welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Saturday, February 07, 2009

తెలంగాణా రాజకీయోద్యమము - చరిత్ర .

తెలంగాణ టైమ్స్ | 02 జనవరి 2007 09:44 pm తెలంగాణా రాజకీయోద్యమము - చరిత్ర .
- రావి నారాయణరెడ్డి
తెలంగాణా రాజకీయోద్యమాన్ని ఒక చిన్న వ్యాసంలో పొందుపరచడం అంత సులభమైన విషయం కాదు. నేను స్వయంగా కొద్దిగానో, గొప్పగానో ఉద్యమంతో సంబంధం ఉన్నవారిలో ఒకనిగా నుండట చేతన, దానితో సన్నిహిత సంబంధముండుటచేతను, వ్యాసము వ్రాయునప్పుడు ఎన్నియో సంఘటనలు, వివరాలు జ్ఞాపకానికి రావడం, వాటినన్నిటిని పాఠకలోకానికి తెలియజేయ కుతూహలము కలగడము సహజము. అయినా అటువంటి కోర్కెను అణచిపెట్టుకొని, సాధ్యమైనంత క్లుప్తంగా ఈ వ్యాసములో తెలంగాణా రాజకీయోద్యమ చరిత్ర చిత్రించేందులకు ప్రయత్నించుతాను.

నేనీ వ్యాసాన్ని అనారోగ్య పరిస్థితియందు ఢిల్లీలో విశ్రాంతి దీసికొను సందర్భాన వ్రాస్తున్నాను. ఈ కారణంవల్ల ఉద్యమానికి సంబంధించి ఎలాంటి రికార్డు సహాయము లేకనే, నా జ్ఞాపకశక్తి పైన ఆధారపడియే వ్రాయవలసి వస్తున్నందులకు చింతిల్లుచున్నాను. అందుచేత ఈ వ్యాసానికి కొన్ని పరిమితులుండుట సహజము. విషయ సేకరణయందునూ, ముఖ్యంగా తేదీల విషయంలోను కొన్ని పారపాట్లు దొర్లితే పాఠక మహాశయులు క్షమించాలని కోరుచున్నాను. 1920-1930 1920 కంటె పూర్వము తెలంగాణా ప్రజాహిత ఉద్యమము దాదాపు లేదనే చెప్పవచ్చును. శ్రీకృష్ణదేవరాయ ఆంధ్ర భాషా నిలయములాంటి గ్రంథాలయాలు కొన్ని స్థాపించబడి పనిచేయుచున్నప్పటికి అవి వేరు వేరుగా పనిజేయుచున్న సంస్థలుగానే ఉండి పోయినవి. కాని ఉద్యమ స్వరూపము రాలేదు.

1920 ప్రాంతంలో భారతదేశ జాతీయోద్యమానికి గాంధీజీ నాయకత్వం వహించి, దానిని ప్రజా ఉద్యమంగా మార్చిన తర్వాతనే దాని ప్రభావము తెలంగాణాపైన పడి, విద్యావంతులలో దేశసేవాసక్తి కలుగజేసింది. నైజాం పరిపాలనలో హక్కులు సాధించుటకు ఉద్యమాలను ప్రారంభింప పూనుకున్నారు.

తెలంగాణా ఆ రోజుల్లో ఏవిధంగా పరిపాలించబడుతుండేదో తెలిసికోవడం అవసరము. ఇచ్చట కలితీలేని జాగీర్దారీ - జమీందారీ విధానము అమలులో ఉండేది. నైజాంరాజు బ్రిటీషు సామ్రాజ్యవాదుల తొత్తుగా నిరంకుశ పరిపాలన సాగించుచుండే వాడు. చట్టాలకు అనుకూలమైనట్టియు, వ్యతిరేకమైనట్టియు జాగీర్దారీ - జమీందారీ దోపిడీ విధానము విపరీతంగా సాగుతుండేది. రాజకీయంగా ప్రజలకు హక్కులు లేవు. పౌరసత్వాలు శూన్యం. సభలు జేసుకోవాలంటే దరఖాస్తు బెట్టికొని నెలల తరబడి పైరవీ చేసుకోవలసి వచ్చేది. తెలుగు భాష అణచివేయబడి ప్రాథమిక తరగతి నుండి గూడా ఉర్దూభాషలోనే విద్యార్థులు విద్య నభ్యసించ వలసి వుండేది. ఫ్యూడల్‌ విధానానికి సహజమైన మతపాక్షిక (Communal) తత్వం గూడా ప్రభుత్వం అమలు జరుపుతుండేది.

అయినా తెలంగాణాలోని వివిధ ప్రాంతాలలో గ్రంథాలయాలు పఠనాలయాలు, వర్తక సంఘాలు, కొన్ని రైతు సంఘాలు, కుల సంస్థలు మొదలగునవి వాటంతటవే ఆరంభింపబడి పనిచేయడం ఆరంభించినవి. ఆంధ్రులకు జెందిన ఈ సంస్థలను ఏకముఖానికి దెచ్చి ఒక కేంద్ర సంస్థను స్థాపించుటకు కృషి జరిగింది. ఈ కృషి ఫలితంగానే 1920లో 'నిజాంరాష్ట్రాంధ్ర కేంద్ర జన సంఘము' స్థాపించబడింది. ఈ కేంద్రీకరణ తెలంగాణాలో ఉండే సంస్థలనన్నిటిని ఒకే నిర్మాణం క్రిందికిదెచ్చి, వాటికొక ఉద్యమ స్వరూపాన్ని కలుగజేసింది. ప్రతి సంవత్సరం ప్రతినిధుల మహాజనసభ జరిగేది. ఈ మహాసభలో పైన పేర్కొనబడిన సంస్థలన్నియు, ఒక్కొక్క ప్రతినిధిని పంపించేవి. దేశాన్ని ఎదిరించుచున్న సమస్యలపై తీర్మానాలు జేయడం, ఎన్నికలు జరుపడం జరిగేది.

ఆంధ్రజన కేంద్ర సంఘ పక్షాన కొన్ని ఉపయోగకరమయిన లఘుపుస్తకాలు ప్రకటించి, తెలంగాణా ప్రజల చైతన్యాన్ని అభివృద్ధి జేయు ప్రయత్నం గావించబడింది. ప్రభుత్వోద్యోగులు వర్తకులపై జేసే అక్రమాలను అరికట్టుటకు, "వర్తక స్వాతంత్య్రం" అనేది, వెట్టిచాకిరికి వ్యతిరేకంగా "వెట్టిచాకిరి" అనేది హైదరాబాడు ప్రస్థాన జనపరిగణన రిపోర్టులో నుండి ఆంధ్రులకు సంబం ధించిన సంఖ్యలను తెలిపే దొకటి ముఖ్యంగా పేర్కొనదగిన లఘుపుస్తకాలు. ఈ లఘు పుస్తకాలలో ప్రభుత్వం పాలసీలపైన విమర్శ ఏమాత్రం లేక చట్టంలో ఉన్న విషయాలే వానిలో వ్రాయబడి, వానినే అమలు జరిపే ప్రయత్నం చేయబడింది. "వర్తక స్వాతంత్య్రం" అనే లఘు పుస్తకము వర్తకుల వద్ద నుండి సరకులు లాగుకుపోయ్యే పద్ధతిని అరికట్టుటకు కొంతవరకు ఉపయోగ పడింది.

అక్కడక్కడ గ్రామాలలో కొన్ని రైతు సంఘాలు స్థాపించబడినవి. కాని రైతు ఉద్యమానికి అవసరమయిన పరిస్థితులు ఆనాడు లేకుండుటచే అవేమి పనిజేయ చాలలేదు. సాంస్కృతికంగా, భాషా రీత్యా అణచబడిన తెలంగాణా ప్రజల్లో తెలుగు గ్రంథాలయాలు, పఠన మందిరాలు స్థాపించి, తెలుగు పత్రికలను ప్రకటించి, ఆంధ్ర చరిత్ర పరిశోధన జరిపించి తెలుగు ప్రజలలో ఆంధ్ర భాషపైన ఆసక్తి, వారి జాతీయ సాంస్కృ తిక వికాసానికి దోహదమివ్వడం జరిగింది. ముఖ్యంగా గ్రంథాలయోద్యమము బాగా వ్యాపించింది. తెలంగాణా వివిధ ప్రాంతాలలో సభలు, సమావేశాలు జరిపి ప్రజలలో చైతన్యం కలుగజేయ కృషి జరిగింది.

ఈ ఉద్యమానికంతటికి 'పద్మభూషణ' మాడపాటి హనుమంతరావు పంతులుగారు వెన్నెముక వంటివారు. ఆంధ్రోధ్యమాన్ని తెలంగాణాలో స్థాపించింది వారే. అభివృద్ధి జేసినవారిలో అగ్రగణ్యులు వారే. అందుకే వారికి 'ఆంధ్ర పితామహు'డనే పేరు వచ్చింది. వారితో ప్రస్తుతం భేదించేవారు గూడా, ఆ రోజుల్లో వారు జేసిన కృషిని ప్రశంసించకుండా ఉండలేరు.

ఈ దశలో ఆంధ్రోద్యమము, రాజకీయ ఉద్యమమూ, లేక రాజకీయేతర ఉద్యమమూ అనే సందేహానికి తావేలేదు. సామాన్యంగా ఉద్యమాలను రాజకీయాలనియు, రాజకీయేతరములనియు వేరు వేరుగా Water-tight Compartments లో చూడడము సరయిన పద్ధతిగాదు. అందులో నైజాం పరిపాలననాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ పరిస్థితులలో, వీటిని ఈ విధంగా విభజించడము పూర్తిగా అశాస్త్రీయమయిన విషయం. నాయకులీ ఉద్యమానికి రాజకీయాలతో సంబంధము లేదని, ఎంత ప్రకటించినప్పటికి, ఉద్యమాన్ని చట్టబద్ధంగా నడుపుటకు ఎంత కృషిచేసినప్పటికి, ఈ దశలో ఆంధ్రోద్యమానికుండే రాజకీయ ప్రాముఖ్యతను ఎవరూ విస్మరించజాలరు. నలు దిశలలలో అంధకారము వ్యాపించియున్న ఆ రోజుల్లో, ఎంత చిన్నదయినప్పటికీ, ఆంధ్రోద్యమము ఒక జ్యోతిగా వెలిగి మార్గము జూపించింది అనే విషయమంలో సందేహమే మాత్రం లేదు. అటు పిదప అభివృద్ధిజెందిన విశాల ప్రజా ఉద్యమాలకీ దశాబ్దమునందు జరిగిన కృషి పునాదిగా పనిచేసింది.

1930-1938 భారతదేశమునందు సామ్రాజ్యవాదవ్యతిరేకోద్యమము అభివృద్ధిజెంది, వ్యాపించింది. లాహోరు కాంగ్రెసు సంపూర్ణ స్వాతంత్య్ర సాధన కొరకు నిర్ణయంజేసి, శాసనోల్లంఘనము 1930 ప్రథమ భాగములో ఆరంభించింది. ఇది ఒక బ్రహ్మాండమైన ప్రజా ఉద్య మంగా అభివృద్ధి జెంది, బ్రిటిషు సామ్రాజ్యవాదాన్ని చలింపజేసింది. కోట్లకొలది ప్రజలీ ఉద్యమంలో పాల్గొన్నారు. లక్షలు నిర్భంధ విధానినికి గురయ్యారు. వేలు జైళ్ళకు వెళ్లారు. ఎందరో ఆహుతి అయ్యారు. భారత ప్రజల సామ్రాజ్యవాద వ్యతిరేక చైతన్యం ఉబికింది. తెలంగాణా మాత్రమెలా వేరే ఉండజాలుతుంది? తెలంగాణాలో గూడా యెందరో యువకులు శాసనోల్లంఘనమునందు పాల్గొనుటకు ఉత్సాహితులయ్యారు. కాని భారత జాతీయ నాయకులు సంస్థానాలలో ఉద్యమాన్ని నిషేధించుటవల్ల, హైదరాబాదు సంస్థానం నుంచి దాదాపు 150 మంది సత్యాగ్రహులు సంస్థానం బైటికివెళ్లి శాసనోల్లంఘనముజేసి జైలు శిక్షల ననుభవించారు. వీరిలో చాలా మంది తెలంగాణా వారు గూడా నుండిరి.

భారతదేశంలో కలిగిన చైతన్య ప్రభావం వల్లనే తెలంగాణాలో ఆంధ్రోద్యమము బలపడింది. భారతదేశములో ప్రతి సంవ త్సరము కాంగ్రెసు మహాసభ జరిగిన విధంగానే తెలంగాణాలో గూడా 'ఆంధ్ర మహాసభ' పేరుతో ఒకసభ జరపవలెననే అభిలాష జనించింది. దీని ఫలితమే 1930వ సంవత్సరమున జోగిపేట (మెదకు జిల్లా)లో ప్రథమాంధ్ర మహాసభ కీ.శే.లగు శ్రీ సురవరము ప్రతాపరెడ్డిగారి అధ్యక్షతన, ద్వితీయాంధ్ర మహాసభ దేవరకొండలో (నల్లగొండ జిల్లా) శ్రీబూర్గుల రామక్రిష్ణారావుగారి అధ్యక్షతన జరిగినవి.

ఈ సందర్భమున ఆంధ్రోద్యమాన్ని నడుపుటకు బాధ్యత వహించే నాయకుల గురించి ఒక మాట చెప్పవలసి యున్నది. వీరచ్ఛంగా మితవాదులు. వీరిలో చాలా మంది భూస్వామ్య కుటుంబాలకు జెందిన అభివృద్ధి నిరోధకులు. 1920 నుండి 1930 వరకు వీరు ఉద్యమాన్ని నడిపించిన విధానం ఎలాంటిదైనప్పటికీ 1930 ముందు, తర్వాత భారతదేశమునందు వచ్చి చారిత్రక సామ్రాజ్యవాద వ్యతిరేక వెల్లువ, దాని నుంచి తెలంగాణా ప్రజలు ఉత్సాహితులైనప్పటికి వీరిలోమాత్ర మేమాత్రము చలనము కలగులేదు. ఇంతకు పూర్వం ఏ 'జోహుకుం' పద్ధతిలో ఉద్యమాన్ని నడిపించారో అదే పద్ధతి కొనసాగించారు. మార్పేమి తీసురావ డానికి ప్రయత్నించలేదు. ఏమాత్రం వారి జీవితాలయందు త్యాగమూ, ధైర్యమూ చూపించుటకు సిద్ధపడలేదు. యువకుల్లో ఉత్సాహము, త్యాగశక్తి ఉన్నప్పటికీ ఒక ఉద్యమానికి బాధ్యత వహించి నడిపించే బాధ్యతాయుతమైన వైఖరియైనా, లేక యోగ్యత యైనా, లేకుండుటచే ఉద్యమాన్ని ప్రభావితం చేయలేకపోయారు.

ప్రథమ ద్వితీయాంధ్ర మహాసభలో వివిధ సమస్యలపై తీర్మానాలు చేయబడినవి. ఈ తీర్మానాలన్నీ ప్రభుత్వంతో మహాసభ జేయు 'ప్రార్థనల' స్వరూపం కలిగి ఉండినవి. వితంతు వివాహం, బాల్యవివాహ నిషేధచట్టం మొదలగు సాంఘిక సమస్యల గురించి రెండు మహాసభలలో తీవ్రమైన వాదోపవాదాలు జరిగి, వ్యవహారము వోటింగు వరకు గూడా వచ్చింది. కీ.శే. వామన్‌నాయక్‌ సాంఘిక విషయాలలో అభివృద్ధి నిరోధక అభిప్రాయాలు గలవారు. ప్రథమాంధ్ర మహాసభలో వారు పాల్గొని తమకుండే వ్యక్తిత్వ ప్రభావము వలన తమ అభిప్రాయాలను నెగ్గించుకున్నారు. ఈ విషయము తెలుసుకొని, కీ.శే. కేశవరావు గారు (ఆర్యసమాజము అధ్యక్షులు, హైకోర్టు న్యాయమూర్తి, సాంఘిక విషయాల్లో అభ్యుదయంగోరేవారు) ద్వితీయాంధ్ర మహాసభకు శ్రీ వామన్‌ నాయక్‌ గారికి పోటీగా హాజరయ్యారు. వీరిద్దరి నాయకత్వంలో సాంఘిక సమస్యలపై తీవ్రమైన వాదోపవాదాలు మహాసభలో జరిగి, వోటింగులో శ్రీ కేశవరావుగారి పక్షం నెగ్గింది. ద్వితీయాంధ్ర మహాసభలో యింకో విషయం గూడా జరిగింది. పౌరసత్వాలు ఇతర రాజకీయ సమస్యల గురించి మహారాష్ట్ర నాయకులు, నైజాం ప్రభుత్వాన్ని ఖండిస్తూ చాలా ఘాటైన ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ ఉపన్యాసాల ఫలితంగా ప్రభుత్వం కొల్లాపురంలో జరుప నిశ్చయించిన తృతీయాంధ్ర మహాసభకు అనుజ్ఞ నిరాకరించింది. దీనికి ప్రతీకారంగా ఆంధ్రనాయకులీ కార్యక్రమం గురించి ఆలోచించక దీర్ఘకాలము ప్రభుత్వంతో ఉత్తర ప్రత్యుత్తరాలు జరిపి అవమానకరమైన షరతుల కంగీకరించి తృతీయాంధ్ర మహాసభ ఖమ్మంమెట్టులో జరుపుటకు నిశ్చయించినారు.

తృతీయాంధ్ర మహాసభకు శ్రీ పులిజాల రంగారావుగారంధ్యక్షత వహించారు. ప్రభుత్వం రాజకీయ విషయాలతోపాటు సాంఘిక విషయాలు గూడా చర్చించగూడదను ఆంక్షపెట్టింది. సాంఘిక సమస్యలపై అభివృద్ధి నిరోధకంగా ఉండే ఛాందసులందరూ ప్రభుత్వ నిరంకుశత్వానికి తోడ్పడ్డారు. అధ్యక్షుని ఉపన్యాసము, మహాసభలో చదవకముందే కలెక్టరుగారి పర్యవేక్షణకై పంపవలసి వచ్చి, కలెక్టరుగారి ఎర్ర పెన్సిలుకు గురయింది. విషయ నిర్ణయ సభలో అధ్యక్షత వహించుచున్న అధ్యక్షులవారికి కలెక్టరు పిలుపు రాగానే, కార్యక్రమాన్ని ఆపి, కలెక్టరుగారి దర్శనార్థమై వెళ్ళిపోవలసి వచ్చింది. దీనివల్ల చాలా ఉత్సాహంతో వేలకొలది ప్రజలు సభకు వచ్చి ఆశాభంగము చెందారు.

ఆంధ్ర మహాసభ నాయకుల కీ సందర్భమున ఒక సమస్య ఎదుర్కొన్నది. "రాజకీయ సమస్యలు చర్చించగూడదు. సాంఘిక సమస్యలూ చర్చించగూడదు" అని ప్రభుత్వ నిషేధము. మరేమి చర్చించాలె? ఈ సమస్యకొక పరిష్కారమార్గము ఆలోచించారు. మహాసభలో రైతు సమస్యలపై తీర్మానాలే మహాసభ కార్యక్రమములో ప్రధాన స్థానము పొందినవి. బావుల క్రింద భూములకు మాగాణి భూములపై ఉండే అధిక పన్ను తగ్గాలనియు, జమాబందీలో రైతులకుండే యిబ్బందులు పోవాలనియు, జాగీర్లలో బందోబస్తు జరుగాలెననియు, యిత్యాది సమస్యలకు ప్రాముఖ్యత యివ్వబడింది. అంటే యింతకు పూర్వం మహాసభల్లో రైతు సమస్యలు రాలేదని కాదు. స్వల్పంగా చర్చించబడేవి గూడా. కాని తృతీయాంధ్ర మహాసభలో యివ్వబడ్డ ప్రాముఖ్యత ఎన్నడూ లేదు.

ఆంధ్ర మహాసభ నాయకులే ఉద్దేశముతో రైతాంగ సమస్యలను మహాసభలో ప్రవేశపెట్టినప్పటికి, ఆ సమస్యలు భూస్వాములకు, రైతాంగములోని పై తరగతులకు ఎక్కువ లాభము చేకూర్చేవైనప్పటికి, ఈ సంఘటనకుండే ప్రాముఖ్యతను తగ్గించి చూచే అవకాశము లేదు. తెలంగాణాలో అభివృద్ధి చెందిన రైతాంగ విప్లవోద్యమానికి, అవసరమయిన ప్రాతిపదిక (అది ఎంత స్వల్పమైనప్పటికి) ఇది కల్గించిందనియే చెప్పవలసి వస్తుంది. చతుర్థాంధ్ర మహాసభ సిరిసిల్ల (కరీంనగరము జిల్లా)లో శ్రీ మాడపాటి హనుమంతరావు పంతులుగారి అధ్యక్షతన, ఐదవ ఆంధ్ర మహాసభ షాదునగరంలో శ్రీ కొండా వెంకటరంగారెడ్డి గారి అధ్యక్షతన, ఆరవ ఆంధ్ర మహాసభ నిజాం ఆబాదులో శ్రీ మందుముల నర్సింగరావుగారి అధ్యక్షతన జరిగినవి. ఈ మహాసభలన్నియు యించుమించు ఒకే మాదిరిగా జరిగినవి. అవే రైతు సమస్యలపై తీర్మానాలు, అదే నాయకుల వైఖరి, అదే వాతావరణము అయినా భారతదేశమునందు అభివృద్ధిచెందుచున్న జాతీయోద్యమ ప్రభావం మాత్రం తెలంగాణా ప్రజలపై పడతునే ఉంది. దాని మూలంగా ప్రజా చైతన్యం అభివృద్ధిచెందుతునే ఉంది. సంవత్సరానికి సంవత్సరము ఎక్కువ సంఖ్యలో ప్రజలు మహాసభలో పాల్గొనసాగారు. పై మూడు మహాసభలలో "అభివృద్ధి పక్షము" వారు జేసిన పోరాటానికి మాత్రము కొంత ప్రాముఖ్యత వచ్చింది. దీనిని గురించి కొంత వ్రాయవలసి ఉన్నది.

అభివృద్ధి పక్షము
ఈ పక్షంవారు శుద్ధ భాషావాదులు, ఆంధ్ర మహాసభా చర్చలలో, సభాచర్యలలో, కవిలె రికార్డు మొదలగు విషయాలన్నిటి లోను తెలుగు తప్ప యింకే భాషను యేమాత్రము ఉపయోగించ కూడదని వీరి పట్టుదల. ఈ విధంగా వాదించేవారిలో చాల మంది విద్యా విజ్ఞానముగల యువకులు నాయకులుగా ఉండిరి. వీరి వాదన పూర్తిగా అనాచరణ యోగ్యమైనది. ఆంధ్ర మహాసభ చర్చలలో, చర్యలలో, రికార్డు మొదలగు విషయాలలో మొదటి నుండి తెలుగు తప్ప యితర భాష లేమాత్రము ఉపయోగించకూడదనుట అర్థరహితము. ఆచరణ రహితము. ఆంధ్ర మహాసభ నాయకుల మితవాద పాలసీలచే జనించిన అసంతృప్తి, నైజాం ప్రభుత్వం అవలంబించే ప్రజల మాతృభాషా వ్యతిరేక వైఖరిచే జనించిన ఆగ్రహం. యీ రెండు అభివృద్ధిపక్షం వారి పైన ఉదహరించబడిన వాదనకు కారణములై ఉండవచ్చును. కాని పై కార ణములను తొలగించుటకు వీరవలంబించిన వైఖరి ఏమాత్రం సమంజసమైనది కాదు. అందుచేతనే ఆరవ ఆంధ్ర మహాసభ వీరి వాదనను పూర్తిగా నిరాకరించింది. అటు తర్వాత మహసభలో సభ నియమావళిలో అవసరమైన మార్పులుజేసి, ఇలాంటి పారపాటు భాషావాదానికి పునాలు లేకుండా జేసినవి.
ఈ కాలమునందే బ్రిటిషు సామ్రాజ్యవాదులు మరొక కిస్తు సంస్కరణలను ప్రవేశపెట్టారు. ఈ సంస్కరణలద్వారా 'రాష్ట్రీయ స్వయం పరిపాలన' బ్రిటిషు రాష్ట్రాలకు లభించినది. 1936లో ఎన్నికలు జరిగి వివిధ రాష్ట్రాలలో కాంగ్రెసు ప్రభుత్వాలు స్థాపించబడినవి.

ఇది వివిధ సంస్థాన ప్రజలలో తీవ్రమైన సంచలనము కలుగజేసినది. కాశ్మీరు సంస్థానములోను, మైసూరు మొదలగు సంస్థానములలోను బాధ్యతాయుత ప్రభుత్వ స్థాపన కొరకై ప్రజా పోరాటలు ప్రజా సంచలనము, తహతహ ఆరంభమైనవి. వీటి ప్రభావము హైద్రాబాదు ప్రజలపై గూడపడినది. హైద్రాబాదులో బాధ్యతాయుత ప్రభుత్వము సాధించుట కొరకై స్టేట్‌ కాంగ్రెసు సంస్థను స్థాపించుటకు ప్రయత్నములను ప్రారంభమైనవి. హైద్రాబాదు ప్రభుత్వము గూడ యిదే సందర్భమున కొన్ని బూటకమైన సంస్కరణలను ప్రకటించినది. ఈ సంస్కరణలలో వుండే ప్రత్యేకత యేమంటే వీటి ననుసరించి స్థాపించబడే శాసనసభకు వృత్తి పూర్వకమైన ప్రాతినిధ్యం (Functional representation) యివ్వబడింది. శాసనసభ కొచ్చే సభ్యులు భూభాగ నియోజక వర్గముల (Territorial constituencies) నుండి ఎన్నుకోబడక, వృత్తి నియోజకవర్గముల ద్వారా ఎన్నుకోబడుదురు.

దీని ననుసరించి అత్యధిక సంఖ్యాకులైన, రైతు కూలి వర్గాలకు చాల తక్కువ ప్రాతినిధ్యమును అత్యల్ప సంఖ్యాకులయిన దోపిడి వర్గాలకు అత్యధిక ప్రాతినిధ్యం లభించినది. ఫ్యాసిస్టు దేశాలలోని రాజ్యాంగ చట్టములయందువుండే వృత్తి ప్రాతినిధ్యాన్ని నైజాము ప్రభుత్వం కూడ అనుకరించ ప్రయత్నించినది.

అందువల్ల హైదరాబాదు నగరమునందు వివిధ రాజకీయాభిప్రాయాలకు ప్రాతినిధ్యం వహించే ప్రతినిధుల సదస్సు జరిప ఏలాంటి సంస్కరణలను హైదరాబాదు సంస్థానమునందు ప్రవేశపెట్టవలెనో దీర్ఘ చర్చలు జరిగినవి. కాని ఏకాభిప్రాయము కుదరలేదు. ఇత్తేహాదుల్ముసల్మీన్‌ సంస్థ ప్రతినిధులు బహాద్దూర్‌ యార్జంగు నాయకత్వాన సంస్థానంలో నూటికి పన్నెండు (12%) ఉన్న ముస్లింలకు నూటికి 50 ప్రాతినిధ్యం కావాలని పట్టుబట్టిరి.. ఇదే సందర్భమున ఇత్తేహాదుల్‌ ముసల్మీన్‌ అధ్యక్షుడగు బహాద్దురు యార్జంగుగారికిని, ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు మందుముల నర్సింగరావుగారికిని దీర్ఘమయిన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి ఏకాభిప్రాయము కుదరక సంప్రదింపులు విఫలమయిపోయినవి.

సంప్రదింపులు విఫలమయిన తదుపరి ఇత్తేహాదుల్ముసల్మీన్‌ ప్రతినిధులు లేకుండానే సదస్సు కొనసాగింపబడింది. హైదరాబాదు సంస్థానము కొరకై సంస్కరణల స్వరూపము నిశ్చయించబడింది. ఈ సంస్కరణలు 1919లో బ్రిటిషు భారతదేశమున ప్రవేశెట్టబడిన మాంటేగు ఛెంసుఫోర్డు (Montague Chelmsford) సంస్కరణలను పోలియుండినవి. ద్వంద్వ ప్రభుత్వ విధానము (Diarchy) సూచింపబడింది. అంటే కొందరు మంత్రులు నైజాంచే నియమింపబడుదురు. కొందరు శాసన సభ్యుల నుండి ఎన్నుకోబడి, శాసన సభకు బాధ్యతాయుత ప్రభుత్వ వాంఛితులుగా నుండిరి గాబట్టి పై సంస్కరణలకు ప్రజాదరణము లభించలేదు. ప్రభుత్వమూ అంగీకరించలేదు. ఇక్కడ ఇత్తేహాదుల్ముసల్మీన్‌ సంస్థ గురించి చెప్పవలసి వుంది. 1927-28 ప్రాంతాన ఇది ఒక నిరపాయకరమయిన ముస్లిం, సాంస్కృతిక సంస్థగా ఆరంభమయింది. దాని నాయకులు సంస్థాన జాగీర్దార్ధలో నొకడగు కీ.శే. బహాదురు యార్జంగు గారు. రాను రాను ఈ సంస్థ ప్రత్యేక్షంగా రాజకీయాలలో పాల్గొనుట నారంభించినది. బహాద్దురు యార్జంగు మంచి వక్త. తన వాగ్ధాటిచే రాజకీయ చైతన్య రహితులయిన సంస్థాన ముస్లింలలో చాలా మందిని సమీకరించజాలాడు.. రాను రాను ఈ సంస్థ పచ్చి అభివృద్ధి నిరోధక సంస్థగా రూపొందింది. నైజాం సంస్థానము మస్లింల రాజ్యమనియు, ప్రతి ముస్లిం కూడా పరిపాలక జాతికి జెందిన వాడు కాబట్టి తనను రాజు (అసల్‌ మలిక్‌) గా భావించవలెననియు, ముస్లిం రాజ్యాన్ని కాపాడుటకు నడుం బిగించాలనియు, వీరి నినాదాలు. రాజకీయంగా ఈ సంస్థను పరిశీలించిన, ఈ సంస్థ నైజాం జాగీర్దారీ దోపిడీ విధానాన్ని రక్షించు ఉద్దేశం గలిగి, ఈ ఉద్దేశాన్ని సాధించుటకై రాజకీయ చైతన్యంలేని బీద ముస్లింలను తమ వాగ్ధాటి (Demogogy)తో మోసగించి సమీకరించి వారికెంతో నష్టము చేశారనేది స్పష్టము.

సంస్థానంలోని ముస్లింల సంఖ్యను రాజకీయోద్దేశముతో పెంచుటకు 1937వ సంవత్సరమున ఇత్తేహాదుల్ముసల్మీన్‌ సంస్థ మత పరివర్తన ఉద్యమము (తబ్లీగు) ఆరంభించింది. సంస్థానంలోని హరిజనులను వేల సంఖ్యలో, వారికి ఆర్థిక బానిసత్వం నుంచి విముక్తి కలిగిస్తామనియు, భూములిస్తామనియు, శుష్కవాగ్దానాలు జేసి ఇస్లాం మతములో జేర్చారు. కాని ఈ ఉద్యమము అట్టే ఎక్కువ కాలము బ్రతుకలేదు. సంస్థానం నందలి హిందూమత సంస్థలు, అభ్యుదయ రాజకీయ కార్యకర్తలందరు ఉద్యమాన్ని తీవ్రంగా ప్రతిఘటించారు. మతపరివర్తన ఉద్యమానికి ఓటమి కలిగింది. మతపరివర్తన జెందిన హరిజనులందరు తాము క్రొత్తగా స్వీకరించిన ఇస్లాం మతాన్ని పరిత్యజించారు. బహాద్దురు యార్జంగు మరణం తర్వాత కొంత కాలానికి ఈ సంస్థ అధ్యక్ష పదవి ఖాసీం రజ్వీకి లభించింది. ఖాసీం రజ్వీ నాయకత్వం క్రిందనే "రజాకారు" ఉద్యమం ఆరంభమైంది. రజాకారు అంటే వాలంటీరు అని అర్థం. ఇత్తేహాదుల్ముసల్మీన్‌ సంస్థకు జెందిన వాలంటీరు ఉద్యమమన్న మాట. పోలీసు ఆక్షన్‌తో ఈ సంస్థ, ఈ సంస్థకు జెందిన వాలంటీరు ఉద్యమము నామరూపాలు లేకుండా పోయినవి.
(తరువాయి భాగం ఫిబ్రవరి సంచికలో ) ("తెలంగాణం" రెండవ భాగం, దేశోద్ధారక గ్రంథమాల, 1956 సంపాదకులు: వట్టికోట ఆళ్వారుస్వామి )
__,_._,___

No comments: