welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, October 20, 2008

సమతతో సమృద్ధా? మతంతో పతనమా?

సమతతో సమృద్ధా? మతంతో పతనమా?
గురుచరణ్‌దాస్
దేశంలోని ప్రధాన నగరాల్లో ఇస్లామిక్ ఛాందసవాదుల బాంబు దాడులు, ఒరిస్సాలో క్రైస్తవులపై హిందూ మౌఢ్యుల దాడులు పాతగాయాలను రేపాయి. మనల్ని మళ్లీ రెండు వర్గాలుగా చీలుస్తున్నాయి. అంతర్జాతీయ సంక్షోభంతో పాటు స్వదేశంలో మత ఛాందసవాదం కూడా భారత ఆర్థికాభివృద్ధికి సవాళ్లు విసురుతోంది. మనం ఆశిస్తున్న భవిష్యత్తును ప్రశ్నార్థకంలో పడేస్తోంది. భారత్ శాంతియుతంగా కొనసాగించే ఆర్థికాభివృద్ధి 21వ శతాబ్దపు విజయగాథగా నిలుస్తుందా? లేదా మత యుద్ధాలతో మన భవిష్యత్తు గాడి తప్పుతుందా?

ఆధునిక, సంపన్న, ప్రజాస్వామిక దేశంగా భారత్ మారడాన్ని ఎవరూ ఆపలేరన్నది నా విశ్వాసం. ఇస్లామిక్, హిందూ అతివాదాలు అరాచక సంస్కృతికి రెండు భిన్న ముఖాలు. కాలక్రమేణా అవి ప్రాధాన్యాన్ని కోల్పోతాయి. కొంతకాలం తర్వాతైనా ఛాందసవాదులు మంచి ఉద్యోగాలను, ఇళ్లను, తమ పిల్లలకు చక్కటి పాఠశాలలను పొందుతారు. యుద్ధం కంటే శాంతికి మద్దతు పెరుగుతుంది. అనుకున్నది సాధించడానికి పోరాటం కంటే వ్యాపారమే మంచి సాధనం అవుతుంది. విశ్వాసం, సహకారం ముందు హింస తలవంచుతుంది. తద్వారా రాజకీయ ఇస్లాంవాదం, రాజకీయ హిందూవాదం విఫలమవుతాయి. ఈ వాదనను చరిత్ర నిరూపించింది. గత రెండు శతాబ్దాల్లో సానుకూల సామాజిక వ్యవస్థలన్నింటినీలోనూ ప్రజాస్వామ్యం, మార్కెట్ ఆర్థిక విధానాల కలయిక విజయవంతమైంది. భూస్వామ్యం, రాజరికం, నియంతృత్వం, కమ్యూనిజం తదితర వ్యవస్థలపై ఉదార ప్రజాస్వామ్యం పైచేయి సాధించింది. శతాబ్దం క్రితం ప్రపంచంలో 10 ప్రజాస్వామ్య దేశాలుండగా ఇప్పుడు 120 ఉన్నాయి.

భవిష్యత్తు సంక్షోభాలు దేశాల మధ్య కాకుండా మత, సాంస్కృతిక నాగరకతల మధ్య తలెత్తుతాయని 'ద క్లాష్ ఆఫ్ సివిలైజేషన్స్' అనే గ్రంథంలో రాజకీయ శాస్త్రవేత్త శామ్యూల్ హంటింగ్టన్ వాదించారు. ఎదుగుతున్న ఇస్లామిక్‌వాదం, బలమైన శక్తిగా మారుతున్న చైనాతో చేతులు కలిపి పశ్చిమదేశాలకు సవాలు విసురుతుందని ఆయన అంచనా వేశారు. అయితే కమ్యూనిజం పతనమయ్యాక చాలా దేశాల్లో పెట్టుబడిదారీ ప్రజాస్వామ్య వ్యవస్థలు ఏర్పడతాయని 'ది ఎండ్ ఆఫ్ హిస్టరీ' అనే గ్రంథంలో ఫ్రాన్సిస్ ఫుకుయామా సూత్రీకరించారు. తద్వారా ప్రపంచం శాంతియుతంగా మారతుందని అభిప్రాయపడ్డారు. మనుషులు సంపన్నులయ్యాక ఒకానొక దశలో షాపింగ్‌మాళ్లు, వినియోగ సంస్కృతి పట్ల విసుగుచెందుతారనీ, కొత్తరకమైన సంతృప్తి కోసం మతాన్ని, యుద్ధాన్ని ఆశ్రయిస్తారని విశ్లేషించారు. అమెరికాలో క్రైస్తవం పునరుజ్జీవం పొందడం ఇందుకు నిదర్శనంగా భావించవచ్చు. దీన్ని 'ద నెక్ట్స్ క్రిస్టెన్‌డమ్: ద రైజ్ ఆఫ్ గ్లోబల్ క్రిస్టియానిటీ' పేరుతో ఫిలిప్ జెంకిన్స్ గ్రంథస్తం చేశారు. విస్తృతంగా కార్యకలాపాలు నిర్వహిస్తూ, రాజకీయంగానూ కీలకపాత్ర పోషించే సరికొత్త మిషనరీ క్రైస్తవత్వాన్ని గుర్తించారు. ఈ కొత్త మిషనరీలు భారీగా సాగిస్తున్న మత మార్పిడులే భారత్‌లో హిందూ అతివాదవర్గాల ప్రతిఘటనకు కారణమా అన్నది సందేహం.

తీవ్ర ఇస్లామిక్‌వాదం లేదా జిహాదిజం మతపరమైన సిద్ధాంతంగా కంటే రాజకీయ భావనగానే కనిపిస్తోంది. సయ్యిద్ కుతుబ్, బిన్ లాడెన్‌లు రాజకీయ హింసావాదాన్ని ఉపయోగించుకున్నారు. ఇది ఇస్లాం నుంచి వచ్చింది కాదు. ఐరోపాలోని అతివాద, అరాచక సిద్ధాంతాల నుంచి పుట్టుకొచ్చింది. ఈ ప్రమాదకర ధోరణి తన రాజకీయ లక్ష్యాల కోసం ఇస్లాంను ఉపయోగించుకుంది. పశ్చిమ దేశాలకు దూరంగా ఉండే అరబ్, ఐరోపా ముస్లింలలో దీనికి పట్టు దొరికింది. ఇక ఉగ్రవాద సవాలు నుంచి భారత ఉదార ప్రజాస్వామ్యాన్ని ఎలా రక్షించుకోవాలన్నది ప్రశ్న. ఈ విషయంలో ఇప్పటివరకు మనం అమెరికా కంటే చక్కటి పరిణతితోనే ప్రతిస్పందించాం. వారి తరహాలో అందరినీ అనుమానించే తీరును మనం అనుసరించలేదు. ఇది ఉగ్రవాదుల స్త్థెర్యాన్ని దెబ్బతీసి ఉండాలి. అయితే అనేకమంది ఉదార ముస్లింల మధ్యలో ఉన్న అతి కొద్దిమంది ఉగ్రవాదులను పట్టుకోవడంలో మన భద్రతా సంస్థలు విఫలమయ్యాయి. మరో 9/11 దాడి జరగకుండా నివారించిన అమెరికా తరహాలో మనం వ్యవహరించలేకపోయాం. దీన్నుంచి పాఠాలు నేర్చుకోవాలి. పౌరులకు మత, కులపరమైన గుర్తింపును కొనసాగించడం ద్వారా వ్యక్తులుగా వారి ఔన్నత్యాన్ని నిలబెట్టడంలో ప్రభుత్వంకూడా విఫలమైంది. మన రాజ్యాంగం ప్రకారం ఒక సమూహంకంటే వ్యక్తి ఔన్నత్యాన్ని కాపాడడమే ప్రభుత్వ ప్రాధాన్యంకావాలి. అయితే ఓటు బ్యాంకు వ్యవస్థలో ఇదేమంత సులభం కాదు. ఆధునిక లౌకికవాద రాజకీయాలు రాత్రికిరాత్రి పుట్టుకురాలేదు. పశ్చిమదేశాల్లో దీనికి కొన్ని శతాబ్దాలు పట్టింది. ఈ విషయంలోనే ఇస్లామిక్ ప్రపంచం సమస్యను ఎదుర్కొంటోంది. ఇక భారత్‌లో ప్రజాస్వామిక పెట్టుబడిదారీ విధానం కొనసాగుతుందని నేను ఇప్పటికీ విశ్వసిస్తున్నాను. మన ఉదార ప్రజాస్వామ్యం మతతీవ్రవాదంపై విజయం సాధిస్తుంది. చివరికి బహుళత్వ, లౌకిక, శాంతియుతభారతం సాకారమవుతుంది.
-వ్యాసకర్త ప్రోక్టర్ అండ్ గ్యాంబుల్ ఇండియాకు మాజీ ఛైర్మన్, ఎండీ.
'ముక్తాభారత్' గ్రంథ రచయిత.

No comments: