welcome

మా తెలుగు తల్లి కి మల్లె పూదండ, మా తెలుగు తల్లికి మల్లెపూదండ, మా కన్నతల్లికి మంగళారతులు, కడుపులో బంగారు, కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మాతల్లి, గలగలా గోదారి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులిడుతుంటేను, బంగారు పంటలేపండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి, అమరావతి నగరి అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడునాదాలు, తిక్కయ్య కలములో తియ్యందనాలు, నిత్యమై నిఖిలమై నిలిచియుండేదాక, రుద్రమ్మ భుజశక్తి, మల్లమ్మ పతిభక్తి, తిమ్మరుసు ధీయుక్తి, కృష్ణరాయలకీర్తి, మా చెవుల రింగుమని మారుమ్రోగేదాక, నీ పాటలే పాడుతాం, నీ ఆటలేఆడుతా, జై తెలుగుతల్లీ జై తెలుగుతల్లీ-శంకరంబాడి సుందరాచార్య

google

Monday, May 01, 2017

ఈ కవితలు ఎవరివి?

 

ఈ కవితలు ఎవరివి?
ఈ అరబీ కవితలు ఉమర్ క్రీ.శ. 579-644,అబూబకర్ 573--634 ఖలీఫాల కాలం నాటివి.
1."ముద్దూముచ్చట్లతో నన్నాందపరిచే చెలికాడు లేకుండ పోయాడే!!
అయ్యో! ఈ విషయమే నన్ను రాత్రుళ్ళలో నిద్ర లేకుండ చేసింది.
దేవుని దగ్గర పట్టుబడిపోతానన్న భయమే గనక లేకపోయి ఉంటే,
ఈపాటికి ఈ మంచం పట్టెలు సయితం కదిలిపోయి ఉండేవి!!''

2.''ఇలాంటి అందమైన భార్యకు విడాకులిచ్చిన నాలాంటివాడ్ని నేనెవర్నీ చూడలేదు.
ఏ పాపం ఎరగకపోయినా విడకులతో భర్తకు దూరమైన స్త్రీని కూడ చూడలేదు.
సద్గుణసంపత్తితో తులతూగే సతి ఆమె, నీతిన్యాయాలు నిండిని నాతి ఆమె.
నా హృదయంలో చెరగని ముద్ర వేసిన ఆ చెలిని నేనెలా మరచిపోగలను?''

ఈ తల్లుల పేర్లు చెప్పగలరా?
1.అబద్దం ఆడటం ఇష్టం లేక బందిపోటు దొంగలకు డబ్బు కోల్పోయిన సత్యశీలి హజ్రత్ అబ్దుల్ ఖాదర్ జిలానీ గారి తల్లి పేరేమిటి?
2.హజ్రత్ ఉమర్ గారి కోడలు.ఆసిమ్ గారి భార్య,5వ ఖలీఫా హజ్రత్ ఉమర్ బిన్ అబ్దుల్ అజీజ్ గారి అమ్మమ్మ,ఉమ్మె ఆసిమ్ గారి తల్లి, పాలలో నీళ్ళు కలపకూడదని తన తల్లికే నీతి చెప్పిన సత్యసంధురాలి పేరేమిటి?
3.షాఫై ఫిఖా వ్యవస్థాపకుడు హజ్రత్ షాఫై సంపాదన మొత్తం పేదలకు పంచి మళ్ళీ పేదవాడిగా చేసిన అతని తల్లి పేరేమిటి?
,_._,___

అమ్మ పలుకు

 



 Mothers day శుభాకాంక్షలు తల్లులందరికీ. తల్లిదండ్రులను విడదీయడం ఎందుకో నచ్చలేదు.
 కాబట్టి తల్లి వాత్సల్యం చూపించే తండ్రులకు కూడా శుభాకాంక్షలు :-)

 అందరు పలుకుతారు, కాని అమ్మ పలుకు మాత్రం ప్రత్యేకం ఎవ్వరికైనా, ఎప్పుడైనా.
 భగవంతుని సుప్రభాతం సైతం తల్లిపేరు ప్రస్తావిస్తూ  "కౌసల్యా సుప్రజా రామా" 
 అని మొదలుపెట్టడం మనోహరమైన భావం. పిల్లలకే సుప్రభాతాలు, తల్లులకెప్పుడూ కాదు!
 ఎందుకంటే తల్లే లేచి పిల్లలని నిద్ర లేపుతూ ఉంటుంది కాబట్టి. 

 పిలిచినా, దిద్దినా, వారించినా, చీవాట్లు పెట్టినా ప్రేమతో కూడి ఉంటుంది అమ్మ పలుకు.

 అమ్మ పలుకు అమ్మే చెప్పాలి. చెప్తే ఎట్లా ఉంటుందంటే ఇట్లా ఉంటుందేమో!
 ----------
 ఆది కవి నన్నయ్య గారి అమ్మ ఇట్లా అనేదేమో- "నన్నయ్యా భోజనానినికి పిలిచి గంటసేపవుతుంది. అన్నం చల్లారిపోతుంది.
 నీ పద్యాలు వెయ్యేళ్ళు అట్లాగే ఉంటాయి కాని, నీ రచన కొంచెం ఆపి ఇప్పుడు భోజనం చెయ్యి"

 వెమన తల్లి - "వేమా ఎవారో నీ ధ్యాస ఆట పైనా వెలదిపైనా అని అరోపణలు చేస్తే చేసారుగాని నువ్వు
 మొదట స్నానం చేసి భోజనం చెయ్యి. ఎప్పుడు తిన్నావో. నీ "ఆటవెలదులు" లోకకల్యాణం చేస్తాయి గాని నువ్వు
 ఇప్పుడు తిను"

 త్యాగయ్య తల్లి - "నీ పాటా చాలా శ్రావ్యంగా ఉంది. వేరే వాళ్ళకేం నాయనా, వింటూ కూర్చుంటారు. నీ భోజనానికి ఆలస్యమవుతుంది.
 సమయానికి తగు తిండి తిన్నతరువాత పాడితే ఇంకా ఆనందిస్తా నీ కృతి - 'సమయానికి తగు మాటలాడెనే..'"

 ధూర్జటి తల్లి - ""అమ్మా అయ్య అటంచు ఎవ్వరిని నేనన్నన్ శివా" అని నువ్వు రాసినంత మాత్రాన నేను నీకు
అమ్మను కాకుండా పోతానా? నువ్వు ఎట్లా రాసినా బాగా ఉంటుంది కాని, భోజనానికి ఆలస్యం అయ్యింది. నన్ను ఏమి
అన్నావు అని కాదు,నువ్వెప్పుడు తిన్నావో అన్నదే నా బెంగ. తిన్న తరువాత రాద్దువుగాని పద్యాలు."

పోతన తల్లి - "అంత సేపు ధ్యానం చేస్తే మరి భోజనం ఎప్పుడు? వడ్డించి గంట అయ్యింది. తినకుండా
ధ్యానం చేస్తే నీ రచన ఎట్లా సాగుతుంది? తిన్న తరువాత కూర్చో. అప్పుడు ఆ రామభద్రుడు కూడా పలుకుతాడు. ఆయన పలికినా నీకు వినడానికి కొంత శక్తి ఉంటుంది, భోజనం చెయ్యి"

Newton* తల్లి - "ఎంత సేపు ఆ ఆపిల్ చెట్టు కింద ఎందుకు కూర్చుంటావు? భోజనానికి ఆలస్యం అయ్యింది. మొదట తిను.
తరువాత ఆ పక్కింటి పిల్లలు లాగా science,physics చదువుకో- ఆపిల్ చెట్టు కింద time waste చేయకు."

Einstein* తల్లి - "తిండి లేదు ఏమి లేదు, భోజనానికి ఆలస్యం అయ్యింది. ఆ జుట్టు చూడు ఎట్లా తయారయిందో.
నువ్వేమన్నా scientist అనుకుంటున్నావా- మొదట భోజనం చేసి, ఆ జుట్టు కత్తిరించుకో తరువాత."

Edison* తల్లి - " ఎప్పుడు తిన్నావో ఏమో. నువ్వు తోందరగా భోజనం చెయ్యి. నువ్వు light bulb తయారు చేసి నందుకు చాలా గర్వ పడతాను. కాని ఆ light బంజేసి పడుకో. అసలే సరిగ్గా నిద్ర పోలేదు నిన్న."

ఇంకా ఉంది- ఇది రాస్తున్నానని తెలిస్తే మా అమ్మ కూడా తినేసి పడుకో అంటుందని ఆపేయడం.
==========
విధేయుడు
_శ్రీనివాస్

Tuesday, April 02, 2013

తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

 
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

ప్రపంచ తెలుగు మహాసభల సందర్భంగా ప్రఖ్యాత హేతువాది,కవిశ్రీ ఆకురాతి గోపాలకృష్ణ గారు
"తెలుగు అధికార భాష కావాలంటే.." ,"తెలుగు దేవ భాషే" పుస్తకాలలోని నాఆవేదనలూ, అభ్యర్ధనలూ ఈ శతకంలో 103 పద్యాలలో కూర్చారు.ఈ శతకాన్ని ప్రింటు చేయించి సభలో ఉచితంగా పంచుతాను.అన్ని పత్రికలకూ పంపుతాను.ఈ పద్యాలను తెలుగు మిత్రులంతా విస్తృతంగా వాడండి.వాడవాడలా వినిపించండి.సవరణలు సూచించండి.

1. పాలనాధికార పగ్గాలతో, పేద
బ్రతుకు తెరవొసంగు బాటలన్ని
ఒరులకిచ్చి వారికూడిగం సేతువా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

2. ప్రాచ్యభాష యెదిగి ప్రాంతీయ భాషకు
ఊపిరంద నీక యుసురు తీసె
మ్రింగి వేసెగా తిమింగ్ల రూపు దాల్చి
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

3. ప్రాణ వాయు వాంగ్ల భాషకే అందిస్తె
మాతృభాష కింక మనుగడేది ?
గొప్పదైన పాము కప్పను మ్రింగదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

4. కొంప పెత్తనమ్ము ఉంపుడు గత్తెకా ?
ఎంత ధారుణమ్ము ? ఎంత తెగవు ?
తల్లి సవతి యైన పిల్లల భవితేమి ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

5. పసి వయస్సులోనే పరభాష చొప్పించి
లేత మెదడు మీద వాత లిడకు
పులుల స్వారీ పగటి కలలు గావింపదా ?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

6. అమ్మవడిని మానిపి అతిచిన్న బిడ్డల
సవతి కప్పగించి సాకమనిన
సవతి ప్రేమ మనను చెప్పు నాకింపదా?
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

7. మత పుంజుకొని మమ్మీలు, డాడీలు
కుమ్ముచుండే తల్లి రొమ్ము మీద
ముద్దు సేయ దివిటీ మూతి కాల్చిన రీతి
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

8. తమిళ మలయాళ తల్లులకీనాడు
బిడ్డలిచ్చుచున్న పెంపు చూడు
తల్లిభాష నీకు తగనిదై పోయెనా?
సొంత తల్లి పరువు సంతలో తీయకు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

9. పర భాషలో నెంత పాండిత్యమున్ననూ
భావ వ్యక్తీకరణ భ్రష్టు గుండు
అలవిగాని బండ తలకెత్తుకున్నట్లు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

