welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Saturday, June 23, 2007

The Encounters

విశ్వం తన శక్తినంతా కూడగట్టుకుని పరిగెడ్తున్నాడు.
చుట్టూ దట్టంగా పెరిగిన పొదల్లోంచి ఎగిరెగిరి దూకుతున్నాడు.
అతని దూకుడుకి అక్కడక్కడా దాక్కుని ఉన్న కుందేళ్ళు అతనితో పాటే పరుగెత్తి పొదల్లోకి మాయమవుతున్నయి.
వెనక్కి తిరిగి చూడడంలేదతను.
కొద్ది దూరంలోనే వినిపిస్తున్న బూట్ల సవ్వడి అతనికి తుపాకీ మోతల్లా చెవుల్లో మారుమోగతోంది.
కాళ్ళకి చెప్పులైనా లేకపోవడంతో ముల్లు గుచ్చుకుని కాలినుండి తలవరకూ భరించలేని బాధ కలిగిస్తున్నా అతని వేగం మాత్రం తగ్గలేదు. ప్రాణాలమీద ఆశకన్నా తన ప్రాణాలన్ని పెట్టుకున్న కూతుర్ని, తనపైనే ప్రాణాలు నిల్పిన భార్యను తలచుకుని క్షణక్షణానికి రెట్టించిన వేగంతో పరిగెట్టసాగాడు.
అతని పరుగుల సవ్వడికి అడవిలోని చెట్లపై విశ్రమిస్తున్న పక్షులు గాల్లోకెగిరి రెక్కలు తతపలాడించాయి.
ఎండుటాకులపై అతని పాదాల సవడి గలగలమని విటశబ్దాలౌ చేసాయి.
ఏపుగా ఎదిగిన చెట్లలోంచి పరిగెడ్తున్న విశ్వం చేతుల టాకిడికి చిన్న చిన్న ఎండుకొమ్మలు విరిగి చిటపటలాడాయి.
విశ్వాన్ని వెంటాడుతూ వెనుకనే వస్తున్న బూట్ల సవ్వడీ మరో కొట్ట తాళంలో పలికాయి.
ఇంతలో వీచిన గాలి సవ్వడికి చెట్లు తలలాడించి వింత ధ్వనినేదో వెలువరించి భీకర సంగీతాన్ని పలికించాయి మిగిలిన శబ్దాలతో కలిసి.
ఇవేమీ తనకు పట్టనట్టు పడగెత్తి కోరగా చూసిందో త్రాచు పాము. నాకేం భయం లేదన్నట్టు నీలుక్కోని చూస్తున్న ఆ నాగు విశ్వం అడుగుల సవ్వడికి ఉలిక్కిపడీ విశ్వాన్ని ఎదుర్కోబోయి మెరుపులా మాయమయిన అతనెక్కడ అని దిక్కులు చూస్తూ నిల్చుండీపోయింది.
ఎంత పరిగెత్తినా బూట్ల సవ్వడి మాత్రం విశ్వం చెవులకు లీలగా వినిపిస్తూనే ఉంది. ఎంతదూరం వెళ్ళినా, ఎక్కడికెల్తున్నాడొ అర్థంకాకఫొయినా ఎక్కడో దగ్గర తను పోలీసులకు దూరమవుతాదేమోనన్న ఆశతో ఆవేశంగా పరిగెట్టాడు విశ్వం. అలుపన్నది ఎరుగక అదే పనిగా పరిగెట్టి చివరకో మైదానం లాంటి ప్రదేశాన్ని చేరుకున్నాడు విశ్వం.
ఖాసేపు కాలికి విశ్రాంతినిచ్చి చుట్టూ చూశడు.
దట్టంగా పెరిగిన ఆడవి. ఆ ఆడవి మధ్యలో విచిత్రమైన ఈ మైదాన ప్రాంతం. ఇన్నాళ్ళ తన జీవితంలో ఎన్నడూ చూడనట్టి ప్రదేశమది. మైదానం మధ్యలో ఒంటరిగా నిల్చుని ఆకాశం వైపు చూశాడు. సూర్యుడు ఇంకాసేపట్లో అస్తమించేలా ఉన్నాడు.
రెండు క్షణాలు ఊపిరి గట్టిగా పీల్చి వదిలాడు. పొంగుకు వస్తున్న ఆయాసాన్ని ఆపుకోడానికి ప్రయత్నించాడూ.ఉబికి వస్తున్న ధుఃఖాన్ని ఆపుకున్నాడు గాని కంట్లోకి చేరిన కన్నీటి చుక్కలు మాత్రం చెంపలపై చేరాయి. కళ్ళనిండా చేరిన నీటితో అతని దృష్టి మసకబారింది.
దూరంగా చెట్లలోపల అలికిడి కావడంతో తలతిప్పకుండానే అటువైపు దృష్టి సారించాడు విశ్వం. చుట్టూ వున్న చెట్లలోంచి పోలీసులు తుపాకీలెక్కుబెట్టి తన వైపే వస్తుండడం గమనించాడు. ఒక్క క్షణం కూడా వృధా చేయకుండా మరలా కాలికి బుధ్ధి చెప్పాడు విశ్వం.
పదులకొద్దీ దూసుకువస్తున్న బుల్లెట్లను వెంట్రుకవాసిలో తప్పించుకుంటూ దారీ తెన్నూ తెలియక అడవిలోకి పరుగు తీసాడు. చీకట్లు అలముకుంటున్న ఆ అడవిలో కంటికి ఎటువంటి దారి కనిపించకున్నా కాళ్ళు ఎటువైపు తీసుకెళ్తే అటువైపుగా పరిగెత్తసాగాడు. ఆ చీకటిలో అతని కాళ్ళే అతని కళ్ళయ్యాయి.
మధ్యాహ్నం నుంచీ పరుగెత్తడంవలన అతనిలో సత్తువ లోపించసాగింది. ఎంత వద్దనుకున్నా ఇంటి గుమ్మం ముందు దీపం కాంతిలో తనకోసమే ఎదురుచూస్తుండే తన భార్య కళ్ళముందు ప్రత్యక్షమవసాగింది. ఆమె పెద్దకళ్ళల్లోని వెలుగు, తనను చూడగానే ఆమె ముఖంపై వికసించే చిరునవ్వే గుర్తుకు రాసాగాయి. ఆ చీకట్లో తన కూతురి బోసినవ్వులు నవ్వి క్షణానికోసారి అడవంతా వెన్నెల కురిసినట్లుగా తోచిందతనికి.
బూట్ల సవ్వడి చేస్తున్న వికృత శబ్దాలకు దూరమై తన కూతురి బోసినవ్వులు వింటూ భార్య ఒడిలో సేదతీరాలనే కోరిక ఎక్కువయియింది అతనిలో. ఆ కోరికతో అత్నిలో నిస్సత్తువ ఆవిరయిపోయింది. ఆశ్చర్యంగా అప్పటివరకూ అక్కడ ఆవరించిన చీకట్లు తొలిగిపోసాగాయి.
రాత్రి మాయమయింది. సుర్యోదయానికి సమయమైంది. దూరంగా కోండల్లోంచి సూర్యుడు అప్పుడే బయటకు వస్తున్నట్టుగా సూచనగా ఆకాశం కాషాయం రంగు పులుముకొంది. విశ్వానికి పగలూ రాత్రితో పనిలేనట్టుగా అదేపనిగా పరిగెత్తాడు.
తన చుట్టూ ఉన్న అడవి, దూరంగా కొండలోల్లోని జలపాతాల గలగల, పచ్చని పచ్చిక అతనికి బాగా పరిచయమే.ఉషోదయ కాంతుల్లో విశ్వం కళ్ళల్లో కొత్తకాంతులు మెరిశయి. ఆగకూండా అతను పెట్టిన పరుగు మరి కొద్ది సేపట్లో అంతం కాబోతుందనే అతని ఆనందానికి అవధుల్లేకుండా పోయింది.
విశ్వం మనసు ఆనందంతో ఊగిసలాడింది.
చేతులు బార్లా చాపి "వస్తున్నా! నేనొచ్చేస్తున్నా! అని చేతులు చాపి ప్రకృతిలో కలిసిపోదామనిపించింది.
ఊరు దగ్గరపడ్తున్న కొద్దీ అతను వేగాన్ని రెట్టించాదు. దూరంగా బూట్ల సవ్వడీ రెట్టింపవుటోంది.
ఒక్కసారి తన భార్య చిరునవ్వు చూడాలి. తన ఒక్కగానొక్క కూతురి లేతఆదాలను ముద్దాడాలి.కోరిక, ఆశ, ఆవేశం, ఆత్రుత, భయంలతో కూడుకున్న తెలియని భావమొకటి అతని మదిలో మెదిలింది. ఆనందం అంతలోనే భయంకర విషాదం.
ఊరు దగ్గరవుతున్న కొద్దీ అతని గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోసాగింది. దూరంగా బూట్ల సవ్వడీ రెట్టింపవుతోంది. క్షణక్షణానికి దగ్గరవుతున్నాయి. ఒకటికాదు, రెండుకాదు వేలకోదీ పోలీసూలు తన వైపే దూసుకువస్తున్నారు. చేతిలో తుపాకీలు. కళ్ళల్లో క్రౌర్యం. తన చావి ఖాయం అనుకున్నాడు విశ్వం.
కళ్ళముందు ఊరి పిలిమేరలు కనిపిస్తూ ఉన్నాయి.
ఇంక రెండు నిమిషాలు. ఈ పొలంగట్టు దాటి ఎడం వైపు ఉన్న రెండో సందులోనే తన ఇల్లు.
వచ్చేస్తోంది.
ఊరు!
ఇల్లి!
దగ్గరకొచ్చేస్తోంది!
అతని గుండే ఎప్పుడూ లేనంత వేగంగా కొట్టుకోంటోంది.
చనిపోయిన తన అమ్మ గుర్తుకొచ్చింది విశ్వానికి.
చిన్నప్పుడు రోజంతా పొలల్లో బురదలో ఆదుకొని, పక్కనున్న యేట్లో స్నానం చేయడం గుర్తొచ్చింది. అక్కడే చేపలు పట్టడం, సాయంత్రమేఫ్ఫుడొ ఇంటికి వెళ్ళడం,ఆక్లేసి అమ్మపెట్టె చివాట్లతోపాటు అన్నంకోసం ఇంటి వైపు పరిగెత్తడం గుర్తుకొచ్చింది విశ్వానికి.
"అమ్మా నేనొచ్చేశను!" అప్రయత్నంగా అతని గొంతు పలికింది.
"రా బాబూ!" అంటూ చేతులు చాపి ఎదురుచూస్తున్నట్టుగా తన ఊరు అమ్మలా స్వాగతించింది.
తన గమ్యమైతే చేరుకుంటున్నాడు గాని, పట్టు వదలని విక్రమార్కులలా తననే వెంటాడుతున్న పోలీసుల గురించే విశ్వానికి అర్థంకాలేదు.అయినా పరుగాపలేదు.
ఊరి పొలిమేరలు దాటాడు.తన స్నేహితుడు రాము వుండే మొదటి వీధి దాటేసాడు. రెండో వీధి మొదట్లోకి చేరుకున్నాడు. అక్కడ్నుంచి అతని ఇల్లు స్పష్టంగా కనిపించింది.
తన చిన్న ఇల్లు. ఇంటిముందు తన భార్య.
పాపం రాత్రంతా తనకోసం ఎదురుచూస్తూ కూర్చున్నట్టుంది. అరుగుమీద గుడ్డీగా వెలుగుతున్న దీపం ఆర్పేసి ఇంట్లోనుంచి కుండలో నీళ్ళు తెచ్చి గడపపై పెట్టింది. తన కూతుర్ని తెచ్చి గడపలో చాపపై పడుకోబెట్టింది.
అడుగులో అడుగువేస్తూ ఇంటికి దగ్గరవుతున్న కొద్దీ విశ్వం ఆనందం ఆపుకోలేక పోయాడు. ఇంకా రెండు అడుగులు వేస్తే తన భార్య కళ్ళముందుంటాడనే నిజం అతన్ని ఉక్కిరి బిక్కిరి చేసింది.
అతని భార్య కుండలోని నీళ్ళు చెంబుతోతీసి ఇంటిముందు చల్లబోతుందగా అక్కడకు చేరుకున్నాడు విశ్వం.
చల్లని నీళ్ళు అతని మొహంపై చిలరింపబడడంతో ఉలిక్కిపడ్డడు విశ్వం.
కళ్ళలోకి చేరిన నీళ్ళను తుడుచుకోని కళ్ళుతెరిచి చూసిన విశ్వం ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
అతని కళ్ళ ముందు కనిపించిన దృశ్యం అతనిలో భయంకర విషాదం కలుగచేసింది.
తను చూసింది నమ్మ లేనట్టుగా కళ్ళు మరోసారి తుడుచుకోన్నాడూ. తల విదిలించాడు. కళ్ళు తెరిచి చూశాడు. అయినా అక్కడ దృశ్యం ఏ మాత్రం మారలేదు.
ఎదురుగా నీళ్ళ సీసాతో నిలబడి మరోసారి తన మొహంపై నీటిని చిలకరించబోయిన పోలీసోడిని చూసి బిత్తరపోయాడు విశ్వం.
"ఏంటి పగటి కలలు కంటున్నావా?" పద పద నీ తైమొచ్చేసింది!" అంటూన్న పోలీసు మాటలతో తిరిగి ఈ లోకంలోకి వచ్చిపడ్డడు విశ్వం.
పోలీసుల దెబ్బలకు సృహ తప్పిపడిపోయిన విశ్వానికి అప్పటివరకూ తను కల కన్నాడని అర్థమయ్యి కంటినిండా నీళ్ళు ఉబికివచ్చాయి. నిజంలా తోచిన కలను తలచుకుంటూ వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టాడు.
దూరంగా ఇద్దరు పోలీసులు సిగరెట్టు కాలుస్తూ నిల్చున్నారు. మరో పోలీసు జీపులోనే కూర్చుని తమాషా చూస్తున్నాడు. మరొక పోలీసు విశ్వం కట్లు విప్ప సాగాడు.
ఆడవితల్లి సాక్షిగా అక్కడ మరో బూటకపు ఎంకౌంటర్ రంగం సిధ్ధమయ్యింది. పోలిసుల తుపాకీ గుళ్ళు రెండు ప్రాణాలను అన్యాయంగా బలి తీసుకున్నాయి. అడవి బిడ్డలిద్దరు అడవిలోనే ప్రాణాలొదిరారు. సాటి జీవులకు జరుగుతున్న అన్యాయానికి మూగసాక్షులయ్యాయి అక్కడి చెట్లు, పక్షులు.
రేపటి ఉదయం వర్తాపత్రికల్లొ రాబోయే కథనమేంటో మాకూ తెలుసని ఈ నాటి వార్తా పత్రిక గాలిలో రెపరెపలాడింది.
ఆకాశం ఎర్రని రంగునలముకుంది.
సూర్యుడు అస్తమించాడు.

No comments: