నార్ల వెంకటేశ్వరరావు తెలుగునాట ప్రముఖ పాత్రికేయులు మరియు రచయిత. వీ.ఆర్.నార్ల గా కూడా వీరు ప్రసిద్ధులు.
ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి పత్రికలకు చాలా కాలం సంపాదకులుగా ఉన్నారు. పత్రికా రచనలే కాక వారు పలు నాటికలు, కవితలు మరియు కొన్ని కథలు రాసారు. ఆయన వివిధ దేశాల చరిత్రల రచన చేసినా, ఎందరో మహానుభావుల జీవితాలను చిత్రించి సామాన్య ప్రజానికి పరిచయం చేసినా - మరేది చేసినా జర్నలిజానికి ఎనలేని సేవ చేసారు.
హేతువాది గా, మానవతావాది గా జీవించారు. వేల సంఖ్యలో వైవిధ్యభరితమైన వ్యాసాలు రాసారు. నార్ల రచనలు అన్నీ కూర్చి ఇటీవలే "నార్ల రచనలు" పేరిట పలుభాగాలుగా వెలువరించారు నార్ల కుటుంబం వారు. వెంకటేశ్వరరావు ఏప్రిల్ 3, 1958 నుండి ఏప్రిల్ 2, 1970 వరకు రెండు పర్యాయములు రాజ్యసభ సభ్యునిగా పనిచేశాడు. ఈయన నార్ల వారి మాట అను శతకాన్ని కూడా రచించాడు.నార్ల వారి సొంత గ్రంధాలయంలో 20000 పుస్తకాలు ఉండేవట.
కవిగా, రచయితగా, నాటకకర్తగా, విమర్శకుడుగా, అనువాదకుడుగా, పాత్రికేయునిగా అనేకులకు నార్ల స్ఫూర్తి ప్రదాత. ఇంగ్లిష్‌లో ఆలోచించి తెలుగులో రాసే మూసలో కొట్టుకుపోతున్న పాత్రికేయాన్ని ప్రజల భాషకు చేరువ చేశారు. తెలుగు పత్రికా రచనకు కొత్త గౌరవాన్ని, మర్యాదను సమకూర్చారు. 'స్వరాజ్య', 'జనవాణి', 'ప్రజామిత్ర' పత్రికల్లో మెరుపులు మెరిపించి 'ఆంధ్రప్రభ', 'ఆంధ్రజ్యోతి' పత్రికల సంపాదక బాధ్యతలను చేపట్టి వాటిని తీర్చిదిద్దారు.ఎడిటర్‌గా పనిచేసిన ముప్ఫై మూడేళ్ల కాలంలో ఛాందస విశ్వాసాలతో రాజీలేని పోరు సాగించి,నిజంపట్ల నిబద్ధత, జనశ్రేయంపట్ల నిజాయతీ, వృత్తిపథంలో తిరుగులేని నిర్భీకతలను పాత్రికేయుడి ప్రధాన లక్షణాలుగా నార్ల విశ్వసించారు. సంపాదకీయాలను పత్రికకు ప్రాణదీపాలుగా మార్చడంతోపాటు, సామాజిక సంస్కరణకు వాహికలుగా వాటిని నార్లవారు ఉపయోగించారు. రాజగోపాలాచారిని కాంగ్రెస్ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకోవాలని 1946లో మహాత్ముడు నిర్ణయించినప్పుడు- దానికి నిరసనగా నార్ల పరంపరగా సంపాదకశస్త్రాలను ప్రయోగించారు.
అదేవిధంగా మహాత్ముడు చనిపోయినప్పుడు ఆయన రాసిన సంపాదకీయం ఆంధ్రదేశాన్ని పట్టి కుదిపింది. వేటూరి ప్రభాకరశాస్త్రి స్థాయి వ్యక్తి 'ఎవరు రాశారో తెలియదుగానీ వారికి సాష్టాంగ నమస్కారం' అన్నారు. ప్రజలకు అర్థమయ్యే జీవభాషలో సంపాదకీయాలను రాశారు. సంస్కృత భాషను విస్తృతంగా ప్రచారం చేస్తే తప్ప మన సంస్కృతి విస్తరించదన్న వాదనను ఆయన తుదికంటా వ్యతిరేకించారు. హేతువాదిగా నిలిచారు. సామాజిక పరిణామాలను భౌతికవాద దృష్టితో పరిశీలించడం నార్ల ప్రత్యేకత. జీవితాన్ని మానవతావాదిగా తరచిచూడటం ఆయన విశిష్టత. సమాజంలో తరాలుగా పాతుకుపోయిన అంధవిశ్వాసాలను, సంప్రదాయాలను ప్రశ్నిస్తూ నార్ల విరచించిన 'సీతజోస్యం' ఛాందసవాదులకు చెంపపెట్టులాంటిది. రామాయణాన్ని; రామ, రావణ యుద్ధాన్ని ఆయన ఆహారోత్పత్తి వ్యవస్థకు, ఆహార సేకరణ వ్యవస్థకు మధ్య సంఘర్షణగా వ్యాఖ్యానించారు. అగ్రకులాధిపత్యానికి, ఆధిపత్యభావజాలానికి సవాలు విసురుతూ ఆయన రాసిన 'శంభూక వధ' అట్టడుగువర్గాల తరఫున పూరించిన సమరశంఖమనే చెప్పాలి. బౌద్ధమతాన్ని మనస్ఫూర్తిగా నమ్మి ఆచరించి; స్వచ్ఛమైన హేతువాదిగా జీవించారు.తాను నమ్మిన విషయాన్ని శక్తిమంతంగా చెప్పడంలో నార్ల అద్వితీయుడు. ఆయన రచనలో సూటిదనం, గడుసుదనం, వ్యంగ్యం, చమత్కారం, లోకజ్ఞత, సమయజ్ఞత సమపాళ్ళలో ఉండేవి. నీళ్ళు నమలడం ఆయనకు చేతకాదు. మర్యాదలు పనికిరావు. ముక్కుమీద గుద్దినట్టు రాయడం ఆయన ప్రత్యేకత. 'బుద్ధి చెప్పువాడు గుద్దితేనేమయా' అన్న వేమన అభిప్రాయాన్ని అక్షరాలా అమలు చేసి పత్రికా రచయిత ఆయన.ఒకానొక సంపాదకుడి కోసం పత్రికను నెలకొల్పిన ఒకే ఒక సందర్భం 'ఆంధ్రజ్యోతి' ఆవిర్భావం. ' ఆంధ్రప్రభ' నుంచి వైదొలిగి సంపాదకత్వం వహించడానికి చేతిలో పత్రిక లేకుండా 'నిరుద్యోగి'గా ఉన్న నార్ల కోసం కొందరు ముఖ్యులు పూనుకొని పెట్టిన పత్రిక అది. గోరాశాస్త్రి మాటల్లో చెప్పాలంటే 'కేవలం సత్వగుణ ప్రధానంగా, అచ్చ తెలుగులో చప్పచప్పగా ఉన్న పత్రికా రచనలో వాడినీ, వేడినీ సృష్టించి, తెలుగు నుడికారంలో ఎంత 'కారం' ఉందో తెలియజెప్పినవాడు' నార్ల. 'కాగడా', 'జనవాణి'తో తాపీ ధర్మారావు ప్రారంభించిన వ్యావహారిక భాషా ఉద్యమాన్ని నార్ల 'ఆంధ్ర ప్రభ', 'ఆంధ్రజ్యోతి' ద్వారా సమర్థంగా కొనసాగించారు.తెలుగులో ఆలోచించి, తెలుగు నుడికారంలో తెలుగుదనం ఉట్టిపడేటట్టు రాయగలిగినప్పుడే తెలుగు వారిలో మనం కదలిక పుట్టించగలం' అని ఆయన తోటి జర్నలిస్టులకు ఉద్బోధించారు.
తెలుగు పట్ల ఇంతటి మమకారం లేకపోతే కోటంరాజు రామారావు, మానికొండ చలపతిరావు, కుందూరి ఈశ్వరదత్తు, ఖాసా సుబ్బారావులాగా నార్ల కూడా ఢిల్లీకో, లక్నోకో వెళ్ళి ఆంగ్ల పత్రికల సంపాదకుడిగా కీర్తి గడించేవారు.సంపాదకుడు అనే మాట ఉపయోగించేవారు కాదు. ఎడిటర్ అనే రాసుకునే వారు, పిలిపించుకునేవారు. ఎడిటర్ అనే ఇంగ్లీషు మాటకు సంపాదకుడు అనే తెలుగు అనువాదాన్ని ఆయన ఆమోదించలేదు. సంపాదకుడు అంటే ఏమిటో, సంపాదకుడి స్థానం ఏమిటో యాజమాన్యాలకూ, సమాజానికీ తెలియజెప్పడానికి ఆయన శత విధాలుగా ప్రయత్నించారు.ఎడిటరైనవాడు బిడియము చూపుచో ధాటి తగ్గు వృత్తి ధర్మమందు, కడుపుకూటి రాత కక్కుర్తి రాతరా' అంటూ తోటి రచయితలనూ, భావి సంపాదకులనూ హెచ్చరించిన యోధుడు నార్ల.'విరామమెరుగని రాక్షసుడు నార్ల' అని ప్రఖ్యాత సంపాదకుడు ఖాసా సుబ్బారావు అభివర్ణించారు.
నార్ల వారి మాటలు యొక్కలతో తెలుగుభాష డొక్క పొడవొద్దు.ఎంత గొప్పవాడైనా వస్తాడేకాని విచ్చేయడు.సంపాదకుడు అనొద్దు ఎడిటర్ అనండి.బడు వాడేవాడు బడుద్ధాయి.
No comments:
Post a Comment