welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Saturday, January 14, 2012

తెల్లవార వచ్చె తెలియక నా సామి

ప్రతిరోజు తెల్లవారుతుంది. తెల్లవారుట గురించి రెండు మాటలు, కాదు రెండు పాటలనుండి కొన్ని మాటలు.
ప్రతిరోజు తల్లులు పిల్లల్ని నిద్ర లేపుతుంటారు. సినిమా సన్నివేశమేమో కాని, యశోద తన బాలకృష్ణున్ని నిద్ర లేపుతున్నట్టుగా రాసిన పాటలో తెలుగు నుడికారాన్ని, తల్లి మమకారాన్ని మేళవించి అందించారు మల్లది రామకృష్ణశాస్త్రిగారు. కృష్ణుడు చిన్నవాడు. పాట చిన్నది. పదాలు చిన్నవి. చిన్న వాటితోనే మరి సొగసంతా. లీల గళంలో ఇంకొంత రమణీయత సంతరించుకుంది.

------------------------------
మల్లాది వారి రచన ("చిరంజీవులు" సినిమాలో)-
"తెల్లవార వచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింక లేరా
కలకలమని పక్షి గణములు చెదిరేను
 కల్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయె
దైవరాయ నిదుర లేరా
నల్లనయ్య రారా నను కన్నవాడా
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా"
------------------------------
  అందరికీ తెలిసే వచ్చే తెల్లవారడాన్ని తెలియకుండా వచ్చేసిందని చెప్పడం,
 నిద్ర లేపడం, అంతే కాదు, ఎక్కడ పిల్లవాడు మళ్ళీ పడుకుంటాడో అని "మళ్ళీ పరుండేవు"
 అని అనడం సహజత్వంతో కూడిన సొగసు. "కల్యాణ గుణధామ లేరా" అన్నప్పుడు
  "కౌసల్యా సుప్రజా రామా" అన్నది స్ఫురిస్తుంది. తల్లి పిల్లవాణ్ణి "నను కన్నవాడా, బుల్లితండ్రి" అనడం తెలుగులోనే ఉందో ఇంకే ఇతర భాషల్లో ఉందో తెలియదు.
 నిద్ర లేచి ఏం చెయ్యమంటావు? ఎందుకు లేవాలి? ఇవి ప్రతి పిల్లవాడి ప్రశ్నలే ప్రతిరోజు. మరి యశోద తల్లి చాతుర్యమంతా, ఈ నిద్ర లేవడం అంతా ఎందుకంటే
 "వెన్న తిందువుగాని రారా" అనడంలో ఉంది, కాదు యశోద చేత పలికించిన తీరులో ఉంది. "మన్ను తిన్నవాడిని" వెన్న తినడానికి లేవమంటే ఇంకెందుకు లేవడు? అన్న గడుసుతనం కూడా ఉంది, గోప్యంగా. ఉండదు మరి, లేపేది గోపెమ్మే కదా!

 తెల్లవారడం గురించి ఇటీవల అస్తమించిన మల్లెమాల గారి పాటలోని కొన్ని పదాలు
 గుర్తొస్తాయి, కాదు గుర్తుండేలా రాసారు.
 "వెలుగు దుస్తులేసుకొని సూరీడు,
  తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు,
  పాడు చీకటికెంత భయమేసిందో,
   పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది" (మల్లెమాల "ముత్యాల ముగ్గు" పాటలో)
 సామాన్యంగా చీకటి అంటే భయపడతారు. అట్లా కాదట! వెలుగు దుస్తులేసుకున్న సూరీడును చూసి అందరు భయపడే చీకటికే భయమేసి పరుగు తీసింది అనడం చమత్కారం.

 తెలిసిన తెల్లవారుటను సరికొత్తగా చూపించి, అందంగా అందించి, ఆనందింపజేయడం, చదివిన వేళ ఎప్పుడైనా తెల్లవారినట్టుగా అనిపించడం సాధించారేమో అనిపిస్తుంది.
============
విధేయుడు
_శ్రీనివాస్

1 comment:

మాలా కుమార్ said...

మంచి పాట గురించి చెప్పారు . థాంక్ యు .
సంక్రాంతి శుభాకాంక్షలు .