్న పని కాస్త ముగించుకుని ఇంటికి బయల్దేరాను.
“అప్పుడే వెళ్ళిపోతున్నావా?” ఆడిగాడు పక్క సీట్లో కూర్చున్న కార్తీక్.
“ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలి పెళ్ళికి వెళ్ళాలి” అని చెప్పి ఆఫీసు నుంచి బయటపడ్డాను. ఆటో ఎక్కి అమీర్ పేట అని చెప్పాను.
“జ్యోతి వెడ్స్ వినయ్”. చేతిలో ఉన్న శుభలేఖను తెరిచి చూశాను. నవీన్ వాళ్ళ బాబాయ్ కూతురు జ్యోతి. బెంగుళూరులో ఏదో సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం. పెళ్ళికొడుకు కూడా సాఫ్ట్ వేర్ ఉద్యోగమే చేస్తున్నాడట.
అశ్విని కూడా పెళ్ళికొస్తుందని చెప్పాడు నవీన్ ఇందాక ఫోన్లో. ఆరునెలల తర్వాత మొదటిసారి అశ్వినిని కలుసుకునే అవకాశం వస్తుందని ఒకవైపు మనసులో ఆనందంగా ఉన్నా మరోవైపు తెలియని భయం.
యూనివర్శిటిలో చదివేరోజుల్లో పరిచయం మాఇద్దరిది. నేను ఎం.సి.ఏ రెండో సంవత్సరంలో వుండగా ఎం.ఏ సోషియాలజీలో చేరింది తను. నాచిన్ననాటి స్నేహితుడైన నవీన్ తనకి క్లాస్ మేట్. నేను నవీన్ చిన్నప్పటినుంచి కలిసి చదువుకున్నాము. ఇంటర్ తర్వాత నేను సైన్స్ గ్రూప్ , వాడు ఆర్ట్స్ గ్రూప్ తీసుకుని చదువుల దారుల్లో వేరుపడ్డా మా దోస్తీ మాత్రం ఎప్పటిలానే సాగిపోయింది.
డిగ్రీ పూర్తయ్యాక నేను ఎం.సి.ఏ లో చేరడం, నవీన్ ఒక సంవత్సరంపాటు ఎవో చిన్నా చితకా ఉద్యోగాలు చేసి చివరకు విసుగుచెంది నేను చదివే యూనివర్శిటిలోనే ఎం.ఏ సోషియాలజీ లో చేరడం జరిగిపోయాయి. నవీన్ తోపాటు ఒకే క్లాసులో ఉండడంతో అప్పుడప్పుడు అతన్ని కలవడనికి వెళ్ళినప్పుడూ కనిపిస్తుండేది అశ్విని.
ఒక్కసారిచూసి తలతిప్పుకోలేని అందం ఆమెది. ఆమెను చూసిన ప్రతివారు మరోసారి తలతిప్పి ఆమెను చూడాల్సిందే! గల గల పారే సెలయేరులా ఎప్పుడు చిరునవ్వునలంకరించుకుని అందరితో కలుపుగోలుగా మాట్లాడుతూ తిరిగే అశ్వినిని చూస్తే ఒక్కోసారి పురివిప్పిన నెమలిలానో, చెంగుచెంగున ఎగిరే లేడిపిల్లలానో ఉండేది.అందుకే ఆమెను చూస్తూండడంలో చాల థ్రిల్ కలిగేది. అలా చూస్తూచూస్తూనే ఆమెతో ప్రేమలో పడిపోయాను నేను. ఎప్పుడైనా నవ్విందంటే చాలు, ఆ నవ్వుల సవ్వడి వీనుల విందైన సంగీతంలా నా మనసుకి తోచేది. మిగిలిన వాళ్ళకు ఆమె చేష్టలు, నవ్వులు ఎలా అనిపించేవో, ఎలా వినిపించేవో నాకయితే తెలియదు.
యూనివర్శిటిలో చేరిన ఆరు నెలల్లోనే నవీన్, అశ్వినిలు మంచి స్నేహితులయ్యారు.
నవీన్ నాకు దూరమవుతున్నందుకో, అశ్విని నాకు దగ్గర కానందుకో లేక నవీన్, అశ్వినిలు దగ్గరయ్యి తనకు దూరమవుతున్నందుకో తెలియదుకాని రోజు రోజుకి నా మనసు చెప్పలేని బాధతో నిండిపోయేది.
“మీ ఫ్రెండ్ నన్నెందుకలా తినేశాలా చూస్తుంటాడు?” అని నవీన్‌ని అడిగిందట అశ్విని.నవీన్ గాడు అదేదో పెద్ద జోకులా నాతో చెప్తే నా కళ్ళల్లో నీళ్ళు తిరగడం నాకింకా గుర్తుంది.
నవీన్ తో పనిఉన్నా లేకపోయినా అశ్వినిని చూడలన్న నెపంతో రోజుకు రెండుసార్లయినా సోషియాలజీ క్లాసురూముల వైపు వెళ్ళేవాడిని. నవీని గాడికి కొన్ని రోజులకి విషయం అర్థమైపోయింది. ఒకరోజు నన్ను క్యాంటీన్‌కి తీసుకెళ్ళి అడిగేశాడు.
“అశ్విని అంటే ఇష్టమా?” అని సూటిగా అడిగేసరికి సమాధానం ఏం చెప్పాలో తెలియక బిక్కమొహం వేసీ నన్ను చూసి పడిపడి నవ్వాడు.
నాకు చాలా కోపమొచ్చింది. నవీన్‌ని చెడామడా తిట్టేశాను. నాకీ ప్రేమలు, అమ్మాయిలతో పరిచయాలు కొత్తేమీ కాకపోయినా అంతకుముందు నేను ప్రేమించాననుకున్న రోజుల్లో లేని ఏదో కొత్తదనం ఆ రోజుల్లో వుండేది. అంతకుముందు నాకెదురైన అనుభవాలు ప్రేమకాదని అశ్వినితో నేను అనుభవిస్తున్నదే నిజమైన ప్రేమని నవీన్‌కి చెప్పాను.
నేను ప్రేమలో పడ్డా ప్రతిసారీ ఇలాగే చెప్తానని నేను జీవితాంతం ఎఫ్ఫుడూ ఎవరో ఒక అమ్మాయిని గాఢంగా, లోతుగా ప్రేమిస్తూనే వుంటానని జోక్ చేశాడు. నేను మాత్రం ధృడ నిశ్చయంతో చెప్పేశాను. నేను ప్రేమించేది, పెళ్ళంటూ చేసుకుంటే అది అశ్విని ఒక్కదాన్నే అని.
నా సీరియస్‌నెస్ చూసి వాడికి నవ్వాగలేదు.అసలు తప్పంతా నాదే అనిపించింది. నా సొంత విషయాలన్నీ నవీన్‌కి పూసగుచ్చినట్టు చెప్పడం, వాడూ నన్ను ఎప్పట్లానే ఏడిపించడం, మరోసారి నా విషయాలేవీ నవీంకి చెప్పకూడదనుకోవడం, వాడీ దగ్గర ఏ విషయమూ దాచకపోవడం మా మధ్య సర్వసాధారణమైపోయింది.
“ఏడిపించడం మాని వీలయితే సహాయం చెయ్యరా” అని ప్రాధేయపడ్డాను.
గ్రీన్‌పార్క్ హోటల్లో పార్టీ ఇస్తానంటే సరే అన్నాడు. నవీన్ సహాయంతో అశ్విని మనసు ఎలాగైనా గెలుచుకోవచ్చనే సంతోషంతో మనసు కొంచెం కుదుట పడింది.
అప్పటికే లంచ్ టైం కావస్తుండడంతో అందరూ క్యాంటిన్ వైపు రావడం మొదలుపెట్టారు. అశ్విని కూడా వచ్చి మాతోపాటే కూర్చుంటే బవుండునని మనసులో అనుకున్నానో లేదో “హాయ్, నవీన్” అంటూ నా ఎదురుగుండా కుర్చీలో కూర్చుంది తను.
నవీన్ స్నేహితురాలయినప్పటికీ నేనెప్పుడూ ఆమెను పలకరించను కూడా లేదు.పార్టికి కక్కుర్తి పడి అయినా నన్ను అశ్వినికి పరిచయం చేస్తాడేమోనని నేను ఆతృతగా ఎదురు చూస్తుంటే “తినడానికేమైనా తెస్తా” అంటూ మమ్మల్నిద్దరినీ ఒంటరిగా వదిలి క్యాంటీన్ లోపలికెళ్ళిపోయాడు మా ప్రాణ మిత్రుడు నవీన్.
అమ్మాయిల్తో మాట్లాడడం నాకు కొత్త కాకపోయినా అశ్విని ముందు ముడుచుకు కూర్చుండిపోయానారోజు. అసహనంగా నేను అటు ఇటు ఇబ్బందిగా కదుల్తుంటే అడిగింది అశ్విని, “మీకు పెళ్ళయిందా?” అని.
ఇరవై రెండేళ్ళకే పెళ్ళయిపోయిన అంకుల్ లా కనిపిస్తున్నానా? అని నామీద నాకే అనుమానం వచ్చింది. తమని ఇష్టపడే అబ్బాయిలంటే అమ్మాయిలకింత చులకన భావమెందుకో అర్థం కాలేదు. యినా కూడా ఆడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలన్న సంస్కారంతో “నాకు పెళ్ళికాలేదు” అని చెప్పి అక్కడ్నుంచి లేవబోతుంటే నా కళ్ళలోకి సూటిగా చూస్తూ మరో ప్రశ్న విసిరింది.
“అసలు జీవితంలో పెళ్ళి చేసుకోవాలనే ఆలోచన వుందా?” అని
రోజు ఆమెను ఆరాధనతో చూడడం మూలానే ఆమె తనను వేలాకోలం చేస్తుందనుకున్నాను.ఆమెపై ఎక్కడలేని కోపమొచ్చింది. పెళ్ళి చేసుకునే ఉద్దేశం ఖచ్చితంగావుంది. కానీ నీలాంటి కఠిన హృదయం కలిగిన దానిని మాత్రం కాదని చెప్పాలనిపించింది. ధైర్యం చాలక అవునన్నట్టుగా తలూపి మౌనంగా ఉండిపోయాను.
“మరి నన్ను పెళ్ళి చేసుకుంటావా?” అని ఆటంబాంబు పేల్చినట్టు మూడొప్రశ్న వేసి సమాధానం కోసం ఎదురుచూడకుండా పరుగులాంటి నడకతో అక్కడ్నుంచి వెళ్ళిపోయింది.
ఇంతలో చేతిలో రెండూ ప్లేట్లతో ప్రత్యక్షమయ్యాడు నవీన్.
“ఏంట్రా! కొంపతీసి ఐ లవ్ యూ అని చెప్పేసావా?” ఆదిగాడు నవీన్.
“సార్ లెఫ్టా రైటా?” అని ఆటోడ్రైవర్ సడన్ బ్రేక్‌వేసి అడగడంతో నా జ్ఞాపకాలకొక బ్రెక్ పడింది. మళ్ళి ఈ లోకంలోకి వచ్చిపడ్డాను.
రెండు నిమిషాల్లో ఇల్లొచ్చేసింది.ఎంత వద్దనుకున్నా అశ్విని ఆలోచనలే మనసంతా అలుముకోనిపోయాయి.
షవర్ కింద స్నానం చేస్తుంటె మేమిద్దరం వర్షంలో నడుస్తూ గంటలు గంటలు గడిపిన రోజులు గుర్తొచ్చాయి.
స్నానం ముగించి బట్టలేసుకుంటూ నవీన్ కి ఫోన్ చేశాను. నాక్కొంచెం పనూందని రావడం కుదరదేమోనని చెప్పాను. అలా అయితే జీవితంలో నా మొహం చూడనని టక్కున ఫోన్ పెట్టేశాడు. నేనక్కడికి వెళితే పాతస్నేహితుల మధ్యలో నేను అశ్విని మాట్లాడుకోకుండా ఇబ్బందిగా ఉండాల్సిరావడం ఊహించుకుంటె అసలు పెళ్ళికి వెళ్ళకపోతేనే మంచిదనిపించింది.
అప్పటికింకా టైం ఐదే అయ్యింది. పెళ్లికింకా గంటన్నర టైం వుంది. సోఫాలో కూలబడి టివిపెట్టి అట్నుంచి అటూ, అట్నుంచి ఇటూ చానెల్స్ అన్నీ ఒకసారి చూసి టివి కట్టెశను. వెళ్ళాలా? వద్దా? అనే ఆలోచనల్తో మనసంతా గందరగోళంగా తయారయింది. ఆరునెలల్లో ఇదే మొదటిసారి అశ్వినిని కలుసుకోవడం.
మొదటిసారి మేమిద్దరం మనసు విప్పి మాట్లాదుకొన్న రోజు గుర్తొచ్చింది. ఒక అమ్మాయి నా దగ్గర్కొచ్చి పెళ్ళిచేసుకుంటావా అని అడిగితే అది నిజమా అబధ్ధ్మా అని తేల్చుకోవడానికి రెండు రోజులు పట్టింది. రెండు రోజులు క్లాసులెగ్గొట్టి మరీ తీవ్రంగా ఆలోచించి ఇంటిదగ్గర్లోవున్న కనకదుర్గమ్మ గుడి దగ్గరకెళ్ళి ఒక పసుపుతాడూ ఒక పసుపుకొమ్ము కొని సినిమా హీరోలాగా యూనివర్శిటీకి బయల్దేరాను.
ఆ రోజు నాకంత ధైర్యమెలా వచ్చిందో నాకిప్పటికీ అర్థంకాదు.
సోషియాలజీ క్లాసుకెళ్ళి అశ్వినిని బయటకు పిలిచాను. అయటకు రాగానే పెళ్ళిచేసుకుందామా అని జేబులోంచి పసుపుతాడు తియ్యడంతో కంగారు పడీపోయింది. అశ్విని వెనకాలే క్లాసులోంచి బయటకు వచ్చిన నవీన్ నా ధైర్య సాహసాల్ని చూసి శిలాప్రతిమలా నిల్చుందిపోయాడు.
స్వతహాగా ధైర్యవంతుడినయిన నేను అంతకు ముందు రెండు మూడు సార్లు ధైర్యంగా వ్యవహరింపబట్టే అమ్మయిలు నా ప్రేమనంగీకరించారు. అప్పుడూ కూడా అలాగే జరుగుతుందనే నమ్మకంతో ధైర్యె సాహస లక్ష్మీ అనుకుని ఆ సాహస కార్యానికి తలపడ్డాను.
ముందు షాక్ తిన్నా తర్వాత నాకు షాక్ తినిపించింది అశ్విని. హేండ్బ్యాగ్ లోంచి ఒక గ్రీటింగ్‌కార్డ్ తీసి నాకిచ్చింది. నల్ల బ్యాక్‌గ్రౌండ్ పై ఎర్ర అక్షరాలతో ‘ఐ లవ్ యూ’ అని ముద్రించి వుంది.
పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమించినమ్మాయినే చేసుకుంటానని ఎప్పుడూ ఫ్రెండ్స్‌కి ఛాలెంజ్ చేసి చెప్పేవాడిని. నేనెంతో ఇష్టపడిన అశ్విని నా జీవితంలోకి రావడంతో నా మాట కాస్త నిజమయ్యే రోజు దగ్గర పడిందనే ఆనందంతో నా మనసు పరవళ్ళు తొక్కింది.
అలా సినిమాటిక్ గా జరిగిన మా పరిచయం చాలా మందికి వింతగా తోచింది. మా ఇద్దరి వింత చేష్టలను క్యాంపస్ మొత్తం కథలు కథలుగా చెప్పుకున్నారారోజుల్లో. అలా మేమిద్దరం అనుకోకుండా అందరి దృష్టిలో పడిపోయాము. దానికి తోడు ప్రతిరోజు యూనివర్శిటిలో కనీసం నాలుగ్గంటలు, ఇంటికొచ్చాక మరో రెండూ మూడూ గంటాలు మాట్లాడుకోందే రోజు గడిచేది కాదు.దాంతో మా విషయం ఇంట్లో తెలిసిపోయింది.
ప్రేమ పెళ్ళిళ్ళకు ఎన్ని అడ్డంకులుండాలో అన్నీ మా ప్రేమకూ ఉండేవి. మా కులాలు వేరు. స్థితిగతులు వేరు. ఇవన్నీ వేరైనా ప్రెమ పెళ్ళిళ్ళను వ్యతిరేకించడంలో మా ఇద్దరి కుటుంబాల అభిప్రాయాలు మాత్రం ఒక్కటే. వీటన్నింటినీ అధిగమించి మేమిద్దరం ఒకటి కావాలనుకుని కలలు కనే వాళ్ళం.
ఒకతిన్నర సంవత్సరం పాటు మా ప్రేమకు హద్దులు లేకుండా పోయాయి.
మధ్య మధ్యలో చిన్న చిన్న అభిప్రాయ బేధాలు, తిట్టుకోవడాలు, అలగడాలు, బుజ్జగించుకోవడాలు వున్నా కూడా అవ్న్నీ ప్రేమలో భాగంగా భావించేవాళ్ళం.
విచ్చ్లవిడీగా హైదరాబాదు వీధుల్లో ప్రేమించేసుకుంటున్న మా గురించి ఇద్దరి ఇళ్ళల్లోనూ గొడవలు మొదలయ్యాయి. తమ కొడుకు తమ కులంకాని అమ్మాయిని ప్రేమిస్తున్నాడని తెలిసి ఒక మధ్య తరగతి కుటుంబంలో ఎంత గొడవ జరగాలో అంత గొడవ మా ఇంట్లోనూ జరిగింది.
నేను మాత్రం ఎప్పటిలానే మా అమ్మానాన్నల తిట్లు భరించానే కానీ వాళ్ళకి ఎదురు చెప్పి మాత్రం మాట్లాడలేదు.నాకు తెలిసినంత వరకూ వాళ్ళకు తప్పుగా అనిపించే విషయాలు నాకు తప్పని అనిపించకపోవచ్చు. వాళ్ళకు మంచి అనిపించే విషయాలు నాకు మంచి అనిపించకఫోవచ్చని కూడా తెలుసు. అందుకు కారణాలు ఎన్నో. వయసులో తేడా, పెరిగిన సమాజంలో తేడా, అన్నింటికీ మించి తరతరాలకీ వున్న ఆలోచనా విధానంలో తేడా. ఇన్ని తేడాలతో తల్లిదండ్రులు, పిల్లలు ఒక విషయాన్ని అభిప్రాయభేదాలు లేకుండా అంగీకరించగలరని నేనెప్పుడూ అనుకోలేదు.
అందుకే వాల్లెంత అరిచి గీపెట్టినా నేను నమ్మిన సిధ్ధాంతాలను నేను వదులుకోలేదు. అది వారి మీద ప్రేమ, గౌరవం లేక మాత్రం కాదు. వారు నమ్మిన సిధ్ధాంతాల ప్రకారం ప్రేమ పెళ్ళిల్లు తప్పు. నాకు తెలిసినంత వరకూ ప్రేమించిన అమ్మాయినే వెళ్ళిచేసుకోవడం కరెక్ట్.
తరానికీ తరానికీ మధ్య వుండే జనరేషన్ గ్యాప్ని పూడ్చడం ఎవ్వరివల్లా కాదని కూడా తెలుసు.
అశ్విని వాళ్ళింట్లో ఇంతకంతే పెద్ద గొడవే జరిగింది. అశ్విని మాత్రం చెరగని చిరునవ్వుతో ఆ గొడవ జరగనట్టే కనిపించేది. తన వాళ్ళని ఎలా అయినా ఒప్పించి తీరాలన్న సంకల్పంతో ఎన్నో విధాలా ప్రయత్నించేది. అలా రోజూ గొడవలతో గందరగోళంగా మారిపోయిన మా ఇద్దరి ఇళ్ళల్లోనూ మా బాధాకర హృదయాలు చూసి కరిగిపోయారో లెక మా ప్రేమకు అడ్డు చెప్పి మమ్మల్ని బాధించకూడదనుకున్నారో తెలియదు కానీ, కొన్ని రోజులకు మా ఇద్దరి ఇళ్ళల్లోనూ మా ప్రేమకు ఓకే చెపేసారు. పెళ్ళి పెళ్ళంటూ మా వెంటపడ్డారు.
నా ఎం.సి.ఎ కూడా పూర్తయ్యి మంచి కంపెనీలో ఉద్యోగం కూడా సంపాదించడంతో మా పెళ్ళికి ఉన్న అడ్డంకులన్నీ తొలిగిపోయినట్టయింది. అశ్విని ఎం.ఏ పూరయిఓవడంతో ఉద్యోగ ప్రయత్నాలు మొదలు పెట్టింది.
యూనివర్శిటీ నుంది బయటపడ్డప్పటినుంచీ ఇద్దరి మధ్యా దూరం ఎక్కువయింది. రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూనే వున్నా, ప్రతి ఆదివారం ఎవరో ఒకరి ఇంట్లో కలుస్తూనె ఉన్నా ఎదో తెలియని దూరం మమ్మల్నిద్దరిని వేర్వేరుగా ఉంచసాగింది.
అంతకుముందు ఎన్నో చిన్న గొడవల్ని విజవంతంగా సర్దుబాటు చేసుకున్న మేము రాను రాను వ్హీటికీ మాటికీ గొడవలు పెట్టుకుని ఒకరితో ఒకరం కొన్ని రోజులు పాటు మాట్లాదుకోకుండా గడీపే వాళ్ళం.
ఆఫీసు పనిమీద నన్ను ఆరునెలల కోసం బెంగుళూరు పంపించడంతో అంతవరకూ మనసుల్లోనే ఉన్న దూరం నిజంగానే మమ్మల్నిద్దరినీ దూరం చేసింది. దానికి తోడు అశ్విని అభ్యుదయ భావాలు కలిగిన మహిళా సంఘంలో సభ్యురాలిగా చేరి స్త్రీ స్వాతంత్ర్యం గురించి, స్త్రీలపై జరుగుతున్న అన్యాలని ఎదురించే పోరాతాంలో సభలూ, ప్రసంగాలంటూ నా కోసం సమయం కేటాయించేది కాదు. ఎప్పుడైనా బెంగుళూరు నుంచి ఫోన్ చేసినా కూడా తన మహిళా సంఘం గురించో, తాము చేస్తున్న కార్యక్రమాల గురించో చెప్పి బోర్ కొట్టించేది.
మా ఇద్దరి కుటుంబాలలో మా మధ్య పెరుగుతున్న దూరాన్ని గమనించారో ఎమో, పెళ్ళి పెళ్ళీ అంటూ తొందర పెట్టాడం మెదలుపెట్టారు.
నాకూడా పెళ్ళయితే అన్ని విషయాలు సర్దుకుంటాయనిపించింది. అందుకే ఒక రాత్రి బెంగుళురు నుంచి అశ్విని వాళ్ళింటికి ఫోన్ చేశాను. వాళ్ళ బావతో సినిమాకెళ్ళిందని చెప్పారు నాక్కాబోయే అత్తగారు. ఎంత చదువుకున్నా, ఎన్ని అభ్యుదయ భావాలున్నా, నక్కాబోయే భార్య వేరొక మగవాడితో సినిమాలెళ్ళిందని తెలిసి మనసులోనెఏ కొంచెం బాధపడ్డాను. అయినా నా బాధను బయటకు కనిపించకుండానే ఆ తరవాతి రోజు ఫోన్ చేసి మాములుగానే మాట్లాడాను.
మాట్లాడినంత సేపూ తనకు కొత్తగా పరిచయమైన మరో ఫ్రెండ్ గురించే చెప్పింది.మగవాడైనా స్త్రీ హక్కుల గురించి, స్త్రీ స్వాతంత్ర్యం గురించి అతనికున్న ఉన్నతమైన అభిప్రాయాల గురించి అరగంటసేపు చెప్పడంతో నాకు వళ్ళుమండిపోయింది.
త్వరగా పెళ్ళిచేసుకోవడమే ఈ సంస్యలన్నింటికీ పరిష్కారమని నవీన్ సలహా ఇవ్వడంతో వారంరోజుల తర్వాత బెంగుళురునుంచి హైదరాబాదు వచ్చేశాను. ఆదివారం నెక్‌లెస్ రోడ్డూలో కూర్చోబెట్టి నాక్కాబోయే భార్య ఎలా వుండాలో ఏ విధంగా నడుచుకోవాలో అశ్వినికి విడమరిచి చెప్పాను.
అంతా విని నాక్కావలిసింది ఇంట్లో కూర్చ్ని వంట పని, ఇంటిపని చేసే పనిమనిషి అని, అందుకు తను సిధ్ధంగా లేనని, స్త్రీలకు కూడా ఒక జీవితముంటుందనీ, జీవితంలో ఏదో సాధించాలనే కలలుంటాయని, వాటి సాధన కోసం స్త్రీకి స్వాతంత్ర్యం కావాలని, ఆ స్వాతంత్ర్యం దొరకని చోటు తనకవసరం లేదని చెప్పి కోపంతో వెళ్ళిపోయింది.
ఆ రోజు నుండీ ఈ రోజు వరకూ ఒకరి మొహం ఒకరు చూసుకోలెదు సరికదా కనీసం ఫోన్లో అయినా మాట్లాడుకోలేదు. మా ఇంట్లో వాళ్ళు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎంత సర్ది చెప్పినా ఎవ్వరం వినలేదు. మా ప్రేమకథ ఎంత విచిత్రంగా మొదలయిందో అంతే చిత్రంగా ముగిసిపోయింది.
ఆ రోజు తర్వాత మళ్ళి ఈ రోజు అశ్వినిని కలుసుకోవలసి వస్తుండడంతో మనసంతా అల్లకల్లోలమైపోయింది.
ట్రింగ్…ట్రింగ్..మని ఫోన్ మోగడంతో కంగారుగా టైం చూసుకున్నాను. ఆరు నలభై అయ్యింది. అవతలివైపు నవీన్ తిడుతున్నాడు నేనింకా బయల్దేరనందుకు. ఇప్పుడే బయల్దేరుతున్నానని చెప్పి ఇంట్లో నుంచి బయటపడ్డాను.
గ్రీన్‌పార్క్ హోటల్ దగ్గరే కావడంతో అశ్విని ఆలోచనల్తో భారమైన మనసుని మోసుకుంటూ కాలినడకనే అటువైపుగా కదిలాను.
ఈ మధ్య పెళ్ళిళ్ళు హోటళ్ళాలో ఏర్పాటు చేయడం ఫ్యాషన్ అయినట్టుంది.మా పెళ్ళి ఖూడా ఎదో ఒక మంచి హోటాళ్ళోనే ఏర్పాటు చేయాలని ఆ రోజుల్లో అశ్విని నాన్నగరంటే నాకవన్నీ ఇష్టముండదనీ, ఎదో ఒక గుళ్ళో చేసేసుకుంటామని చెప్తే, అదేం కుదరదని ఒక్కగానొక్క కూతురి పెళ్ళి గొప్పగా చెయ్యాలని చెప్పడం గుర్తొచ్చింది.
నాకోసమే ఎదురు చూస్తున్నారు మా మిత్రబృందమంతా. పెళ్ళి వేకువజామునెప్పుడో! కాకపోతే ముంది వింది భోజనం వుందట. అందరిని ఒక సారి పలకరించి చుట్టూ చూశాను. అశ్విని ఇంకా వచ్చినట్టులేదు. ఆశగా వెతుకుతున్న నాకు “మీ ఫ్రెండ్ ఇంకా రాలేదురా, వెతుక్కోకు” అంటు చెవిలో చెప్పాడు నవీన్.
వాళ్ళందరి ముందు నాకు చాలా ఇబ్బందిగా అనిపించింది. టైం ఇంకా ఏడే అవడంతో అప్ప్పుడే భోజనాలు చేసే ఆలోచనేమీ లేదని అందరూ చెప్పేసారు. మరేం చెయ్యాలని అందరూ ఆలోచనల్లో పడి ఒక్కొక్కరొక సలహా పడేశారు.
బంధువుల హడావుడిలో నవీన్ అందరినీ పలకరిస్తూ మొహంమీద ఒక నవ్వు పులుముకిని అటూ ఇటూ తిరుగుతున్నాడు. మూలగా దిగులుగా కూర్చున్న ఒక వ్యక్తి వద్దకెళ్ళి ఏదో చెప్తూ నా వైపు చూశాడు. ఆ చూపుకర్థమేమిటో నాకర్థం కాలేదు.కొంచెంసేపు ఆ కొత్త వ్యక్తితో కూర్చుని ఎదో మాట్లాడి అతన్ని మా వైపే తీసుకొచ్చాడు.
ఈ మధ్య కాలంలో రోజూ అద్దంలో నా దిగులు మొహం చూసుకుని నాకంటే దిగులుతో వున్న ఆ కొత్త వ్యక్తి మొహాన్ని చుసి జాలివేసింది. అతని పేరు ఆనంద్ అట. ఒకప్పూడూ ఆనందంగానే వుండేవాడాట. అతని విషాదానికి కారణం చెప్పాడు నవీన్.
ఆనంద్, మరి కొద్దిగంటాల్లో వేరొకరి భార్య కాబోయే జ్యోతి మూడెళ్ళగా ప్రేమించుకున్నారటా. ఇద్దరి కులాలు వేరవడం, ఇంట్లోవాళ్ళు ఒప్పుకోకపోవడం, ఆనంద్ కి ఆత్మహత్య చేసుకోవాలనిపించడం, రొటీన్ తెలుగు సినిమా కథలానే వుంది ఆనంద్ ప్రేమ కథ కూడా!
నవీన్ ఇదంతా నాకెందుకు చెప్పాడో అర్థం కాలేదు. సినిమాల్లోలాగా చివరి నిమిషంలో “ఈ పెళ్ళి జరగడానికి వీళ్ళేదు” అని మేమందరం కలిసి పెళ్ళి ఆపుచేసి జ్యోతి, ఆనంద్ ల ప్రేమను పెళ్ళివరకూ తీసుకెళ్తే బాగుంటుంది కానీ, నిజ జీవితంలో అది ఎంతవరకూ సాధ్యమో తెలియలేదు.
నేను కూడా ప్రేమలో విఫలమై వున్న కారణంగా, నాఅగే ధైర్యంగా జీవితంలో ముందుకు సాగిపోవడనికి ఏదైనా సలహా ఇస్తానేమోనని ఆనంద్ని నాకు పరిచయం చేసి అతని ప్రేమ గాథను నాకు వినిపించాడని నవీన్ చెప్పడంతో నాకు నవ్వొచ్చింది.
అశ్విని దూరమయ్యి నేను పడుతున్న వేదన వీళ్ళకేం తెలుస్తుందనిపించిచంది. నేను డిగ్రిళొ వుండగా, తను ప్రేమించిన అమ్మాయికి వేరొకరితో పెళ్ళయిపోగా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న రవి, చిన్నప్పుడూ మాఊళ్ళో ఆత్మహత్య చేసుకున్న ప్రేమజంట , ఇప్పుడిక్కడ ప్రేమలో ఓడిపోయిన మరోప్రియుడు….వీళ్ళందరినీ తలుచుకుంటే మన జీవితంలో ప్రేమ, ప్రేమ తర్వాత పెళ్ళి ఎంత ముఖ్యమైన ఘట్టాలో అర్థమయింది.
ప్రేమవివాహం!
ప్రేమ, వివాహం. రెండు వేర్వేరు విషయాలైనప్పటికీ అవి రెండూ కలిసి ప్రేమ వివాహమయితే అంతకంటే ఆనందించదగ్గ విషయం మరొకటుండదేమోనని ఆలోచనళ్ళొ మునిగిపోయి వుండగా అశ్విని వచ్చింది.
ఆరునెలల్లో ఇదే మొదటిసారి తనని చూడడం. ఒకవైపు సంతోషం మరోవైపు భయం. భవిష్య్త్తులో అశ్విని కూడా వేరొకరిని పెళ్ళి చేసుంటుంటే నేను ఖూడా ఆనంద్ లా పెళ్ళిపందిరిలో మూల కూర్చుని “ఎకాడ వున్నా నీ సిఖమే కోరుకున్నా” అని ఆశీర్వదించి వెళ్ళిపోవాల్సిందేనా అనిపించింది.
ఏదో ఒకటి చేసి అశ్వినిని తిరిగి నా దగ్గరకు చేర్చుకోవాలనిపించింది. నాకు తనంటే ఇష్టం. నేనంటే తనకు ఇష్టం. ఇద్దరి ఇళ్ళాల్లోనూ కష్టపడి మా పెళ్ళికి ఒప్పించిన తర్వాత అర్థం లేని అభిప్రాయ బేధాలతో విడిపోయిన మా ఇద్దరిణి తలుచుకుంటే నవ్వొచ్చింది. అన్ని ప్రేమకథల్లోలాగా మా ప్రేమకథలోనూ విలన్స్ ఉన్నారు. ఆ విలన్స్ మేమే అవ్వడమే విచిత్రం. మా ప్రేమకు మేమే అడ్డాంకులై కూర్చున్నాము.
మారుతున్న సమాజంలో స్త్రీ స్వాతంత్ర్యం, హక్కులు, సమానత్వం గురించి అశ్విని అడిగిన మాటల్లో తప్పేమీలేదని అనిపించింది. ఆ విషయం నాకిప్పటివరకూ ఎందుకు తోచలేదో నాకర్థంకాలేదు. అహంభావం. పురుషాహంకారం కావొచ్చనిపించింది. మంచి ఉద్యోగం చేస్తూ, సూటూ బూటూ వేసుకుని ఆధునికత ముసుగులో నేనింకా పాతతరం మనిషినే అనిపించింది.
నాకింకేమీ ఆలోచించాలనిపించలేదు.దూరంగా నిల్చుని స్నేహితులతో మాట్లాడుతున్న అశ్విని దగ్గరకెల్లి “పెళ్ళెప్పుడూ చేసుకుందాం?” అని సూటిగా ఆదిగేశాను. చుట్టూ వున్న వాళ్ళంతా ఖంగుతిని మాఇద్దరివైపు మర్చి మార్చి చూశరు.
ఆమె మొహంలో ఎప్పటిలానే ప్రశాంతత. హ్యాండ్‌బ్యాగ్ లోంచి ఎదో చిన్న డబ్బాలాంటిది తీసింది తను. అందులోంచి తాళిబొట్టు టీసి “ఆరునెలల నుంచి మోసుకుని తిరుగుతున్నాను. నా మెడలో వుండాల్సిన దీన్ని ఎన్ని రోజులు హ్యాండ్‌బ్యాగ్‌లో పెట్టుకుని తిరగను? అని నన్ను ఎదురు ప్రశ్నించింది.
సరిగ్గా రెండునెలల తర్వాత అదే హోటాల్లో పెళ్ళి పీటల మీద కూర్చున్నప్పుడు అశ్విని అంది, తన స్వాతంత్ర్యం వేరొకరి బాధకు కారణమయినప్పుడు ఆ స్వాతంత్ర్యం తనకవసరంలేదనీ, ఇక ఎల్లప్పటికీ నాకు జీవిత ఖైదీగానే వుండిపోతుందనీ.
మరొకరి మనసు నొప్పించే స్వాతంత్ర్యం కంటే ఒకరికోసం ఒకరు జీవితాంతం బందీగా వుండడంలోనే సుఖముందని మేమిద్దరం అంగీకరించడంతో మా ప్రెమ పెళ్ళి వరకూ వచ్చింది. పెళ్ళి తర్వాత కూడా మా మధ్య గొడవలు రావని గ్యారంటి ఏమీ లేదు. అప్పుడూ ఇంకో కథ చెబుతాను. అప్పటివరకు…..ప్రేమాయనమః

No comments: