welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, December 18, 2008

దుఃఖానికి ఆమడ దూరం?

దుఃఖానికి ఆమడ దూరం?
మారుతున్న ధోరణి
'నాగరికత' తెస్తున్న మార్పు
దిగమింగుకోవడం సరికాదు
సంతోషం ఒక్కటే కాదు.. ఎంత వద్దనుకున్నా మన జీవితాల్లో దుఃఖానిదీ పెద్ద పాత్రే. కట్టలు తెంచుకుని ఉబికివచ్చే దుఃఖాన్ని బయటకు వదిలేస్తే.. మనసు తేలిక పడుతుంది. గుండెబరువు దిగుతుంది. కానీ కాలంతో పాటే ఇప్పుడు 'దుఃఖం' తీరుతెన్నులూ మారిపోతున్నాయి. నేడు ఎంతో మంది ఆత్మీయులో, బంధువులో చనిపోయినప్పుడు కూడా ఏడ్వటం, కాస్త బిగ్గరగా దుఃఖించడాన్ని 'అనాగరికమైన' వ్యవహారంగా భావిస్తున్నారు.

ఆత్మీయతలు కొరవడుతుండడం, ఆర్థిక అసమానతలు, మనుషులు దూరందూరంగా జీవిస్తుండడం లాంటి అంశాలు నేటి తరాన్ని మానసికంగా బాగా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సహజంగానే దుఃఖం గాఢత తగ్గిపోతోంది. మరోవైపు ఏడ్వటాన్ని చిన్నతనంగా భావిస్తూ దుఃఖాన్ని లోలోపలే దాచుకుంటున్నవారి సంఖ్యా పెరుగుతోందనీ, ఇదంతా నాగరికత ఫలితమేననీ చెబుతున్నారు సామాజిక విశ్లేషకులు.

''మా తాతయ్య చనిపోయినప్పుడు నాన్నమ్మతో పాటు ఇంట్లో అందరం తల్చుకుని తల్చుకుని మరీ చాలా రోజులు ఏడ్చాం. దాన్ని ఆపుకోలేకపోయేవాళ్లం. చుట్టుపక్కల వాళ్లు కూడా దాన్ని సహజంగానే పరిగణించేవారు. ఇప్పుడా వాతావరణాన్ని ఊహించడం కూడా కష్టం. ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఎవరైనా చనిపోతే ఆ దుఃఖం, ఏడుపులు ఆ రోజుకే.. ఇంకా చెప్పాలంటే ఆ కొద్ది గంటలకే పరిమితవుతున్న ఉదాహరణలు ఎన్నో'' అని గతాన్నీ, వర్తమానాన్నీ విశ్లేషిస్తున్నారు 50 ఏళ్ల వీరాంజనేయులు. బాధను వ్యక్తీకరించే తీరులో కూడా కాలానుగుణంగా మార్పులు వస్తున్నాయని చెప్పటానికి ఆయన తరం అనుభవాలే సాక్ష్యం. ''ఇటీవల మా పిన్ని చనిపోయినప్పుడు ఆమె కూతుళ్లు మాట వరసకైనా ఏడ్వకపోవడం ఆశ్చర్యంగా అనిపించింది. నా ఉద్దేశం వాళ్లు ఏడ్వాలని కాదుగానీ వారిలో ఆ బాధ, భావన కనబడకపోవటం చిత్రమనిపించింది'' అని తన అనుభవాన్ని వివరించారు మహబూబ్‌నగర్‌కి చెందిన ఎస్.బుచ్చిరెడ్డి. ఆత్మీయులు పోయినప్పుడు ఎవరికైనా అప్రయత్నంగానే ఏడుపు ముంచుకొస్తుంది. ఒకప్పుడు ఆత్మీయులంతా కన్నీరుమున్నీరవుతున్న దృశ్యాలు ప్రతిచోటా కనబడేవి. కానీ, ఇప్పుడిలాంటి వాతావరణం కేవలం గ్రామాలకే పరిమితమవుతోంది. పట్టణాల్లోని ఇరుకిరుకు అపార్టుమెంట్ జీవితాల్లో 'సభ్యత' పెద్ద అడ్డుగోడగా నిలుస్తోందని బాధపడ్డారు హైదరాబాద్‌లో నివసించే శ్రీనివాసరావు. రోజురోజుకీ నగర జీవితాలు బిజీగా మారుతుండడం, రెక్కలు రాగానే దారులు వేరైపోతుండటం లాంటివి అనుబంధాలనూ, ఆత్మీయతలనే కాదు, దుఃఖాన్నీ పల్చన చేస్తున్నాయి.

''మొన్న మా మామయ్య చనిపోయారు. ఆయనకి సంతానం లేదుగానీ తన ఒక్కగానొక్క తమ్ముడిని ఆయనే పెంచి పెద్దచేసి ఉద్యోగం కూడా ఇప్పించారు. ఆయన పోయినప్పుడు చెన్నై నుంచి ఆ తమ్ముడు వచ్చాడుగానీ కంట చుక్క నీరు కూడా కనబడకపోవటం ఆశ్చర్యమనిపించింది'' అని వివరించారు నల్గొండ జిల్లాకు చెందిన కె.నర్సింహ. ఆత్మీయులతో ఉండే అనుబంధాలను, జ్ఞాపకాలను అంత తేలికగా తుడిచేసుకోవటం ఆయనకు ఎక్కడలేని విస్మయాన్ని కలిగించింది. ''ఒకప్పుడు అన్నదమ్ములు విడిపోయినా అంతా దగ్గరగానే ఉండేవారు. ఒకరి అవసరానికి ఒకరు తోడుగా నిలిచేవారు. అనుబంధాలూ సజీవంగా ఉండేవి. కాబట్టే, దగ్గరివాళ్లు పోయినప్పుడు సహజంగానే దుఃఖం వచ్చేది'' అని వివరిస్తున్నారు నెల్లూరుకు చెందిన జి.భవాని. బాబాయి చనిపోతే ఆమె ఇటీవలే తమ ఊరు వెళ్లివచ్చారు. ఉద్యోగరీత్యా మర్నాడే తిరిగి వచ్చేయాల్సి వచ్చింది. ''వస్తూనే నెత్తిన వెయ్యి పనులు. ఇక అందరితో కలిసి ఆ దుఃఖాన్ని పంచుకునేదిమాత్రం ఏముంటుంది'' అని ప్రశ్నిస్తున్నారామె. దూరంగా ఉండటం, బిజీ జీవితాలవల్లనే కాబోలు.. తాను వెంటనే రోజువారీ పనుల్లో మునిగిపోయానని చెబుతారామె.

నిజానికి ఒక్క మరణ సందర్భాల్లోనే కాదు.. మొత్తమ్మీదే దుఃఖం తగ్గిపోయిందంటున్నారు ఖమ్మం జిల్లా వాసి మాధవి. ''మా అమ్మాయి అత్తారింటికి వెళ్లేటప్పుడు నాకు ఏడుపొస్తుందిగానీ.. తను మాత్రం నిబ్బరంగానే ఉంటుంది. పైగా రోజూ ఫోన్లో మాట్లాడుకుంటూనే ఉంటాం కదా, ఆ మాత్రం దానికి ఏడుస్తావెందుకని నాకే ధైర్యం చెబుతుంది'' అంటారామె. అలాగని తన మనసులో బాధ లేదనుకోవటం లేదనీ, దాన్ని తను బయటకు వ్యక్తం చేయటం లేదంటారామె. ఇలా నేటి యవతరంలో మనసులోని భావాలను దాచుకోవటం, అణచిపెట్టుకోవటం పెరుగుతున్న మాట వాస్తవమేనంటూ ఇది విపరీతమైన ఫలితాలకు దారి తీస్తుందని సూచిస్తున్నారు క్లినికల్ సైకాలజిస్టు కె.నిరంజన్‌రెడ్డి. ''ప్రెషర్ కుక్కర్‌లో సేఫ్టీవాల్వ్ లాగానే... మనసులోని బాధని బయటకు పంపిచడానికి ఏడుపు కూడా ఒక మార్గంగా పనిచేస్తుంది. దీన్ని లోలోనే అణచుకుంటే నిద్ర సరిగా పట్టకపోవటం, దిగులు ఎక్కువ కావటం, ఆకలి తగ్గడం, బలహీనత, భయంకరమైన కలలు వంటివన్నీ మొదలవుతాయి'' అని ఆయన చెబుతున్నారు.

ఎవరైనా చనిపోయినప్పుడు కొన్నిరోజుల పాటు సంతాప దినాలుగా పాటించడం, అంతా ఊరడించటం తదితర సంప్రదాయాలన్నీ మనసులోని దుఃఖాన్ని పారదోలే ప్రయత్నాలే. వీటివల్ల దుఃఖంలో ఉన్నవారికి 'అందరూ తమ వెంటే ఉన్నారన్న' భావన కలుగుతుంది. ఒక రకంగా ఏడుపు కూడా 'సామాజిక భద్రత'లో భాగమే. అందుకే ఇది కొరవడటం సమాజానికే మంచిది కాదంటున్నారు విశ్లేషకులు. ఒకప్పుడు ఆత్మీయులు పోతే ఏడ్చేందుకు రాజులు అద్దె మనుషులను పెట్టుకునేవారు. రాజులమైన తాము ఏడవటమేంటని బింకాలు పోయేవారు. రాజులే పోయాక మనకెందుకీ డాంబికాలు 

5 comments:

Anonymous said...

good this artical

Anonymous said...

thanks

Anonymous said...

nice

Anonymous said...

nice

Anonymous said...

nice