welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Sunday, February 21, 2010

విచ్చల విడిగా ఖర్చు చేయడమేనా జీవిత పరమార్థం?

ఆస్ట్రియాలో అభినవ బుద్ధుడు
కోరికలు దుఃఖానికి హే తువని గౌతమ బుద్ధుడు ప్రవచిస్తే, సంపదలే విషాదానికి కారణమని ఎలుగెత్తి చాటుతున్నాడు అభినవ బుద్ధుడు!
ఆస్తిపాస్తులన్నీ పేదల ఉద్ధరణకే అర్పించి సామాన్యునిలా జీవిస్తున్న కుబేరుడు
గాంధీజీ 'ధర్మకర్తృత్వ' సిద్ధాంతాన్ని ఆచరించి చూపిన ఏకైక వ్యక్తి

లండన్‌: కోరికలు దుఃఖానికి హే తువని గౌతమ బుద్ధుడు ప్రవచిస్తే, సంపదలే విషాదానికి కారణమని ఎలుగెత్తి చాటుతున్నాడు అభినవ బుద్ధుడు! నాటి గౌతముడు రాజభోగాలను త్యజించినట్టే, నేటి కార్ల్‌ రాబేదర్‌ సంపదలన్నీ పేదలకే అర్పించి, కుటీరంలో తలదాచుకుంటున్నాడు. 'డబ్బు ఆనందానికి అడ్డంకి. అన్నీ పోవాల్సిందే....అన్నీ....అన్నీ' అంటూ, సర్వం పేదలకు అర్పించేసాడు, ఆస్ట్రియా సంపన్నుడు
రాబేదర్‌. ఆల్ప్స్‌ పర్వతాల్లోని అత్యంత విలాసవంతమైన అద్భుత హర్మ్యాన్ని, సువిశాలమైన సుందరమైన ఫార్మ్‌ హౌస్‌ని, అధునాతన మైన ఆడి ఏ-8 కారును అమ్మకానికి పెట్టేసాడు. ఇంటీరియర్‌ డెకరేషన్లు, ఫర్నిచర్‌, ఫ్లవర్‌వాజ్‌లు, వాటిలోని కృత్రిమ పుష్పాలను సైతం అమ్మేశాడు. గ్లైడింగ్‌ అంటే మహా ఇష్టమైనా, గ్లైడర్‌లను కూడా ఉంచుకోలేదు. అన్నీ వదిలాక, 'అమ్మయ్య ఇప్పటికి నా గుండె
బరువు తీరింది' అని సంతృప్తి వ్యక్తం చేశాడు!

ఫైవ్‌స్టార్‌ హోటల్లో జ్ఞానోదయం
ఇన్స్‌బ్రక్‌ కొండలలో అడవుల మధ్యన ఓ చిన్న కుటీరంలోనో, లేక ఓ చిన్న అపార్ట్‌మెంట్‌ గదిలోనో శేష జీవితాన్ని గడిపేయాలని కోరుకుంటున్న రాబేదర్‌, జీవితమంటే విరక్తి కలిగిన వృద్ధుడూ కాడు, ముక్కు మూసుకుని తపస్సు చేసుకోవాలనీ కోరుకోవడమూ లేదు. అర్థవంతమైన, నిజమైన జీవితం కోసం తపిస్తున్నాడు. సంపాదనకోసం పరుగులు తీస్తూ, విచ్చలవిడి గా ఖర్చుచేస్తూ నలభై ఏడేళ్లకే విసిగి
వేసారి పోయాడు. అలా అని రాబేదర్‌, బుద్ధునిలా ఆగర్భ శ్రీమంతుడు కాడు. పేదరికంలో పుట్టి, శ్రమించి పైకొచ్చిన వాడు. వస్తు వినియోగ వ్యసనానికి బానిసగామారి, విచ్చల విడిగా ఖర్చు చేయడమేనా జీవిత పరమార్థం? అనే ప్రశ్న నీడై వెన్నాడగా 'సిద్ధార్థుడ'య్యాడు. అది కూడా... విందు విలాసాల్లో మునిగి తేలుతుండగా!

కులాసాగా గడపడంకోసం హవాయి దీవులకు వెళ్లిన రాబేదర్‌, మూడు వారాల్లో ఎంత డబ్బు తగలేయడానికి వీలవుతుందో అంతా తగలేశాడు. అంతలోనే.... తన చుట్టూ ఉన్న అతి«థులు, నౌకర్లూ చాకర్లూ, అందరూ... తాను కూడా, అంతా నటులమేనని, నిజం మనుషులం కామని తోచింది. నటనతో నిండిన ఆ జీవితానికి అర్థమే లేదని అనిపించింది. రాబేదర్‌, అంతకు ముందు దక్షిణ, మధ్య అమెరికా దేశాలలోని పేదరికాన్ని, దైన్యాన్ని చూసి
కలత చెందాడు. అదంతా ఇప్పుడు, ఆ ఫైవ్‌స్టార్‌ హోటల్‌లో తిరిగి కళ్ల ముందు మెదలాడింది. ఇబ్బందిగా ఫీలై.. ఫీలై...చివరికి విషాదమూర్తి అయ్యాడు. రాబేదర్‌, కార్ల్‌ మార్క్స్‌ను చదువుకున్నాడో లేదో తెలీదు. తన సంపదలకు, అక్కడి పేదరికానికి ఏదో సంబంధం ఉందని అనిపించసాగింది. అంతే, సర్వ సంపదల పరిత్యాగానికి సిద్ధమయ్యాడు.

నిజమైన గాంధేయవాది
ఒక ధార్మిక సంస్థను ఏర్పాటు చేశాడు. తన సర్వస్వాన్ని, (23 కోట్ల రూపాయలకు పైగా విలువ చేసే ఆస్తులను) ఆ సంస్థ పరం చేశాడు. అది, లాభాపేక్షలేని ఒక మైక్రోఫైనాన్స్‌ సంస్థను నడుపుతోంది. ఎల్‌సాల్వడార్‌, హాండ్యురాస్‌, బొలీవియా, పెరు, అర్జెంటినా, చిలీ దేశాలలో పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి కృషి చేస్తుంది. స్వయం ఉపాధి పథకాలను చేపడుతుంది. రాబేదర్‌, ఆ సంస్థలో జీతం భత్యంలేని
ఉద్యోగి! 'సంపన్నులు, ప్రజల ఆస్తులకు ధర్మకర్తలు మాత్ర మే' అన్న గాంధీజీ సూక్తిని ఆచరించిన వారు బహుశా ఈ ప్రపంచంలో ఎవరూ లేరు.....ఒక్క రాబేదర్‌ తప్ప. 'ది డైలీ టెలిగ్రాఫ్‌'తో మాట్లాడుతూ రాబేదర్‌ అన్న మాటలు, ఈ అభినవ బుద్ధుని వ్యక్తిత్వానికి అద్దం పడతాయి....'ఎవరికైనాగాని సందేశాన్ని ఇచ్చే హక్కు నాకు లేదు. ఏదో నా అంతరాత్మ ఆదేశాన్ని అనుసరించి నడుచుకుంటున్నాను
అంతే!

No comments: