welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Tuesday, September 25, 2012

ఆ పద్యం

 

 అందంగా అందమైన భావాన్ని అందించిన కరుణశ్రీ గారి ఒక పద్యాన్ని పంచుకోవడం.

తెలతెలవారు వేళ, తెరతీయగ పక్షి సమూహ సంతతుల్
కలకలకూయు వేళ, పయిగ్రమ్మిన మబ్బులు వాన చింకులన్
జలజలరాల్చు వేళ, సహజమ్ముగ స్వప్నములో స్తనంధయుల్
కిలకిల నవ్వు వేళ, తిలకింతును నీ సొగసుల్ జగత్ప్రభూ!

ఆ పద్యం స్ఫూర్తితో ఒక ప్రయత్నం. అయ్య వారిని గుర్తుచేసుకున్నప్పుడు, అమ్మవారిని కూడా స్మరించడం.

మిలమిల తెల్లవారుటకు మేలిమి బంగరు సంధ్యకాంతులన్
గలగల పారు యేరులకు గానము సేయు తరంగనాదముల్
కళకళలాడు పూలకు సుగంధముతో మకరంద మాధురుల్
పలుపలు రీతి గూర్చెదవు భాగ్యముగా జగదంబ యంతటన్!
================
విధేయుడు
_శ్రీనివాస్





Wednesday, August 29, 2012

హనుమంతుడి టి.ఏ. బిల్లు


లంకలో  రామ రావణ యుద్ధం ముగిసింది. లంకేశ్వరుడి మరణం తరువాత రాముడు పుష్పక విమానంపై  అయోధ్యకు తిరిగివచ్చి ఘనంగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ కోలాహలంలో పాత టియ్యే బిల్లులు సకాలంలో క్లెయిం చేసుకోకపోతే ఆ తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని అయోధ్యలో అనుభవశాలి ఒకరు సలహా చెప్పడంతో ఆంజనేయుడు ఎందుకయినా మంచిదని ముందుగానే తన బిల్లును సబ్మిట్ చేసాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు సంజీవని మూలికను తేవడానికి వెళ్ళివచ్చినప్పటి ప్రయాణ భత్యం బిల్లు అది.
టియ్యే బిల్లు సెక్షన్లో పనిచేసే డీలింగ్ అసిస్టెంట్ తన బుద్ధి పోనిచ్చుకోకుండా అలవాటు ప్రకారం మూడు కొర్రీలు వేశాడు.
హనుమంతుడు ఈ టూరుకు ముందుగా అప్పటి రాజయిన భరతుడి  లిఖితపూర్వక అనుమతి తీసుకోలేదన్నది మొదటి అభ్యంతరం కాగాఅంజనీ సుతుడికి తన ఉద్యోగ హోదా రీత్యా విమానంలో (గాలిలో) ప్రయాణించే అర్హత లేదన్నది రెండోది. ముందస్తు అనుమతి తీసుకోకుండా గాలిలో యెగిరి వెళ్లి సంజీవని తీసుకువచ్చాడు. అందువల్ల అతడు సబ్మిట్ చేసిన బిల్లు నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాదు. పోతేఅతడ్నిసంజీవని మూలికను మాత్రమే తీసుకురమ్మని పంపారు. కానీ మొత్తం సంజీవని పర్వతాన్నే అంజనేయుడు తీసుకువచ్చాడు. పై అధికారుల ముందస్తు అనుమతి లేకుండా సొంత నిర్ణయం ప్రకారం తెచ్చిన అదనపు బాగేజ్ అలవెన్సును మంజూరు చేయడానికి రూల్స్ ఒప్పుకోవని  రాసేసి  డీలింగు అసిస్టెంటు ఫైలును  మూసేశాడు.
రామనామం తప్ప వేరేదీ రుచించని వాయునందనుడికి ఈ డీలింగ్ అసిస్టెంట్ వ్యవహారం సుతరామూ  రుచించలేదు. ముడతపడిన మూతిని మరింత ముడుచుకుని గబా గబా  వెళ్లి రామచంద్రులవారికే విషయం వివరించాడు. సాక్షాత్తు రాముడికే నమ్మిన బంటు అయిన తన విషయంలోనే ఇలా జరిగితే రామ పాలనను నమ్ముకున్న షరా మామూలు జనం మాటేమిటని రాజును  నిలదీశాడు.
రాముడికి హనుమంతుడంటే ఎంతో ఇది. కానీ నియమనిబంధనలంటే కూడా ఇంకెంతో ఇది. రూల్స్ ఒప్పుకోకపోతే రాజు మాత్రం ఏం చేస్తాడుఏం చెయ్యలేనని రాంబంటు మొహం మీదే చెప్పేసాడు.
పక్కనవున్న లక్ష్మణుల వారికి రాముడి వైఖరి చూసి వొళ్ళు మండింది. ఆరోజు పవన సుతుడు అమాంతంగా యెగిరి వెళ్లి సంజీవని తీసుకురాకపోతే తానీపాటికి స్వర్గంలో సభ తీరుస్తుండేవాడినన్న వాస్తవం గుర్తుకు తెచ్చుకుని మరింత మండి  పడ్డాడు.
ఆ కృతజ్ఞతతో లక్ష్మణుడు నేరుగా డీలింగ్ అసిస్టెంటుతోనే డీల్ చేసాడు.  ఏదోవిధంగా పని సానుకూలం అయ్యేట్టు చూడమని కోరాడు. బిల్లు శాంక్షన్ చేస్తే బిల్లు మొత్తంలో పది శాతం ఆమ్యామ్యా కూడా ఇస్తానని ప్రలోభపెట్టాడు.
అడుగుతోంది సాక్షాత్తూ రాజుగారి అనుంగు తమ్ముడు. పని చేయమంటోంది కూడా పుణ్యానికి  కాదు. ముట్టాల్సింది కూడా ముడుతున్నప్పుడు పనిచేయకపోవడానికి కారణం ఏముంటుంది కనుక.
డీలింగ్ అసిస్టెంటు మళ్ళీ ఫైల్  బయటకు తీసి  ఇలా తిరగరాసి పైకి పంపాడు.
కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఈ కేసును తిరిగి మరోమారు పరిశీలించడం జరిగింది.
హనుమంతులవారు ఈ టూరుపై  వెళ్ళిన సమయంలో భరతులవారు రాములవారి రాజ ప్రతినిధిగా రాజ్యం చేస్తున్నారు. అప్పటికి ఆయన పూర్తిస్తాయిలో రాజుగారి హోదాలో లేరు. రాములవారి ఆదేశం మేరకే ఆనాడు ఆంజనేయులవారు  ఈ అధికారిక పర్యటన మీద వెళ్లారు. శ్రీవారు స్వయంగా ఆదేశించారు కాబట్టిఅది కూడా అత్యంత జరూరుగా జరగాల్సిన రాచకార్యం కాబట్టిఈ పర్యటనకు మామూలుగా వుండే నిబంధనలు వర్తించవు. కాబట్టి ఈ బిల్లును యధాతధంగా ఆమోదించడమైనది. అలాగే ఆయన క్లెయిం చేసిన  ఎయిర్ ట్రావెల్ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడానికి ముందస్తు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భావించడం జరిగింది.
పోతేఅదనపు బాగేజీకి సంబంధించి చెల్లింపు విషయంలో గతంలో లేవనెత్తిన అభ్యంతరాన్ని సయితం పునః సమీక్షించడం జరిగింది. హనుమంతులవారు గ్రూప్ డి’ కేటగిరీ ఉద్యోగి కనుకన్నూమూలికలను గుర్తించగలిగే సామర్ధ్యం వుండడానికి అవకాశం లేదు కనుకన్నూపొరబాటున తప్పుడు మూలికను తీసుకువచ్చిన పక్షంలో మరికొన్నిసార్లు అక్కడికి వెళ్లి రావాల్సిన పని పడే అవకాశం వుందికనుకన్నూఅలాటి ప్రయాణాల వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం పడే  అవకాశాలు లేకపోనూ లేవు కనుకన్నూ – ఈ అన్ని విషయాలనుఖజానా భారాన్ని  సాకల్యంగాసవివరంగా  పరిశీలించి, ‘ప్రజాప్రయోజనాల’ దృష్ట్యా ఈ బిల్లును పాసు చేయాలని సిఫారసు చేయడం జరిగింది.
అంతే!  ఫైలు ఆఘమేఘాల మీద కదిలింది. అనేక విభాగాలు చుట్టబెట్టింది. బిల్లు ఆమోదానికి అందరూ ఎస్’ అన్నవాళ్ళే. నో’ అన్న వాళ్లు ఒక్కరూ లేరు. అందుకే ఒక్క రోజులోనే టియ్యే డబ్బులు హనుమంతుడి ఖాతాలో   పడ్డాయి.

Thursday, July 12, 2012

పరువు పేరుతో పైశాచికం

 


'పరువు హత్య'ల పేరుతో సిగ్గుమాలిన, ఆటవికమైన హత్యలు తరచు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో సంభవిస్తున్నాయి. కులం కట్టుబాట్లకు, ఆచారాలకు విరుద్ధంగా పెళ్ళి చేసుకొన్నారన్న ఆరోపణతో యువజంటలను స్వయంగా వారి రక్తసంబంధీకులే పరమ కిరాతకంగా హతమార్చి, వాటిని 'పరువు హత్యలు'గా చిత్రించి, బహిరంగ సమర్థనకు బరితెగిస్తున్నారు. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర
రాష్ట్రాలలో 'కుల పంచాయితీ'లు అక్షరాలా సమాంతర న్యాయవ్యవస్థలుగా పనిచేస్తూ, ఇలాంటి అమానుష హత్యలకు ఆదేశాలు జారీ చేయడం పరిపాటిగా మారింది.

ఇటువంటి ఒక హత్యకేసులో న్యాయస్థానం దోషులకు మరణశిక్ష విధించడంతో, హర్యానాలో జాట్‌ కులస్థులకు చెందిన 'ఖాప్‌ మహాపంచాయత్‌' కురుక్షేత్రలో సమావేశమై ఆ తీర్పును సవాలు చేయాలని నిర్ణయించింది. అది న్యాయస్థానాల అధికారాన్ని ప్రశ్నించడమే కాదు, 'నెల రోజుల్లో' హిందూ వివాహ చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వానికి 'తాఖీదు' జారీ చేసింది. ఈ సమావేశంలో ప్రముఖ రైతు నాయకుడు
మహీందర్‌సింగ్‌ తికాయత్‌, కొందరు మాజీ పోలీస్‌, సైనికాధికారులు పాల్గొనడం ఈ రాజ్యాంగధిక్కారపు లోతుకూ, తీవ్రతకూ నిదర్శనం

ఒకే గోత్రానికి చెందినవారు(సగోత్రులు) పెళ్ళి చేసుకోరాదన్న నిబంధనను ఉల్లంఘించి 2007లో వివాహమాడిన మనోజ్‌, బబ్లీ అనే ప్రేమికులను ఖాప్‌ పంచాయితీ ఆదేశంపై రక్తబంధువులే హతమార్చారు. కోర్టు ఆదేశంపై వారికి పోలీసు రక్షణ కల్పించినప్పటికీ, హత్య జరిగిన రోజు రాత్రి వారు అదృశ్యమయ్యారని- న్యాయపోరాటం చేస్తున్న మనోజ్‌ తల్లి కథనం. ఇటువంటి పాశవిక హత్యలకు పోలీస్‌,
అధికారయంత్రాంగపు అండదండలు ఉంటాయనడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే.

రాజకీయ నాయకుల సంగతి ఇక చెప్పుకోనవసరమేలేదు. కర్నాల్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ కేసులో అయిదుగురికి మరణశిక్ష, ఒకరికి యావజ్జీవశిక్ష విధించింది. కొడుకును, కోడలిని కోల్పోయిన దుఃఖంతోపాటు, కుల పంచాయితీ విధించిన సామాజిక వెలిని గత మూడేళ్ళుగా అనుభవిస్తున్న మనోజ్‌ తల్లిది మరోరకం చావు. కుల పంచాయితీ 'మరణశాసనం' విధించడానికి సగోత్ర వివాహాలే కారణం కానవసరంలేదు.
కులాంతర వివాహం చేసుకున్నా, ఒకే గ్రామానికి చెందిన యువతీ యువకులు పెళ్ళిచేసుకున్నా అదే గతి. రవీందర్‌ కౌర్‌ అనే అమ్మాయి వేరే కులస్థుని ప్రేమించి పెళ్ళిచేసుకుందని, ఆమె కళ్ళముందే భర్తను ఆమె తండ్రి, మరో దగ్గరి బంధువు నరికి చంపేశారు.

హంతకులకు సెషన్స్‌ జడ్జి మరణశిక్ష విధిస్తే, హైకోర్టు దానిని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఎనిమిదేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు దానిని ధ్రువీకరించింది. మనోజ్‌, బబ్లీ కేసులో తీర్పు వెలువడిన రోజునే ప్రబ్‌జీత్‌ కౌర్‌, పర్‌దీప్‌ సింగ్‌ అనే జంటను బంధువులు కాల్చి చంపారు. పోలీసు 'రక్షణ' య«థావిధిగా ఇక్కడా వారిని కాపాడలేక పోయింది. ఇక తల్లిదండ్రులే ఇటువంటి సందర్భాలలో
ఆడపిల్లకు విషమిచ్చి చంపి, ఆత్మహత్యగా చిత్రించడమూ మామూలేనట. ఒక సర్వే ప్రకారం, ఏడాదికి వందకు పైగా ఇటువంటి 'పరువు' హత్యలు జరుగుతున్నాయి. పెద్దలకు ఇష్టంలేని ఏ పెళ్ళినైనాసరే శిక్షించడానికి 'పరువు' ఒక ముసుగుగా మారినా ఆశ్చర్యం లేదు.

సగోత్ర వివాహాలు మంచివి కావనీ, ఆచార విరుద్ధమైనవనీ అనుకొన్నప్పుడు దానిని ఇతరులకు బోధించే హక్కును, వ్యక్తిగతంగా పాటించే హక్కును ఎవరూ కాదనరు. కన్నబిడ్డలైనా సరే, ఆ కట్టుబాటును ఉల్లంఘించారని చెప్పి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారికి 'మరణశిక్ష' అమలు చేసే రాజ్యాంగాతీతమైన అధికారం ఎంత కొమ్ములు తిరిగిన కుల పంచాయితీలకైనా ఉండదు, ఉండ డానికి వీలులేదు. ఆచారాలు,
సంప్రదాయాల పేరుతో సమాంతర న్యాయ, పోలీస్‌ వ్యవస్థలను నడుపుకొనే అధికారాన్ని ప్రతి కుల పంచాయితీకీ అనుమతిస్తే, రాజ్యాంగం, చట్టాల ఉనికికే అర్థం ఉండదు. ఉత్తరాది రాష్ట్రాలలో కుల పంచాయితీల పేరుతో జరుగుతున్న ఈ రాజ్యాంగ బహిరంగ ధిక్కారాన్ని ప్రభుత్వాలు ఉపేక్షిస్తున్నాయి కనుకనే, అవి ఇలా పేట్రేగుతున్నాయి. ప్రభుత్వాలకే 'అల్టిమేటమ్‌' జారీ చేయగలుగుతున్నాయి.

కుల పంచాయితీలకు ఉన్న ఓటు బలం రాజకీయపక్షాల నోటికి తాళం బిగిస్తున్న సంగతీ సుస్పష్టం. కోర్టులలో కేసుల పరిష్కారంలో జరిగే అసాధారణ జాప్యం కూడా కుల పంచాయితీ ముసుగులో ఇలా పైశాచిక ప్రవృత్తుల వికట తాండవానికి పరోక్ష దోహదం అవుతోంది. కులస్వామ్యం కోరలకు చిక్కి వివిధ రూపాల్లో నిత్య నరకాన్ని ఎదుర్కొంటున్న అభాగ్యులు మరెందరో ఉంటారు. వారందరూ వార్తలలోకి రారు.
ఉత్తరప్రదేశ్‌లో బిజ్నోర్‌ అనే గ్రామంలో కుల పంచాయితీ తండ్రీ, కూతుళ్ళకు అక్రమ సంబంధం అంటగడితే తీవ్ర మనక్షోభకు గురైన ఆ ఇద్దరూ కులపంచాయితీ సభ్యులిద్దరినీ కాల్చి చంపినట్టు వార్త.

ఖాప్‌ మహాపంచాయత్‌లో పాల్గొన్న వారిలో పలువురు ప్రముఖులు, విద్యావంతులు ఉండడం, సామాజిక జీవితమూ, నైతిక మర్యాదలూ చట్టపరమైన అంశాలు కావని, కుల పెద్దలు తేల్చవలసిన కుటుంబవిషయాలని, కులగౌరవం చట్టంకన్నా గొప్పదని అపరిణత వ్యాఖ్యలు చేయడం మధ్యయుగాల మౌఢ్యాన్ని భయానకంగా ప్రదర్శిస్తున్నాయి. 'పరువు'హంతకులకు సముచిత శిక్షపడే విధంగా, ప్రత్యేక నేరంగా వర్గీకరిస్తూ భారత
శిక్షాస్మృతిని సవరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దానితోపాటు కుల పంచాయితీలపై ఉక్కుపాదం మోపడం అవసరం. అప్పుడే ప్రభుత్వం ఉనికికి అర్థం, పరమార్థం.--సాక్షి సంపాదకీయం 18.4.2010

అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు

 


మహిళలు మహరాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు [మహిళలు]

ఆశపుడితే తీరుదాకా ఆగరు ఎలనాగలు
సహనానికి నేలతల్లిని పోలగలరు పొలతులు
అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు
అత్తగా అవతరిస్తే వారే అమ్మతల్లులు
ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు [మహిళలు]

విద్యలున్నా విత్తమున్నా ఒద్దికెరుగని వనితలు
ఒడ్డుదాటే ఉప్పెనల్లే ముప్పుకారా ముదితలు
పెద్దలను మన్నించే పద్దతే వద్దంటే
మానము మర్యాదా ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణకొద్ది కాపాడే రెప్పలే
కత్తులై పొడిచేస్తే ఆపేదింకెవరులే
వంగివున్న కొమ్మలే బంగారు బొమ్మలు [మహిళలు]

--సీతారామశాస్త్రి

మన దేవుళ్ళకు తెలుగు రాదా? పులికొండ సుబ్బాచారి వ్యాసం (సూర్య 9.4.2012)

 


మన దేవుళ్ళకు తెలుగు రాదా?

దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయించే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు మనం ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయో ర్మధ్యదేశే అస్మద్‌ గృహే పత్నీ సహితం అని వగైరా మన ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తాడు.ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలిగిన వ్యక్తిని భరతవర్షంలో భరత ఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణాగోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్ని కోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న.

ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసును బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.మన దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడారో మనకు తెలి యదు. తెలుసు అని అనుకుని చెప్పేవాళ్ళు మా త్రం దేవుళ్ళు సంస్కృతంలో మాట్లాడుకుంటారు అని చెబుతారు. అందుకే దీన్ని దేవభాష అనీ అంటుంటారు అంతే కాదు దీన్ని గీర్వాణభాష అని గీర్వాణంగా చెబుతారు. కాని దేవుళ్ళు మాట్లాడగా విని చెప్పిన వారు తటస్థిస్తే దీన్ని నిక్క చ్చిగా నమ్మే వీలుంది. దేవుళ్ళలో కూడా జండర్‌ వివక్ష చాలా ఉందని చెప్పడానికి వీలుంది. మన సంస్కృత నాటకాల్లో పురుష దేవతలు అందరూ సంస్కృతంలో సంభాషిస్తూండగా సేవకులు పరిచార కులు వంటి అథమ పాత్రలు, స్ర్తీ దేవతలు మాత్రం సమాజంలో తక్కువగా భావించిన ప్రాకృత భాషలో మాట్లాడతాయి.

