welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Tuesday, June 10, 2008

తెలుగు వెలుగులెప్పుడు!

తెలుగు వెలుగులెప్పుడు!

'తెలుగుకు ప్రాచీనహోదా కావాలని రాష్ట్రప్రజలంతా ముక్తకంఠంతో కోరుకుంటున్నారు... కేంద్రప్రభుత్వమూ ఇందుకు సుముఖంగా ఉంది...'- పదకొండు నెలలక్రితం 'తానా' మహాసభలో కేంద్రమంత్రి పురందరేశ్వరి ప్రకటన పాఠమది.

ఇప్పటికీ ఒనగూడని ప్రాచీనహోదా ప్రతిపాదనపైనే దేశరాజధానిలో నేడు కీలకసమావేశం జరగబోతోంది. సాహిత్య అకాడమీ సారథ్యంలో కొలువుతీరనున్న సదస్సు- తెలుగు, కన్నడ భాషల పుట్టుపూర్వోత్తరాలకు సంబంధించిన చారిత్రక ఆధారాలు నిగ్గుతేల్చి హోంమంత్రిత్వశాఖకు సిఫార్సు చేయాల్సి ఉంది! తమిళానికి ప్రాచీనముద్ర వేయించుకోగలిగిన గౌరవ ప్రజాప్రతినిధులు మరేభాషకూ ఆ హోదా దక్కకుండా అడ్డుపడుతున్నారని కొన్నాళ్లుగా గగ్గోలుపుడుతోంది. తమిళ రాజకీయాన్ని అధిగమించి తెలుగు, కన్నడ భాషలు ప్రాచీనహోదాకు నోచుకుంటాయా లేదా అన్నదే ఇప్పుడు సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ. తెలుగుభాషకు ప్రాచీనహోదా సాధించి తీరతామని గడచిన ఆగస్టులో ముఖ్యమంత్రి వై.ఎస్. గంభీరంగా ఉద్ఘోషించారు. అందుకు గడువేమీ లేనేలేదని కేంద్రసర్కారు మూడు నెలలక్రితం తాపీగా సెలవిచ్చింది. ఆ తరవాతనైనా రాష్ట్రం తరఫున ప్రయత్నాలు ముమ్మరమయ్యాయా? లేదు! సానుకూల నిర్ణయం తీసుకోవాల్సిందిగా కేంద్రమంత్రిని వై.ఎస్. ఫోన్లో అభ్యర్థించినట్లు గుప్పుమంది. తమచేతుల్లో ఏమీ లేదన్నదే ఆయనకు లభించిన సమాధానం! అభ్యర్థనలతోనే సరిపుచ్చే రాష్ట్ర నాయకత్వమంటే, కేంద్రంలోని సొంతపార్టీ నేతలకు సైతం ఎంత లోకువో వేరే ఉదాహరణలెందుకు? 'మాతృభాషా తృణీకారం మాతృదేవీ తిరస్కార'మని ఒకప్పుడు గాంధీజీ చెప్పింది అక్షరసత్యం. తెలుగుకు ప్రాచీనహోదాకోసం అరకొర చర్యలు, ఏలికల నిబద్ధతారాహిత్యానికి ప్రబలదృష్టాంతం. జాతీయభాష కాగల హక్కు ఒక్క తెలుగుకే ఉందన్నది మహాకవి వాక్కు. ఇటీవల కేంద్రం వెలువరించిన నిర్ణయం దాన్ని వెక్కిరించింది. సంస్కృతం, తమిళాల్ని మాత్రమే ప్రాచీనభాషలుగా పరిగణించిన కేంద్రం, వాటి అభివృద్ధికి ప్రత్యేక నిధులు మంజూరుచేసి- తెలుగుపై హేతుబద్ధ విజ్ఞాపనల్ని పెడచెవిన పెట్టింది. ఈ సవతితల్లి ధోరణిని నిరసిస్తూ వచ్చే సంక్రాంతిలోగా తెలుగుకు ప్రాచీనహోదా ఇవ్వకపోతే సామూహిక నిరశన అనివార్యమని తిరుపతి భాషా బ్రహ్మోత్సవాలు గళమెత్తడం తెలిసిందే.

తెలుగు, తమిళ, కన్నడ భాషలు మూడింటా శతాబ్ది అటూ ఇటూగా సాహిత్యం ఆవిర్భవించిందని చారిత్రకాధారాలు తెలియజెబుతున్నాయి. హరప్పా నాగరికతలో తెలుగువారి ఉనికిని వివిధ పరిశోధనలు చాటుతున్నాయి. తెలుగుకు మూలాధారమంటున్న మధ్య ద్రవిడ భాషాపదాలు ఆఫ్రో ఆసియాటిక్ భాషల్లోను, బౌద్ధకాలంలోను దర్శనమిచ్చిన ఆధారాలున్నాయి. ప్రాచీనతలో తమిళానికి తెలుగు ఏ రకంగానూ తీసిపోదని కాళీపాండ్యన్ లాంటి పరిశోధకులు ఎన్నాళ్లుగానో మొత్తుకుంటున్నారు. తుంగభద్ర లోయలో దొరికిన కొన్ని శాసనాల్లోని భాష ఇప్పటి తెలుగుకు మూలమన్నది వారి వాదన. క్రీస్తుపూర్వం 500 సంవత్సరానికి చెందిన ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రసక్తి ఉందన్నా- ఆధారాల సేకరణలో మూడడుగులు ముందుకు, ఆరడుగులు వెనక్కి! భాషాభిమానానికి మారుపేరైన తమిళనాయకులు పట్టుపట్టి ప్రాచీనహోదా సంపాదించుకున్నారు. దేశంలోనే మొట్టమొదటి భాషాప్రయుక్త రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ నేతల్లో ఎక్కడా అలాంటి పట్టుదలే లేదు. తెలుగు విషయంలో రాష్ట్రమంత్రులతోపాటు తక్కిన అమాత్యులు మౌనప్రేక్షకపాత్ర పోషిస్తున్నారన్న యథార్థాన్ని రెండేళ్లక్రితమే కేంద్రమంత్రి ఒకరు కక్కేశారు. అగణిత సంస్కృతి, అపార వైభవం కలిగిన మన తెలుగుభాషకు సముచిత గౌరవం సముపార్జించే చిత్తశుద్ధి, నిబద్ధత కలిగిన నాయకులు అసలు ఎందరున్నారు మనకు?

అయిదు దశాబ్దాలక్రితం రాష్ట్ర శాసనసభాపతిగా అయ్యదేవర కాళేశ్వరరావు పాలన శాసననిర్మాణ విభాగాల్లో తెలుగు వాడకాన్ని పెంపొందించాలని ఎంతగానో తాపత్రయపడ్డారు. తక్కిన నాయకగణం కూడిరాని పర్యవసానంగా ఆయన కృషి ఎలా నీరుకారిపోయిందో రాష్ట్ర పౌరులు నిర్వేదంతో పరికించారు. ఆపై, నానాటికి తీసికట్టు నాగంభట్టు తంతు! తెలుగును అధికారభాషగా అమలుపరచాలన్నది 1966నాటి ఘనతర తీర్మానం. సర్కారీ వ్యవహారాలన్నీ తెలుగులోనే నిర్వహించాలన్నది 1971నాటి మహానిర్దేశం.

అవి కాగితాలకే పరిమితమై తెలుగునాట తెలుగుమాటే అపురూపమయ్యే దుర్భర దురవస్థ దాపురించడానికి ఇన్నేళ్ల నాయకుల నిర్లక్ష్యం, అసమర్థతలే ప్రధాన హేతువులు. 'మన జీతభత్యాలను ప్రజల డబ్బుతో పొందుతున్నందున, ప్రజల తెలుగుభాషనందు కార్యవ్యవహారాలు నిర్వహించడం మన ఉద్యోగధర్మం' తరహా అధికారిక సంకల్పాలెన్నో ఏట్లో కొట్టుకుపోయాయి. తెలుగు వికాసానికి, ప్రాచీనహోదా సాధనకు కంకణం కట్టుకున్నామన్న నేతల ఇబ్బడిముబ్బడి నాటకీయ ప్రకటనలు నీరుకారిపోతున్నాయి. తమిళ, కన్నడ, ఒరియా, మరాఠీ సోదరులు మాతృభాషా పరిరక్షణను మహోద్యమంగా మలచి వ్యూహాత్మకంగా ముందడుగేస్తున్నారు. కాలమాన పరిస్థితులకు అనుగుణంగా మాతృభాషను పరిపుష్టీకరించుకుంటేనే వ్యక్తి బహుముఖ వికాసం సుసాధ్యమని ఆకళించుకున్న దేశాలెన్నో సొంత మాధ్యమంలోనే భావితరాలకు చదువుసంధ్యలు నేర్పుతున్నాయి. ఇక్కడేమో ప్రాథమిక దశలోనే ఆంగ్లమాధ్యమాన్ని రుద్దేందుకు సర్కారు ఉరకలెత్తుతోంది. తెలుగునేలపై అత్యధిక విద్యార్థులకిప్పుడు మాధ్యమం ఆంగ్లం, ప్రథమభాష హిందీ, ద్వితీయభాష స్పెషల్ ఇంగ్లిష్! అవసరానుగుణంగా ఆంగ్ల వినియోగాన్ని ఆమోదిస్తూనే, పెచ్చరిల్లుతున్న అన్యభాషా పైత్యాన్ని పరిహరించాల్సిన సర్కారు- చెప్పిందొకటి, చేస్తున్నదొకటి. ప్రజల అర్థవంతమైన తోడ్పాటును కూడగట్టి రాష్ట్రభాషను సుసంపన్నం చేయడంలో, సముచిత గౌరవం సంపాదించిపెట్టడంలో ప్రభుత్వం పురోగమించినప్పుడే- మన తెలుగు మళ్లీ వెలుగులీనేది!

No comments: