నా బిడ్డను చంపేయండి!
"ఈ బిడ్డతో ఇంక నావల్లగాదు. చంపేద్దామనుకున్నా. ఎలుకల మందు తెద్దామని పది రూపాయలు తీసుకుని మదనపల్లికి పోయినా. షాపు దగ్గరికి పోయినాక నావల్ల కాలా... తల్లినిగదా... నా వల్ల గాలా... దయగల తండ్రులారా... మీరన్నా... నా బిడ్డకీ నాకూ ఇంత విషమిచ్చి పుణ్యం కట్టుకోండి. బతుకు మీద ఆశలేదు మాకు....''
(ఆన్‌లైన్- మదనపల్లె) కదిలిస్తే ఆ తల్లి కన్నీటి వరదవుతుంది. మాటలూ దుఖమూ కలగలసి పోయి గొంతు పూడుకు పోతుంది. మాటి మాటికీ చేతులు జోడిస్తుంది. దీనంగా వేడుకుంటుంది. బిడ్డకింత విషమిచ్చి చంపేసి, తనూ చచ్చిపోవాలనుకుంటున్న ఆ అమ్మ పేరు లక్ష్మమ్మ. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం బొమ్మనచెరువు దండువారి పల్లె ఆమె ఊరు. జనార్ధన్ ఆమె కొడుకు. మెకానికల్ ఇంజనీర్. కటిక పేద
కుటుంబంలో పుట్టిన సరస్వతీపుత్రుడు. చదువు మీద బిడ్డ ప్రేమను చూసి లక్ష్మమ్మ దంపతులు మురిసిపోయారు. కాయకష్టం చేసిచదివించారు.
బంధువులూ ఆదుకున్నారు. బెంగళూరులో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం వచ్చింది. వీసా దొరికింది. ఆశల రెక్కలు విచ్చుకున్నాయి. అమ్మానాయనల స్వేదం తుడవాలనుకున్న ఆ కొడుకు పుట్టెడు దుఃఖమే మిగిల్చాడు. వీసా తీసుకుని బైకు మీద వస్తున్న జనార్దన్‌ను ఓ బస్సు ఢీకొట్టింది. నెత్తుటి ముద్దయ్యాడు. కోమాలోకి వెళ్ళిపోయాడు. ఆ తల్లిదండ్రులు లబోదిబోమన్నారు. అప్పు,
సప్పు చేసి వైద్యం చేయించారు. వాళ్ళ శక్తి చాలలేదు. తెలిసిన వాళ్ళంతా దయ తలిచారు. కార్పొరేట్ వైద్యం, ఖరీదైన వైద్యం ఆ పేద కుటుంబాన్ని వెక్కిరించింది.
ఒకరోజు.. రెండు రోజులు కాదు. రెండే ళ్ళు బెంగళూరు ఆసుపత్రుల్లోనే కాపురం. బిడ్డ ప్రాణాలు దక్కాయి గానీ, శరీరం స్వాధీనం తప్పింది. మతి భ్రమించింది. ముప్పయి నాలుగేళ్ళ వయస్సులో పసిబిడ్డగా మారిపోయాడు. నడవలేడు. కూర్చోలేడు, పెదవివిప్పి మాట్లాడలేడు. బిత్తరచూపులు... వంకర్లు తిరిగిపోయే ముఖం, కాళ్ళు చేతులు. బిడ్డ బాగవుతాడనే ఆశతో బెంగళూరులో మరికొంత కాలం ఉండాలనుకున్నారు.
అద్దెకి ఇల్లు కూడా ఎవరూ ఇవ్వలేదు. కడుపు రగిలి పోయింది. దేవుడి మీద భారం వేసి పల్లెకి తీసుకొచ్చేశారు. కన్నబిడ్డ స్థితిని చూసి తట్టుకోలేక తండ్రి గుండె ఆగి మరణించాడు. మగబిడ్డ ఉన్నా లక్ష్మమ్మ ఒంటరిదైంది. బతుకుతో పోరాటానికి సిద్ధమైంది.
పాలు కొని పెరుగు చేసి ఇల్లిల్లూ తిరిగి అమ్ముతుంది. ఎంత పెరుగు అమ్మితే, ఎంత వస్తుంది? కడుపు నిండని సంపాదన. "ఒక్కో తూరి మూడు దినాలు గూడా తిననయ్యా. నా బిడ్డకి కడుపునిండా పెడితే చాలు. పెట్టడానికి నా దగ్గరేముంది? ఆకలికి వాడు వేళ్ళు కొరుక్కుంటాడు. గుడ్డలు కొరుక్కుతినేస్తాడు. నేను దగ్గరగా బోతే నా గుడ్డలు కూడా కొరికి తినేస్తాడు'' అని పొగిలి పొగిలి ఏడుస్తుంది
లక్ష్మమ్మ. కొడుకుని లేపి కూర్చోబెట్టే శక్తి కూడా ఆ తల్లికి లేదు. ఇటీవల వచ్చిన చికున్‌గున్యా ఆమెను మరింత అసహాయను చేసింది. పక్కమీదే ఒంటికీ, దొడ్డికీ పొయ్యే ఆ బిడ్డ దగ్గరికి ఎంత జాలి ఉన్నా ఇరుగూ పొరుగూ అడుగు పెట్టరు. కావాలంటే నాలుగు ముద్దల అన్నం పెడతారు. ఆ ఆమ్మే తినిపించాలి.
ఒంట్లో శక్తినంతా కూడదీసుకుని లేపి కూర్చోబెడితే కాసేపు కూర్చోలేడు. మరో పక్కకి వాలిపోతాడు. పగలూ రాత్రి ఆ బిడ్డతో ఆమె కష్టం చూసే వాళ్ళ కడుపులో దేవుతుంది. దయతలచి అ«ధికారులు, రేషన్ బియ్యమూ, వికలాంగుల పింఛనూ ఇస్తున్నారు. ఎక్కడికి సరిపోతాయి అవి? బిడ్డతో వేగలేక, బతుకు లాగలేక చచ్చిపోవాలనుకుంటోంది లక్ష్మమ్మ. కన్న బిడ్డను చంపి, తనూ చచ్చి పోవాలనుకుంటోంది. "ఇంత
విషమివ్వండి స్వామీ'' అని వేడుకుంటోంది. అయినా దయగల ప్రపంచమిది ఆమెకు ఆశ రెపరెపలాడుతూనే ఉంది. ధర్మాత్ములుంటారు. తనకూ తన బిడ్డకు పిడికెడు మెతుకులు పెడతారనీ, తన బిడ్డకు వైద్యం చేయిస్తారనీ, ఆశపడుతోంది. ఆమె ఆశ నిజం కావాలని కోరుకుందాం.
Tuesday, November 03, 2009
నా బిడ్డను చంపేయండి!
Labels:
Shot Story
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment