తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ 
 ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రఖ్యాత హేతువాది,కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ గారు
 "తెలుగు అధికార భాష కావాలంటే.." ,"తెలుగు దేవ భాషే" పుస్తకాలలోని నాఆవేదనలూ, అభ్యర్ధనలూ ఈ శతకంలో 103 పద్యాలలో కూర్చారు.ఈ శతకాన్ని ప్రింటు చేయించి సభలో ఉచితంగా పంచుతాను.అన్ని పత్రికలకూ పంపుతాను.ఈ పద్యాలను తెలుగు మిత్రులంతా విస్తృతంగా వాడండి.వాడవాడలా వినిపించండి.సవరణలు సూచించండి.
 
 1. పాలనాధికార పగ్గాలతో, పేద
 బ్రతుకు తెరవొసంగు బాటలన్ని
 ఒరులకిచ్చి వారికూడిగం సేతువా?
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 2. ప్రాచ్యభాష యెదిగి ప్రాంతీయ భాషకు
 ఊపిరంద నీక యుసురు తీసె
 మ్రింగి వేసెగా తిమింగ్ల రూపు దాల్చి
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 3. ప్రాణ వాయు వాంగ్ల భాషకే అందిస్తె
 మాతృభాష కింక మనుగడేది ?
 గొప్పదైన పాము కప్పను మ్రింగదా ?
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 4. కొంప పెత్తనమ్ము ఉంపుడు గత్తెకా ?
 ఎంత ధారుణమ్ము ? ఎంత తెగవు ?
 తల్లి సవతి యైన పిల్లల భవితేమి ?
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 5. పసి వయస్సులోనే పరభాష చొప్పించి
 లేత మెదడు మీద వాత లిడకు
 పులుల స్వారీ పగటి కలలు గావింపదా ?
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 6. అమ్మవడిని మానిపి అతిచిన్న బిడ్డల
 సవతి కప్పగించి సాకమనిన
 సవతి ప్రేమ మనను చెప్పు నాకింపదా?
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 7. మత పుంజుకొని మమ్మీలు, డాడీలు
 కుమ్ముచుండే తల్లి రొమ్ము మీద
 ముద్దు సేయ దివిటీ మూతి కాల్చిన రీతి
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 8. తమిళ మలయాళ తల్లులకీనాడు
 బిడ్డలిచ్చుచున్న పెంపు చూడు
 తల్లిభాష నీకు తగనిదై పోయెనా?
 సొంత తల్లి పరువు సంతలో తీయకు
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 9. పర భాషలో నెంత పాండిత్యమున్ననూ
 భావ వ్యక్తీకరణ భ్రష్టు గుండు
 అలవిగాని బండ తలకెత్తుకున్నట్లు
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 10. అట్టహాసమైన ఆంగ్ల వక్తల మధ్య
 తెల్లబోయి మిగులు తెలుగు వక్త
 సానిడాబుగాంచి జంకెడి భార్యలా
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 11. యెల్ల వనరులున్న తల్లి భాషీనాడు
 బ్రతుకు యవని బ్రహ్మ రక్కసల్లె
 కానుపించు చుండ కనికరించేదెవరు?
 (కానుపించు దాని కాంక్షతో నేర్తురా?)
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 12. దేశభాషలందు తెలుగు లెస్సన్నట్టి
 కృష్ణదేవరాయ కీర్తి శిఖలు
 అన్ని దిశల చాటి వన్నె కెక్కిన భాష
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 13. చరితతో పాటు తగిన సాహిత్య ప్రాచీన
 ప్రతిభ కల్గినట్టి ప్రముఖ భాష!
 కన్న తెలుగు తల్లి ఉన్నతిని కాపాడు
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 14. ఇంపు చేయవచ్చు కంప్యూటరందుండు
 అచ్చరాల బెడద ఖచ్చితముగా
 అలవికానిదంటు అన్వేషణకు లేదు
 తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
 
 15. ఉన్నలోపములను తిన్నగా సవరించి
 తల్లిభాష నున్నతముగా తీర్చిదిద్ది
 అప్పగింపవోయి అధికార పీఠాన్ని
 తెలివి తెచ్చుకోని తెలుగు బిడ్డ
 
 16. దేశ భాషలందు తేజరిల్లిన తెలుగు
 వాసి తగ్గి ఆంగ్ల దాసి యయ్యె
 కుక్క వాత పడ్డ బక్క సింహం భంగి
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 17. ఆంగ్ల సంస్కృతాల నాలింగనం గొనీ
 సరకుగొనని తెలుగు సన్నగిల్లె
 కూరుచున్న కొమ్మ కూలిపోబోతోంది
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 18. అచ్చ తెలుగు వదలి ఆసంస్కృతంబునే
 మంత్రములకు వాడు తంత్రమేమి ?
 శ్రేష్టమైన వృత్తి చేజారుతుందనా ?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 19. తెలుగు దేశ బిడ్డ తెలుగు పండిత పోష్టు
 ఆంగ్ల భాషలోన ఆర్డరేసి
 అచ్చ తెనుగు వాని బిచ్చమెత్తింతురా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 20. అన్యదేశమందు ఆంధ్రులిర్వురు కలువ
 మాత్రు భాష దాచి మసులు కొండ్రు
 మనిషి దాచు కొనెడి మర్మాంగ జబ్బల్లే
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 21. ఆంధ్రభాష మనకు అధికారి యైయింత
 అన్నమిచ్చుననెడి ఆశయుండె
 ఆంగ్లమిచట జేరి అడియాశ జేసెరా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 22. అర్ధమవని భాష కధికార మందిస్తె
 బడుగు మూకనెల్ల పారద్రోలి
 కనక పీఠమందు శునకమై వర్ధిల్లు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 23. రూకలిచ్చు భాష కాకతో నేర్చేరు
 యేమి యివని దాని నేర్వరెవరు
 పాలు యివని పశువు కబేళాల కర్పితం
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 24. మిసిమి కల్గు కవుల పసిడి పల్కుల తల్లి
 సిరుల రాజసమ్ము తరిగిపోయె
 తిరుమలేశు నగలు అరువు కేగిన రీతి
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 25. పేద తెలుగు వారు పిరియాదు లందిస్తె
 ఆంగ్లమందు తీర్పు లదరగొట్టు
 కోతి కాపరైన కొబ్బరి కాయల్లె
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 26. స్వంత భాష నున్న సౌలభ్య మేనాడు
 అన్యభాషలందు అందబోదు
 తల్లిప్రేమ, మారు తల్లిలో దొరకునా ?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 27. ఆంగ్ల భాష సుంత అలవడినంతనే
 తెలుగు నీసడించు పులుగు లార
 యేరు దాటి తెప్ప నేల తగలేతురు ?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 28. వెర్రి తెలుగు కవికి యెర్ర పైసా కూడ
 రాల్చు దిక్కు లేదు రాష్ట్ర మందు
 తనదు రాతె తనకు తల కొర్వి యగుచుండె
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 29. ఇంచుమించుగా ప్రపంచ వ్యాప్తంబుగా
 పదునెనిమిది కోట్ల ప్రబలమైన
 సంతు యుండు తల్లి కింత అన్యాయమా ?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 30. అష్ట దిగ్గజాల హావభావాలతో
 కృష్ణ దేవరాయ కొలువులోని
 తెలుగు వైభవమ్ము తిరిగి మళ్ళొచ్చునా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 31. పొరుగు భాషతనకు భుక్తి కల్పించినా
 తనదు మాతృభాష దైన్య స్థితికి
 కఠిన ఆకురాయి కరిగి ఆక్రోశించె
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 32. తెలుగు ఉద్యమాన్ని తెగువతో చేపట్టి
 లౌక్యమౌ పధాన రహంతుల్లా
 గారు,బండి ముందు కరదీపికై నిలిచే
 (బండి ముందు నడుచు బంటు తానై నిలిచే)
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 33. అంటు వ్యాధి వోలె వ్యాపించి దేశాన
 ఆంగ్ల మోజు ప్రజల కంట గట్ట
 కాని వెంట్లు వెలసె కడగండ్ల ప్లాంట్లుగా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 34. తెలుగు నేల మీద తెలుగు బిడ్డే తెలుగు
 ఉచ్ఛరింప, పట్టి శిక్షవేయు
 బంటు పెత్తనమ్ము ఇంటి కెగ బ్రాకింది
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 35. మిసిమి కోలు పోయి పసిడి బాల్యంలోనె
 బండబారు తోంది భరత జాతి
 కానివెంట్లు జైళ్ళు, ఖైదీలె పిల్లలై
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 36. అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును
 మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె
 మేక వన్నె పులిని సాకిన ఫలమిది
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 37. పదవి నున్న వారు పలుకరు స్కూళ్ళ, ని
 ర్లక్ష్యమందు తెనుగు లైను దప్పె
 దిక్కు లేని శిశువు కుక్క పాలైనట్లు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 38. మొదటి తరగతందె ముదనష్ట పింగ్లీషు
 తెలుగు భాష గొంతు నులుముచుండె
 చంటి బిడ్డ కెపుడు చనుబాలె పట్టవలె
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 38. చంటిబిడ్డ త్రాగు చనుబాలురా తెలుగు
 అమ్మ రొమ్ము విడచి ఆంగ్లమనెడి
 ఖరము చన్ను గుడుచు ఖర్మ పట్టింపకు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 39. ప్రధమ విద్య మాతృ భాష యందున్నపుడె
 గట్టి పడును బేసు మట్టమెపుడు
 పై తరగతులందె పరభాషలకు చోటు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 40. తెలుగు మీడియమ్ము తెలుగు విద్యార్ధులకు
 చదువు కొనుట కెంతో సౌఖ్యప్రదము
 ఇంపిత మగుదారి కంప కొట్టించారు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 41. గుండెలోని బాధ దండిగా వివరింప
 మాతృభాష యొకటె మహిని చెల్లు
 మనసు దోచు పండు మామిడే నన్నట్లు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 42. తెలుగు నేల మీద తిన్నగా జన్మించి
 తెలుగు పాలు త్రాగి తెలుగు తల్లి
 రొమ్ము మీద గుద్దు రోమియోగాకుమీ
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 43. పెద్ద భాష వచ్చి గద్దెపై కూర్చుంటె
 మాతృభాష నోట మన్ను పడును
 పక్షి గూటి లోకి పాము జొర పడ్డట్లె
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 44. వొరుల కిచ్చి పొలము వారి వద్దే కూలి
 చేయబోవు టెంత హేయ కరము
 ఆంగ్ల ఆదిపత్యమటువంటిదే గురూ
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 45. ఇరుగు పొరుగు భాష కిస్తున్న గౌరవం
 తెలుగు కివ్వ రేమి తెగులొ మనకు
 పేద కన్నిచోట్ల వేదనే యెదురగు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 46. విధినెరింగి నేటి అధికార గణమంత
 ఆంగ్ల భేషజాన్ని అట్టె వదిలి
 తెలుగు ఉచ్చరిస్తె తిరిగి రాదా గతము
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 47. అమెరికాకు బోవు ఆ నల్గురి కొరకు
 ఆంగ్ల బండ నెత్తిరందరికిని
 ఉత్త సూది కొరకు ఎత్తకు దూలాన్ని
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 48. పరుగు లెత్తి యచట పాలు ద్రావే కంటె
 నిలబడింట త్రాగు నీరు మేలు
 అమెరికాల కేగి యగ చాట్లు పడ నేల
 (అమెరికా ఉపాధి హైక్లాసు బెగ్గింగు)
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 49. చదువు చక్కనైన సంస్కార లావణ్య
 అందమైన తెలుగు ఆడపిల్ల
 కన్ని యుండె, యిప్పు డయిదవ తన మివ్వు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 50. సర్వమతము లందు సామూహ ప్రార్ధనల్
 స్వీయ భాషలందు చేయరేల
 దేవుడితరభాష తెలియని మూర్ఖుడా ?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 51. ఆంధ్రముస్లిములను అరబ్ ఆకర్షించె
 సంస్కృతమ్ము తెలుగు జాతి నొంచె
 బల్లి యొడిసి పట్టు బలహీన జీవులన్
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 52. రక్తి చూపకుంటె ముక్తి సున్నాయంచు
 భక్త తటికి త్రొక్కి పట్టి నేర్పు
 మౌఢ్యమతపు భాష మర్మంబు తెలుసుకో
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 53. శాస్త్ర యుక్తమై సంస్కృతమేనాడో
 తెలుగు భాష మీద తిష్ట వేసి
 కొలువు తీరినట్టి గోముఖ వ్యాఘ్రహం
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 54. వేల యేండ్ల నుండి విలువైన గ్రామీణ
 పారిభాషికాల పట్టరైరి
 ఎక్కడున్న గొంగళక్కడే నన్నట్లు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 55. మాతృభాష తోనె మహనీయుడైనట్టి
 సత్య సాయి గొప్ప చరిత చూడు
 నేల విడిచి సాము మేలు కాదెన్నటికి
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 56. లోటు పాటులుంటె నీటుగా సవరించి
 పాటు చేసి తెలుగు మీట నొక్కు
 ఎలుకలున్న వంచు యిల్లు తగలేతుమా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 57. A,B లు C,D లు, యే శివాజీకొచ్చు?
 ఆంధ్ర భోజుకేమి ఆంగ్లమొచ్చు?
 కోడికూయకుంటె కొంప తెల్లారదా?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 58. జన్మమిచ్చినట్టి జననిగా వేనోళ్ళ
 పొగడగానె తల్లి దిగులు పోదు
 పూజసేయ గోవు పుష్టికి నోచునా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 59. భక్తి మహిమ పెంచు భారతం రామాయ
 ణాది కావ్యధారలందు తడిసి
 తెలుగు నేలలందు వెలుగు లీనిన భాష
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 60. బడుగు భాష యనుచు బాణాలు సంధించి
 తెనుగు తల్లి యుసురు తీయబోకు
 నిందమోపి సతిని బొందపెట్టిన రీతి
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 61. చిన్న చూపదేల చీదరింపదియేల?
 తెలుగు తల్లి మీద ద్వేషమేల?
 ఆంగ్లకోటు దాల్చి అధికుడ ననుకోకు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 62. మాతృభాష నొదిలి మరియొక భాషపై
 కాలుమోపు వాడు కలత చెందు
 నాటు పడవ నొదిలి ఓటి పడవెక్కకు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 63. చిన్నతనము నందె కన్నతల్లిని వీడి
 అన్యదేశవాస ఆంధ్రులంత
 తెలుగు దైన్యస్ధితికి దిగ్బ్రాంతి చెందేరు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 64. అర్ధమవని భాష అధికార మందుంటె
 అనువదించి తెల్పు అల్పులైన
 మాయ మోసగాళ్ళు మనకొంప ముంచరా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 65. పాలనాధికార పగ్గాలు చేపట్టి
 సాటిభాష లన్ని సాగు చుండ
 తల్లి తెలుగు భాష దాస్యమే విడదాయె
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 66. సకలమైన యితర జాతి పదాలతో
 సంకరించె నన్న శంక పడకు
 యెట్టిదైన పిల్లి యెలుకను పట్టేను
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 67. రాజపీఠమందు రంజిల్లు భాషకు
 మతపు భాషలకును క్షతియులేదు
 ప్రాణ హానియెపుడు ప్రాంతీయభాషకే
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 68. వట్టిమాట లంటు కొట్టిపారేయక
 పట్టుతోడ బుద్ది పదును చూపి
 మేలు చేయు భాష నేలిక చేసుకో
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 69. వచ్చి రాని ఆంగ్ల భాషతో కుస్తీలు
 పట్టు లెక్చరర్ల బాధచూడు
 నక్కలకును ద్రాక్ష నిక్కితే అందునా ?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 70. మాతృదేశ ప్రేమ మరువకు మరువకు
 మాతృభాష ప్రతిభ మబ్బువీడి
 వెల్లివిరిసి నపుడె యిల్లు స్వర్గంబురా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 71. దేశమేమొ తెలుగు దేశీయులు తెలుగు
 అమలు చేయు వారలంత తెలుగు
 ఆంగ్ల భాషకేల అధికార పీఠమ్ము?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 72. ప్రజల నోళ్ల నుండు భాషోన్నతిన్ పొందు
 ప్రజకు దూరమైన భాష చచ్చు
 తైలమివని దివ్వె తిన్నగా కొండెక్కు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 73. ఒరుల గొప్ప చూచి పరవశించుట మాని
 స్వంత జాతి ప్రతిభ చాటనెంచు
 కుంటి యైన కూడ యింటి బిడ్డే మేలు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 74. ఆంగ్ల భాషయేమొ అసలు నేర్వను రాదు
 తెలుగు చదవ బ్రతుకు తెరవు లేదు
 సొంత కూడు పాయె బంతి కూడూ పాయె
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 75. ఆలయాల పూజ కర్హత లేదని
 తెలుగు మంత్రములకు విలువ నివరు
 తెలుగు రాని వాడు దేవుడెట్లాయెనో
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 76. కామధేను వంటి కమ్మని తెలుగుండ
 ఇంగిలీషు నెత్తి కెత్తుకోకు
 గంగి గోవు నొదిలి గాడిద కొలువట్లు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 77. బానిసత్వమందు బ్రతికిన జాతికి
 తగ్గదాయె మోజు దాస్యమందు
 పోదు బిడ్డతోనె, పురిటి కంపన్నట్లు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 78. ఆంగ్ల భాష మీద అభిమానమున్ బెంచి
 తెలుగును విడనాడు తెగువ యేల ?
 ఆలి దొరకెనంచు అమ్మను చంపకు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 79. తేనె లొలుకు నట్టి తెలుగును విడనాడి
 గొంతు దిగని ఆంగ్ల చింతయేల?
 అక్షయమ్మునొదలి భిక్షెత్తు కొన్నట్లు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 80. లిపిని సంస్కరించి అపర వజ్రమ్ముగా
 తీర్చి దిద్ది చూడు తెలుగు భాష
 రాజ పీఠమునకె తేజస్సు నందించు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 81. ఇళ్ళలో యింగ్లీషు బళ్ళలో యింగ్లీషు
 తల్లి భాష విలువ తరుగుతోంది
 చుప్పనాతి ప్రభుత చోద్యం చూస్తోంది
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 82. కంటిపాప వోలె కాపాడగల బిడ్డ
 గనిన రీతి, నిద్రననుసరిస్తె
 మాతృ మూర్తి కింక మరణమే శరణము
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 83. స్వంత తల్లి నగలు, సవతికి అందించి
 బాధపెట్టు సుతులు బ్రతుకనేల
 మాతృభాష ద్రోహ మిట్టిదేయగుజుమి
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 84. బలసినట్టి భాష, బలహీనమగు దాని
 యిట్టె మింగి వేసి గుట్ట గూల్చు
 తెలుగు భాష కిట్టి స్థితిని రానీయకు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 85. ఆంధ్ర ప్రభుత తెలుగు కంగీకరించినా
 పెక్కు ఆఫీసర్లు లెక్క గొనరు
 పారునీళ్ళ కెపుడు పాచి తెగులన్నట్లు
 (దైవము వరమిడినా దారివ్వడు పూజారి)
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 86. తెగులుపట్టినట్టి తెలుగు బిడ్డల్లోని
 అంతరించినపుడె ఆంగ్లతిక్క
 మాతృభాష కొచ్చు మంచి రోజానాడు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 87. ఇళ్ల లోనె కాదు బళ్లలో గుళ్లలో
 కోర్టులందు ప్రజల హార్టులందు
 చోటు గొన్న భాష సుస్థిరమై నిలుచు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 88. ఆంగ్లముండు వారి కన్ని ఉద్యోగాలు
 తెలుగు భాష కింక విలువ యేది
 అద్దె వాడికిల్లు అసలు వాడికి నిల్లు
 (బంటుకు విలువిస్తే బాసును మ్రింగడా?)
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 89. లోకమార్పు తోడ పోకడలు మారాలి
 మారనట్టి దెల్ల మరణ మందు
 తెలుగు తల్లి కట్టి స్ధితిని పట్టింపకు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 90. కొన్ని చోట్ల ప్రజలు ఎన్నో తరంబులు
 కూర్చుకున్న భాష కూలెనంటె
 భాషతోడ జాతి భవిత మరణింపదా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 91. ఆంద్ర భాషకంటె ఆంగ్లమే మేలైతే
 చదివి నీవె అందు చతురు డగుము
 ఆంగ్ల గజ్జి తెచ్చి అందరికి పుల్మకు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 92. తెలుగు వేషధారణ తెలుగు వేదికలందె
 వేదికలను దాటి వెలికిరాదు
 ఆంగ్లమైక మందె ఆఫీసు గణముండు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 93. అసలు చిత్త శుద్ది ఆఫీసరందుంటే
 తెలుగు కూడ మంచి స్ధితి గడించు
 మెత్తగుంటె రౌతు నర్తించు గుర్రాలు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 94. విలువ తరిగినట్టి తెలుగు మీడియాన్ని
 యెంచుకున్నవాడు కించవడును
 యేమిటీ పరీక్ష యెన్నాళ్ళు ఈశిక్ష?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 95. అరచి పిలువగానె అక్బరు పాదుషా
 చచ్చిపోయెను కదా వచ్చు టెట్లు?
 అర్ధమవని భాష తర్జుమా యిట్లుండు
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 96. పట్టిమూఢ మతము వల్లించు ప్రార్ధనల్
 పాత భాషలోనే వాతలిడును
 అర్ధమవని గోష వ్యర్ధ ప్రయాసరా
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 97. సకల మతములందు సమభావ దృష్టితో
 తెనుగు భాష యున్నతికి తపించు
 రహంతుల్లా గారి తహతహను గుర్తించి
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 98. బడుగు తెలుగు భాష పాలింప యోగ్యమా
 సాద్యమెట్టులనకుడు చవట లల్లె
 నూర్ బాషా గారి తీరుగని నేర్చుకో
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 99. అరయ యూనికోడు కందరూ క్రమముగా
 మారి మాతృభాష మనుగడకును
 సహకరించినపుడె సంపూర్ణ సమృద్ది
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 100. కన్నతల్లి కింత గంజి పోయుట మాని
 సానికొంప మరిగి చంపజూచు
 బిడ్డలున్న పురిటి గడ్డ కాదీ భూమి
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 101. పూర్వరాజసాన పుట్టి పెరిగిన భాష
 ప్రజలు రేబవళ్ళు పలుకు భాష
 కవుల గంటమందు కదం త్రొక్కిన భాష
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 102. ఆంద్రదేశ రాజ అధికార పీఠాన
 తెలుగు తల్లి పఠిమ తీర్చి దిద్ది
 నిలుపకల్గు వరకు నిద్రపోరాదని
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 103. పరుల పాలనమ్ము పనికి రాదంటి మే
 వారి తోక (భాష) పట్టి వదల రేమి?
 ఉడిగమ్ము కింత ఉబలాటమెందుకో ?
 తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||
 
 -- ఆకురాతి గోపాలకృష్ణ A .S. పేట ,నెల్లూరు జిల్లా -524304     
Tuesday, April 02, 2013
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ
Labels:
poems
Subscribe to:
Comments (Atom)
