welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Tuesday, July 26, 2011

అంధకార చారిత్రిక

 
"అరిగిన సబ్బు
తరిగిన మబ్బు
పెరిగిన గబ్బు
కావేవీ అవార్డులకు అనర్హం"
అనేవారేమో శ్రీశ్రీ!
"Graveyards are full of indispensable men" said Charles DeGaulle. కాదు, బతికినప్పుడు కుడా అన్నట్లు, ఉన్నప్పుడు చూపని గౌరవమంతా లేనప్పుడు గుర్తుకుతెచ్చుకోవడం, వారికి ఫలానా అవార్డులివ్వకపోవడం గురించి మాట్లాడుకోవడం తెలుగువారి ప్రత్యేకతగా మారిపోతుందేమో అని చెడ్డ అనుమానం!

ఎవ్వరైనా ఏడిపించొచ్చు. నవ్వించడం, ఎవ్వరినీ నొప్పించకుండా నవ్వించడం, అదీ అక్షరాలతో సాధించడం నవ్వులాట కాదు. చతురోక్తులతో చిత్రోక్తులతో చిరునవ్వును సరసంగా గుబాళింపజేసిన ముళ్ళపూడివారి మాటలకు ఏ అవార్డులొచ్చినా రాకపోయినా నవ్వును మాత్రం రివార్డుగా ఇస్తూనే ఉంటాయి.

కథలో నవ్వించడం ఒక ఎత్తు. జీవితంలో నవ్వును గుర్తించడం ఇంకో ఎత్తు. క్లిష్ట సమయాల్లో సైతం sense of humor వీడకపోవడం చాలా మందికి అందనంత ఎత్తు. అంతటి ఎత్తులను కూడా పరికించి, గుర్తించి జరిగిన ఉదంతాలను మనసులనుండి జరిగిపోకుండా ఉండే రీతిగా వారు వ్రాసిన కొన్నిటిని పంచుకోవడం మాత్రమే.
[Source: ముళ్ళపూడూ గారి "హాస్యజ్యోతి" నుండి]
-------------------------------
* వేదాంతి, రసతపస్వి అయిన ముట్నూరి కృష్ణారావుగారు మరణ శయ్యపై ఉండగా, ఆయన భార్య పక్కనే కూచుని కంట తడి పెట్టింది. ఆ దశలో కూడా ఆయన చిరునవ్వుతో "అప్పుడే రిహార్సల్స్ మొదలు పెట్టావా" అన్నారట ఆమెతో.

* టైముకి రావడం శాస్త్రీయం, టైముకి రాకపోవడం కృష్ణశాస్త్రీయం- శ్రీశ్రీ

* ఒకసారి జ్వరపడి మంచంలోఉన్న దిగ్గిరాలవారిని పరామర్శించడానికి వెళ్ళారు దువ్వూరి సుబ్బమ్మగారు. ఆయనను పలకరించి "జ్వరం ఎక్కువగా ఉందా" అంటూ చెయ్యిపట్టికు చూడసాగింది.
"అసలే నేను జ్వరంతో బాధపడుతుంటే పైగా పాణిగ్రహణం కూడానా" అన్నారట ఆంధ్రరత్న చలోక్తిగా.

* కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్రవిశ్వవిద్యాలం ఉపాధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆంధ్రవిశ్వవిద్యాలయమే తన ప్రేయసీ అని చెప్పుకునేవారు. ఒక సభలో ఆయనను భీషుడు, హనుమంతుడు అంటూ కొందరు వక్తలు ప్రస్తుతించడం ప్రారంభించారు. తర్వాత రెడ్డిగారు అందుకొని "లేనిపోని ఉపమానాలని విశేషాణలను ఎందుకు దురివినియోగం చేస్తారు?" "అవివాహితుడు" అంటే
సరిపోతుంది" అన్నారు.

* శ్రీపాద వారు "స్మశాని వాటికి" రచనను ప్రాణం మీదికి వచ్చిన రోగిన చూడడానికి వెళ్తున్న డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారికి ఇచ్చారట. "శాస్త్రిగారూ మీకి బొత్తిగా లొక్యం లేదండీ" అన్నారటాయన.

* 1949 లో హైదరాబాదు నిజాం పాలనను అంతమొందించడానికి భారత ప్రభుత్వాం "పోలీసు చర్య" అమలు జరిపింది. తర్వాత దానికి అయిన ఖర్చూ ఏ పద్దుకింద చేర్చాలో ప్రభుత్వానికి అర్థం కాక తికమక పడింది. అది పోలీసు చర్య కనుక భార్త రక్షణ శాఖ ఆ ఖర్చుని భరించడానికి నిరాకరించింది. పోలీసు బలగాన్ని వినియోగించలేదని, అంతా మిలిటరీ వారే పాల్గొన్నారని, కాబట్టి ఆ ఖర్చుతో తమకి సంబంధంలేదని హోంశాఖ
తరస్కరించింది. పైగా అది క్రమశిఖణ చర్య కనుక ఆ ఖర్చుని విద్యాశాఖకి బదలాయించమని సలహా ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ అందుకు నిరాకరించి "హైదరాబాదుపై పోలీసు చర్య దేశానికి పట్టుకున్న వ్యాధినిర్మూలన పథకంలో భాగం కనుక ఖర్చు ఆయోగ్య శాఖపరణ్గా వ్రాయించ" మన్న సూచనను పాటించి ఆ ఖర్చుని ఆరోగ్యాశాఖ భరించింది."
---------
అంధకార చారిత్రిక సంఘటనలో సైతం హాస్యాన్ని వెతికి పట్టుకోవడం ముళ్ళపూడివారికే చెల్లు.
=======================================
విధేయుడు
-శ్రీనివాస్


అట జని కాంచె భూసురుడు

 
==================================================
ఈ నెల "తెలుగునాడి"లో రెండు మంచి పద్యాలున్నాయి. ఒకటి సుమతి శతకం, ఇంకొకటి మనుచరిత్ర నుండి.
---------------------
"మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!"
నోటి మాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.
---------------------
"చీటికి" బదులు "చీకటి" అని ఉంది. టైపో అనుకుంటాను.

పెద్దన విరచిత మనుచరిత్ర లోని పద్యాన్ని శ్రీ పాపినేని శివశంకర్ గారు పరిచయం చేసిన దాని నుంచి కొంత పంచుకోవడం
----------------------------------------------
[Source: TeluguNaaDi - Feb-March 2011 Issue]
"అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
 పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
 స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్
 గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్"
 భూమిసురుడు = బ్రాహ్మణుడైన ప్రవరుడు
 అటన్+చని = అక్కడికి వెళ్ళి
 అంబర చుంబి = ఆకాశాన్ని తాకుతున్న
 శిరస్ = శిఖరాల నుండి
 సరత్ = జారుతున్న
 ఝరీపటల = సెలయేళ్ళ సమూహంలో
 ముహుః + ముహుః = మాటి మాటికి
 లుఠత్ = దొర్లుతున్న
 అభంగ = ఎడతెగని
 తరంగ = అలలు అనే
 మృదంగ = మద్దెలల యొక్క
 నిస్వన = ధ్వనుల చేత
 స్ఫుట = స్పష్టమైన
 నటన + అనుకూల = నాట్యమునకు తగినట్లుగా
 పరిపుల్ల = మిక్కిలి విప్పారిన
 కలాప = పురులుగల
 కలాపి జాలమున్= ఆడ నెమళ్ళు గల దానిని
 కటక చరత్ = పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగే
 కరేణుకర = ఆడ ఏనుగుల తొండాల చేత
 కంపిత = కదిలించబడిన
 సాలమున్ = మద్దిచెట్లు గల దానిని
 శీతశైలమున్ = మంచుకొండను
 కాంచెన్ = చూశాడు

మంచుకొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి. వాటి నుండి సెలయేళ్ళు జారుతున్నాయి. వాటిలో లేచిపడే
 అలల సవ్వడి మద్దెలమోతల్లాగా ఉన్నాయి. వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి.
 ఏనుగుల తొండాలతో అక్కడి మద్దిచెట్లను పెకలిస్తున్నాయి. అటువంటి మంచుకొండను చూశాడు ప్రవరుడు.

ఇంత సరళంగా చెప్పగలిగిన సంగతిని ఎందుకింత ప్రౌఢగంభీరంగా వర్ణించాడు కవి? హిమాలయ పర్వతం
 అసామాన్యమైనది. మహోన్నతమైనది. ఆ మహత్వాన్ని, మహాద్భుత దృశ్యాన్ని స్ఫురింపజేయటానికి అంత
 సంస్కృత పదాటోపం అవసరమైంది. పద్యంలో ముచ్చెం మొదటి మూడూ మాటలు తప్ప (అట, చని, కాంచె)
 తక్కినవన్నీ సంస్కృతం నుండి దిగిన తత్సమపదాలే.

 కేవలం శబ్దం ద్వారానే అర్థస్ఫురణ గావించటం ఈ పద్యంలో విశేషం. "అంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల"
 మన్నప్పుడు నింగినంటిన కొండల నుండి జాలువారే సెలయేళ్ళ ధారాప్రవాహం మనో నేత్రం ముందు
 కనబడుతుంది.

 మద్దెల చప్పుళ్ళకి, మేఘధ్వనులకి నెమళ్ళు ఆహ్లాదంతో పురివిప్పి ఆడతాయని ప్రసిద్ధి. ఆ సెలయేటి అలలు
 రాళ్ళకు కొట్టుకొని మద్దెలలాగా మోగుతున్నాయి. అభంగ, తరంగ, మృదంగ అనే పదాల ద్వారా ఆ మద్దెలల
 మోత వినిపించాడు కవి. "స్ఫుటనటనానుకూల" అనేచోట నాట్యం స్ఫురింపజేస్తున్నాడు. అక్షరాలు
 నర్తిస్తున్నట్టు, ఆయా అర్థాలను స్ఫురింజేస్తున్నట్టు రచించటం వికటత్వం. (వికటత్వ ముదారతా- వామనుడు)
  వికటత్వం గల కూర్పు ఔదార్యం. ఈ పద్యంలో ఔదార్యం అనే గుణం ఉంది. దీనికి తోడు దీర్ఘసమాసాలతో కూడిన
 గాఢబంధం వల్ల ఓజోగుణం కూడా చేకూరింది.

"అంబరచుంబి, శిరస్సరత్, ముహుర్ముహుః, అభంగ తరంగ మృదంగ, స్ఫుట నటనానుకూల, కలాపకలాపి,
సాలము శీతశైలము" - ఈ చోటుల్లో వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాస, అంత్యప్రాస, యమకంలాంటి
 శబ్దాలంకారాలున్నాయి. తరంగ ధ్వనుల్ని మృదంగధ్వనులుగా నెమళ్ళు భ్రమించినట్టు వర్ణించటం చేత
 భ్రాంతిమదలంకారం అవుతుంది.

 "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే
 బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.
----------------------------------------------
 ఎన్నో విషయాలు ఆసక్తికరంగా అందించిన శివశంకర్ గారికి చాలా కృతజ్ఞతలు.

 చిన్న సందేహం. ప్రతిపదార్థంలో "కలాపి" అంటే ఆడనెమళ్ళు అన్నారు. ద్వా.నా.శాస్త్రిగారి "తెలుగు సాహిత్య
 చరిత్ర"లో మగనెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అని ఉంది. నిఘంటువులో "కలాపి"కి నెమలి అనే ఉంది.
 మామూలుగా మగనెమళ్ళ నాట్యమే ప్రసిద్ధం. తెలిసిన వారు దయచేసి వివరించ మనవి.
=============
 విధేయుడు
 -శ్రీనివాస్

సీత నవ్వు

 
 సీత నవ్వు
 =====
"వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండాంకరే" అన్న శ్లోకం, భద్రాద్రి రామున్ని సీతా సమేతంగా సౌమిత్రి యుక్తంగా కోదండ ధారిగా మనస్సులో నిలుపుతుంది.
అంతే అందంగా, అంతకంటే అదనంగా, ఆంజనేయసహితంగా, తెలుగులో శ్రీనమశ్శివాయగారి వెంకట నరసింహులు గారి ఈ పద్యం ఆకట్టుకుంది.
--------------------------------------------
"తమ్ముడు లక్ష్మణుండు పెదతమ్ముడు యా భరతుండు చేరి వి
  ల్లమ్ములు దాల్చి నిల్వ చరణంబులనంటియు నాంజనేయుడా
 నమ్మిన బంటు కొల్వ విభవమ్మున బంగరు గద్దె మీద సీ
 తమ్మ సమేతుడౌ దశరథాత్మజు శ్రీరఘురాము గొల్చెదన్"
--------------------------------------------
 శ్రీరామనవమి సందర్భంగా వ్రాసిన ఒక పద్యం

సీ.
 నవ్వగాను తరులు పువ్వులై వికసించె
 విరుల నవ్వులుజిమ్మె పరిమళాలు
 గిరులన్ని నవ్వంగ ఝరులు పరుగులెత్తె
 నాట్యమాడె యలలు నదులు నవ్వ
 మంద్రంగ నవ్వుచు మలయమారుతమేగె
 కోకిల నవ్వుచు కూయగాను
 పుడమియే నవ్వంగ పులకించె ప్రకృతి
 నింగి నవ్వినపుడు నీల కాంతి

 ఆ.
 రాము చేత విల్లు రయముగ విరుగంగ
 పుడమి బెదిరి కొంత కడలి తొణక
 చిర్నగవుల తోడ సీతరాముని జేర
 సీత నవ్వుకెల్ల సృష్టి నవ్వె!
 ===========
విధేయుడు
 -శ్రీనివాస్

తెలుగుక!

 
తెలుగుకూ స్పెల్‌ చెకర్‌! 

_ పద విశ్లేషణ ఆధారం _ 6 నెలల్లో రూపకల్పన _ యూనికోడ్‌ ఫాంట్‌ తయారీకి యత్నాలు

ఈనాడు దినపత్రిక _ హైదరాబాద్ _ 18 ఏప్రిలు 2011

పద విశ్లేషణ ఆధారంగా తెలుగు భాషకు పూర్తిస్థాయి స్పెల్‌ చెకర్‌(రాసిన పదంలోని అక్షర క్రమం సరైందో కాదో తెలిపే కంప్యూటర్‌ ప్రోగ్రాం)ను రూపొందించేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. అంతర్జాతీయ అంతర్జాల తెలుగు వేదిక(గిఫ్ట్‌) ఇందుకు సారథ్యం వహించనుంది. హైదరాబాద్‌లో జరిగిన మొదటి అంతర్జాల సదస్సులో ఈ మేరకు తీర్మానించారు. స్పెల్‌చెకర్‌ను ఆరు నెలల్లో రూపొందించాలని

యోచిస్తున్నారు. తెలుగులో ఇప్పటికే స్పెల్‌చెకర్‌లు ఉన్నప్పటికీ, అవి పూర్తి స్థాయిలో లేవు. భాషలోని పదాల సంక్లిష్టతే ఇందుకు కారణం. ఆంగ్ల భాషలో అయితే ఒక్కో పదం నుంచి ఐదు పదాల వరకు విభిన్న పద ప్రయోగాలు వస్తాయి. వీటికి స్పెల్‌ చెకర్‌ చేయడం తేలిక. అదే దక్షిణాది భాషల్లో ముఖ్యంగా తెలుగులో ఒక్కో పదానికి వేల పద ప్రయోగాలు ఉండవచ్చు. ఇందువల్ల పదం పొడవుగా కూడా మారుతుంది.

అందువల్లే సంక్లిష్ట పద విశ్లేషణ ఆధారంగా తెలుగు పదాలకు స్పెల్‌చెకర్‌ రూపొందించాల్సి వస్తోంది.


ప్రస్తుతం తెలుగులో రచనలను వాణిజ్య పంథాలో ముద్రించే ప్రచురణకర్తలు వందకు పైగా ఉన్నారు. వీరిలో అత్యధికులు వినియోగించే ఫాంట్‌ గ్లిఫ్‌ ఎన్‌కోడింగ్‌ పద్ధతిలో ఉంటుంది. అంటే ఒక అక్షరం కంటికి కనపడే సంకేతాల రూపంలో ఉంటుంది. ఒక అక్షరం రూపకల్పనకు కీబోర్డ్‌పై వేర్వేరు బటన్‌లు టైప్‌ చేయాల్సి వస్తోంది. అదే యూనికోడ్‌(యూనివర్సల్‌ క్యారక్టర్‌ ఎన్‌కోడింగ్‌) పద్ధతిలో

అక్షరాల కూర్పు ఉంటుంది. అనువాద ప్రక్రియకు ఇది అనుకూలంగా ఉంటుంది. దేశంలో మిగిలిన రాష్ట్రాల ప్రచురణకర్తలు యూనికోడ్‌ను పాటిస్తున్నా, ఆంధ్రప్రదేశ్‌లో అందుకు భిన్నంగా ఉంది. ఈ పరిస్థితి మార్చేందుకు మూడు నెలల్లో ఒక ఫాంట్‌ను రూపొందించి, అందరూ ఉచితంగా వినియోగించేందుకు అనువుగా అంతర్జాలంలో ఉంచాలని 'గిఫ్ట్‌' నిర్ణయించింది. యూనికోడ్‌ సమకూరితే, ఇతర భాషల నుంచి

అనువాదం తేలిక అవుతుంది. సెప్టెంబర్‌లో జరిగే విశ్వ అంతర్జాల తెలుగు సమ్మేళనం లోపే తెలుగు భాషకు యూనికోడ్‌ ఫాంట్‌, పూర్తిస్థాయి స్పెల్‌ చెకర్‌ను రూపొందించాలని నిర్ణయించినట్లు యూనివర్సిటీ ఆఫ్‌ హైదరాబాద్‌ ప్రొఫెసర్‌ గారపాటి ఉమామహేశ్వరరావు 'న్యూస్‌టుడే'తో చెప్పారు. సిలికానాంధ్ర ఇందుకు సహాయ సహకారాలు అందిస్తోందని తెలిపారు.

మనీషి

 
 మనీషి
======
విశాల జగతిలో
విషాద మణగునా ?
అశాంతి తొలగునా ?
ప్రశాంతి నిలుచునా ?

అనూహ్య ప్రగతిలో
వినూత్న జగతిలో
రుణాల బరువులా ?
రణాల ధ్వనులెలా ?

అశక్తి ముసిరెనా
అశేష తిమిరమే
స్వశక్తి మెరిసెనా
ఉషోద సమయమే!

సునిశ్చియముగనే
మనంబు తలచెనా
జనాలు నిలిచెనా
మనీషి గెలువడా!
=======
విధేయుడు
-శ్రీనివాస్

Monday, July 18, 2011

స్నేహబంధము ఎంత మధురము

స్నేహబంధము ఎంత మధురము
చెరిగిపోదు తరిగిపోదు జీవితాంతము

ఒకే ఆత్మ ఉంటుంది రెండు శరీరాలలో
ఒకే పాట పలుకుతుంది వేరు వేరు గుండెల్లో
ఒకటే దొరుకుతుంది జీవితంలో
అది ఓడిపోదు వాడిపోదు కష్టసుఖాల్లో [స్నేహబంధము]

మల్లెపూవు నల్లగా మాయవచ్చును
మంచు కూడ వేడి సెగలు ఎగయువచ్చును
పువ్వుబట్టి తేనె రుచి మారవచ్చును
చెక్కుచెదరంది స్నేహమని నమ్మవచ్చును [స్నేహబంధము]

--ఆత్రేయ

సాగలేక ఆగితే దారి తరుగునా? Ever green Song in Telugu

ఎవరో ఒకరు ఎపుడొ అపుడు
నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు

మొదటి వాడు ఎప్పుడూ ఒక్కడే మరి
మొదటి అడుగు ఎప్పుడూ ఒంటరే మరి
వెనుక వచ్చువాళ్ళకు బాట అయినది..[ఎవరో ఒకరు]

కదలరు ఎవ్వరూ వేకువ వచ్చినా
అనుకొని కొడి కూత నిదరపొదుగా..
జగతికి మేలుకొలుపు మానుకోదుగా..
మొదటి చినుకు సూటిగా దూకి రానిదే..
మబ్బు కొంగు చాటుగా ఒదిగి దాగితే..
వాన ధార రాదుగా నేల దారికి
ప్రాణమంటు లేదుగా బ్రతకటానికి.. [ఎవరో ఒకరు]

చెదరక పోదుగా చిక్కని చీకటి
మిణుగురు రెక్క చాటు చిన్ని కాంతికి..
దానికి లెక్క లేదు కాలరాతిరి..
పెదవి ప్రమిద నిలపని నవ్వు జ్యోతిని
రెప్ప వెనక ఆపని కంటి నీతిని
సాగలేక ఆగితే దారి తరుగునా?
జాలి చూపి తీరమే దరికి చేరునా..? [ఎవరో ఒకరు]

యుగములు సాగినా నింగిని తాకక
ఎగసిన అలల ఆశ అలసిపోదుగా
ఓటమి ఒప్పుకుంటు ఆగిపోదుగా
ఎంత వేడి ఎండతో ఒల్లు మండితే
అంత వాడి ఆవిరై వెళ్ళి చేరదా
అంత గొప్ప సూర్యుడు కళ్ళు మూయడా
నల్ల మబ్బు కమ్మితే చల్లబారడా [ఎవరో ఒకరు]

--అంకురం,చిత్ర,బాలు,హంసలేఖ

దేవుడి పేరిట మూఢుడైతే వాడే దానవుడు

దేవుడు ఉన్నాడో లేడో మానవుడున్నాడురా
వాడే దేవుడు కలడో లేడని తికమకపడుతున్నాడురా
మానవుడున్నంతవరకు దేవుడు ఉంటాడురా
వాడినితలచేందుకు మానవుడుండాలిరా [దేవుడు ]

తనలో మంచిని పెంచుకునేటందుకు
తానే దేవుడు అయ్యేటందుకు
మనిషొకరూపం కల్పించాడు
అది మనిషి మనిషికొక రూపమయి
పలుమతాలుగా మారాయిరా [దేవుడు ]

భయంనుంచి దేవుడు పుట్టాడు
భక్తి నుంచి దైవత్వం పుట్టింది
భయం భక్తులను మించిన స్థితినే
ముక్తి అంటారురా [దేవుడు ]

మనిషికోసం బ్రతికే మనిషే దేవుడు
దేవుడి కోసం మనిషిని మరిచే వాడే మూఢుడు
ప్రేమ త్యాగం తెలిసిన వాడే మానవుడూ
దేవుడి పేరిట మూఢుడైతే వాడే దానవుడు [దేవుడు ]

గాయకుడు-జేసుదాసు