welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Thursday, December 23, 2010

అనితర సాధ్యమైన అక్షరశిల్పులు -మంచి పుస్తకం

 



అనితర సాధ్యమైన అక్షరశిల్పులు

మంచి పుస్తకం

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌ మంచి రచయితగా, పరిణతి చెందిన పాత్రికేయునిగా చిరపరిచితులు. భారత స్వాతంత్య్రోద్యమంలో ముస్లిములు నిర్వహించిన పాత్రను వివరిస్తూ ఆయన రాసిన పరిశోధనా వ్యాసాలు పుస్తకాలుగా వెలువడి పాఠకాదరణ పొందాయి. ముస్లిం స్వాతంత్య్ర సమర యోధుల గురించిన సమాచారం సేకరించడానికి ఎంతో కష్టపడిన నశీర్‌ అహమ్మద్‌ ఇప్పుడు మరింత క(ఇ)ష్టపడి 'అక్షరశిల్పులు' అనే గ్రంథాన్ని అందించారు.




ఇందులో రాష్ట్రం నలుమూలలా ఉన్న 333 మంది ముస్లిం కవులు, రచయితలు, అనువాదకులను పరిచయం చేస్తూ, వారు చేసిన, చేస్తున్న సాహితీ సేవను పాఠకుల ముందుంచారు. ఆయా కవులు, రచయితలు, అనువాదకుల పరిచయాలు, వారు చెక్కిన సాహితీ శిల్పాల గురించి క్లుప్తంగానే చెప్పినప్పటికీ, తనకు అంది (తెలిసి)నంత వరకూ వారి చిరునామాలు, టెలిఫోన్‌ నంబర్లను సేకరించడానికి చేసిన కృషి, వారి గురించి రాసిన ప్రతి అక్షరంలోనూ సాటి ముస్లింల పట్ల గల ప్రేమాభిమానాలు, వారిని పదిమందికీ పరిచయం చేయడానికి పడ్డ తపన సంభ్రమాశ్చర్యాలకు గురి చేస్తాయి.




పాత్రికేయ ప్రముఖులు పొత్తూరి వెంకటేశ్వరరావుగారన్నట్లు ఈ పుస్తకం తెలుగు సాహిత్య పరిశోధకులకు, రచయితలకు మార్గదర్శివంటిదని చెప్పవచ్చు. అయితే ఇంకా ఇందులో సంకలన కర్త దృష్టిలోకి రాని ముస్లిం పాత్రికేయులు, రచయితలు మరెందరో ఉండి ఉండవచ్చు. తమ వివరాలను వెల్లడించడానికి ఇష్టపడని వారు కూడా ఉండి ఉండవచ్చు. అయినప్పటికీ ఇటువంటి పుస్తకం ఒకదానిని తీసుకు రావాలన్న నశీర్‌ అహమ్మద్‌ ఆలోచన ను మెచ్చుకోక తప్పదు.




అక్షరశిల్పులు (ముస్లిం కవులు- రచయితల

సంక్షిప్త పరిచయం)

కూర్పు: సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పుటలు: 180, వెల రూ. 150

ప్రతులకు: ఆజాద్‌ హౌస్‌ ఆఫ్‌ పబ్లికేషన్స్‌, శివప్రసాద్‌ వీధి, కొత్తపేట, వినుకొండ- 522 647, గుంటూరు జిల్లా మరియు అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాలు.

సోల్‌ డిస్ట్రిబ్యూషన్‌: తెలుగు బుక్‌హౌస్‌, 3-3-862,

కాచిగూడా ఎక్స్‌రోడ్స్‌, హైదరాబాద్‌- 500 027.




- డి.వి.ఆర్‌. భాస్కర్‌ (సాక్షి 10.7.2010)

No comments: