ఇటీవల ఓ జిల్లా కేంద్రంలో నూర్ బాషాలు అంటే దూదేకుల కులస్థుల సమావేశం జరిగింది. హాజరయిన పెద్దలు "మనం ముస్లిములమా?హిందువులమా?" అనే మీమాంసంలో పడి రసవత్తరమయిన చర్చ జరిపారు.
ఉర్దూ భాష నమాజురాకపోవటం వలన ముస్లిములు తమను చిన్నచూపు చూస్తున్నారని, వాళ్ళ పిల్లలకు తమ పిల్లల్నిచ్చి పెళ్ళిళ్ళు చేయటానికి ముందుకు రావడంలేదని కొందరు ముస్లిం దూదేకుల వారు వాపోయారు. మాకు తెలుగు మసీదులు కావాలన్నారు. నిజంగా హిందూ దేవుళ్ళను నమ్ముకొని తిరుపతికి పోయి గుండు చేయించుకొచ్చినా, సాయిబుల పేర్లుండటం వలన హిందువులు కేటాయించి చూస్తున్నారనీ, షేక్ శ్రినివాసరావు, షేక్ పద్మావతులు గూడా హిందువుల ఆదరణకు నోచుకోవటం లేదని, మరికొందరు హిందూ దూదేకులవారు బాధపడ్డారు. మన విలువ పెరగాలంటే దూదేకుల సిద్ధప్పను తలదన్నే తాత్వికులతో పాటు ప్రత్యేక పూజారులు, పురోహితులు కావాలన్నారు. వే
టపాలెం దగ్గర మా మందంతా క్రైస్తవ మతం పుచ్చుకొని హాయిగా ఉన్నాం. చర్చిలో మమ్మల్ని ముందు వరసలో కూర్చోబెట్టి గౌరవిస్తున్నారు మాకు ఉర్దూ బెడదలేదు. కులం గొడవాలేదని షేక్ ఏసుపాదం, షేక్ దానియేలు లాంటి క్రైస్తవ దూదేకుల వాళ్ళు సెలవిచ్చారు. పైగా త్వరలో స్వంత చర్చి కడతారట. నూతిలో పడతావా? పాతర్లో పడతావా? అన్నట్లయింది సమావేశం. ఎవరి మతాన్ని వారు సమర్ధించుకున్నారు. మనమంతా ఒక కుల పోళ్ళం కాబట్టి మనకందరికీ ఒకే మతం ఉండాలని కొందరు పిడివాద దూదేకులు వాదించారు. ఎవరి మతం ఎవరు విదిచిపెడతారు? ఎవరి మతం వారిదేనని కొందరు ఉదారవాద దూదేకులు ఎదురు తిరిగారు. ఆహా! ఏమీ లౌకికవాదం! ఎంతటి అద్భుతమీ భిన్నత్వంలో ఏకత్వం! సకల మతాల సారాలను ఆచారాలను తనలో ఇముడ్చుకొని సర్దుకొని చక్కగా పోతున్న దూదేకుల ఐకృత వర్ధిల్లాలని కొందరు సెక్యులర్ దూదేకుల వారు అరిచారు. అన్ని మతాల వాళ్ళూ మనల్ని కరివేపాకుల్లాగా వాడు కొని అవతల పారేస్తున్నారు. వెనుకపడిన కులాల జనాభాలో 4 శాతం ఉన్నాం.
ఎప్పుడన్నా మనకు ఎమ్మెల్యే పదవిచ్చారా? ఒక్క దూదేకుల వాడైనా ఐ.ఎ.ఎస్. ఆఫీసర్ అయ్యాడా? ఆర్ధికాభివృద్ధి లేకుండా ఈ మతాలెందుకు? అని కొందరు హేతువాద దూదేకులు ఆక్రోశించారు.దూదేకటం అనే వృత్తి పోయింది. ఇప్పుడెవరూ ఆ వృత్తి చేయటం లేదు. ఇక మీదట ఆ వృత్తినే చేసి బ్రతికే అవకాశమూ లేదు. ఇంకా ఆ వృత్తి పేరుతోనే కులం పేరు ఎందుకు? మన కులానికి మరేదయినా మంచి పేరు పెట్టాలని కొందరు సంస్కరణవాదులు మాట్లాడారు. కూటికీ గుడ్డకూ రాని బ్యాండు మేళాలు,సన్నాయి వదిలేసి సాంకేతిక విద్యలు చదవాలనీ, ప్రభుత్వాన్ని భూములడగాలనీ కొందరు కమ్యూనిస్టు దూదేకులవారు డిమాండ్ చేశారు. బంతికే రావద్దంతే విస్తరాకు తెమ్మన్నట్టుంది మీ వ్యవహారం. ఏదో ఒక మత గుంపులో చేరితే తప్ప బెదురు తీరని బడుగు జీవులం మనం. ఏమతంలో చేరితే మన పేదరికం అంతరిస్తుంది? ఏ మతంలో చేరితే మన పిల్లల భ్వష్యత్తుకు భధ్రత కలుగుతుంది?
ఏ మతంలో చేరితే వాళ్ళ పిల్లల్ని మన పిల్లలకిచ్చి పెళ్ళిళ్ళు చేసి మనల్ని హృదయ పూర్వకంగా కలుపుకుంటారు? మనం దాడిచేసేవాళ్ళం కాదు ఎప్పుడూ దాడులకు గురవుతున్న వాళ్ళం. ఇప్పుడు కావలసింది మన ఆత్మల రక్షణ కాదు. మన ప్రాణాలకు భౌతిక రక్షణ, ఆర్ధిక రక్షణ, సాంఘిక రక్షణ, ఏ మతంలో దొరుకుతుంది? కుల విచక్షణ చూపకుండా మానవతాభావంతో కరుణ రసాన్ని కురిపించి మనపట్ల సమ గౌరవం చూపే మతమేది? ఆ మనవతా మత మేది? అంటూ కొందరు సభ లోనే అన్వేషించారు. కానీ ఫలితం కానరాలేదు.రాజ్యాంగం రాసినవాడే కులాంతర, మతంతర వివాహాలకు మాత్రమే రిజర్వేషన్లను పరిమితం చేసినా ఈ 53 ఏళ్ళలో కులమత ప్రసక్తిలేని, ఏ కులమో చెప్పలేని భారత జాతి గణనీయంగా పెరిగి కుల, మత కలహాలను సమసింపజేసి ఉండేది.
No comments:
Post a Comment