ఇదంతా మన సంస్కృత నాటకకారుల చేతిచలువే కాని దేవతా స్ర్తీలు ఏ భాషలో మాట్లాడారో వారికేం తెలుసు అని మన ఫెమినిస్టు వీరనా రీమణులు అడిగే అవకాశమూ లేకపోలేదు. నిజానికి దేవుళ్ళు ఏభాషలో మాట్లాడినా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని మనం మాట్లాడే తెలుగు వారికి అర్థం కాదట. దీనితోనే మన కు ఇబ్బంది వచ్చింది.
ప్రతి మనిషి తాను పుట్టిన ఇంట్లో తల్లి తండ్రి కుటుంబ సభ్యులతో నేర్చుకునే భాష ఒకటి ఉంటుంది. దాన్నే మాతృభాష అని అంటారు. నిజానికి ఇది కుటుంబ భాష. వ్యక్తి పెరిగి విద్యావంతుడు అవుతూ ఇతర భాషలు నేర్చు కుంటాడు. తన సామాజిక అవస రాలకు ఏ భాష అవసర మో దానిలో అతను పని చేసుకుంటాడు. తన దైనందిన జీ వితపు అవస రాలకు తన భాషే విని యోగప డాలని ప్రతి భాషీ యుడు కోరుకుం టాడు. అలా వీలుపడని సందర్భాలలో ఆ సందర్భా నికి అవసరమైన భాష లో పని చేసుకోవలసి ఉంటుంది.

ప్రతి భాషకు సంబంధించిన వారికి, ప్రతి సంస్కృతిలోని వారికీ సామా జిక సందర్భాలతో పాటు మత సందర్భాలూ ఉంటాయి. అంటే దేవునితో సంబంధం ఉన్న సందర్భాలు అని కూడా వీటిని చెప్పవచ్చు. ప్రతి సంస్కృ తిలో జానపదులలో గిరిజన తెగలలోను ఈ మత సందర్భాలలో దేవునికి మనిషికి మధ్యన మరొక మనిషి ఉంటాడు. ఇతడినే పూజారి అని ఆచార మంతుడు అని, ముజావర్‌ అని పాస్టర్‌ అని ఒక్కొక్క మతంలో ఒక్కో సం స్కృతిలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ మధ్యవర్తి మన తరఫున దేవునితో మాట్లాడుతుంటాడు.

ప్రతి సంస్కృతిలోను దేవునితో మాట్లాడే భాష దేవుడు మాట్లాడే భాష వేరుగా ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే చాలా మత గ్రంథాలు సామాన్య మానవు లు మాట్లాడే భాషలో లేవు. అంతే కాదు మత సంబంధమైన దైవ సంబం ధమైన కార్యక్రమాలు అన్నీ అందరికీ అర్థంకాని భాషలో ఉంటాయి. ఒక తరహా భాషకు మతగౌరవం లభించిన తర్వాత ఆ భాష అర్థంకాకపోయినా ఫర్వాలేదు అనే భావన ఆ భాషీయులలో కలగడం అన్ని చోట్లా గమనించవచ్చు. అందుకే వీటిని రిచ్యువల్‌ లాంగ్వేజస్‌ అని అంటారు. అంటే ఇక్కడ పావిత్య్రం అనే భావన భాషతో ఉందే కాని భావంతో ప్రధానంగా కాదని. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుగు నేలపై లేదా ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో ఏం జరుగుతుందో గమనించి మంచి చెడు ఆలోచన చేద్దాం. ఆంధ్ర దేశంలో ఎక్కువ శాతం ప్రజలలో అంటే చాలా కులాల వారికి మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేది బ్రాహ్మణ కులానికి చెందిన పూజారులు.

లైఫ్‌ సైకిల్‌ రిచ్యువల్స్‌ వీటినే జీవన చక్ర సంబరాలు అని అంటారు. అంటే మనిషి పుట్టి నప్పుడు చేసే ఆచారం దగ్గరనుండి ఉపనయనం, రజస్వల, పెండ్లి, గర్భాదానం తిరిగి పుట్టుక అంటే బారసాల మరణం వీటన్నింటి సందర్భాలలో పూజారి ఉండి మనతో ఆయన పూజ చేయించ వలసి ఉంటుంది. మన తరఫున దేవునికి ఆయన మంత్రాలు చదువుతాడు. అంతే కాదు చాలా ఇతర సందర్భాలలో అంటే గృహప్రవేశం, సత్యనా రాయణస్వామి వ్రతాలు వంటి చాలా వ్రతాలలోను ఇలాంటి ఇతర మత సందర్భాల లోను పూజారి లేకుండా పనులు జరగవు. ఇక గుడికి పోతే మనం చేసే అష్టోత్తరం సహస్రనామం, అర్చనలు వంటి అన్ని సేవలు మన తరఫున పూజారి చేస్తాడు. తెలు గు నేలమీద తెలుగు వారి ఇండ్లలో, గుడులలోను జరిగే ఈ అన్ని కార్య క్రమాలలో ను పూజారి చదివే మంత్రాలు పూజలు అన్నీ అటు పూజారికీ ఇటు చేయించుకునే వారికి తెలిసిన తెలుగు భాషలో జరగవు. ఇవి అన్నీ సంస్కృత భాషలో జరుగుతాయి.

దేవునికి ఘంటానాదం సమర్పయామి, మధ్యమధ్యే పానీయం సమర్పయామి, దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నాట్యం దర్శయామి అని మనం చేసే సేవలు అన్నింటికీ మన తరఫున పూజారి మనకు తెలియని సంస్కృతభాషలో చదువు తాడు. దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయించే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు మనం ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయోర్మధ్యదేశే అస్మద్‌ గృహే పత్నీ సహితం అని వగైరా మన ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తా డు. ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలి గిన వ్యక్తిని భరతవర్షంలో భరతఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణా గోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్నికోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న. ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసు ను బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.

అంతే కాదు పెళ్ళి సందర్భంలో వరుడుతో తాళి కట్టే ముందు పూజారి ఒక మంత్రం అనిపిస్తాడు. మాంగల్యంతంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బధ్నా మి శుభగే సంజీవ శరదాం శతం అని. నోరు తిరిగినా తిరగకపోయినా పెళ్ళికొడుకు దాన్ని చెప్పి తర్వాత ఆమె మెడలో మాంగల్యాన్ని కడతాడు. ఇది పూజారికి అర్థం అయితే కావచ్చుగాక కాని తాళికట్టే పెండ్లి కొడుకులకు దీని అర్థం నూటికి తొంభై తొమ్మిదిమందికి అర్థంకాదు. కట్టించుకునే పెండ్లి కూతు రుకీ అర్థంకాదు, చుట్టూ ఉన్న బంధుమిత్రులకూ అర్థంకాదు. ఇంత బాధ ఎందుకు పెండ్లి కొడుకుతో నేను నూరేండ్లు హాయిగా ఈమెతో కలిసి జీవించడానికి గాను ఈమె కంఠంలో మాంగల్యా న్ని కడుతున్నాను అని చక్కగా తెలుగు లో చెప్పి కట్టవచ్చుగా. మిగతా ప్రమాణాలు అన్నీ కూడా ఇలా తెలు గులో చేస్తే చాలా హాయిగా ఉండదా.

కాని పెండ్లివేళ అక్కడికి ఆవాహన చేసిన దేవుళ్ళకి ఈ తెలుగు అర్థంకాదట. దేవుళ్ళకి అలా సంస్కృతం మం త్రాలలోనే చదివితేనే పవిత్రమైనదని వారికి తెలుస్తుందని ఒక పూజారిగారు సెలవి చ్చారు. అంతే కాదు అలా మంత్రాలని తెలుగులో చదివి చెప్పడాన్ని పెళ్ళి చేయించు కునే ప్రజలు ఎవరూ అంగీకరించేలా కూడా లేరు. వారికి కూడా సంస్కృతం మంత్రా లు చదివితేనే తృప్తి అక్కడికి అది పవిత్రమౌతుందని భావం కలుగుతుంది. గుడిలో జరిగే విషయంలోను ఇదే జరుగు తుంది. కాని ఒకప్పుడు కవి రాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పెండ్లిండ్లు అన్నీ తెలుగులో చేయవచ్చని, చేయాలని ఒక ఉద్యమంగా గ్రహించి చేపట్టారని చాలా సందర్భాలలో అలా చేయించారని పెద్ద వాళ్లు చెప్పగా విన్నాను. పెండ్లి మంత్రాలన్నీ తానే చదివి దేవునికి అప్పగిస్తే పెండ్లి కొడు కు ఊరక అతను చెప్పినవన్నీ చేస్తే ఆమె ఎవరి భార్య అవుతుం ది అనే తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తాడు వెనిగళ్ళ సుబ్బా రావు పెండ్లి మంత్రాల వెనుక బండారం అనే పుస్తకంలో.
కాని పరిస్థితి దేశం అంతటా ఇలా లేదు.

చాలా గ్రామ దేవతల గుడులలో, పేరం టాళ్ళ దేవతల గుడులలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు, దళితులు పూజారులు గా ఉన్నారు. అక్కడ జరిగే ఆచారాలన్నింటి లో తెలుగులోనే పూజా కార్య క్రమాలు జర గడం గమనించవచ్చు. చాలా గ్రామ దేవ తల గుడులలో రజకులు, క్షురక వృత్తి వా రు పూజారులుగా ఉన్నారు. అలాగే కొమ్ములవాళ్ళు, బైండ్లవాళ్ళు వంటి దళితులు పూ జలు చేసే గుడులు, జాతరలు కొన్ని ఉన్నా యి. వాటిలో ఈ కులాల పూజారులు వారి మంత్రాలను ఆచారాలను తెలుగులోనే చేస్తారు. కొన్ని సందర్భాలలో వినపడకుం డా చదవడం కూడా ఉంది. దీన్నిబట్టి పవిత్ర కార్యక్రమాలు తెలుగులో చేసుకోవచ్చు అని ఒక నిరూపణ మనకు ఉండనే ఉంది.

చాలా మంది గిరిజనులు వారి దేవతల పూజల్ని వారి భాషలోనే చేసుకోవడం ఉం ది. ఇన్ని ఉండగా నూటికి ఎనభై మంది పై గా ఉన్న తెలుగు వారు అటు గుడు లలోను ఇటు ఇండ్లలో జరిగే మత కార్యక్రమాలలో ను ఎరికీ తెలియని సంస్కృత భాషను ఎం దుకు వాడాలి మనకు తెలిసిన తెలుగులోనే మనం చేసుకోకూడదా. నిజానికి మనం మ న దేవునికోసం మనమే చేసే పూజకు మధ్య వర్తి ఉండి మనకు తెలియని భాషలో చదవ డం అవసరమా. ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఇవి విశ్వాసానికి మాత్రమే సంబంధించిన వి కావు. అసలు దేవుని దృష్టిలో మనుషుల మధ్య తారతమ్యాలు లేనట్లే భాషల మధ్య కూడా ఉండవు. అది నిజంగా దేవుడే అయితే అసలు ఉండడానికి వీలులేదు. మన దేవుళ్లకు తెలుగు రాదా అని ప్రశ్న వేసు కుంటే రాదు అని చెప్పగలిగే తెలుగువారు ఉన్నారా. రాదు అని చెప్పలేనప్పుడు మన తెలుగుకు మతసంస్కార స్థాయిని కల్పించి గుడిలో ఇంట్లో అన్ని మతకార్యా లకు తెలుగే ఎందుకు వాడకూడదు అని ప్రశ్న వేసు కుందాం.

ఈ విషయంలో క్రిస్టియన్లు కొంత మెరుగు అనిపిస్తుంది వారు మత ప్రచారం చేయడానికి తమ లక్ష్యంగా ఎవరు ఉన్నారో వారి భాషలోనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. క్రీస్తు భాష అని హీబ్రూ భాషలో చేయరు. కాని వారి తెలుగు విషయంలోను తకరారు ఉంది. వారు ఒక ప్రత్యేకమైన తెలుగును కృతకమైన దాన్ని అభివృద్ధిపరిచారు. వారి మతప్రచారకు లకు మామూలుగా అందరికీ అర్థమయ్యే తెలుగు వచ్చినా దానిలో మాట్లాడరు. వారి కృతక తెలుగులోనే మాట్లాడతారు. ఆ తెలుగుకు మత స్థాయి వచ్చింది.
బడుల్లో తెలుగు పరిస్థితి దీనాతిదీనంగా ఉందనే విషయం మొన్న విశాఖ పట్నం లో జరిగిన సంఘటన. అధికారభాష అమలుకూడా ప్రభుత్వం చేతిలో ఉంది. దాని కోసం ఉద్యమం చేయాల్సిందే. కాని మన ఇండ్లలో చేసే పూజల్లోను గుడుల్లో చేసే పూజల్లోను మనకు మనమే దేవునికి మనకు తెలిసిన మన తెలుగులో చేసుకోలేమా అని ప్రశ్నించుకొని ఆచరిస్తే మన తెలుగుకు మతసంస్కార స్థాయిని, పవిత్ర స్థాయిని తెచ్చుకోవడం మన చేతల్లోనే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేసైనా తెలుగుకు మతపవిత్రస్థాయికూడా తెచ్చుకోవాలి. నాకు తెలుగు అర్థం కాదు అనే దేవుడు ఉంటాడని దేవుడిని నమ్మేవాళ్ళు ఎవరైనా అంటారా. చూద్దాం వేచి చూద్దాం.--( వ్యావహారికభాషా మార్గదర్శి గురజాడ 150 జయంతి సం పురస్కరించుకొని) (సూర్య 9.4.2012)

తల్లి భాష పట్ల నిరాదరణ తగునా!

 

మన తల్లి భాష తెలుగు. అది మన రాష్ట్ర రాజ భాష కూడా. తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో పదికోట్లతో మూడవ స్థానంలో ఉందని గర్వంగా చెప్పుకుంటాము. కానీ దానికి తగిన ఆదరణ లభించడం లేదు. విదేశాల్లో తెలుగు భాషాభివృద్ధికై పలు సంస్థలు పాటుపడుతుంటే మన రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అంతకంతకూ దిగజారిపోతోంది. ఇటీవల జరిగిన గ్రూప్‌-1 పరీక్షలో తెలుగు ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లితే ఇంగ్లీష్‌నే అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటామని ఎపిపిఎస్సీ ప్రకటించడం కొసమెరుపు. ఇతర రాష్ట్రాలకొచ్చేసరికి ఆ రాష్ట్రాలు వాటి మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో స్వచ్ఛమైన తెలుగు భాషపై ఎందుకంత చిన్నచూపు? అలాగే ప్రైవేట్‌ స్కూల్స్‌ పెరిగిపోయి తెలుగుభాషకు ప్రాధాన్యత లేకుండా పోతోంది. దీనికితోడు పిల్లల్లోకూడా తెలుగులో మాట్లాడడానికి, రాయడానికి కూడా చాలా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పాలకులు స్పందించి తగిన నిధులు కేటాయించి మన మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

Saturday, January 14, 2012

మనసు మనిషిని మనిషిగ చేస్తుంది


కలువకు చంద్రుడు ఎంతో దూరం
 కమలానికి సూర్యుడు మరీ దూరం
 దూరమైన కొలదీ పెరుగును అనురాగం
 విరహంలోనే ఉన్నది అనుబంధం [[కలువకు]]

నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది
 నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
 ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది
 అది కలిమిలేములను మరిపిస్తుంది [[కలువకు]]

వలపు కన్నా తలపే తీయన
 కలయిక కన్నా కలలే తీయన
 చూపులకన్నా ఎదురు చూపులే తీయన
 నేటి కన్నా రేపే తీయన [[కలువకు]]

మనసు మనిషిని మనిషిగ చేస్తుంది
 వలపా మనసుకు అందాన్నిస్తుంది
 ఈ రెండూ లేక జీవితమేముంది
 ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది [[కలువకు]]

