welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, October 06, 2008

నాన్నకు వద్దా సెలవు? 'సంరక్షణ' ఎవరిది?

నాన్నకు వద్దా సెలవు? 'సంరక్షణ' ఎవరిది?

నాన్నకు వద్దా సెలవు?
'సంరక్షణ' ఎవరిది?
కొత్త సెలవులపై రేగుతున్న చర్చ
పిల్లల పెంపకం ఎవరి బాధ్యత? దీనిపై దేశవ్యాప్తంగా కొత్త చర్చ మొదలైంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగినులకు రెండు సంవత్సరాల శిశు సంరక్షణ సెలవు(చైల్డ్ కేర్ లీవ్) ఇవ్వాలని నిర్ణయం తీసుకోవటమే ఈ తాజా చర్చకు మూలం. దీనివల్ల తల్లులకు పిల్లల్ని దగ్గరుండి చూసుకునే వెసులుబాటు లభిస్తుందని ఓవైపు సంతోషం వ్యక్తమవుతుండగా.. మరోవైపు పిల్లల సంరక్షణ, పెంపకం పూర్తిగా ఆడవారి బాధ్యతేనా? మగవారికి ఇందులో ఏ పాత్రా లేదా? ఈ సెలవులతో పిల్లల పెంపకమన్నది కేవలం స్త్రీల బాధ్యతేనని అధికారికంగా కూడా గుర్తించినట్టు కాదా?.. ఇలాంటి చిక్కుప్రశ్నలెన్నో రేగుతున్నాయి.

రోజంతా రకరకాల పనులతో అలసిపోయి ఇంటికొచ్చే ఉద్యోగినుల కోసం.. ఇంటి దగ్గరా గంపెడు చాకిరీ ఎదురుచూస్తుంటుంది. పిల్లల హోంవర్కులూ, చదువుల 'బాధ్యత'లూ వీటికి అదనం. ఇటీవల 'అసోచామ్' నిర్వహించిన సర్వేలో కూడా పిల్లలతో గడపడం, దగ్గరుండి వారిని చదివించటం వంటి బాధ్యతలన్నీ స్త్రీలవేనని ఎంతోమంది పురుషులు అభిప్రాయపడుతున్నట్టు వెల్లడైంది. 4% మంది తండ్రులే వాటిలో తమకూ బాధ్యత ఉందని అంగీకరిస్తున్నారు. మిగిలిన వారిలో 7% మంది ఎప్పుడన్నా ఓసారి హోంవర్క్‌లో సాయం చేస్తుంటే.. 24% మంది తండ్రులు 'పిల్లలు మమ్మల్ని అడిగినప్పుడు చూస్తాం' అనీ.. గరిష్ఠంగా 65% మంది 'అసలు పట్టించుకోం' అని చెప్పడం పరిస్థితికి అద్దంపడుతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కూడా స్త్రీలకే పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చెయ్యటం.. ఈ అస్తవ్యస్త సామాజిక విధానాన్ని సమర్థించినట్టు కాదా? అంటున్నారు కొందరు.

నిజానికి పిల్లల పెంపకంలో మన దగ్గర మొదట్నించీ పురుషుల పాత్ర నామమాత్రమే. డబ్బు సంపాదించడంతోనే తన పని అయిపోయిందనుకునే 'మగమహారాజు'లే ఎక్కువ. ''మావారు పిల్లాడికి బట్టలూ, బొమ్మలూ బాగానే కొనిస్తారు. వాడి స్కూలు వ్యవహారాలు చూడమంటే మాత్రం విసుక్కుంటారు. జబ్బు చేస్తే ఆసుపత్రికి కూడా నన్నే తీసుకెళ్లమంటారు'' అంటారు ఓ బ్యాంకు ఉద్యోగిని వసంత. అయితే, ఇప్పుడీ పరిస్థితిలో కొద్దిగానైనా మార్పువస్తోంది. ఇంటి పనుల్లో తామూ ఓ చేయి వేయాలని, వంటలోనూ సాయం చేయాలనుకునే పురుషుల సంఖ్య పెరుగుతోంది. ''పిల్లలను చదివించడం, పరీక్షలకు సిద్ధం చేయడం, జబ్బు చేసినపుడు సేవలు చేయడం వంటివి కేవలం ఆడవారి మీదే వేయటమెందుకు? అంతకన్నా ఆ బాధ్యతలను సమానంగా మోసేలా చేయడం మేలు కదా'' అంటారు ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కృష్ణమూర్తి. అయితే... ''పిల్లల సంరక్షణ సెలవు వల్ల తల్లులకు ఆ మేరకు ఒత్తిడి తగ్గుతుందనడంలో సందేహమేం లేదు. దీంతో ఉద్యోగభారం తగ్గి పూర్తిగా పిల్లల మీదే దృష్టి కేంద్రీకరించే అవకాశం కలుగుతుంది'' అని చెబుతున్నారు న్యాయనిపుణులు మాడభూషి శ్రీధర్. ఇది చట్టపరంగా ఆడవారికి లభిస్తున్న ఓ బాసటే తప్ప.. పిల్లల సంరక్షణలో మగవారి పాత్రను చర్చించడానికి దీన్ని వేదికగా చేయరాదంటారాయన.

నాన్నల తోడూ కావాలి: శిశువులకు మొదటి ఆర్నెల్లూ కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని వైద్యులు సూచిస్తున్నారు. అందుకే ప్రభుత్వం నాలుగున్నర నెలల మాతృత్వ సెలవులను ఆర్నెల్ల వరకూ పొడిగించింది. ఇప్పుడు ప్రకటించిన పిల్లల సంరక్షణ సెలవులు వీటికి అదనం. ''దీనివల్ల తల్లులకు ఎంత ఊరట లభిస్తుందో మాటల్లో చెప్పలేను. కానీ, ప్రసవానంతరం బయటి పనులు చూసుకునేందుకు భర్తలు తోడుంటే ఇంకా బాగుంటుంది'' అన్నది ఉపాధ్యాయురాలు విజయలక్ష్మి అనుభవం. నిజానికి పిల్లల సంరక్షణలో తండ్రులూ పాలు పంచుకుంటే ఎంతోమేలు జరుగుతుందని, అలా పెరిగే పిల్లలు చదువుల్లోనూ బాగా రాణిస్తారని బెంజమిన్ స్పాక్స్ వంటి విఖ్యాత శిశు మనస్తత్వవేత్తలు మూడు దశాబ్దాల క్రితమే గుర్తించారు. దీనివల్ల కేవలం పిల్లల భవిష్యత్తు మెరుగుపడటమే కాదు, భార్యాభర్తల మధ్య అన్యోన్యతా పెరుగుతుంది. ''మా వారు ఆఫీసు నుంచి రాగానే పాపను ఆడిస్తారు, దగ్గరుండి చదివిస్తారు. సెలవురోజుల్లో పార్కులు, మ్యూజియానికి తీసుకెళ్తారు. పరీక్షల సమయంలో పాపతో మరికాస్త సమయం గడిపే వీలుంటే బాగుండని ఎన్నోసార్లు అంటుంటారు. అందుకే పురుషులకూ సెలవులిస్తే మంచిది'' అంటారు హైదరాబాద్‌లోని ఓ గృహిణి భవాని. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 15 రోజుల పితృత్వ సెలవుల సదుపాయం ఉంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలూ ఈ సెలవులు ఇస్తున్నాయి. ఇవేకాకుండా, పురుషులకూ 'పిల్లల సెలవులు' ఇవ్వాలని చాలామంది కోరుతున్నారు. కాలంతో పాటే ప్రజల అభిప్రాయాలూ మారుతున్నాయి. వాటిని సమాజ అవసరాలకు అనుగుణంగా ప్రోత్సహించేలా విధానాలు రూపొందాలి.. అప్పుడే మరింత పురోగతి దిశగా అడుగులు పడతాయి. కాదంటారా?

No comments: