welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Wednesday, July 02, 2008

వివాహబంధం లేకుండా కూడా జీవితం ఉంటుంది

త్వరపడితే ...తెరపడదు
భార్యాభర్తలు విడిపోయి బతకడం కన్నా చావడం నయం అనుకోవడం భారతీయ సంస్కృతి. అందుకే ఒకప్పటి తల్లిదండ్రులు చావైనా బతుకైనా భర్తదగ్గరే తేల్చుకోమంటూ కన్న కూతుర్ని మెట్టినెంటి దయాదాక్షిణ్యాలకే వదిలేసేవారు. నేటి సమాజ ప్రమాణాలు మారాయి. స్త్రీపురుష సంబంధాలకు ఎన్నోకోణాలు వెలుగులోకొచ్చాయి. ఇష్టంలేకపోతే విడిపోవడం మామూలే.
కొన్నాళ్లక్రితం ఒక వృద్ధజంట నా దగ్గరకు వచ్చారు. విడాకులు తీసుకుంటానంటున్న తమ కుమార్తె గురించి చెప్తూ పాశ్చాత్యులను అనుకరిస్తూ మనదేశం పాడైపోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. సహజీవనం సాధ్యంకాక ఇద్దరు వ్యక్తులు విడిపోవడానికి దేశం నాశనమవడానికి సంబంధమేంటో నాకర్థం కాలేదు. ఇప్పటికీ చాలామంది పలుకారణాల వల్ల తాము బాధపడుతూ పిల్లల్ని బాధపెడుతూ కలిసుండడానికే ఇష్టపడుతున్నారు. ఇంత సామాజికాభివృద్ధి అనంతరం కూడా పెళ్లి, భార్యాభర్తల అనుబంధాల గురించి మన నిర్వచనాలు మారలేదు. శిల్ప వివాహమై ఆరేళ్లు. ఇద్దరి భావాల మధ్య విపరీతమైన భేదం. వ్యక్తిత్వాలమధ్య తీవ్ర అంతరం. దాంతో ఆమె విడిపోవాలనుకుంది. తల్లిదండ్రులు, స్నేహితులు అందరూ అడిగిందివే... అతను నిన్ను కొడతాడా, తాగి వస్తాడా, మరో స్త్రీతో సంబంధం ఉందా, పేకాడతాడా... అని. అవేవీ కాదని శిల్ప సమాధానం. మరెందుకు విడిపోతున్నావన్నారు. మనిషి మంచి చెడులకు కొలమానాలివేనా? అదే పురుషుడైతే... ఆమె వంట చేయకపోయినా, ఇంటికి ఆలస్యంగా వచ్చినా, ఆమె శీలం మీద అనుమానం వచ్చినా... విడాకులు తీసుకుంటాడు. ఇక్కడ గమనించాల్సింది ఒకటుంది. ఇద్దరు వ్యక్తుల సహజీవనం పొసగనప్పుడు (కంపాటిబిలిటీ)... అన్నది రెండువైపులా కూడా విడాకులకు కారణం కాకపోవడాన్ని గమనించాలి.
పద్మ భర్తకు ఏ దురలవాట్లు లేవు. ఆఫీసునుంచి ఠంచనుగా ఇంటికి వస్తాడు. ఇంటికి కావలసినవన్నీ కొని పడేస్తాడు. అందరూ ఆమెను అదృష్టవంతురాలంటారు. కానీ బాధేమిటో ఆమెకు తెలుసు. చెప్పకుండా టూర్‌కెళ్తాడు. అక్కడ్నుంచీ ఫోన్‌చేయడు. ఇంట్లో ఉన్న సమయంలో టీవీతప్ప పెళ్లాం పిల్లల్ని చూడడు. ఎప్పుడూ కోపంగా ఉండే అతన్ని చూసి పిల్లలూ దూరంగా ఉంటారు. ఒక సినిమా, షికారు... ఉండవు సరే, కనీసం పిల్లల భవిష్యత్తు, డబ్బు పొదుపు, ఇల్లు కొనుక్కోవడం... భర్తతో ఎన్నెన్నో చెప్పాలని ఆమెకుంటుంది. అతను అవకాశమిస్తేగా. ఇప్పుడు చెప్పండి ఆమె అదృష్టవంతురాలేనా? ఆమె నాతో ఒకటే మాట అంది... 'భర్త ఉన్న వితంతువుని' అని. విడిపోయి పిల్లలతో ఒంటరిగా జీవిస్తున్న ఆమెను ఇప్పటికీ ఎవరూ అర్థం చేసుకోలేదు. ఆమెకు ఖరీదైన బహుమతులు ఇచ్చేవాడనే అంటారు కానీ పిల్లల పేరున వెయ్యి రూపాయలు దాచిన పాపాన పోలేదన్నది వారికి పట్టదు. ప్రేమ లేదు... భద్రత లేదు... ఎందుకు కలిసుండాలన్నది పద్మ ప్రశ్న.

చాలా బంధాల్లో జరిగేదిదే. పెళ్ళైన కొన్నేళ్లకు భాగస్వామిని తేలిగ్గా తీసుకోవడం మొదలవుతుంది. బాధ్యతలు, ఉద్యోగాల వల్ల కలిసుండే సమయంతోపాటు సాన్నిహిత్యం తగ్గుతుంది. అది గమనించి బంధాన్ని పటిష్ఠపరచుకునే ప్రయత్నాలు చేయాల్సింది పోయి ఒకరి తప్పులు ఒకరు వెదుకుతారు. కయ్యానికి కాలు దువ్వుతారు. అలాంటి వాళ్లు విడాకులు తీసుకునేది కాగితాల మీదే. మనసులు ఏనాడో విడిపోయి ఉంటాయి. పెళ్లయ్యాక ఐదేళ్లపాటు కలిసుండగలిగితే ఆ తర్వాత ముప్పై ఏళ్లు ఎలా గడుస్తాయో తెలియవంటారు. అది కొంతవరకు నిజమేననిపించేది. చాలావరకు విడాకులు ఐదేళ్లలోపే జరిగేవి. కానీ ఈమధ్యకాలంలో పెళ్త్లెన పదేళ్లకు విడాకులు తీసుకోవడం పెరుగుతోంది. అంటే అంతకు కొన్ని సంవత్సరాల ముందునుంచీ ఇలాంటి కాపురాలన్నీ గొడవలు పడుతూనే ఉన్నాయని కదా అర్థం. కొట్టుకోవడం, వివాహేతర సంబంధాలు లాంటివే విడాకులకు కారణాలు కానక్కర్లేదని, భాగస్వామితో మనసు విప్పి మాట్లాడలేకపోవడం, పరస్పర వైముఖ్యం, పరిష్కారం కాని వాదోపవాదాలు, నిశ్శబ్దంగా ఎవరి దారిన వారు పనిచేసుకోవడం... ఇవన్నీ కూడా సంసారం సజావుగా సాగడం లేదనడానికి నిదర్శనలే. అలాంటప్పుడు తెగేదాకా లాగేబదులు కాస్త ముందుగానే పటిష్ఠపరుచుకునే ప్రయత్నమెందుకు చేయరు?

బంధం బీటలువారుతున్నట్లనిపించగానే జాగ్రత్తపడాలి.
మనసు క్రియాశీలంగా ఉండాలంటే మంచివ్యాపకం అవసరం. బంధాన్ని పటిష్ఠపరుచుకోవడానికి ఆరోగ్యకరమైన పద్దతులు వెదకాలి. నిపుణుల సహకారం తీసుకోవాలి.
అన్ని ప్రయత్నాలూ విఫలమయ్యాయి. వేరవ్వాలనే నిర్ణయించుకున్నారు. అప్పుడైనా హడావుడిగా నిర్ణయాలు ప్రకటించక కాస్త సమయం తీసుకుని ప్రశాంతంగా ఆలోచించండి. పిల్లల్ని కూడా అందుకు సిద్ధంచేయాల్సి ఉంటుంది.
సాధ్యమైనంత స్నేహంగా విడిపోవడానికి ప్రయత్నించండి. న్యాయస్థానాలదాకా వెళ్లి హోరాహోరీ పోరాడుకోవడం అనవసరం. ఎందుకంటే మనకు ఆ బంధం ముగిసినా పిల్లలకు అమ్మానాన్నా ఇద్దరూ కావాలి. మీ గొడవ వారికి పీడకల కాకూడదు.
భాగస్వామి పట్ల మీకెంత కోపం ఉన్నా పిల్లలతో దాన్ని పంచుకోవద్దు. వారు సుహృద్భావంతో కలుసుకుంటూండాలి.
హింసలాంటివేమీ లేనప్పుడు అసలు మీరెందుకు విడిపోయారో పిల్లలకు తెలియాల్సిన అవసరంలేదు. పెద్దయ్యాక వాళ్లే తెలుసుకుంటారు. ప్రపంచానికీ వివరణ ఇవ్వనక్కర్లేదు. మీ జీవితం మీ ఇష్టం.
తల్లిదండ్రులకు, సన్నిహితులకు మాత్రం చెప్పండి. వాళ్ల సహకారం మీకు అవసరం.
భాగస్వామి... వివాహబంధం... ఇవేవీ లేకుండా కూడా జీవితం ఉంటుంది. ప్రశాంతంగా ఆ జీవితం గడపడానికి ప్రయత్నించండి. పిల్లలకూ మంచి జీవితాన్ని ఇవ్వండి

డా పూర్ణిమా నాగరాజ
సైకియాట్రిస్టు.

No comments: