welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Sunday, October 18, 2009

పట్టుదల ముందు ఓడిన పేదరికం

పట్టుదల ముందు ఓడిన పేదరికం దుగ్గిరాల, న్యూస్‌టుడే దుగ్గిరాలకు చెందిన మళావత్ బాలనాగయ్యనాయక్ తండ్రి తారునాయక్ రిక్షా తొక్కుతూ భార్య, నలుగురు పిల్లల్ని పోషించాడు. పిల్లలు తనలా కష్టపడకూడదనే ఉద్దేశంతో వారిని చదివించాడు. ఇలా సాగుతున్న కుటుంబంపై విధి కాటు వేసింది. 2000 సంవత్సరం సెప్టెంబరులో మృత్యురూపంలో తండ్రి తారునాయక్‌ను కుటుంబం నుంచి విధి దూరం చేసింది.దీంతో కుటుంబసభ్యులంతా దిక్కులేని వారయ్యారు. అంతటి దుఃఖాన్ని గుండెల్లో దాచుకుని తల్లి ధ్వాలీబాయి కూలికి వెళ్ళసాగింది. రెక్కలు ముక్కలు చేసుకుంది. అయినా ఆ సంపాదన కుటుంబ పోషణకు సరిపోలేదు. ఈదశలో బీఎస్సీ రెండో సంవత్సరం చదువుతున్న బాలనాగయ్యనాయక్ ఇంటికి పెద్దకొడుకుగా పరిణితి చెందిన మనస్సుతో కర్తవ్యాన్ని గుర్తించాడు. కుటుంబ భారాన్ని నెత్తికెత్తుకున్నాడు.

తండ్రి రిక్షాను అందుకున్నాడు. కళాశాల వదిలిపెట్టగానే ఇంటికి వచ్చేవాడు. రిక్షా లాగేవాడు. దుగ్గిరాల యార్డులో పనిచేశాడు. రైల్వేస్టేషన్ నుంచి వచ్చే ప్రయాణికుల లగేజీని తీసుకెళ్ళేవాడు. బస్తాకు మూడు రూపాయలు చొప్పున రోజుకు రూ. 50 నుంచి రూ. 70 వరకూ వచ్చేవి. బిడ్డ పడుతున్న కష్టం బాధనిపించినా కుటుంబ పరిస్థితుల వల్ల ఆ తల్లి కాదనలేకపోయింది.

స్నేహితుని మార్గదర్శకం 2002లో డిగ్రీ పూర్తి చేసిన బాలయ్యనాయక్ 2002-03లో విజయవాడ దక్షిణ భారత హిందీ ప్రచార సభ ద్వారా హిందీ పండిట్ శిక్షణ పూర్తిచేశాడు. అప్పుడు కూడా ఇంటికి వచ్చి రిక్షా వృత్తి కొనసాగించాడు. 2003-04లో గణితం, ఫిజికల్ సైన్సెస్ సబ్జెక్టులుగా బి.ఇడి. చేశాడు. నాయక్ మాటల్లో చెప్పాలంటే అతని స్నేహితుడు కాకాని యలమందరావు ఒత్తిడి చేసి బి.ఇడి. ప్రవేశపరీక్ష రాయించాడు.

కష్టపడుతున్న స్నేహితుడికి యలమంద మార్గదర్శకుడయ్యాడు. అతని ప్రోత్సాహమే లేకపోతే తాను ఈనాడు ఈ స్థాయిలో ఉండేవాడిని కాదని బాలునాయక్ అంటున్నారు. బి.ఇడి. పూర్తికాగానే ఏం చేద్దామని అన్పించింది. అప్పుడు స్నేహితుని మార్గదర్శకమే. ఎం.ఎస్.సి. చేయమని సలహా ఇచ్చాడు. డబ్బులు సరిపోతాయా? తన వల్ల అవుతుందా? ఇవన్నీ నాయక్ మదిలో మెదిలిన భావనలు. రిక్షా ఎక్కువ సేపు తొక్కుదాం అనుకున్నాడు. అంతే
దూరవిద్య ద్వారా 2004-06లో ఎం.ఎస్.సి. పట్టా అతని చేతిలోకి వచ్చింది. తాను ఎమ్మెస్సీ పూర్తి చేసి అధ్యాపకుడిగా పనిచేస్తున్న కళాశాలలోనే నాగయ్యనాయక్‌కు కూడా యలమందయ్య అధ్యాపకుని పోస్టు వచ్చేలా ప్రయత్నించాడు. నలంద కళాశాలలో ఒక సంవత్సరం పనిచేశాడు. విజయవాడలో ఉచితంగా గ్రూప్-2 శిక్షణ ఇస్తుంటే దానిలో చేరాడు. అక్కడ నేర్చుకున్న జనరల్ నాలెడ్జి తనకు డీఎస్సీలో ఉపయోగపడిందని నాయక్ చెప్పారు.


ఈదశలోనే స్నేహితుడితో కలిసి 2008లో డీఎస్సీకి సిద్ధమయ్యాడు. గణితశాస్త్ర ఉపాధ్యాయునిగా ఎంపికయ్యాడు. నూజెండ్ల మండలం ములకలూరు జిల్లాపరిషత్తు ఉన్నత పాఠశాలలో పోస్టు పొందాడు. సోమవారం నుంచి విధుల్లో చేరుతున్న నాయక్ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తు వచ్చేలా కృషి చేస్తానంటున్నారు. తనను ఇంతటి వాడిని చేసిన తల్లికి, స్నేహితునికి, అక్కలు-బావలకు తాను ఎప్పుడూ రుణపడి ఉంటానని ఆయన పేర్కొంటున్నారు.

ఆనందంగా ఉంది: తల్లి ధ్వాలీబాయి నా భర్త చనిపోయినప్పుడు ఇంట్లో పరిస్థితుల కొడుకు రిక్షా తొక్కుతానన్నా కాదనలేకపోయాను. ఇప్పుడు బిడ్డ ఉపాధ్యాయుడు అయినందుకు ఎంతో సంతోషంగా ఉంది. వాడు పడ్డ కష్టానికి ఫలితం లభించింది.eenadu18.10.2009


No comments: