welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Wednesday, August 17, 2011

[జన్మమెత్తితిరా] మనిషియందె మహాత్ముని కాంచగలవురా


జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
మంచి తెలిసి మానవుడుగా మారినానురా [జన్మమెత్తితిరా]

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవ శక్తి మృగత్వమునే సంహరించెరా
సమర భూమి నా హృదయం శాంతి పొందెరా [జన్మమెత్తితిరా]

క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసె దివ్య మందిరముగా మారిపోయెరా [జన్మమెత్తితిరా]

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడిగంటలె ప్రతిధ్వనించురా
ఆ దివ్య స్వరం న్యాయ పధం చూపగలుగురా [జన్మమెత్తితిరా]

--అనిశెట్టి
 

Tuesday, August 16, 2011

mirapakaaya bajji మిరపకాయ బజ్జి

మిరపకాయ బజ్జి
===============

చిన్నదే యనుకొని చిన్న చూపులు వద్దు

మరచి మింగిన ఘాటు మాడ కెత్తు

మేనెల్ల తాకంగ మెత్తమెత్తగ దోచు

అంతరంగమునుండు యసలు కిటుకు

పైపైన రుచిచూసి ఫర్లేదు యనవద్దు

కొరుకంగ గట్టిగ గుణము తెలియు

మరువదెపుడు జిహ్వ మరగెనా రుచిదీని

వద్దనక తినగ సిద్ధ పడును

ఆహ!వోహొ! యనుచు ఆరగింతురెపుడు

నీరు మింగి కనుల నీరు నింపి!

కష్టమనక తినుట కిష్ట పడెడు

ఘనత కలదు మిరపకాయ బజ్జి!

============
విధేయుడు
_శ్రీనివాస్

ఈ జీవనవైభవమంతయు తుదకు నశించుటకేనా?

ఇదేనా ఇంతేనా జీవితసారమింతేనా?

అంతులేని ఈ జీవనవైభవమంతయు

తుదకు నశించుటకేనా?




బోసినవ్వులను కువ్వలుపోసే

పసిపాపల బ్రతుకు ఇంతేనా

జీవితసారమిదేనా

ఆటపాటల నలరించుచు

సెలయేటివోలే వెలివారే బ్రతుకూ ఇంతేనా

కిలకిలనవ్వుచు తొలకరివలపుల పొలకవోయు

జవరాలి వయ్యారము ఇదేనా ఇంతేనా




దాచుకున్న వయసంతయు మగనికి

దోచి యిచ్చుఇల్లాలి గతి ఇదేనా ఇంతేనా

పురిటిపాప చిరుపెదవులతావున

మురిసిపోవు బాలింతబ్రతుకు ఇదేనా ఇంతేనా

తనబలగము ధనధాన్యములనుగని

తనిసే ముదుసలి పేరాశ ఫలము ఇదేనా ఇంతేనా

సకల శాస్త్రములు పారసమిడినా

అఖిల దేశముల ఆక్రమించినా

కట్తకడకు ఈ కాయము విడిచీ

మట్టిగలిసి పోవలెనా?

మట్టిగలిసి పోవలెనా?




--యోగి వేమన.చిత్తూరు వి.నాగయ్య,సముద్రాల రాఘవాచార్యులు 1947

Friday, August 05, 2011

ప్రశ్నలా కాదా ?!



   ప్రశ్నలా కాదా ?!
===============

పైసలిస్తే పనిచేస్తారా?
పని చేస్తే పైసలిస్తారా?

పని చేస్తే పైసలిస్తే జీతం
పైసలిస్తే పని చేస్తే లంచం
పైసలిచ్చినా పని చేయకపోతే ఘోరం!

ఆకలి అయితే తింటారా?
తింటే ఆకలి అవుతుందా?

ఆకలి అయితే తింటే భోజనం
తింటే ఆకలి అయితే జీర్ణం
ఆకలి కాకున్నా తింటే రోగం!

ప్రేమిస్తే పెళ్ళవుతుందా?
పెళ్ళైతే ప్రేమిస్తారా?

పెళ్ళై ప్రేమిస్తే సంతోషం
ప్రేమిస్తే పెళ్ళైతే సుఖాంతం
పెళ్ళైనా ప్రేమించకపోతే విషాదం!

వార్తలొస్తాయని టీవీ చూస్తారా ?
టీవీ చూస్తారని వార్తలొస్తాయా ?

వార్తలొస్తాయని టీవీ చూస్తే ఆశ
టీవీ చూస్తారని వార్తలొస్తే దురాశ
టీవీ చూసినా వార్తలు రాకపోతే నిరాశ!

మాట్లాడటానికి ఫోను చేస్తారా?
ఫోను చేస్తే మాట్లాడుతారా?

ఫోను చేస్తే మాట్లాడుతే పరిచయమున్నవారు
మాట్లాడటానికి ఫోను చేస్తే తెలిసిన వారు
తప్పు నంబరైనా మాట్లాడుతుంటే అంతా నావారే అనుకునేవారు!
==========
విధేయుడు
-శ్రీనివాస్