'పరువు హత్య'ల పేరుతో సిగ్గుమాలిన, ఆటవికమైన హత్యలు తరచు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో సంభవిస్తున్నాయి. కులం కట్టుబాట్లకు, ఆచారాలకు విరుద్ధంగా పెళ్ళి చేసుకొన్నారన్న ఆరోపణతో యువజంటలను స్వయంగా వారి రక్తసంబంధీకులే పరమ కిరాతకంగా హతమార్చి, వాటిని 'పరువు హత్యలు'గా చిత్రించి, బహిరంగ సమర్థనకు బరితెగిస్తున్నారు. పంజాబ్, హర్యానా, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్ తదితర
రాష్ట్రాలలో 'కుల పంచాయితీ'లు అక్షరాలా సమాంతర న్యాయవ్యవస్థలుగా పనిచేస్తూ, ఇలాంటి అమానుష హత్యలకు ఆదేశాలు జారీ చేయడం పరిపాటిగా మారింది.
ఇటువంటి ఒక హత్యకేసులో న్యాయస్థానం దోషులకు మరణశిక్ష విధించడంతో, హర్యానాలో జాట్ కులస్థులకు చెందిన 'ఖాప్ మహాపంచాయత్' కురుక్షేత్రలో సమావేశమై ఆ తీర్పును సవాలు చేయాలని నిర్ణయించింది. అది న్యాయస్థానాల అధికారాన్ని ప్రశ్నించడమే కాదు, 'నెల రోజుల్లో' హిందూ వివాహ చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వానికి 'తాఖీదు' జారీ చేసింది. ఈ సమావేశంలో ప్రముఖ రైతు నాయకుడు
మహీందర్‌సింగ్ తికాయత్, కొందరు మాజీ పోలీస్, సైనికాధికారులు పాల్గొనడం ఈ రాజ్యాంగధిక్కారపు లోతుకూ, తీవ్రతకూ నిదర్శనం
ఒకే గోత్రానికి చెందినవారు(సగోత్రులు) పెళ్ళి చేసుకోరాదన్న నిబంధనను ఉల్లంఘించి 2007లో వివాహమాడిన మనోజ్, బబ్లీ అనే ప్రేమికులను ఖాప్ పంచాయితీ ఆదేశంపై రక్తబంధువులే హతమార్చారు. కోర్టు ఆదేశంపై వారికి పోలీసు రక్షణ కల్పించినప్పటికీ, హత్య జరిగిన రోజు రాత్రి వారు అదృశ్యమయ్యారని- న్యాయపోరాటం చేస్తున్న మనోజ్ తల్లి కథనం. ఇటువంటి పాశవిక హత్యలకు పోలీస్,
అధికారయంత్రాంగపు అండదండలు ఉంటాయనడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే.
రాజకీయ నాయకుల సంగతి ఇక చెప్పుకోనవసరమేలేదు. కర్నాల్‌లోని జిల్లా, సెషన్స్ కోర్టు ఈ కేసులో అయిదుగురికి మరణశిక్ష, ఒకరికి యావజ్జీవశిక్ష విధించింది. కొడుకును, కోడలిని కోల్పోయిన దుఃఖంతోపాటు, కుల పంచాయితీ విధించిన సామాజిక వెలిని గత మూడేళ్ళుగా అనుభవిస్తున్న మనోజ్ తల్లిది మరోరకం చావు. కుల పంచాయితీ 'మరణశాసనం' విధించడానికి సగోత్ర వివాహాలే కారణం కానవసరంలేదు.
కులాంతర వివాహం చేసుకున్నా, ఒకే గ్రామానికి చెందిన యువతీ యువకులు పెళ్ళిచేసుకున్నా అదే గతి. రవీందర్ కౌర్ అనే అమ్మాయి వేరే కులస్థుని ప్రేమించి పెళ్ళిచేసుకుందని, ఆమె కళ్ళముందే భర్తను ఆమె తండ్రి, మరో దగ్గరి బంధువు నరికి చంపేశారు.
హంతకులకు సెషన్స్ జడ్జి మరణశిక్ష విధిస్తే, హైకోర్టు దానిని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఎనిమిదేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు దానిని ధ్రువీకరించింది. మనోజ్, బబ్లీ కేసులో తీర్పు వెలువడిన రోజునే ప్రబ్‌జీత్ కౌర్, పర్‌దీప్ సింగ్ అనే జంటను బంధువులు కాల్చి చంపారు. పోలీసు 'రక్షణ' య«థావిధిగా ఇక్కడా వారిని కాపాడలేక పోయింది. ఇక తల్లిదండ్రులే ఇటువంటి సందర్భాలలో
ఆడపిల్లకు విషమిచ్చి చంపి, ఆత్మహత్యగా చిత్రించడమూ మామూలేనట. ఒక సర్వే ప్రకారం, ఏడాదికి వందకు పైగా ఇటువంటి 'పరువు' హత్యలు జరుగుతున్నాయి. పెద్దలకు ఇష్టంలేని ఏ పెళ్ళినైనాసరే శిక్షించడానికి 'పరువు' ఒక ముసుగుగా మారినా ఆశ్చర్యం లేదు.
సగోత్ర వివాహాలు మంచివి కావనీ, ఆచార విరుద్ధమైనవనీ అనుకొన్నప్పుడు దానిని ఇతరులకు బోధించే హక్కును, వ్యక్తిగతంగా పాటించే హక్కును ఎవరూ కాదనరు. కన్నబిడ్డలైనా సరే, ఆ కట్టుబాటును ఉల్లంఘించారని చెప్పి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారికి 'మరణశిక్ష' అమలు చేసే రాజ్యాంగాతీతమైన అధికారం ఎంత కొమ్ములు తిరిగిన కుల పంచాయితీలకైనా ఉండదు, ఉండ డానికి వీలులేదు. ఆచారాలు,
సంప్రదాయాల పేరుతో సమాంతర న్యాయ, పోలీస్ వ్యవస్థలను నడుపుకొనే అధికారాన్ని ప్రతి కుల పంచాయితీకీ అనుమతిస్తే, రాజ్యాంగం, చట్టాల ఉనికికే అర్థం ఉండదు. ఉత్తరాది రాష్ట్రాలలో కుల పంచాయితీల పేరుతో జరుగుతున్న ఈ రాజ్యాంగ బహిరంగ ధిక్కారాన్ని ప్రభుత్వాలు ఉపేక్షిస్తున్నాయి కనుకనే, అవి ఇలా పేట్రేగుతున్నాయి. ప్రభుత్వాలకే 'అల్టిమేటమ్' జారీ చేయగలుగుతున్నాయి.
కుల పంచాయితీలకు ఉన్న ఓటు బలం రాజకీయపక్షాల నోటికి తాళం బిగిస్తున్న సంగతీ సుస్పష్టం. కోర్టులలో కేసుల పరిష్కారంలో జరిగే అసాధారణ జాప్యం కూడా కుల పంచాయితీ ముసుగులో ఇలా పైశాచిక ప్రవృత్తుల వికట తాండవానికి పరోక్ష దోహదం అవుతోంది. కులస్వామ్యం కోరలకు చిక్కి వివిధ రూపాల్లో నిత్య నరకాన్ని ఎదుర్కొంటున్న అభాగ్యులు మరెందరో ఉంటారు. వారందరూ వార్తలలోకి రారు.
ఉత్తరప్రదేశ్‌లో బిజ్నోర్ అనే గ్రామంలో కుల పంచాయితీ తండ్రీ, కూతుళ్ళకు అక్రమ సంబంధం అంటగడితే తీవ్ర మనక్షోభకు గురైన ఆ ఇద్దరూ కులపంచాయితీ సభ్యులిద్దరినీ కాల్చి చంపినట్టు వార్త.
ఖాప్ మహాపంచాయత్‌లో పాల్గొన్న వారిలో పలువురు ప్రముఖులు, విద్యావంతులు ఉండడం, సామాజిక జీవితమూ, నైతిక మర్యాదలూ చట్టపరమైన అంశాలు కావని, కుల పెద్దలు తేల్చవలసిన కుటుంబవిషయాలని, కులగౌరవం చట్టంకన్నా గొప్పదని అపరిణత వ్యాఖ్యలు చేయడం మధ్యయుగాల మౌఢ్యాన్ని భయానకంగా ప్రదర్శిస్తున్నాయి. 'పరువు'హంతకులకు సముచిత శిక్షపడే విధంగా, ప్రత్యేక నేరంగా వర్గీకరిస్తూ భారత
శిక్షాస్మృతిని సవరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దానితోపాటు కుల పంచాయితీలపై ఉక్కుపాదం మోపడం అవసరం. అప్పుడే ప్రభుత్వం ఉనికికి అర్థం, పరమార్థం.--సాక్షి సంపాదకీయం 18.4.2010