--ఆత్రేయ 1975 చిల్లరదేవుళ్ళు

విధినిగెల్చుట ఎవరితరమూ


చిత్రమైనది విధీ నడకా
పరిశోధనే ఒక వేడుకా
రాజులే రారాజులే గానీ
వీరాధి వీరులే గానీ
విర్రవీగుట వెర్రిగానీ
విధినిగెల్చుట ఎవరితరమూ [[చిత్రమైనది]]
సత్యనిరతుని పతినిబాసి దాసియైనది చంద్రమతియే
తల్లితండ్రి గురుడుతానై కన్నబిడ్డను పెంచలేదా [[చిత్రమైనది]]
అడవిలోన కుములుటే శ్రీరామగీత
అపనిందతోవెలియౌటయే సతి సీతరాతా
తప్పలేదే బాధలు వారికైనా
తప్పునాసామాన్యులకు ఈ వేధనా [[చిత్రమైనది]]
ధారుణ మీ దరిద్రము విధాత సృజించినబాధలందునన్
రౌరవమాదిగాగల నిరంతరకష్టములైన సాటియే
ఘోర దరిద్రభారమునకుంగిన ఆ నల చక్రవర్తియే దారను వీడిపోయెనుగదా
ఇక అన్యులులెక్కయౌదురే ఇక అన్యులులెక్కయౌదురే

--సుసర్ల దక్షిణామూర్తి,సంసారం 1950

తెల్లవార వచ్చె తెలియక నా సామి

ప్రతిరోజు తెల్లవారుతుంది. తెల్లవారుట గురించి రెండు మాటలు, కాదు రెండు పాటలనుండి కొన్ని మాటలు.
ప్రతిరోజు తల్లులు పిల్లల్ని నిద్ర లేపుతుంటారు. సినిమా సన్నివేశమేమో కాని, యశోద తన బాలకృష్ణున్ని నిద్ర లేపుతున్నట్టుగా రాసిన పాటలో తెలుగు నుడికారాన్ని, తల్లి మమకారాన్ని మేళవించి అందించారు మల్లది రామకృష్ణశాస్త్రిగారు. కృష్ణుడు చిన్నవాడు. పాట చిన్నది. పదాలు చిన్నవి. చిన్న వాటితోనే మరి సొగసంతా. లీల గళంలో ఇంకొంత రమణీయత సంతరించుకుంది.

------------------------------
మల్లాది వారి రచన ("చిరంజీవులు" సినిమాలో)-
"తెల్లవార వచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింక లేరా
కలకలమని పక్షి గణములు చెదిరేను
 కల్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయె
దైవరాయ నిదుర లేరా
నల్లనయ్య రారా నను కన్నవాడా
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా"
------------------------------
  అందరికీ తెలిసే వచ్చే తెల్లవారడాన్ని తెలియకుండా వచ్చేసిందని చెప్పడం,
 నిద్ర లేపడం, అంతే కాదు, ఎక్కడ పిల్లవాడు మళ్ళీ పడుకుంటాడో అని "మళ్ళీ పరుండేవు"
 అని అనడం సహజత్వంతో కూడిన సొగసు. "కల్యాణ గుణధామ లేరా" అన్నప్పుడు
  "కౌసల్యా సుప్రజా రామా" అన్నది స్ఫురిస్తుంది. తల్లి పిల్లవాణ్ణి "నను కన్నవాడా, బుల్లితండ్రి" అనడం తెలుగులోనే ఉందో ఇంకే ఇతర భాషల్లో ఉందో తెలియదు.
 నిద్ర లేచి ఏం చెయ్యమంటావు? ఎందుకు లేవాలి? ఇవి ప్రతి పిల్లవాడి ప్రశ్నలే ప్రతిరోజు. మరి యశోద తల్లి చాతుర్యమంతా, ఈ నిద్ర లేవడం అంతా ఎందుకంటే
 "వెన్న తిందువుగాని రారా" అనడంలో ఉంది, కాదు యశోద చేత పలికించిన తీరులో ఉంది. "మన్ను తిన్నవాడిని" వెన్న తినడానికి లేవమంటే ఇంకెందుకు లేవడు? అన్న గడుసుతనం కూడా ఉంది, గోప్యంగా. ఉండదు మరి, లేపేది గోపెమ్మే కదా!

 తెల్లవారడం గురించి ఇటీవల అస్తమించిన మల్లెమాల గారి పాటలోని కొన్ని పదాలు
 గుర్తొస్తాయి, కాదు గుర్తుండేలా రాసారు.
 "వెలుగు దుస్తులేసుకొని సూరీడు,
  తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు,
  పాడు చీకటికెంత భయమేసిందో,
   పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది" (మల్లెమాల "ముత్యాల ముగ్గు" పాటలో)
 సామాన్యంగా చీకటి అంటే భయపడతారు. అట్లా కాదట! వెలుగు దుస్తులేసుకున్న సూరీడును చూసి అందరు భయపడే చీకటికే భయమేసి పరుగు తీసింది అనడం చమత్కారం.

 తెలిసిన తెల్లవారుటను సరికొత్తగా చూపించి, అందంగా అందించి, ఆనందింపజేయడం, చదివిన వేళ ఎప్పుడైనా తెల్లవారినట్టుగా అనిపించడం సాధించారేమో అనిపిస్తుంది.
============
విధేయుడు
_శ్రీనివాస్