ఆజాద్ హింద్ ఫౌజ్‌లో ముస్లిం పోరాట యోధులు
సయ్యద్ నశీర్ అహమ్మద్
పరాయి పాలకులను మాతృ దేశం నుండి తరిమికొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్య్రపోరాట చరిత్ర చివరిదశలో ఆజాద్ హింద్ ఫౌజ్ (భారత జాతీయ సైన్యం) సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుండి అంతం వరకు ముస్లింపోరాట యోధులు చాలా ప్రధాన భాగస్వామ్యం వహించారు.
1941 జనవరిలో సుభాష్ చంద్రబోస్ ఆంగ్ల ప్రభుత్వ గూఢాచారి వ్యవస్థ కళ్ళుగప్పి మహమ్మద్ జియావుద్దీన్ అను మారు పేరుతో కలకత్తా నుండి తప్పుకున్న 'గ్రేట్ ఎస్కేప్' ఏర్పాట్లను మియా అక్బర్ షా నిర్వహించగా, ఆ తరువాతి ప్రాణాంతక కాబూల్ ప్రయా ణంలో అక్బర్‌షా ఏర్పాటు చేసిన సాయుధ పఠాన్ యువ కులు నేతాజీకి అంగరక్షకులుగా నడిచారు. ఆఫ్ఘాన్ గుండా పఠాన్ వేషంలో నేతాజీ ప్రయాణం సాగించాల్సి వచ్చిన ప్పుడు, ఆంగ్ల గూఢచారులు, వారి తొత్తులు ఏమాత్రం గుర్తు పట్టకుండా ఆబాద్ ఖాన్ నేతాజీకి ఆఫ్ఘాన్ పఠాన్ వ్యవహారసరళి,ఆచార సాంప్రదాయాలలో వారం రోజుల పాటు తన ఇంట రహాస్యంగా ప్రత్యేక శిక్షణ గరిపి ముం దుకు పంపారు. 1941 మార్చి 27న నేతాజీ బెర్లిన్ చేరేంతవరకు ప్రమాదకర పరిస్థితులలో ఆయనను కళ్ళల్లో పెట్టుకుని కాపాడి గమ్యం చేర్చడంలో ముస్లిం యోధులు తోడ్పడ్డారు.
భారతదేశం వెలుపల నుండి వలసపాలకులను తరిమిగొట్టడానికి పోరుకు సిద్ధపడిన రాస్ బిహారి బోస్ మార్గదర్శకత్వంలో 1942 మార్చిలో జరిగిన సింగపూర్ సమావేేశంలో పాల్గొన్న మేజర్ మహమ్మద్ జమాన్ ఖైనిలాంటి వారు ఆ తరువాత 'భారత జాతీయ సైన్యం' కమాండర్ గా నేతాజీ తరువాతి స్థాయి అధికారిగా గణనీయ సేవలు అందించారు. ఆనాడు రాస్‌బిహారి, ప్రీతం సింగ్, కెప్టెన్ మాన్‌సింగ్ లాంటి నేతల నేతృత్వం లోని 'కౌన్సిల్ ఆఫ్ యాక్షన్', 'భారత జాతీయ సైన్యం'లలో కెప్టెన్ మహమ్మద్ అక్రం, కల్నల్ యం.జడ్. ఖైని, కల్నల్ జి.క్యూ. జిలాని, లెఫ్టినెన్ట్ కల్నల్ యస్.యన్.హుస్సేన్, లెఫ్టినెన్ట్ కల్నల్ షానవాజ్ ఖాన్, మేజర్ ఇక్బాల్‌లు బాధ్యతలు నిర్వహించగా, ప్రముఖ ఉర్దూ కవి మహమ్మద్ ఇక్బాల్ రాసిన 'సారె జహాసే అచ్ఛా హిందూస్తాన్ హమార్' గీతాన్ని 'భారత జాతీయ సైన్యం' ప్రతి సందర్భంలో గానం చేస్తూ గౌరవించింది.
1941 మార్చిలో స్వదేశాన్ని వీడి జర్మనీ చేరుకున్న నేతాజీ జర్మనీలో 'స్వేచ్ఛా భారత కేంద్రం' (ఫ్రీ ఇండియా సెంటర్) ప్రారంభించారు. ఆ సందర్భంగా నేతాజీకి పరిచయమైన హైదరాబాది అబిద్ హసన్ సప్రాని, 1941 నవంబర్‌లో నేతాజీ ఏర్పాటు చేసిన 'భారతీయ కమాండో దళం' శిక్షకుడిగా, ఆ తరువాత 'ఆజాద్ హింద్ రేడియో'లో నేతాజీ ప్రసంగాల సహాయకుడిగా బాధ్యతలను నిర్వహించారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్య చరిత్రలో నినాదంగా నిలచిన 'జైహింద్' సుభాష్ పేరును కూడా మర్చిపోయేలా చేసిన 'నేతాజీ' నామాన్ని అబిద్ రూపొం దించారు. అబిద్ హసన్ సప్రాని కృషి వలన ఉనికిలోకి వచ్చిన 'జైహింద్' ఈనాటికి భారత దేశమంతటా ప్రతిధ్వనించడం అబిద్ సృజనాత్మకతకు తార్కాణం.
జపాన్ ప్రభుత్వాధినేతల పట్ల భారతీయ విప్ల వోద్యమ నేతల్లో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా తూర్పు అసియా ప్రాంతంలో జనరల్ మాన్‌సింగ్ నేతృత్వంలో ఏర్పడిన 'భారతీయ జాతీయ సైన్యం', 'కౌన్సిల్ ఆఫ్ యాక్షన్'లు 1942 డిసెంబర్ 29న రద్దయినట్టు జనరల్ మాన్‌సింగ్ ప్రకటించగా, విప్లవోద్యమ నేత రాస్ బిహరి బోస్ నేతృత్వంలో 1943 ఫిబ్రవరి 15న భారత జాతీయ సైన్యాన్ని పునర్‌వ్యవస్ధీకరించారు. ఆ సమయంలో భారత జాతీయ సైన్యం, దాని అనుబంధ సంస్థలను, కార్యకర్తలను, సైనికులకు మార్గదర్శకత్వం వహించేందుకు సుప్రీం మిలటరీ బ్యూరో సంచాలకులుగా లెఫ్టినెంట్ కల్నల్ జె.కె.భోన్స్‌లే బాధ్యతలు స్వీకరించగా లెఫ్టినెంట్ మీర్జా ఇనాయత్, లెఫ్టినెంట్ కల్నల్ ఇషాన్ ఖాదిర్, లెఫ్టినెంట్ కల్నల్ ఎం.జడ్ కియాని, మేజర్ మతా-ఉల్-ముల్క్, లెఫ్టినెంట్ కల్నల్ బుర్హానుద్దీన్, మేజర్ ఎ.డి జహంగీర్, మేజర్ హబీబుర్ రెహమాన్, లెఫ్టినెంట్ అల్లాయార్ ఖాన్, మేజర్ మహమ్మద్ రజాఖాన్, కెప్టెన్ ముంతాజ్ ఖాన్, ఎస్.ఓ ఇబ్రహీం, లెఫ్టినెంట్ కల్నల్ అజీజ్ అహమ్మద్, లెఫ్టినెంట్ మీర్ రహమాన్ ఖాన్, మేజర్ రషీద్, లెఫ్టినెంట్ కల్నల్ అర్షద్‌లు ముందుకు వచ్చి ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్ కల్నల్ ఎం.జడ్ కియాని జనరల్ స్టాఫ్ ప్రధానాధికారిగా, సైనికుల శిక్షణాధికారిగా మేజర్ హబీబుర్ రెహమాన్, రిఎన్‌ఫోర్స్‌మెంట్ కమాండెం ట్‌గా మేజర్ ముతా-ఉల్-ముల్క్ , చరిత్ర-సంస్కృతి-పౌర సంబంధాల అధికారిగా మేజర్ ఏ.జడ్ జహంగీర్ ప్రధాన భూమికలను చాకచక్యంగా నిర్వర్తించారు.
ఈ పరిణామాల నేపధ్యంలో యూరప్ నుండి తూర్పు ఆసియాకు వెళ్ళేందుకు సుభాష్ చంద్రబోస్ నిర్ణయించు కున్నారు. రావాల్సిందిగా కోరుతున్న విప్ల వోద్యమ నేతల ఒత్తిడి మరింత పెరగడం, అవి ద్వితీయ ప్రపంచ సంగ్రామం జరుగు తున్న రోజులు కనుక జపాన్-జర్మనీల సహ కారంతో బ్రిటన్ దాని మిత్రపక్షాల సైన్యాలతో పోరా డుతున్న సుభాష్ చంద్రబోస్ ఆసియాకు వెళ్ళడం ప్రాణాంతకం కావడంతో బ్రిటీష్ గూఢచారి వ్యవస్థ డేగకళ్ళ నుండి తప్పించుకుని గమ్యస్థానం చేరడానికి నేతాజి రహస్యంగా జలాంతర్గమి ప్రయాణం తప్పలేదు. మూడు మాసాలపాటు 25,600 కిలోమీటర్లు సాగిన అత్యంత్య భయానక, సాహసోపేత జలాంతర్గమి ప్రయా ణంలో సుభాష్‌్‌కు అబిద్ హసన్ తోడుగా నిలిచి, భవిష్యత్తు కార్యక్ర మాల రూపకల్పనలో ఆయనకు తోడ్పడి చరిత్ర సృష్టించారు.
1943 మే 16న సుభాష్-అబిద్‌లు టోక్యో చేరుకున్నాక 1943 జూలై నాల్గున సింగపూర్‌లో జరిగిన సమావేశంలో తూర్పు ఆసియాలో సాగుతున్న భారత స్వాతంత్య్రోద్యమం నాయకత్వాన్ని సుభాష్ చంద్రబోస్ చేపట్టి 1943 అక్టోబర్ 23న 'ఆజాద్ హింద్' ప్రభుత్వాన్ని ప్రకటించారు. అ మరుక్షణమే మాతృభూమి విముక్తి కోసం, బ్రిటీష్ దాని మిత్రపక్షాల మీద యుద్ధం ప్రకటిస్తూ భారత జాతీయ సైన్యానికి 'చలో ఢిల్లీ' నినాదమిచ్చారు. భారత జాతీయ సైన్యంలో చేరమంటూ భారతీయులను కోరుతూ ఆజాద్ హింద్ రేడియా కేంద్రం ప్రసారం చేసిన ప్రతి కార్యక్రమంలో, మొగల్ చక్రవర్తి బహుదూర్ షా జఫర్ స్వయంగా రాసిన గీతంలోని 'స్వాతంత్య్ర పోరాటం జరుపు తున్న యోధులలో ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం లండన్ గుండెల్లో భారతీయుల ఖడ్గం దూసుకపోతూనే ఉంటుంది' అను చరణాలతో ఆలాపించడం అనవాయితయ్యింది.
భారత జాతీయ సైన్యం సర్వసైన్యాధ్యక్షులుగా, అజాద్ హింద్ ప్రభుత్వం అధినేతగా భాధ్యతలు స్వీకరించి సుభాష్ చంద్రబోస్ పలు ప్రధాన శాఖలకు సైన్యాధికా రులుగా లెఫ్టినెన్ట్ కల్నల్ అజీజ్ అహమ్మద్, లెఫ్టినెన్ట్ కల్నల్ ఎం.జడ్ కియానిలకు బాధ్యతలు అప్పగిస్తూ, బషీర్ అహమ్మద్‌ను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించారు. లెఫ్టినెంట్ కల్నల్ షానవాజ్ ఖాన్ సాయుధ దళాల ప్రతినిధిగా నియక్తుల య్యారు. ఆ తరువాతి క్రమంలో భారత జాతీయ సైన్యానికి సంబంధించిన మూడు డివిజన్లకు గాను రెండిటికి మేజర్ జనరల్ షా నవాజ్ ఖాన్, ఎం.జడ్ కియానిలు ప్రధానాధి కారులుగా బాధ్యతలు చేపట్టగా, రెజిమెంటల్ కమాం డర్లుగా ఐ.జె కియాని, ఎస్. ఎం. హుసైన్, బుర్హానుద్దీన్, షౌకత్ అలీ మలిక్ తదితరులు నియక్తులయ్యారు. ఈ సందర్భంగా సుభాష్ చంద్ర బోస్ ప్రత్యేక ఆసక్తితో ఏర్పాటు చేసిన 'ఝాన్సీరాణి రెజిమెంట్'లో ఎం.ఫాతిమా బీబి, సయ్యద్ ముంతాజ్, మెహరాజ్ బీబి, బషీరున్ బీబీ లాంటి నారీమణులు పలు బాధ్యతలు నిర్వహించారు.
స్వతంత్ర భారత ప్రభుత్వం, సైన్యం ఏర్పడ్డాక సాగుతున్న కార్యక్రమాలకు అన్నిరకాల సహాయసహకా రాలు అందించాల్సిందిగా సుభాష్ చంద్రబోస్ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ రంగూన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి హబీబ్ సాహెబ్ తన రాజప్రసాదం లాంటి భవంతిని, ఆయనకున్న పొలాలు-స్థలాలు, కోటిన్నర రూపాయల విలువ చేసే ఆభరణాలను ఆజాద్ హింద్ ఫౌజ్‌కు ధారాదత్తం చేసి కట్టుబట్టలతో నిల్చోగా ఆయనను 'సేవక్-ఏ-హింద్' పురస్కారంతో నేతాజీ సత్కరించారు. ఈ క్రమంలో బషీర్ సాహెబ్, నిజామి సాహెబ్ అను మరో ఇరువురు సంపన్నులు విడివిడిగా 50 లక్షల రూపా యలను నేతాజీకి అందించగా, మరో ముస్లిం వ్యాపారి తనకున్న మూడు ప్రింటింగ్ ప్రెస్‌లను, యావదాస్తిని 'నేతాజీ నిధి' పరం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విజయ నగరం జిల్లా వేపాడు (ప్రస్తుతం) నివాసి షేక్ ఖాదర్ మొహిద్దీన్ అతి కష్టం మీద కూడపెట్టుకున్న 20వేల రూపా యలను స్వయంగా 'నేతాజీ నిధి'కి అప్పగించి, రైఫిల్ మన్‌గా భారత జాతీయ సైన్యంలో చేరి సేవలందచేశారు.
'చలో ఢిల్లీ' పిలుపును సాకారం చేయడానికి అరకాన్ యుద్ధరంగంలో తొలిసారిగా కల్నల్ ఎస్.యం మలిక్ నేతృత్వంలోని భారతీయ జాతీయ సైన్యం బ్రిటీష్ సైన్యాలను మట్టికరిపించి మాతృభూమి మీద అడుగు పెట్టి మణిపూర్‌లోని మొయిరాంగ్ వద్ద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఆజాద్ హింద్ ఫౌజ్‌లోని వివిధ శాఖలలో అధికారులుగా బాధ్యతలను నిర్వహించిన యోధులలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన నక్కి అహ్మద్ చౌదరి, అష్రాఫ్ మండల్, అమీర్ హయత్, అబ్దుల్ రజాఖ్, ఆఖ్తర్ అలీ, మహమ్మద్ అలీషా, అటా మహమ్మద్, అహమ్మద్ ఖాన్, ఎ.కె. మీర్జా, అబూ ఖాన్, యస్. అఖ్తర్ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్ రహమాన్ ఖాన్ లాంటి వారున్నారు. చరిత్ర సృష్టించిన ఈ పోరాటంలో ఆంధ్ర పదేశ్‌కు చెందిన ముస్లింలూ భారీ సంఖ్య భాగస్వాముల య్యారు. మన రాష్ట్రం నుండి అబిద్ హసన్ సప్రానితో పాటుగా ఖమురుల్ ఇస్లాం, తాజుద్దీన్ గౌస్, హైదరాబాద్ చార్మినార్ సిగరెట్ కంపెనీ (వజీర్ సుల్తాన్ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్ కూడా భారత జాతీయ సైన్యంలో పనిచేశారు. హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్, అబ్దుల్ సయీద్ ఉస్మా ని, అబ్దుల్ లతీఫ్, ఇమాముద్దీన్, ముహమ్మద్ ఖాన్ లాంటి పలువురు నేతాజీ బాటలో నిర్భయంగా నడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వేపాడు గ్రామానికి చెందిన షేక్ ఖాదర్ మొహిద్దీన్, ప్రకాశం జిల్లా దర్శి తాలూకా చెందిన షేక్ బాదుషా, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్.అబ్దుల్ అలీ,చిత్తూరు జిల్లాకు చెందిన మహ మ్మద్ అఫ్జల్ సాహెబ్, పుంగనూరుకు చెందిన పి.పి.మహ మ్మద్ ఇబ్రహీం, కడపజిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్ ఖాదర్, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన షేక్ అహమ్మద్ ఆజాద్ హింద్ ఫౌజ్ పోరాటాలలో భాగస్వాములయ్యారు.
ఇంఫాలా-కోహిమాలను ఆక్రమించి అస్సాం లోకి అడుగుపెట్టాలని ముందుకు సాగుతున్న భారత జాతీయ సైన్యానికి ఒకవైపున ప్రకృతి మరోవైపున ఆహారం, ఆయుధాలు, రవాణా తదిరల అవసరాల తీవ్ర కొరత దెబ్బతీసింది. ఈ లోగా భారీ సైనిక బలగాలను సమ కూర్చుకున్న బ్రిటన్ దాని మిత్ర పక్షాల సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది.
ఆ తరుణంలో భారత జాతీయ సైన్యానికి అరకొరగా నైనా ఆర్థిక-ఆయుధ మద్దత్తు ఇస్తున్న జపాన్ దారుణంగా దెబ్బతిన్నది. మరోవైపున జర్మనీ కుప్ప కూలింది. బ్రిటన్-ఆమెరికా పక్షాలు విజయం సాధిం చాయి. ఆ కారణంగా 1945 ఆగస్టు 15న జపాన్ తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేయగా భారత జాతీయ సైన్యం కూడా యుద్దరంగం నుండి తప్పుకోవాల్సి రావడంతో నేతాజీ సుభాష్ చంద్రబోస్ యుద్ధరంగం నుండి తప్పుకుని ఆగస్టు 18న కల్నల్ హబీబ్‌తో కలసి నేతాజీ సుభాష్ చంద్ర బోస్ బాంబర్ విమానంలో బయలుదేరారు. ఆకాశంలోకి ఎగిరిన ఆ విమానం ఫోర్‌మొసా ద్వీపంలో కూలిపోవడంతో తీవ్రంగా గాయ పడిన సుభాష్ చంద్రబోస్ ఆగస్టు 19న కన్నుమూశారు. ఆయనతోపాటు ప్రయాణించిన కల్నల్ హబీబుర్రెహమాన్ చికిత్స అనంతరం బతికి బయటపడ్డారు. ఆ దుర్భర క్షణాలలో 'హబీబ్, నాకు తుది ఘడియలు సమీపించాయి. జీవితాంతం నేను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాను. నేను నా దేశ స్వాతంత్య్రం కోసం మరణిస్తున్నాను. భారత స్వాతంత్య్ర పోరాటం సాగించమని నా ప్రజలకు తెలియ జెయ్యి. త్వరలోనే భారత దేశం విముక్తి చెందుతుంది' అని సుభాష్ చంద్రబోస్ కల్నల్ హబీబుర్రెహమాన్ ద్వారా భారతీయులకు తన చివరి సందేశం పంపారు