welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Wednesday, March 31, 2010

అనాథలకు 'అమ్మా నాన్న'

 
అనాథలకు 'అమ్మా నాన్న'..!


చౌటుప్పల్‌, న్యూస్‌లైన్‌: మాసిపోయిన బట్టలతో, పెరిగిపోయిన జుట్టుతో, దుర్వాసన వెదజల్లుతూ, ఒంటిపై బట్టలు లేకుండా, ఆకలి ఆకలి అంటూ పెంటకుప్పలపై పారేసిన విస్తర్లలో దొరికినది తింటూ మతిస్థిమితం లేని వాళ్లు చౌటుప్పల్‌ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎక్కడబడితే అక్కడ కనిపించే వారు. అయితే 25 రోజులుగా వారు కని పించడం లేదు. వారంతా ఏమై పోయారో, ఎక్కడికి వెళ్లారో
తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ కథ చదవండి...

ఆ యువకుని వయస్సు అప్పుడు ఆరేళ్ల్లు. ఒకటో తరగతి చదువుతున్నాడు. ఐదో తరగతి చదువుతున్న అతని అన్న మతిస్థిమితం కోల్పోయి రోడ్లపై తిరుగుతుండేవాడు. రోడ్లపైనే తిరుగుతూ ఎక్కడబడితే అక్కడ దొరికింది తినే వాడు. చివరకు రామోజీ ఫిలింసిటీ దగ్గర ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో కాలు విరిగింది. ఇంటికి తీసుకువచ్చారు. ఏడాది పాటు గాయంతో కుంగి, కృశించి మృత్యువు పాలయ్యాడు. తన
అన్న ఏడేళ్లు అనుభవించిన నరకాన్ని కళ్లారా చూశాడు. అప్పటి నుంచి ఆ యువకుని మనస్సులో రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వాళ్లను చేరదీయాలనే ఆలోచన బలంగా నాటుకుపోయింది. వెంటనే వారిని ఆదుకునేందుకు నడుం కట్టాడు. అతడే సంస్థాన్‌ నారాయణపురానికి చెందిన గట్టు శంకర్‌.

అతని వయస్సు ప్రస్తుతం 30 ఏళ్లు. గ్రామంలో ఆరో తరగతి వరకు చదివి, ఆర్థిక పరిస్థితి బాగాలేకపోవడంతో తన తండ్రి వెంట 1993లో ముంబైకి వెళ్లాడు. జిల్లా నుంచి ముంబైకి వెళ్లే బస్సులను శుభ్రం చేసే పనికి కుదిరాడు. అనంతరం టికెట్ల బుకింగ్‌ కోసం ట్రావెల్‌ ఏజెన్సీని ఏర్పాటు చేశాడు. 2007లో తిరిగి వచ్చి చౌటుప్పల్‌లో శంకర్‌ ఏజెన్సీ పేర టీవీ షోరూం ఏర్పాటు చేశాడు. దానిద్వారా వచ్చిన
ఆదాయంలో 75శాతం అనాధల సేవకు వెచ్చిస్తున్నాడు.

చిన్ననాటి ఆశయ సాధనకు..
రోడ్లపై తిరిగే మతిభ్రమించిన వారిని చూడగానే అతని మనస్సు చలించిపోయేది. వారి కోసం ఏదో చేయాలనే చిన్ననాటి ఆశయం అతని మదిలో మెదలాడుతూనే ఉంది. చేతిలో కొద్దిపాటి డబ్బు ఉంది కదా అని చిన్న ఆలోచన చేశాడు. వలిగొండ రోడ్డులో బాలాజీ దేవాలయం పక్కన ఎందుకూ వాడని షెడ్డు ఉంది.

దానిలో ఐదారు గదులున్నాయి. వెంటనే ఆ షెడ్డు యజమాని చంద్రశేఖర్‌ను కలిసి, తన ఆశయాన్ని, ఆలోచనను వివరించాడు. దీంతో షెడ్డు యజమాని దానిని ఏడాది పాటు ఉచితంగా ఉపయోగించుకునేందుకు హామీ ఇచ్చాడు. దీంతో 2010 ఫిబ్రవరి ఒకటిన ఆ షెడ్డులో అమ్మా..నాన్న అనాధ ఆశ్రమాన్ని ఏర్పాటు చేశాడు. ఆశ్రమ నిర్వహణకు 10 మందిని నియమించాడు.

రోడ్లపై తిరిగే వాళ్లను తీసుకొచ్చి..
రోడ్లపై తిరిగే మతిస్థిమితం లేని వాళ్లను చేరదీస్తూ, ఆశ్రమం వద్దకు తీసుకెళ్తున్నారు. మాసిన బట్టలు, పెరిగిన క్షవరాలు, దుర్వాసన వెదజల్లుతున్నా తడుముకోకుండా వారికి సపర్యలు చేస్తున్నారు సంస్థ నిర్వాహకులు.

వారికి క్షవరాలు చేయించి, ప్రతి రోజూ ఉతికిన బట్టలు వేస్తున్నారు. ప్రతిరోజు స్నానం, మూడు పూటలా భోజనాన్ని అందిస్తున్నారు. గడిచిన 20 రోజుల కాలంలో ఈ మతిస్థిమితం లేని వారి జీవితాల్లో మార్పు కన్పిస్తుందంటే అతిశయోక్తి లేదు. పిల్లలున్నా చూడని తల్లిదండ్రులు, ఏ దిక్కూ లేని వృద్ధులు అందరూ కలిసి దాదాపు 20 మంది ప్రస్తుతం ఈ ఆశ్రమంలో ఉన్నారు.సాక్షి 26.2.2010

No comments: