welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Tuesday, July 26, 2011

అట జని కాంచె భూసురుడు

 
==================================================
ఈ నెల "తెలుగునాడి"లో రెండు మంచి పద్యాలున్నాయి. ఒకటి సుమతి శతకం, ఇంకొకటి మనుచరిత్ర నుండి.
---------------------
"మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!"
నోటి మాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.
---------------------
"చీటికి" బదులు "చీకటి" అని ఉంది. టైపో అనుకుంటాను.

పెద్దన విరచిత మనుచరిత్ర లోని పద్యాన్ని శ్రీ పాపినేని శివశంకర్ గారు పరిచయం చేసిన దాని నుంచి కొంత పంచుకోవడం
----------------------------------------------
[Source: TeluguNaaDi - Feb-March 2011 Issue]
"అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
 పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
 స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్
 గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్"
 భూమిసురుడు = బ్రాహ్మణుడైన ప్రవరుడు
 అటన్+చని = అక్కడికి వెళ్ళి
 అంబర చుంబి = ఆకాశాన్ని తాకుతున్న
 శిరస్ = శిఖరాల నుండి
 సరత్ = జారుతున్న
 ఝరీపటల = సెలయేళ్ళ సమూహంలో
 ముహుః + ముహుః = మాటి మాటికి
 లుఠత్ = దొర్లుతున్న
 అభంగ = ఎడతెగని
 తరంగ = అలలు అనే
 మృదంగ = మద్దెలల యొక్క
 నిస్వన = ధ్వనుల చేత
 స్ఫుట = స్పష్టమైన
 నటన + అనుకూల = నాట్యమునకు తగినట్లుగా
 పరిపుల్ల = మిక్కిలి విప్పారిన
 కలాప = పురులుగల
 కలాపి జాలమున్= ఆడ నెమళ్ళు గల దానిని
 కటక చరత్ = పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగే
 కరేణుకర = ఆడ ఏనుగుల తొండాల చేత
 కంపిత = కదిలించబడిన
 సాలమున్ = మద్దిచెట్లు గల దానిని
 శీతశైలమున్ = మంచుకొండను
 కాంచెన్ = చూశాడు

మంచుకొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి. వాటి నుండి సెలయేళ్ళు జారుతున్నాయి. వాటిలో లేచిపడే
 అలల సవ్వడి మద్దెలమోతల్లాగా ఉన్నాయి. వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి.
 ఏనుగుల తొండాలతో అక్కడి మద్దిచెట్లను పెకలిస్తున్నాయి. అటువంటి మంచుకొండను చూశాడు ప్రవరుడు.

ఇంత సరళంగా చెప్పగలిగిన సంగతిని ఎందుకింత ప్రౌఢగంభీరంగా వర్ణించాడు కవి? హిమాలయ పర్వతం
 అసామాన్యమైనది. మహోన్నతమైనది. ఆ మహత్వాన్ని, మహాద్భుత దృశ్యాన్ని స్ఫురింపజేయటానికి అంత
 సంస్కృత పదాటోపం అవసరమైంది. పద్యంలో ముచ్చెం మొదటి మూడూ మాటలు తప్ప (అట, చని, కాంచె)
 తక్కినవన్నీ సంస్కృతం నుండి దిగిన తత్సమపదాలే.

 కేవలం శబ్దం ద్వారానే అర్థస్ఫురణ గావించటం ఈ పద్యంలో విశేషం. "అంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల"
 మన్నప్పుడు నింగినంటిన కొండల నుండి జాలువారే సెలయేళ్ళ ధారాప్రవాహం మనో నేత్రం ముందు
 కనబడుతుంది.

 మద్దెల చప్పుళ్ళకి, మేఘధ్వనులకి నెమళ్ళు ఆహ్లాదంతో పురివిప్పి ఆడతాయని ప్రసిద్ధి. ఆ సెలయేటి అలలు
 రాళ్ళకు కొట్టుకొని మద్దెలలాగా మోగుతున్నాయి. అభంగ, తరంగ, మృదంగ అనే పదాల ద్వారా ఆ మద్దెలల
 మోత వినిపించాడు కవి. "స్ఫుటనటనానుకూల" అనేచోట నాట్యం స్ఫురింపజేస్తున్నాడు. అక్షరాలు
 నర్తిస్తున్నట్టు, ఆయా అర్థాలను స్ఫురింజేస్తున్నట్టు రచించటం వికటత్వం. (వికటత్వ ముదారతా- వామనుడు)
  వికటత్వం గల కూర్పు ఔదార్యం. ఈ పద్యంలో ఔదార్యం అనే గుణం ఉంది. దీనికి తోడు దీర్ఘసమాసాలతో కూడిన
 గాఢబంధం వల్ల ఓజోగుణం కూడా చేకూరింది.

"అంబరచుంబి, శిరస్సరత్, ముహుర్ముహుః, అభంగ తరంగ మృదంగ, స్ఫుట నటనానుకూల, కలాపకలాపి,
సాలము శీతశైలము" - ఈ చోటుల్లో వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాస, అంత్యప్రాస, యమకంలాంటి
 శబ్దాలంకారాలున్నాయి. తరంగ ధ్వనుల్ని మృదంగధ్వనులుగా నెమళ్ళు భ్రమించినట్టు వర్ణించటం చేత
 భ్రాంతిమదలంకారం అవుతుంది.

 "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే
 బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.
----------------------------------------------
 ఎన్నో విషయాలు ఆసక్తికరంగా అందించిన శివశంకర్ గారికి చాలా కృతజ్ఞతలు.

 చిన్న సందేహం. ప్రతిపదార్థంలో "కలాపి" అంటే ఆడనెమళ్ళు అన్నారు. ద్వా.నా.శాస్త్రిగారి "తెలుగు సాహిత్య
 చరిత్ర"లో మగనెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అని ఉంది. నిఘంటువులో "కలాపి"కి నెమలి అనే ఉంది.
 మామూలుగా మగనెమళ్ళ నాట్యమే ప్రసిద్ధం. తెలిసిన వారు దయచేసి వివరించ మనవి.
=============
 విధేయుడు
 -శ్రీనివాస్

1 comment:

Anonymous said...

kalaapi ante moga nemali ane ardham unnadandi.