10. అట్టహాసమైన ఆంగ్ల వక్తల మధ్య
తెల్లబోయి మిగులు తెలుగు వక్త
సానిడాబుగాంచి జంకెడి భార్యలా
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

11. యెల్ల వనరులున్న తల్లి భాషీనాడు
బ్రతుకు యవని బ్రహ్మ రక్కసల్లె
కానుపించు చుండ కనికరించేదెవరు?
(కానుపించు దాని కాంక్షతో నేర్తురా?)
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

12. దేశభాషలందు తెలుగు లెస్సన్నట్టి
కృష్ణదేవరాయ కీర్తి శిఖలు
అన్ని దిశల చాటి వన్నె కెక్కిన భాష
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

13. చరితతో పాటు తగిన సాహిత్య ప్రాచీన
ప్రతిభ కల్గినట్టి ప్రముఖ భాష!
కన్న తెలుగు తల్లి ఉన్నతిని కాపాడు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

14. ఇంపు చేయవచ్చు కంప్యూటరందుండు
అచ్చరాల బెడద ఖచ్చితముగా
అలవికానిదంటు అన్వేషణకు లేదు
తెలిసి నడుచుకొమ్ము తెలుగు బిడ్డ

15. ఉన్నలోపములను తిన్నగా సవరించి
తల్లిభాష నున్నతముగా తీర్చిదిద్ది
అప్పగింపవోయి అధికార పీఠాన్ని
తెలివి తెచ్చుకోని తెలుగు బిడ్డ

16. దేశ భాషలందు తేజరిల్లిన తెలుగు
వాసి తగ్గి ఆంగ్ల దాసి యయ్యె
కుక్క వాత పడ్డ బక్క సింహం భంగి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

17. ఆంగ్ల సంస్కృతాల నాలింగనం గొనీ
సరకుగొనని తెలుగు సన్నగిల్లె
కూరుచున్న కొమ్మ కూలిపోబోతోంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

18. అచ్చ తెలుగు వదలి ఆసంస్కృతంబునే
మంత్రములకు వాడు తంత్రమేమి ?
శ్రేష్టమైన వృత్తి చేజారుతుందనా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

19. తెలుగు దేశ బిడ్డ తెలుగు పండిత పోష్టు
ఆంగ్ల భాషలోన ఆర్డరేసి
అచ్చ తెనుగు వాని బిచ్చమెత్తింతురా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

20. అన్యదేశమందు ఆంధ్రులిర్వురు కలువ
మాత్రు భాష దాచి మసులు కొండ్రు
మనిషి దాచు కొనెడి మర్మాంగ జబ్బల్లే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

21. ఆంధ్రభాష మనకు అధికారి యైయింత
అన్నమిచ్చుననెడి ఆశయుండె
ఆంగ్లమిచట జేరి అడియాశ జేసెరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

22. అర్ధమవని భాష కధికార మందిస్తె
బడుగు మూకనెల్ల పారద్రోలి
కనక పీఠమందు శునకమై వర్ధిల్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

23. రూకలిచ్చు భాష కాకతో నేర్చేరు
యేమి యివని దాని నేర్వరెవరు
పాలు యివని పశువు కబేళాల కర్పితం
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

24. మిసిమి కల్గు కవుల పసిడి పల్కుల తల్లి
సిరుల రాజసమ్ము తరిగిపోయె
తిరుమలేశు నగలు అరువు కేగిన రీతి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

25. పేద తెలుగు వారు పిరియాదు లందిస్తె
ఆంగ్లమందు తీర్పు లదరగొట్టు
కోతి కాపరైన కొబ్బరి కాయల్లె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

26. స్వంత భాష నున్న సౌలభ్య మేనాడు
అన్యభాషలందు అందబోదు
తల్లిప్రేమ, మారు తల్లిలో దొరకునా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

27. ఆంగ్ల భాష సుంత అలవడినంతనే
తెలుగు నీసడించు పులుగు లార
యేరు దాటి తెప్ప నేల తగలేతురు ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

28. వెర్రి తెలుగు కవికి యెర్ర పైసా కూడ
రాల్చు దిక్కు లేదు రాష్ట్ర మందు
తనదు రాతె తనకు తల కొర్వి యగుచుండె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

29. ఇంచుమించుగా ప్రపంచ వ్యాప్తంబుగా
పదునెనిమిది కోట్ల ప్రబలమైన
సంతు యుండు తల్లి కింత అన్యాయమా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

30. అష్ట దిగ్గజాల హావభావాలతో
కృష్ణ దేవరాయ కొలువులోని
తెలుగు వైభవమ్ము తిరిగి మళ్ళొచ్చునా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

31. పొరుగు భాషతనకు భుక్తి కల్పించినా
తనదు మాతృభాష దైన్య స్థితికి
కఠిన ఆకురాయి కరిగి ఆక్రోశించె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

32. తెలుగు ఉద్యమాన్ని తెగువతో చేపట్టి
లౌక్యమౌ పధాన రహంతుల్లా
గారు,బండి ముందు కరదీపికై నిలిచే
(బండి ముందు నడుచు బంటు తానై నిలిచే)
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

33. అంటు వ్యాధి వోలె వ్యాపించి దేశాన
ఆంగ్ల మోజు ప్రజల కంట గట్ట
కాని వెంట్లు వెలసె కడగండ్ల ప్లాంట్లుగా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

34. తెలుగు నేల మీద తెలుగు బిడ్డే తెలుగు
ఉచ్ఛరింప, పట్టి శిక్షవేయు
బంటు పెత్తనమ్ము ఇంటి కెగ బ్రాకింది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

35. మిసిమి కోలు పోయి పసిడి బాల్యంలోనె
బండబారు తోంది భరత జాతి
కానివెంట్లు జైళ్ళు, ఖైదీలె పిల్లలై
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

36. అమ్మ యనెడి తెలుగు కమ్మని పిలుపును
మమ్మి వచ్చి చేరి మట్టు పెట్టె
మేక వన్నె పులిని సాకిన ఫలమిది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

37. పదవి నున్న వారు పలుకరు స్కూళ్ళ, ని
ర్లక్ష్యమందు తెనుగు లైను దప్పె
దిక్కు లేని శిశువు కుక్క పాలైనట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

38. మొదటి తరగతందె ముదనష్ట పింగ్లీషు
తెలుగు భాష గొంతు నులుముచుండె
చంటి బిడ్డ కెపుడు చనుబాలె పట్టవలె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

38. చంటిబిడ్డ త్రాగు చనుబాలురా తెలుగు
అమ్మ రొమ్ము విడచి ఆంగ్లమనెడి
ఖరము చన్ను గుడుచు ఖర్మ పట్టింపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

39. ప్రధమ విద్య మాతృ భాష యందున్నపుడె
గట్టి పడును బేసు మట్టమెపుడు
పై తరగతులందె పరభాషలకు చోటు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

40. తెలుగు మీడియమ్ము తెలుగు విద్యార్ధులకు
చదువు కొనుట కెంతో సౌఖ్యప్రదము
ఇంపిత మగుదారి కంప కొట్టించారు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

41. గుండెలోని బాధ దండిగా వివరింప
మాతృభాష యొకటె మహిని చెల్లు
మనసు దోచు పండు మామిడే నన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

42. తెలుగు నేల మీద తిన్నగా జన్మించి
తెలుగు పాలు త్రాగి తెలుగు తల్లి
రొమ్ము మీద గుద్దు రోమియోగాకుమీ
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

43. పెద్ద భాష వచ్చి గద్దెపై కూర్చుంటె
మాతృభాష నోట మన్ను పడును
పక్షి గూటి లోకి పాము జొర పడ్డట్లె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

44. వొరుల కిచ్చి పొలము వారి వద్దే కూలి
చేయబోవు టెంత హేయ కరము
ఆంగ్ల ఆదిపత్యమటువంటిదే గురూ
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

45. ఇరుగు పొరుగు భాష కిస్తున్న గౌరవం
తెలుగు కివ్వ రేమి తెగులొ మనకు
పేద కన్నిచోట్ల వేదనే యెదురగు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

46. విధినెరింగి నేటి అధికార గణమంత
ఆంగ్ల భేషజాన్ని అట్టె వదిలి
తెలుగు ఉచ్చరిస్తె తిరిగి రాదా గతము
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

47. అమెరికాకు బోవు ఆ నల్గురి కొరకు
ఆంగ్ల బండ నెత్తిరందరికిని
ఉత్త సూది కొరకు ఎత్తకు దూలాన్ని
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

48. పరుగు లెత్తి యచట పాలు ద్రావే కంటె
నిలబడింట త్రాగు నీరు మేలు
అమెరికాల కేగి యగ చాట్లు పడ నేల
(అమెరికా ఉపాధి హైక్లాసు బెగ్గింగు)
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

49. చదువు చక్కనైన సంస్కార లావణ్య
అందమైన తెలుగు ఆడపిల్ల
కన్ని యుండె, యిప్పు డయిదవ తన మివ్వు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

50. సర్వమతము లందు సామూహ ప్రార్ధనల్
స్వీయ భాషలందు చేయరేల
దేవుడితరభాష తెలియని మూర్ఖుడా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

51. ఆంధ్రముస్లిములను అరబ్ ఆకర్షించె
సంస్కృతమ్ము తెలుగు జాతి నొంచె
బల్లి యొడిసి పట్టు బలహీన జీవులన్
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

52. రక్తి చూపకుంటె ముక్తి సున్నాయంచు
భక్త తటికి త్రొక్కి పట్టి నేర్పు
మౌఢ్యమతపు భాష మర్మంబు తెలుసుకో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

53. శాస్త్ర యుక్తమై సంస్కృతమేనాడో
తెలుగు భాష మీద తిష్ట వేసి
కొలువు తీరినట్టి గోముఖ వ్యాఘ్రహం
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

54. వేల యేండ్ల నుండి విలువైన గ్రామీణ
పారిభాషికాల పట్టరైరి
ఎక్కడున్న గొంగళక్కడే నన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

55. మాతృభాష తోనె మహనీయుడైనట్టి
సత్య సాయి గొప్ప చరిత చూడు
నేల విడిచి సాము మేలు కాదెన్నటికి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

56. లోటు పాటులుంటె నీటుగా సవరించి
పాటు చేసి తెలుగు మీట నొక్కు
ఎలుకలున్న వంచు యిల్లు తగలేతుమా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

57. A,B లు C,D లు, యే శివాజీకొచ్చు?
ఆంధ్ర భోజుకేమి ఆంగ్లమొచ్చు?
కోడికూయకుంటె కొంప తెల్లారదా?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

58. జన్మమిచ్చినట్టి జననిగా వేనోళ్ళ
పొగడగానె తల్లి దిగులు పోదు
పూజసేయ గోవు పుష్టికి నోచునా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

59. భక్తి మహిమ పెంచు భారతం రామాయ
ణాది కావ్యధారలందు తడిసి
తెలుగు నేలలందు వెలుగు లీనిన భాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

60. బడుగు భాష యనుచు బాణాలు సంధించి
తెనుగు తల్లి యుసురు తీయబోకు
నిందమోపి సతిని బొందపెట్టిన రీతి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

61. చిన్న చూపదేల చీదరింపదియేల?
తెలుగు తల్లి మీద ద్వేషమేల?
ఆంగ్లకోటు దాల్చి అధికుడ ననుకోకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

62. మాతృభాష నొదిలి మరియొక భాషపై
కాలుమోపు వాడు కలత చెందు
నాటు పడవ నొదిలి ఓటి పడవెక్కకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

63. చిన్నతనము నందె కన్నతల్లిని వీడి
అన్యదేశవాస ఆంధ్రులంత
తెలుగు దైన్యస్ధితికి దిగ్బ్రాంతి చెందేరు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

64. అర్ధమవని భాష అధికార మందుంటె
అనువదించి తెల్పు అల్పులైన
మాయ మోసగాళ్ళు మనకొంప ముంచరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

65. పాలనాధికార పగ్గాలు చేపట్టి
సాటిభాష లన్ని సాగు చుండ
తల్లి తెలుగు భాష దాస్యమే విడదాయె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

66. సకలమైన యితర జాతి పదాలతో
సంకరించె నన్న శంక పడకు
యెట్టిదైన పిల్లి యెలుకను పట్టేను
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

67. రాజపీఠమందు రంజిల్లు భాషకు
మతపు భాషలకును క్షతియులేదు
ప్రాణ హానియెపుడు ప్రాంతీయభాషకే
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

68. వట్టిమాట లంటు కొట్టిపారేయక
పట్టుతోడ బుద్ది పదును చూపి
మేలు చేయు భాష నేలిక చేసుకో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

69. వచ్చి రాని ఆంగ్ల భాషతో కుస్తీలు
పట్టు లెక్చరర్ల బాధచూడు
నక్కలకును ద్రాక్ష నిక్కితే అందునా ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

70. మాతృదేశ ప్రేమ మరువకు మరువకు
మాతృభాష ప్రతిభ మబ్బువీడి
వెల్లివిరిసి నపుడె యిల్లు స్వర్గంబురా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

71. దేశమేమొ తెలుగు దేశీయులు తెలుగు
అమలు చేయు వారలంత తెలుగు
ఆంగ్ల భాషకేల అధికార పీఠమ్ము?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

72. ప్రజల నోళ్ల నుండు భాషోన్నతిన్ పొందు
ప్రజకు దూరమైన భాష చచ్చు
తైలమివని దివ్వె తిన్నగా కొండెక్కు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

73. ఒరుల గొప్ప చూచి పరవశించుట మాని
స్వంత జాతి ప్రతిభ చాటనెంచు
కుంటి యైన కూడ యింటి బిడ్డే మేలు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

74. ఆంగ్ల భాషయేమొ అసలు నేర్వను రాదు
తెలుగు చదవ బ్రతుకు తెరవు లేదు
సొంత కూడు పాయె బంతి కూడూ పాయె
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

75. ఆలయాల పూజ కర్హత లేదని
తెలుగు మంత్రములకు విలువ నివరు
తెలుగు రాని వాడు దేవుడెట్లాయెనో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

76. కామధేను వంటి కమ్మని తెలుగుండ
ఇంగిలీషు నెత్తి కెత్తుకోకు
గంగి గోవు నొదిలి గాడిద కొలువట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

77. బానిసత్వమందు బ్రతికిన జాతికి
తగ్గదాయె మోజు దాస్యమందు
పోదు బిడ్డతోనె, పురిటి కంపన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

78. ఆంగ్ల భాష మీద అభిమానమున్ బెంచి
తెలుగును విడనాడు తెగువ యేల ?
ఆలి దొరకెనంచు అమ్మను చంపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

79. తేనె లొలుకు నట్టి తెలుగును విడనాడి
గొంతు దిగని ఆంగ్ల చింతయేల?
అక్షయమ్మునొదలి భిక్షెత్తు కొన్నట్లు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

80. లిపిని సంస్కరించి అపర వజ్రమ్ముగా
తీర్చి దిద్ది చూడు తెలుగు భాష
రాజ పీఠమునకె తేజస్సు నందించు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

81. ఇళ్ళలో యింగ్లీషు బళ్ళలో యింగ్లీషు
తల్లి భాష విలువ తరుగుతోంది
చుప్పనాతి ప్రభుత చోద్యం చూస్తోంది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

82. కంటిపాప వోలె కాపాడగల బిడ్డ
గనిన రీతి, నిద్రననుసరిస్తె
మాతృ మూర్తి కింక మరణమే శరణము
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

83. స్వంత తల్లి నగలు, సవతికి అందించి
బాధపెట్టు సుతులు బ్రతుకనేల
మాతృభాష ద్రోహ మిట్టిదేయగుజుమి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

84. బలసినట్టి భాష, బలహీనమగు దాని
యిట్టె మింగి వేసి గుట్ట గూల్చు
తెలుగు భాష కిట్టి స్థితిని రానీయకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

85. ఆంధ్ర ప్రభుత తెలుగు కంగీకరించినా
పెక్కు ఆఫీసర్లు లెక్క గొనరు
పారునీళ్ళ కెపుడు పాచి తెగులన్నట్లు
(దైవము వరమిడినా దారివ్వడు పూజారి)
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

86. తెగులుపట్టినట్టి తెలుగు బిడ్డల్లోని
అంతరించినపుడె ఆంగ్లతిక్క
మాతృభాష కొచ్చు మంచి రోజానాడు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

87. ఇళ్ల లోనె కాదు బళ్లలో గుళ్లలో
కోర్టులందు ప్రజల హార్టులందు
చోటు గొన్న భాష సుస్థిరమై నిలుచు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

88. ఆంగ్లముండు వారి కన్ని ఉద్యోగాలు
తెలుగు భాష కింక విలువ యేది
అద్దె వాడికిల్లు అసలు వాడికి నిల్లు
(బంటుకు విలువిస్తే బాసును మ్రింగడా?)
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

89. లోకమార్పు తోడ పోకడలు మారాలి
మారనట్టి దెల్ల మరణ మందు
తెలుగు తల్లి కట్టి స్ధితిని పట్టింపకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

90. కొన్ని చోట్ల ప్రజలు ఎన్నో తరంబులు
కూర్చుకున్న భాష కూలెనంటె
భాషతోడ జాతి భవిత మరణింపదా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

91. ఆంద్ర భాషకంటె ఆంగ్లమే మేలైతే
చదివి నీవె అందు చతురు డగుము
ఆంగ్ల గజ్జి తెచ్చి అందరికి పుల్మకు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

92. తెలుగు వేషధారణ తెలుగు వేదికలందె
వేదికలను దాటి వెలికిరాదు
ఆంగ్లమైక మందె ఆఫీసు గణముండు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

93. అసలు చిత్త శుద్ది ఆఫీసరందుంటే
తెలుగు కూడ మంచి స్ధితి గడించు
మెత్తగుంటె రౌతు నర్తించు గుర్రాలు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

94. విలువ తరిగినట్టి తెలుగు మీడియాన్ని
యెంచుకున్నవాడు కించవడును
యేమిటీ పరీక్ష యెన్నాళ్ళు ఈశిక్ష?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

95. అరచి పిలువగానె అక్బరు పాదుషా
చచ్చిపోయెను కదా వచ్చు టెట్లు?
అర్ధమవని భాష తర్జుమా యిట్లుండు
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

96. పట్టిమూఢ మతము వల్లించు ప్రార్ధనల్
పాత భాషలోనే వాతలిడును
అర్ధమవని గోష వ్యర్ధ ప్రయాసరా
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

97. సకల మతములందు సమభావ దృష్టితో
తెనుగు భాష యున్నతికి తపించు
రహంతుల్లా గారి తహతహను గుర్తించి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

98. బడుగు తెలుగు భాష పాలింప యోగ్యమా
సాద్యమెట్టులనకుడు చవట లల్లె
నూర్ బాషా గారి తీరుగని నేర్చుకో
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

99. అరయ యూనికోడు కందరూ క్రమముగా
మారి మాతృభాష మనుగడకును
సహకరించినపుడె సంపూర్ణ సమృద్ది
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

100. కన్నతల్లి కింత గంజి పోయుట మాని
సానికొంప మరిగి చంపజూచు
బిడ్డలున్న పురిటి గడ్డ కాదీ భూమి
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

101. పూర్వరాజసాన పుట్టి పెరిగిన భాష
ప్రజలు రేబవళ్ళు పలుకు భాష
కవుల గంటమందు కదం త్రొక్కిన భాష
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

102. ఆంద్రదేశ రాజ అధికార పీఠాన
తెలుగు తల్లి పఠిమ తీర్చి దిద్ది
నిలుపకల్గు వరకు నిద్రపోరాదని
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

103. పరుల పాలనమ్ము పనికి రాదంటి మే
వారి తోక (భాష) పట్టి వదల రేమి?
ఉడిగమ్ము కింత ఉబలాటమెందుకో ?
తెలిసి నడుచు కొమ్ము తెలుగు బిడ్డ ||

-- ఆకురాతి గోపాలకృష్ణ A .S. పేట ,నెల్లూరు జిల్లా -524304 

Tuesday, September 25, 2012

ఆ పద్యం

 

 అందంగా అందమైన భావాన్ని అందించిన కరుణశ్రీ గారి ఒక పద్యాన్ని పంచుకోవడం.

తెలతెలవారు వేళ, తెరతీయగ పక్షి సమూహ సంతతుల్
కలకలకూయు వేళ, పయిగ్రమ్మిన మబ్బులు వాన చింకులన్
జలజలరాల్చు వేళ, సహజమ్ముగ స్వప్నములో స్తనంధయుల్
కిలకిల నవ్వు వేళ, తిలకింతును నీ సొగసుల్ జగత్ప్రభూ!

ఆ పద్యం స్ఫూర్తితో ఒక ప్రయత్నం. అయ్య వారిని గుర్తుచేసుకున్నప్పుడు, అమ్మవారిని కూడా స్మరించడం.

మిలమిల తెల్లవారుటకు మేలిమి బంగరు సంధ్యకాంతులన్
గలగల పారు యేరులకు గానము సేయు తరంగనాదముల్
కళకళలాడు పూలకు సుగంధముతో మకరంద మాధురుల్
పలుపలు రీతి గూర్చెదవు భాగ్యముగా జగదంబ యంతటన్!
================
విధేయుడు
_శ్రీనివాస్





Wednesday, August 29, 2012

హనుమంతుడి టి.ఏ. బిల్లు


లంకలో  రామ రావణ యుద్ధం ముగిసింది. లంకేశ్వరుడి మరణం తరువాత రాముడు పుష్పక విమానంపై  అయోధ్యకు తిరిగివచ్చి ఘనంగా పట్టాభిషేకం చేసుకున్నాడు. ఈ కోలాహలంలో పాత టియ్యే బిల్లులు సకాలంలో క్లెయిం చేసుకోకపోతే ఆ తరువాత ఇబ్బందులు పడాల్సి వస్తుందని అయోధ్యలో అనుభవశాలి ఒకరు సలహా చెప్పడంతో ఆంజనేయుడు ఎందుకయినా మంచిదని ముందుగానే తన బిల్లును సబ్మిట్ చేసాడు. యుద్ధంలో ఇంద్రజిత్తు వేసిన బాణానికి లక్ష్మణుడు మూర్చ పోయినప్పుడు సంజీవని మూలికను తేవడానికి వెళ్ళివచ్చినప్పటి ప్రయాణ భత్యం బిల్లు అది.
టియ్యే బిల్లు సెక్షన్లో పనిచేసే డీలింగ్ అసిస్టెంట్ తన బుద్ధి పోనిచ్చుకోకుండా అలవాటు ప్రకారం మూడు కొర్రీలు వేశాడు.
హనుమంతుడు ఈ టూరుకు ముందుగా అప్పటి రాజయిన భరతుడి  లిఖితపూర్వక అనుమతి తీసుకోలేదన్నది మొదటి అభ్యంతరం కాగాఅంజనీ సుతుడికి తన ఉద్యోగ హోదా రీత్యా విమానంలో (గాలిలో) ప్రయాణించే అర్హత లేదన్నది రెండోది. ముందస్తు అనుమతి తీసుకోకుండా గాలిలో యెగిరి వెళ్లి సంజీవని తీసుకువచ్చాడు. అందువల్ల అతడు సబ్మిట్ చేసిన బిల్లు నిబంధనల ప్రకారం ఆమోదయోగ్యం కాదు. పోతేఅతడ్నిసంజీవని మూలికను మాత్రమే తీసుకురమ్మని పంపారు. కానీ మొత్తం సంజీవని పర్వతాన్నే అంజనేయుడు తీసుకువచ్చాడు. పై అధికారుల ముందస్తు అనుమతి లేకుండా సొంత నిర్ణయం ప్రకారం తెచ్చిన అదనపు బాగేజ్ అలవెన్సును మంజూరు చేయడానికి రూల్స్ ఒప్పుకోవని  రాసేసి  డీలింగు అసిస్టెంటు ఫైలును  మూసేశాడు.
రామనామం తప్ప వేరేదీ రుచించని వాయునందనుడికి ఈ డీలింగ్ అసిస్టెంట్ వ్యవహారం సుతరామూ  రుచించలేదు. ముడతపడిన మూతిని మరింత ముడుచుకుని గబా గబా  వెళ్లి రామచంద్రులవారికే విషయం వివరించాడు. సాక్షాత్తు రాముడికే నమ్మిన బంటు అయిన తన విషయంలోనే ఇలా జరిగితే రామ పాలనను నమ్ముకున్న షరా మామూలు జనం మాటేమిటని రాజును  నిలదీశాడు.
రాముడికి హనుమంతుడంటే ఎంతో ఇది. కానీ నియమనిబంధనలంటే కూడా ఇంకెంతో ఇది. రూల్స్ ఒప్పుకోకపోతే రాజు మాత్రం ఏం చేస్తాడుఏం చెయ్యలేనని రాంబంటు మొహం మీదే చెప్పేసాడు.
పక్కనవున్న లక్ష్మణుల వారికి రాముడి వైఖరి చూసి వొళ్ళు మండింది. ఆరోజు పవన సుతుడు అమాంతంగా యెగిరి వెళ్లి సంజీవని తీసుకురాకపోతే తానీపాటికి స్వర్గంలో సభ తీరుస్తుండేవాడినన్న వాస్తవం గుర్తుకు తెచ్చుకుని మరింత మండి  పడ్డాడు.
ఆ కృతజ్ఞతతో లక్ష్మణుడు నేరుగా డీలింగ్ అసిస్టెంటుతోనే డీల్ చేసాడు.  ఏదోవిధంగా పని సానుకూలం అయ్యేట్టు చూడమని కోరాడు. బిల్లు శాంక్షన్ చేస్తే బిల్లు మొత్తంలో పది శాతం ఆమ్యామ్యా కూడా ఇస్తానని ప్రలోభపెట్టాడు.
అడుగుతోంది సాక్షాత్తూ రాజుగారి అనుంగు తమ్ముడు. పని చేయమంటోంది కూడా పుణ్యానికి  కాదు. ముట్టాల్సింది కూడా ముడుతున్నప్పుడు పనిచేయకపోవడానికి కారణం ఏముంటుంది కనుక.
డీలింగ్ అసిస్టెంటు మళ్ళీ ఫైల్  బయటకు తీసి  ఇలా తిరగరాసి పైకి పంపాడు.
కొన్ని ప్రత్యేక కారణాలవల్ల ఈ కేసును తిరిగి మరోమారు పరిశీలించడం జరిగింది.
హనుమంతులవారు ఈ టూరుపై  వెళ్ళిన సమయంలో భరతులవారు రాములవారి రాజ ప్రతినిధిగా రాజ్యం చేస్తున్నారు. అప్పటికి ఆయన పూర్తిస్తాయిలో రాజుగారి హోదాలో లేరు. రాములవారి ఆదేశం మేరకే ఆనాడు ఆంజనేయులవారు  ఈ అధికారిక పర్యటన మీద వెళ్లారు. శ్రీవారు స్వయంగా ఆదేశించారు కాబట్టిఅది కూడా అత్యంత జరూరుగా జరగాల్సిన రాచకార్యం కాబట్టిఈ పర్యటనకు మామూలుగా వుండే నిబంధనలు వర్తించవు. కాబట్టి ఈ బిల్లును యధాతధంగా ఆమోదించడమైనది. అలాగే ఆయన క్లెయిం చేసిన  ఎయిర్ ట్రావెల్ ఖర్చులను కూడా ప్రభుత్వ ఖజానా నుంచి చెల్లించడానికి ముందస్తు ప్రత్యేక అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదని భావించడం జరిగింది.
పోతేఅదనపు బాగేజీకి సంబంధించి చెల్లింపు విషయంలో గతంలో లేవనెత్తిన అభ్యంతరాన్ని సయితం పునః సమీక్షించడం జరిగింది. హనుమంతులవారు గ్రూప్ డి’ కేటగిరీ ఉద్యోగి కనుకన్నూమూలికలను గుర్తించగలిగే సామర్ధ్యం వుండడానికి అవకాశం లేదు కనుకన్నూపొరబాటున తప్పుడు మూలికను తీసుకువచ్చిన పక్షంలో మరికొన్నిసార్లు అక్కడికి వెళ్లి రావాల్సిన పని పడే అవకాశం వుందికనుకన్నూఅలాటి ప్రయాణాల వల్ల ప్రభుత్వ ఖజానాపై అనవసర భారం పడే  అవకాశాలు లేకపోనూ లేవు కనుకన్నూ – ఈ అన్ని విషయాలనుఖజానా భారాన్ని  సాకల్యంగాసవివరంగా  పరిశీలించి, ‘ప్రజాప్రయోజనాల’ దృష్ట్యా ఈ బిల్లును పాసు చేయాలని సిఫారసు చేయడం జరిగింది.
అంతే!  ఫైలు ఆఘమేఘాల మీద కదిలింది. అనేక విభాగాలు చుట్టబెట్టింది. బిల్లు ఆమోదానికి అందరూ ఎస్’ అన్నవాళ్ళే. నో’ అన్న వాళ్లు ఒక్కరూ లేరు. అందుకే ఒక్క రోజులోనే టియ్యే డబ్బులు హనుమంతుడి ఖాతాలో   పడ్డాయి.

Thursday, July 12, 2012

పరువు పేరుతో పైశాచికం

 


'పరువు హత్య'ల పేరుతో సిగ్గుమాలిన, ఆటవికమైన హత్యలు తరచు కొన్ని ఉత్తరాది రాష్ట్రాలలో సంభవిస్తున్నాయి. కులం కట్టుబాట్లకు, ఆచారాలకు విరుద్ధంగా పెళ్ళి చేసుకొన్నారన్న ఆరోపణతో యువజంటలను స్వయంగా వారి రక్తసంబంధీకులే పరమ కిరాతకంగా హతమార్చి, వాటిని 'పరువు హత్యలు'గా చిత్రించి, బహిరంగ సమర్థనకు బరితెగిస్తున్నారు. పంజాబ్‌, హర్యానా, రాజస్థాన్‌, ఉత్తరప్రదేశ్‌ తదితర
రాష్ట్రాలలో 'కుల పంచాయితీ'లు అక్షరాలా సమాంతర న్యాయవ్యవస్థలుగా పనిచేస్తూ, ఇలాంటి అమానుష హత్యలకు ఆదేశాలు జారీ చేయడం పరిపాటిగా మారింది.

ఇటువంటి ఒక హత్యకేసులో న్యాయస్థానం దోషులకు మరణశిక్ష విధించడంతో, హర్యానాలో జాట్‌ కులస్థులకు చెందిన 'ఖాప్‌ మహాపంచాయత్‌' కురుక్షేత్రలో సమావేశమై ఆ తీర్పును సవాలు చేయాలని నిర్ణయించింది. అది న్యాయస్థానాల అధికారాన్ని ప్రశ్నించడమే కాదు, 'నెల రోజుల్లో' హిందూ వివాహ చట్టంలో సవరణలు చేయాలని ప్రభుత్వానికి 'తాఖీదు' జారీ చేసింది. ఈ సమావేశంలో ప్రముఖ రైతు నాయకుడు
మహీందర్‌సింగ్‌ తికాయత్‌, కొందరు మాజీ పోలీస్‌, సైనికాధికారులు పాల్గొనడం ఈ రాజ్యాంగధిక్కారపు లోతుకూ, తీవ్రతకూ నిదర్శనం

ఒకే గోత్రానికి చెందినవారు(సగోత్రులు) పెళ్ళి చేసుకోరాదన్న నిబంధనను ఉల్లంఘించి 2007లో వివాహమాడిన మనోజ్‌, బబ్లీ అనే ప్రేమికులను ఖాప్‌ పంచాయితీ ఆదేశంపై రక్తబంధువులే హతమార్చారు. కోర్టు ఆదేశంపై వారికి పోలీసు రక్షణ కల్పించినప్పటికీ, హత్య జరిగిన రోజు రాత్రి వారు అదృశ్యమయ్యారని- న్యాయపోరాటం చేస్తున్న మనోజ్‌ తల్లి కథనం. ఇటువంటి పాశవిక హత్యలకు పోలీస్‌,
అధికారయంత్రాంగపు అండదండలు ఉంటాయనడానికి ఇదొక మచ్చుతునక మాత్రమే.

రాజకీయ నాయకుల సంగతి ఇక చెప్పుకోనవసరమేలేదు. కర్నాల్‌లోని జిల్లా, సెషన్స్‌ కోర్టు ఈ కేసులో అయిదుగురికి మరణశిక్ష, ఒకరికి యావజ్జీవశిక్ష విధించింది. కొడుకును, కోడలిని కోల్పోయిన దుఃఖంతోపాటు, కుల పంచాయితీ విధించిన సామాజిక వెలిని గత మూడేళ్ళుగా అనుభవిస్తున్న మనోజ్‌ తల్లిది మరోరకం చావు. కుల పంచాయితీ 'మరణశాసనం' విధించడానికి సగోత్ర వివాహాలే కారణం కానవసరంలేదు.
కులాంతర వివాహం చేసుకున్నా, ఒకే గ్రామానికి చెందిన యువతీ యువకులు పెళ్ళిచేసుకున్నా అదే గతి. రవీందర్‌ కౌర్‌ అనే అమ్మాయి వేరే కులస్థుని ప్రేమించి పెళ్ళిచేసుకుందని, ఆమె కళ్ళముందే భర్తను ఆమె తండ్రి, మరో దగ్గరి బంధువు నరికి చంపేశారు.

హంతకులకు సెషన్స్‌ జడ్జి మరణశిక్ష విధిస్తే, హైకోర్టు దానిని యావజ్జీవ శిక్షగా మార్చింది. ఎనిమిదేళ్ళ తర్వాత సుప్రీంకోర్టు దానిని ధ్రువీకరించింది. మనోజ్‌, బబ్లీ కేసులో తీర్పు వెలువడిన రోజునే ప్రబ్‌జీత్‌ కౌర్‌, పర్‌దీప్‌ సింగ్‌ అనే జంటను బంధువులు కాల్చి చంపారు. పోలీసు 'రక్షణ' య«థావిధిగా ఇక్కడా వారిని కాపాడలేక పోయింది. ఇక తల్లిదండ్రులే ఇటువంటి సందర్భాలలో
ఆడపిల్లకు విషమిచ్చి చంపి, ఆత్మహత్యగా చిత్రించడమూ మామూలేనట. ఒక సర్వే ప్రకారం, ఏడాదికి వందకు పైగా ఇటువంటి 'పరువు' హత్యలు జరుగుతున్నాయి. పెద్దలకు ఇష్టంలేని ఏ పెళ్ళినైనాసరే శిక్షించడానికి 'పరువు' ఒక ముసుగుగా మారినా ఆశ్చర్యం లేదు.

సగోత్ర వివాహాలు మంచివి కావనీ, ఆచార విరుద్ధమైనవనీ అనుకొన్నప్పుడు దానిని ఇతరులకు బోధించే హక్కును, వ్యక్తిగతంగా పాటించే హక్కును ఎవరూ కాదనరు. కన్నబిడ్డలైనా సరే, ఆ కట్టుబాటును ఉల్లంఘించారని చెప్పి, చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని వారికి 'మరణశిక్ష' అమలు చేసే రాజ్యాంగాతీతమైన అధికారం ఎంత కొమ్ములు తిరిగిన కుల పంచాయితీలకైనా ఉండదు, ఉండ డానికి వీలులేదు. ఆచారాలు,
సంప్రదాయాల పేరుతో సమాంతర న్యాయ, పోలీస్‌ వ్యవస్థలను నడుపుకొనే అధికారాన్ని ప్రతి కుల పంచాయితీకీ అనుమతిస్తే, రాజ్యాంగం, చట్టాల ఉనికికే అర్థం ఉండదు. ఉత్తరాది రాష్ట్రాలలో కుల పంచాయితీల పేరుతో జరుగుతున్న ఈ రాజ్యాంగ బహిరంగ ధిక్కారాన్ని ప్రభుత్వాలు ఉపేక్షిస్తున్నాయి కనుకనే, అవి ఇలా పేట్రేగుతున్నాయి. ప్రభుత్వాలకే 'అల్టిమేటమ్‌' జారీ చేయగలుగుతున్నాయి.

కుల పంచాయితీలకు ఉన్న ఓటు బలం రాజకీయపక్షాల నోటికి తాళం బిగిస్తున్న సంగతీ సుస్పష్టం. కోర్టులలో కేసుల పరిష్కారంలో జరిగే అసాధారణ జాప్యం కూడా కుల పంచాయితీ ముసుగులో ఇలా పైశాచిక ప్రవృత్తుల వికట తాండవానికి పరోక్ష దోహదం అవుతోంది. కులస్వామ్యం కోరలకు చిక్కి వివిధ రూపాల్లో నిత్య నరకాన్ని ఎదుర్కొంటున్న అభాగ్యులు మరెందరో ఉంటారు. వారందరూ వార్తలలోకి రారు.
ఉత్తరప్రదేశ్‌లో బిజ్నోర్‌ అనే గ్రామంలో కుల పంచాయితీ తండ్రీ, కూతుళ్ళకు అక్రమ సంబంధం అంటగడితే తీవ్ర మనక్షోభకు గురైన ఆ ఇద్దరూ కులపంచాయితీ సభ్యులిద్దరినీ కాల్చి చంపినట్టు వార్త.

ఖాప్‌ మహాపంచాయత్‌లో పాల్గొన్న వారిలో పలువురు ప్రముఖులు, విద్యావంతులు ఉండడం, సామాజిక జీవితమూ, నైతిక మర్యాదలూ చట్టపరమైన అంశాలు కావని, కుల పెద్దలు తేల్చవలసిన కుటుంబవిషయాలని, కులగౌరవం చట్టంకన్నా గొప్పదని అపరిణత వ్యాఖ్యలు చేయడం మధ్యయుగాల మౌఢ్యాన్ని భయానకంగా ప్రదర్శిస్తున్నాయి. 'పరువు'హంతకులకు సముచిత శిక్షపడే విధంగా, ప్రత్యేక నేరంగా వర్గీకరిస్తూ భారత
శిక్షాస్మృతిని సవరించే యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. దానితోపాటు కుల పంచాయితీలపై ఉక్కుపాదం మోపడం అవసరం. అప్పుడే ప్రభుత్వం ఉనికికి అర్థం, పరమార్థం.--సాక్షి సంపాదకీయం 18.4.2010

అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు

 


మహిళలు మహరాణులు
పచ్చనైన ప్రతి కథకు తల్లివేరు పడతులు
భగ్గుమనే కాపురాల అగ్గిరవ్వ భామలు
ఇంటి దీపమై వెలిగే ఇంధనాలు ఇంతులు
కొంప కొరివిగా మారే కారణాలు కాంతలు [మహిళలు]

ఆశపుడితే తీరుదాకా ఆగరు ఎలనాగలు
సహనానికి నేలతల్లిని పోలగలరు పొలతులు
అమ్మగా లోకానికే ఆయువిచ్చు తల్లులు
అత్తగా అవతరిస్తే వారే అమ్మతల్లులు
ఆడదాని శత్రువు మరో ఆడదనే అతివలు
సొంత ఇంటి దీపాలనే ఆర్పుకునే సుదతులు
అర్ధమవరు ఎవరికీ ప్రశ్నలైన ప్రమదలు [మహిళలు]

విద్యలున్నా విత్తమున్నా ఒద్దికెరుగని వనితలు
ఒడ్డుదాటే ఉప్పెనల్లే ముప్పుకారా ముదితలు
పెద్దలను మన్నించే పద్దతే వద్దంటే
మానము మర్యాదా ఆగునా ఆ ఇంట
కన్నులను కరుణకొద్ది కాపాడే రెప్పలే
కత్తులై పొడిచేస్తే ఆపేదింకెవరులే
వంగివున్న కొమ్మలే బంగారు బొమ్మలు [మహిళలు]

--సీతారామశాస్త్రి

మన దేవుళ్ళకు తెలుగు రాదా? పులికొండ సుబ్బాచారి వ్యాసం (సూర్య 9.4.2012)

 


మన దేవుళ్ళకు తెలుగు రాదా?

దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయించే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు మనం ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయో ర్మధ్యదేశే అస్మద్‌ గృహే పత్నీ సహితం అని వగైరా మన ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తాడు.ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలిగిన వ్యక్తిని భరతవర్షంలో భరత ఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణాగోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్ని కోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న.

ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసును బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.మన దేవుళ్ళు ఏ భాషలో మాట్లాడారో మనకు తెలి యదు. తెలుసు అని అనుకుని చెప్పేవాళ్ళు మా త్రం దేవుళ్ళు సంస్కృతంలో మాట్లాడుకుంటారు అని చెబుతారు. అందుకే దీన్ని దేవభాష అనీ అంటుంటారు అంతే కాదు దీన్ని గీర్వాణభాష అని గీర్వాణంగా చెబుతారు. కాని దేవుళ్ళు మాట్లాడగా విని చెప్పిన వారు తటస్థిస్తే దీన్ని నిక్క చ్చిగా నమ్మే వీలుంది. దేవుళ్ళలో కూడా జండర్‌ వివక్ష చాలా ఉందని చెప్పడానికి వీలుంది. మన సంస్కృత నాటకాల్లో పురుష దేవతలు అందరూ సంస్కృతంలో సంభాషిస్తూండగా సేవకులు పరిచార కులు వంటి అథమ పాత్రలు, స్ర్తీ దేవతలు మాత్రం సమాజంలో తక్కువగా భావించిన ప్రాకృత భాషలో మాట్లాడతాయి.

ఇదంతా మన సంస్కృత నాటకకారుల చేతిచలువే కాని దేవతా స్ర్తీలు ఏ భాషలో మాట్లాడారో వారికేం తెలుసు అని మన ఫెమినిస్టు వీరనా రీమణులు అడిగే అవకాశమూ లేకపోలేదు. నిజానికి దేవుళ్ళు ఏభాషలో మాట్లాడినా మనకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. కాని మనం మాట్లాడే తెలుగు వారికి అర్థం కాదట. దీనితోనే మన కు ఇబ్బంది వచ్చింది.
ప్రతి మనిషి తాను పుట్టిన ఇంట్లో తల్లి తండ్రి కుటుంబ సభ్యులతో నేర్చుకునే భాష ఒకటి ఉంటుంది. దాన్నే మాతృభాష అని అంటారు. నిజానికి ఇది కుటుంబ భాష. వ్యక్తి పెరిగి విద్యావంతుడు అవుతూ ఇతర భాషలు నేర్చు కుంటాడు. తన సామాజిక అవస రాలకు ఏ భాష అవసర మో దానిలో అతను పని చేసుకుంటాడు. తన దైనందిన జీ వితపు అవస రాలకు తన భాషే విని యోగప డాలని ప్రతి భాషీ యుడు కోరుకుం టాడు. అలా వీలుపడని సందర్భాలలో ఆ సందర్భా నికి అవసరమైన భాష లో పని చేసుకోవలసి ఉంటుంది.

ప్రతి భాషకు సంబంధించిన వారికి, ప్రతి సంస్కృతిలోని వారికీ సామా జిక సందర్భాలతో పాటు మత సందర్భాలూ ఉంటాయి. అంటే దేవునితో సంబంధం ఉన్న సందర్భాలు అని కూడా వీటిని చెప్పవచ్చు. ప్రతి సంస్కృ తిలో జానపదులలో గిరిజన తెగలలోను ఈ మత సందర్భాలలో దేవునికి మనిషికి మధ్యన మరొక మనిషి ఉంటాడు. ఇతడినే పూజారి అని ఆచార మంతుడు అని, ముజావర్‌ అని పాస్టర్‌ అని ఒక్కొక్క మతంలో ఒక్కో సం స్కృతిలో ఒక్కో పేరుతో పిలుస్తారు. ఈ మధ్యవర్తి మన తరఫున దేవునితో మాట్లాడుతుంటాడు.

ప్రతి సంస్కృతిలోను దేవునితో మాట్లాడే భాష దేవుడు మాట్లాడే భాష వేరుగా ఉంటాయని ప్రజలు విశ్వసిస్తారు. అందుకే చాలా మత గ్రంథాలు సామాన్య మానవు లు మాట్లాడే భాషలో లేవు. అంతే కాదు మత సంబంధమైన దైవ సంబం ధమైన కార్యక్రమాలు అన్నీ అందరికీ అర్థంకాని భాషలో ఉంటాయి. ఒక తరహా భాషకు మతగౌరవం లభించిన తర్వాత ఆ భాష అర్థంకాకపోయినా ఫర్వాలేదు అనే భావన ఆ భాషీయులలో కలగడం అన్ని చోట్లా గమనించవచ్చు. అందుకే వీటిని రిచ్యువల్‌ లాంగ్వేజస్‌ అని అంటారు. అంటే ఇక్కడ పావిత్య్రం అనే భావన భాషతో ఉందే కాని భావంతో ప్రధానంగా కాదని. ప్రస్తుతం ఈ విషయాన్ని తెలుగు నేలపై లేదా ఆంధ్ర ప్రదేశ్‌ విషయంలో ఏం జరుగుతుందో గమనించి మంచి చెడు ఆలోచన చేద్దాం. ఆంధ్ర దేశంలో ఎక్కువ శాతం ప్రజలలో అంటే చాలా కులాల వారికి మత సంబంధ కార్యక్రమాలు నిర్వహించేది బ్రాహ్మణ కులానికి చెందిన పూజారులు.

లైఫ్‌ సైకిల్‌ రిచ్యువల్స్‌ వీటినే జీవన చక్ర సంబరాలు అని అంటారు. అంటే మనిషి పుట్టి నప్పుడు చేసే ఆచారం దగ్గరనుండి ఉపనయనం, రజస్వల, పెండ్లి, గర్భాదానం తిరిగి పుట్టుక అంటే బారసాల మరణం వీటన్నింటి సందర్భాలలో పూజారి ఉండి మనతో ఆయన పూజ చేయించ వలసి ఉంటుంది. మన తరఫున దేవునికి ఆయన మంత్రాలు చదువుతాడు. అంతే కాదు చాలా ఇతర సందర్భాలలో అంటే గృహప్రవేశం, సత్యనా రాయణస్వామి వ్రతాలు వంటి చాలా వ్రతాలలోను ఇలాంటి ఇతర మత సందర్భాల లోను పూజారి లేకుండా పనులు జరగవు. ఇక గుడికి పోతే మనం చేసే అష్టోత్తరం సహస్రనామం, అర్చనలు వంటి అన్ని సేవలు మన తరఫున పూజారి చేస్తాడు. తెలు గు నేలమీద తెలుగు వారి ఇండ్లలో, గుడులలోను జరిగే ఈ అన్ని కార్య క్రమాలలో ను పూజారి చదివే మంత్రాలు పూజలు అన్నీ అటు పూజారికీ ఇటు చేయించుకునే వారికి తెలిసిన తెలుగు భాషలో జరగవు. ఇవి అన్నీ సంస్కృత భాషలో జరుగుతాయి.

దేవునికి ఘంటానాదం సమర్పయామి, మధ్యమధ్యే పానీయం సమర్పయామి, దీపం దర్శయామి, ధూపమాఘ్రాపయామి, నాట్యం దర్శయామి అని మనం చేసే సేవలు అన్నింటికీ మన తరఫున పూజారి మనకు తెలియని సంస్కృతభాషలో చదువు తాడు. దేవాలయంలో కాని ఇంటి వద్ద కాని చేసే యజ్ఞయాగాదులన్నింటా చేసేది మనం అయినా చేయించే పూజారి చదివేది మనకు తెలియని సంస్కృత భాషే. దీనికి బదులు మనం ఇదే విషయాన్ని తెలుగులో మనమే చెప్పకూడదా. చివరికి సంకల్పం చెప్పే భరత వర్షే భరత ఖండే మేరోర్దక్షిణ దిగ్భాగే, కృష్ణా గోదావరీయోర్మధ్యదేశే అస్మద్‌ గృహే పత్నీ సహితం అని వగైరా మన ఇంట్లో మనం, అంటే నేను వ్రతాన్ని ఆచరిస్తున్నాను అని మనం చెప్పే మాటల్ని పూజారి దేవునికి సంస్కృతంలో వినిపిస్తా డు. ఇలాంటి సంకల్పాన్ని చక్కగా మనకై మనం తెలుగులో నేను ఫలానా పేరు కలి గిన వ్యక్తిని భరతవర్షంలో భరతఖండంలో మేరు పర్వతానికి దక్షిణ దిక్కున కృష్ణా గోదావరీ నదుల మధ్యభాగంలో ఉన్న తెలుగు నేలలో ఫలానా ఊరిలో కుటుంబ క్షేమాన్నికోరి వ్రతం చేస్తున్నాను దేవా అని దేవునికి తెలుగులో మనం చెప్పుకోలేమా అన్నది ప్రశ్న. ఇక్కడ పవిత్రత సంస్కృత భాషని బట్టి వస్తుందా లేదా చేసే మనసు ను బట్టి వస్తుందా అన్నది మనం ఆలోచించాలి.

అంతే కాదు పెళ్ళి సందర్భంలో వరుడుతో తాళి కట్టే ముందు పూజారి ఒక మంత్రం అనిపిస్తాడు. మాంగల్యంతంతునానేనా మమ జీవన హేతునాం కంఠే బధ్నా మి శుభగే సంజీవ శరదాం శతం అని. నోరు తిరిగినా తిరగకపోయినా పెళ్ళికొడుకు దాన్ని చెప్పి తర్వాత ఆమె మెడలో మాంగల్యాన్ని కడతాడు. ఇది పూజారికి అర్థం అయితే కావచ్చుగాక కాని తాళికట్టే పెండ్లి కొడుకులకు దీని అర్థం నూటికి తొంభై తొమ్మిదిమందికి అర్థంకాదు. కట్టించుకునే పెండ్లి కూతు రుకీ అర్థంకాదు, చుట్టూ ఉన్న బంధుమిత్రులకూ అర్థంకాదు. ఇంత బాధ ఎందుకు పెండ్లి కొడుకుతో నేను నూరేండ్లు హాయిగా ఈమెతో కలిసి జీవించడానికి గాను ఈమె కంఠంలో మాంగల్యా న్ని కడుతున్నాను అని చక్కగా తెలుగు లో చెప్పి కట్టవచ్చుగా. మిగతా ప్రమాణాలు అన్నీ కూడా ఇలా తెలు గులో చేస్తే చాలా హాయిగా ఉండదా.

కాని పెండ్లివేళ అక్కడికి ఆవాహన చేసిన దేవుళ్ళకి ఈ తెలుగు అర్థంకాదట. దేవుళ్ళకి అలా సంస్కృతం మం త్రాలలోనే చదివితేనే పవిత్రమైనదని వారికి తెలుస్తుందని ఒక పూజారిగారు సెలవి చ్చారు. అంతే కాదు అలా మంత్రాలని తెలుగులో చదివి చెప్పడాన్ని పెళ్ళి చేయించు కునే ప్రజలు ఎవరూ అంగీకరించేలా కూడా లేరు. వారికి కూడా సంస్కృతం మంత్రా లు చదివితేనే తృప్తి అక్కడికి అది పవిత్రమౌతుందని భావం కలుగుతుంది. గుడిలో జరిగే విషయంలోను ఇదే జరుగు తుంది. కాని ఒకప్పుడు కవి రాజు త్రిపురనేని రామస్వామి చౌదరి పెండ్లిండ్లు అన్నీ తెలుగులో చేయవచ్చని, చేయాలని ఒక ఉద్యమంగా గ్రహించి చేపట్టారని చాలా సందర్భాలలో అలా చేయించారని పెద్ద వాళ్లు చెప్పగా విన్నాను. పెండ్లి మంత్రాలన్నీ తానే చదివి దేవునికి అప్పగిస్తే పెండ్లి కొడు కు ఊరక అతను చెప్పినవన్నీ చేస్తే ఆమె ఎవరి భార్య అవుతుం ది అనే తీవ్రమైన ప్రశ్నలు కూడా లేవనెత్తాడు వెనిగళ్ళ సుబ్బా రావు పెండ్లి మంత్రాల వెనుక బండారం అనే పుస్తకంలో.
కాని పరిస్థితి దేశం అంతటా ఇలా లేదు.

చాలా గ్రామ దేవతల గుడులలో, పేరం టాళ్ళ దేవతల గుడులలో వెనుకబడిన వర్గాలకు చెందినవారు, దళితులు పూజారులు గా ఉన్నారు. అక్కడ జరిగే ఆచారాలన్నింటి లో తెలుగులోనే పూజా కార్య క్రమాలు జర గడం గమనించవచ్చు. చాలా గ్రామ దేవ తల గుడులలో రజకులు, క్షురక వృత్తి వా రు పూజారులుగా ఉన్నారు. అలాగే కొమ్ములవాళ్ళు, బైండ్లవాళ్ళు వంటి దళితులు పూ జలు చేసే గుడులు, జాతరలు కొన్ని ఉన్నా యి. వాటిలో ఈ కులాల పూజారులు వారి మంత్రాలను ఆచారాలను తెలుగులోనే చేస్తారు. కొన్ని సందర్భాలలో వినపడకుం డా చదవడం కూడా ఉంది. దీన్నిబట్టి పవిత్ర కార్యక్రమాలు తెలుగులో చేసుకోవచ్చు అని ఒక నిరూపణ మనకు ఉండనే ఉంది.

చాలా మంది గిరిజనులు వారి దేవతల పూజల్ని వారి భాషలోనే చేసుకోవడం ఉం ది. ఇన్ని ఉండగా నూటికి ఎనభై మంది పై గా ఉన్న తెలుగు వారు అటు గుడు లలోను ఇటు ఇండ్లలో జరిగే మత కార్యక్రమాలలో ను ఎరికీ తెలియని సంస్కృత భాషను ఎం దుకు వాడాలి మనకు తెలిసిన తెలుగులోనే మనం చేసుకోకూడదా. నిజానికి మనం మ న దేవునికోసం మనమే చేసే పూజకు మధ్య వర్తి ఉండి మనకు తెలియని భాషలో చదవ డం అవసరమా. ఇవి మౌలికమైన ప్రశ్నలు. ఇవి విశ్వాసానికి మాత్రమే సంబంధించిన వి కావు. అసలు దేవుని దృష్టిలో మనుషుల మధ్య తారతమ్యాలు లేనట్లే భాషల మధ్య కూడా ఉండవు. అది నిజంగా దేవుడే అయితే అసలు ఉండడానికి వీలులేదు. మన దేవుళ్లకు తెలుగు రాదా అని ప్రశ్న వేసు కుంటే రాదు అని చెప్పగలిగే తెలుగువారు ఉన్నారా. రాదు అని చెప్పలేనప్పుడు మన తెలుగుకు మతసంస్కార స్థాయిని కల్పించి గుడిలో ఇంట్లో అన్ని మతకార్యా లకు తెలుగే ఎందుకు వాడకూడదు అని ప్రశ్న వేసు కుందాం.

ఈ విషయంలో క్రిస్టియన్లు కొంత మెరుగు అనిపిస్తుంది వారు మత ప్రచారం చేయడానికి తమ లక్ష్యంగా ఎవరు ఉన్నారో వారి భాషలోనే ఆధ్యాత్మిక ప్రసంగాలు చేస్తారు. క్రీస్తు భాష అని హీబ్రూ భాషలో చేయరు. కాని వారి తెలుగు విషయంలోను తకరారు ఉంది. వారు ఒక ప్రత్యేకమైన తెలుగును కృతకమైన దాన్ని అభివృద్ధిపరిచారు. వారి మతప్రచారకు లకు మామూలుగా అందరికీ అర్థమయ్యే తెలుగు వచ్చినా దానిలో మాట్లాడరు. వారి కృతక తెలుగులోనే మాట్లాడతారు. ఆ తెలుగుకు మత స్థాయి వచ్చింది.
బడుల్లో తెలుగు పరిస్థితి దీనాతిదీనంగా ఉందనే విషయం మొన్న విశాఖ పట్నం లో జరిగిన సంఘటన. అధికారభాష అమలుకూడా ప్రభుత్వం చేతిలో ఉంది. దాని కోసం ఉద్యమం చేయాల్సిందే. కాని మన ఇండ్లలో చేసే పూజల్లోను గుడుల్లో చేసే పూజల్లోను మనకు మనమే దేవునికి మనకు తెలిసిన మన తెలుగులో చేసుకోలేమా అని ప్రశ్నించుకొని ఆచరిస్తే మన తెలుగుకు మతసంస్కార స్థాయిని, పవిత్ర స్థాయిని తెచ్చుకోవడం మన చేతల్లోనే ఉంది. దీనికోసం ప్రత్యేకంగా ఒక ఉద్యమం చేసైనా తెలుగుకు మతపవిత్రస్థాయికూడా తెచ్చుకోవాలి. నాకు తెలుగు అర్థం కాదు అనే దేవుడు ఉంటాడని దేవుడిని నమ్మేవాళ్ళు ఎవరైనా అంటారా. చూద్దాం వేచి చూద్దాం.--( వ్యావహారికభాషా మార్గదర్శి గురజాడ 150 జయంతి సం పురస్కరించుకొని) (సూర్య 9.4.2012)

తల్లి భాష పట్ల నిరాదరణ తగునా!

 

మన తల్లి భాష తెలుగు. అది మన రాష్ట్ర రాజ భాష కూడా. తెలుగు భాష మాట్లాడే వారి సంఖ్య ప్రపంచంలో పదికోట్లతో మూడవ స్థానంలో ఉందని గర్వంగా చెప్పుకుంటాము. కానీ దానికి తగిన ఆదరణ లభించడం లేదు. విదేశాల్లో తెలుగు భాషాభివృద్ధికై పలు సంస్థలు పాటుపడుతుంటే మన రాష్ట్రంలో పరిస్థితి మాత్రం అంతకంతకూ దిగజారిపోతోంది. ఇటీవల జరిగిన గ్రూప్‌-1 పరీక్షలో తెలుగు ప్రశ్నాపత్రంలో తప్పులు దొర్లితే ఇంగ్లీష్‌నే అంతిమంగా పరిగణనలోకి తీసుకుంటామని ఎపిపిఎస్సీ ప్రకటించడం కొసమెరుపు. ఇతర రాష్ట్రాలకొచ్చేసరికి ఆ రాష్ట్రాలు వాటి మాతృభాషకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాయి. కానీ మన రాష్ట్రంలో స్వచ్ఛమైన తెలుగు భాషపై ఎందుకంత చిన్నచూపు? అలాగే ప్రైవేట్‌ స్కూల్స్‌ పెరిగిపోయి తెలుగుభాషకు ప్రాధాన్యత లేకుండా పోతోంది. దీనికితోడు పిల్లల్లోకూడా తెలుగులో మాట్లాడడానికి, రాయడానికి కూడా చాలా భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో పాలకులు స్పందించి తగిన నిధులు కేటాయించి మన మాతృభాష తెలుగుకు ప్రాధాన్యం ఇచ్చేలా చర్యలు తీసుకోవాలి.

Saturday, January 14, 2012

మనసు మనిషిని మనిషిగ చేస్తుంది


కలువకు చంద్రుడు ఎంతో దూరం
 కమలానికి సూర్యుడు మరీ దూరం
 దూరమైన కొలదీ పెరుగును అనురాగం
 విరహంలోనే ఉన్నది అనుబంధం [[కలువకు]]

నవ్వు నవ్వుకు తేడా ఉంటుంది
 నవ్వే అదృష్టం ఎందరికుంటుంది
 ఏ కన్నీరైనా వెచ్చగ ఉంటుంది
 అది కలిమిలేములను మరిపిస్తుంది [[కలువకు]]

వలపు కన్నా తలపే తీయన
 కలయిక కన్నా కలలే తీయన
 చూపులకన్నా ఎదురు చూపులే తీయన
 నేటి కన్నా రేపే తీయన [[కలువకు]]

మనసు మనిషిని మనిషిగ చేస్తుంది
 వలపా మనసుకు అందాన్నిస్తుంది
 ఈ రెండూ లేక జీవితమేముంది
 ఆ దేవుడికి మనిషికి తేడా ఏముంది [[కలువకు]]

--ఆత్రేయ 1975 చిల్లరదేవుళ్ళు

విధినిగెల్చుట ఎవరితరమూ


చిత్రమైనది విధీ నడకా
పరిశోధనే ఒక వేడుకా
రాజులే రారాజులే గానీ
వీరాధి వీరులే గానీ
విర్రవీగుట వెర్రిగానీ
విధినిగెల్చుట ఎవరితరమూ [[చిత్రమైనది]]
సత్యనిరతుని పతినిబాసి దాసియైనది చంద్రమతియే
తల్లితండ్రి గురుడుతానై కన్నబిడ్డను పెంచలేదా [[చిత్రమైనది]]
అడవిలోన కుములుటే శ్రీరామగీత
అపనిందతోవెలియౌటయే సతి సీతరాతా
తప్పలేదే బాధలు వారికైనా
తప్పునాసామాన్యులకు ఈ వేధనా [[చిత్రమైనది]]
ధారుణ మీ దరిద్రము విధాత సృజించినబాధలందునన్
రౌరవమాదిగాగల నిరంతరకష్టములైన సాటియే
ఘోర దరిద్రభారమునకుంగిన ఆ నల చక్రవర్తియే దారను వీడిపోయెనుగదా
ఇక అన్యులులెక్కయౌదురే ఇక అన్యులులెక్కయౌదురే

--సుసర్ల దక్షిణామూర్తి,సంసారం 1950

తెల్లవార వచ్చె తెలియక నా సామి

ప్రతిరోజు తెల్లవారుతుంది. తెల్లవారుట గురించి రెండు మాటలు, కాదు రెండు పాటలనుండి కొన్ని మాటలు.
ప్రతిరోజు తల్లులు పిల్లల్ని నిద్ర లేపుతుంటారు. సినిమా సన్నివేశమేమో కాని, యశోద తన బాలకృష్ణున్ని నిద్ర లేపుతున్నట్టుగా రాసిన పాటలో తెలుగు నుడికారాన్ని, తల్లి మమకారాన్ని మేళవించి అందించారు మల్లది రామకృష్ణశాస్త్రిగారు. కృష్ణుడు చిన్నవాడు. పాట చిన్నది. పదాలు చిన్నవి. చిన్న వాటితోనే మరి సొగసంతా. లీల గళంలో ఇంకొంత రమణీయత సంతరించుకుంది.

------------------------------
మల్లాది వారి రచన ("చిరంజీవులు" సినిమాలో)-
"తెల్లవార వచ్చె తెలియక నా సామి
మళ్ళీ పరుండేవు లేరా
మళ్ళీ పరుండేవు మసలుతూ ఉండేవు
మారాము చాలింక లేరా
కలకలమని పక్షి గణములు చెదిరేను
 కల్యాణ గుణధామ లేరా
తరుణులందరు దధి చిలికే వేళాయె
దైవరాయ నిదుర లేరా
నల్లనయ్య రారా నను కన్నవాడా
బుల్లితండ్రి రారా బుజ్జాయి రారా
నాన్నా మీ అమ్మ గోపెమ్మ పిలిచేను
వెన్న తిందువుగాని రారా"
------------------------------
  అందరికీ తెలిసే వచ్చే తెల్లవారడాన్ని తెలియకుండా వచ్చేసిందని చెప్పడం,
 నిద్ర లేపడం, అంతే కాదు, ఎక్కడ పిల్లవాడు మళ్ళీ పడుకుంటాడో అని "మళ్ళీ పరుండేవు"
 అని అనడం సహజత్వంతో కూడిన సొగసు. "కల్యాణ గుణధామ లేరా" అన్నప్పుడు
  "కౌసల్యా సుప్రజా రామా" అన్నది స్ఫురిస్తుంది. తల్లి పిల్లవాణ్ణి "నను కన్నవాడా, బుల్లితండ్రి" అనడం తెలుగులోనే ఉందో ఇంకే ఇతర భాషల్లో ఉందో తెలియదు.
 నిద్ర లేచి ఏం చెయ్యమంటావు? ఎందుకు లేవాలి? ఇవి ప్రతి పిల్లవాడి ప్రశ్నలే ప్రతిరోజు. మరి యశోద తల్లి చాతుర్యమంతా, ఈ నిద్ర లేవడం అంతా ఎందుకంటే
 "వెన్న తిందువుగాని రారా" అనడంలో ఉంది, కాదు యశోద చేత పలికించిన తీరులో ఉంది. "మన్ను తిన్నవాడిని" వెన్న తినడానికి లేవమంటే ఇంకెందుకు లేవడు? అన్న గడుసుతనం కూడా ఉంది, గోప్యంగా. ఉండదు మరి, లేపేది గోపెమ్మే కదా!

 తెల్లవారడం గురించి ఇటీవల అస్తమించిన మల్లెమాల గారి పాటలోని కొన్ని పదాలు
 గుర్తొస్తాయి, కాదు గుర్తుండేలా రాసారు.
 "వెలుగు దుస్తులేసుకొని సూరీడు,
  తూర్పు తలుపు తోసుకొని వచ్చాడు,
  పాడు చీకటికెంత భయమేసిందో,
   పక్క దులుపుకొని ఒకే పరుగు తీసింది" (మల్లెమాల "ముత్యాల ముగ్గు" పాటలో)
 సామాన్యంగా చీకటి అంటే భయపడతారు. అట్లా కాదట! వెలుగు దుస్తులేసుకున్న సూరీడును చూసి అందరు భయపడే చీకటికే భయమేసి పరుగు తీసింది అనడం చమత్కారం.

 తెలిసిన తెల్లవారుటను సరికొత్తగా చూపించి, అందంగా అందించి, ఆనందింపజేయడం, చదివిన వేళ ఎప్పుడైనా తెల్లవారినట్టుగా అనిపించడం సాధించారేమో అనిపిస్తుంది.
============
విధేయుడు
_శ్రీనివాస్

Thursday, October 13, 2011

The role of muslim in Aazad Hind Fouz



ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో ముస్లిం పోరాట యోధులు

సయ్యద్‌ నశీర్‌ అహమ్మద్‌

పరాయి పాలకులను మాతృ దేశం నుండి తరిమికొట్టేందుకు సాగిన సుదీర్ఘ స్వాతంత్య్రపోరాట చరిత్ర చివరిదశలో ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ (భారత జాతీయ సైన్యం) సాగించిన సాయుధ పోరాటంలో ఆది నుండి అంతం వరకు ముస్లింపోరాట యోధులు చాలా ప్రధాన భాగస్వామ్యం వహించారు.


1941 జనవరిలో సుభాష్‌ చంద్రబోస్‌ ఆంగ్ల ప్రభుత్వ గూఢాచారి వ్యవస్థ కళ్ళుగప్పి మహమ్మద్‌ జియావుద్దీన్‌ అను మారు పేరుతో కలకత్తా నుండి తప్పుకున్న 'గ్రేట్‌ ఎస్కేప్‌' ఏర్పాట్లను మియా అక్బర్‌ షా నిర్వహించగా, ఆ తరువాతి ప్రాణాంతక కాబూల్‌ ప్రయా ణంలో అక్బర్‌షా ఏర్పాటు చేసిన సాయుధ పఠాన్‌ యువ కులు నేతాజీకి అంగరక్షకులుగా నడిచారు. ఆఫ్ఘాన్‌ గుండా పఠాన్‌ వేషంలో నేతాజీ ప్రయాణం సాగించాల్సి వచ్చిన ప్పుడు, ఆంగ్ల గూఢచారులు, వారి తొత్తులు ఏమాత్రం గుర్తు పట్టకుండా ఆబాద్‌ ఖాన్‌ నేతాజీకి ఆఫ్ఘాన్‌ పఠాన్‌ వ్యవహారసరళి,ఆచార సాంప్రదాయాలలో వారం రోజుల పాటు తన ఇంట రహాస్యంగా ప్రత్యేక శిక్షణ గరిపి ముం దుకు పంపారు. 1941 మార్చి 27న నేతాజీ బెర్లిన్‌ చేరేంతవరకు ప్రమాదకర పరిస్థితులలో ఆయనను కళ్ళల్లో పెట్టుకుని కాపాడి గమ్యం చేర్చడంలో ముస్లిం యోధులు తోడ్పడ్డారు.


భారతదేశం వెలుపల నుండి వలసపాలకులను తరిమిగొట్టడానికి పోరుకు సిద్ధపడిన రాస్‌ బిహారి బోస్‌ మార్గదర్శకత్వంలో 1942 మార్చిలో జరిగిన సింగపూర్‌ సమావేేశంలో పాల్గొన్న మేజర్‌ మహమ్మద్‌ జమాన్‌ ఖైనిలాంటి వారు ఆ తరువాత 'భారత జాతీయ సైన్యం' కమాండర్‌ గా నేతాజీ తరువాతి స్థాయి అధికారిగా గణనీయ సేవలు అందించారు. ఆనాడు రాస్‌బిహారి, ప్రీతం సింగ్‌, కెప్టెన్‌ మాన్‌సింగ్‌ లాంటి నేతల నేతృత్వం లోని 'కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌', 'భారత జాతీయ సైన్యం'లలో కెప్టెన్‌ మహమ్మద్‌ అక్రం, కల్నల్‌ యం.జడ్‌. ఖైని, కల్నల్‌ జి.క్యూ. జిలాని, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ యస్‌.యన్‌.హుస్సేన్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌, మేజర్‌ ఇక్బాల్‌లు బాధ్యతలు నిర్వహించగా, ప్రముఖ ఉర్దూ కవి మహమ్మద్‌ ఇక్బాల్‌ రాసిన 'సారె జహాసే అచ్ఛా హిందూస్తాన్‌ హమార్‌' గీతాన్ని 'భారత జాతీయ సైన్యం' ప్రతి సందర్భంలో గానం చేస్తూ గౌరవించింది.


1941 మార్చిలో స్వదేశాన్ని వీడి జర్మనీ చేరుకున్న నేతాజీ జర్మనీలో 'స్వేచ్ఛా భారత కేంద్రం' (ఫ్రీ ఇండియా సెంటర్‌) ప్రారంభించారు. ఆ సందర్భంగా నేతాజీకి పరిచయమైన హైదరాబాది అబిద్‌ హసన్‌ సప్రాని, 1941 నవంబర్‌లో నేతాజీ ఏర్పాటు చేసిన 'భారతీయ కమాండో దళం' శిక్షకుడిగా, ఆ తరువాత 'ఆజాద్‌ హింద్‌ రేడియో'లో నేతాజీ ప్రసంగాల సహాయకుడిగా బాధ్యతలను నిర్వహించారు. భారత స్వాతంత్య్రోద్యమ సాహిత్య చరిత్రలో నినాదంగా నిలచిన 'జైహింద్‌' సుభాష్‌ పేరును కూడా మర్చిపోయేలా చేసిన 'నేతాజీ' నామాన్ని అబిద్‌ రూపొం దించారు. అబిద్‌ హసన్‌ సప్రాని కృషి వలన ఉనికిలోకి వచ్చిన 'జైహింద్‌' ఈనాటికి భారత దేశమంతటా ప్రతిధ్వనించడం అబిద్‌ సృజనాత్మకతకు తార్కాణం.


జపాన్‌ ప్రభుత్వాధినేతల పట్ల భారతీయ విప్ల వోద్యమ నేతల్లో ఏర్పడిన అభిప్రాయభేదాల కారణంగా తూర్పు అసియా ప్రాంతంలో జనరల్‌ మాన్‌సింగ్‌ నేతృత్వంలో ఏర్పడిన 'భారతీయ జాతీయ సైన్యం', 'కౌన్సిల్‌ ఆఫ్‌ యాక్షన్‌'లు 1942 డిసెంబర్‌ 29న రద్దయినట్టు జనరల్‌ మాన్‌సింగ్‌ ప్రకటించగా, విప్లవోద్యమ నేత రాస్‌ బిహరి బోస్‌ నేతృత్వంలో 1943 ఫిబ్రవరి 15న భారత జాతీయ సైన్యాన్ని పునర్‌వ్యవస్ధీకరించారు. ఆ సమయంలో భారత జాతీయ సైన్యం, దాని అనుబంధ సంస్థలను, కార్యకర్తలను, సైనికులకు మార్గదర్శకత్వం వహించేందుకు సుప్రీం మిలటరీ బ్యూరో సంచాలకులుగా లెఫ్టినెంట్‌ కల్నల్‌ జె.కె.భోన్స్‌లే బాధ్యతలు స్వీకరించగా లెఫ్టినెంట్‌ మీర్జా ఇనాయత్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఇషాన్‌ ఖాదిర్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని, మేజర్‌ మతా-ఉల్‌-ముల్క్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ బుర్హానుద్దీన్‌, మేజర్‌ ఎ.డి జహంగీర్‌, మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌, లెఫ్టినెంట్‌ అల్లాయార్‌ ఖాన్‌, మేజర్‌ మహమ్మద్‌ రజాఖాన్‌, కెప్టెన్‌ ముంతాజ్‌ ఖాన్‌, ఎస్‌.ఓ ఇబ్రహీం, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెంట్‌ మీర్‌ రహమాన్‌ ఖాన్‌, మేజర్‌ రషీద్‌, లెఫ్టినెంట్‌ కల్నల్‌ అర్షద్‌లు ముందుకు వచ్చి ప్రధానాధికారులుగా బాధ్యతలు చేపట్టారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియాని జనరల్‌ స్టాఫ్‌ ప్రధానాధికారిగా, సైనికుల శిక్షణాధికారిగా మేజర్‌ హబీబుర్‌ రెహమాన్‌, రిఎన్‌ఫోర్స్‌మెంట్‌ కమాండెం ట్‌గా మేజర్‌ ముతా-ఉల్‌-ముల్క్‌ , చరిత్ర-సంస్కృతి-పౌర సంబంధాల అధికారిగా మేజర్‌ ఏ.జడ్‌ జహంగీర్‌ ప్రధాన భూమికలను చాకచక్యంగా నిర్వర్తించారు.


ఈ పరిణామాల నేపధ్యంలో యూరప్‌ నుండి తూర్పు ఆసియాకు వెళ్ళేందుకు సుభాష్‌ చంద్రబోస్‌ నిర్ణయించు కున్నారు. రావాల్సిందిగా కోరుతున్న విప్ల వోద్యమ నేతల ఒత్తిడి మరింత పెరగడం, అవి ద్వితీయ ప్రపంచ సంగ్రామం జరుగు తున్న రోజులు కనుక జపాన్‌-జర్మనీల సహ కారంతో బ్రిటన్‌ దాని మిత్రపక్షాల సైన్యాలతో పోరా డుతున్న సుభాష్‌ చంద్రబోస్‌ ఆసియాకు వెళ్ళడం ప్రాణాంతకం కావడంతో బ్రిటీష్‌ గూఢచారి వ్యవస్థ డేగకళ్ళ నుండి తప్పించుకుని గమ్యస్థానం చేరడానికి నేతాజి రహస్యంగా జలాంతర్గమి ప్రయాణం తప్పలేదు. మూడు మాసాలపాటు 25,600 కిలోమీటర్లు సాగిన అత్యంత్య భయానక, సాహసోపేత జలాంతర్గమి ప్రయా ణంలో సుభాష్‌్‌కు అబిద్‌ హసన్‌ తోడుగా నిలిచి, భవిష్యత్తు కార్యక్ర మాల రూపకల్పనలో ఆయనకు తోడ్పడి చరిత్ర సృష్టించారు.


1943 మే 16న సుభాష్‌-అబిద్‌లు టోక్యో చేరుకున్నాక 1943 జూలై నాల్గున సింగపూర్‌లో జరిగిన సమావేశంలో తూర్పు ఆసియాలో సాగుతున్న భారత స్వాతంత్య్రోద్యమం నాయకత్వాన్ని సుభాష్‌ చంద్రబోస్‌ చేపట్టి 1943 అక్టోబర్‌ 23న 'ఆజాద్‌ హింద్‌' ప్రభుత్వాన్ని ప్రకటించారు. అ మరుక్షణమే మాతృభూమి విముక్తి కోసం, బ్రిటీష్‌ దాని మిత్రపక్షాల మీద యుద్ధం ప్రకటిస్తూ భారత జాతీయ సైన్యానికి 'చలో ఢిల్లీ' నినాదమిచ్చారు. భారత జాతీయ సైన్యంలో చేరమంటూ భారతీయులను కోరుతూ ఆజాద్‌ హింద్‌ రేడియా కేంద్రం ప్రసారం చేసిన ప్రతి కార్యక్రమంలో, మొగల్‌ చక్రవర్తి బహుదూర్‌ షా జఫర్‌ స్వయంగా రాసిన గీతంలోని 'స్వాతంత్య్ర పోరాటం జరుపు తున్న యోధులలో ఆత్మవిశ్వాసం ఉన్నంతకాలం లండన్‌ గుండెల్లో భారతీయుల ఖడ్గం దూసుకపోతూనే ఉంటుంది' అను చరణాలతో ఆలాపించడం అనవాయితయ్యింది.


భారత జాతీయ సైన్యం సర్వసైన్యాధ్యక్షులుగా, అజాద్‌ హింద్‌ ప్రభుత్వం అధినేతగా భాధ్యతలు స్వీకరించి సుభాష్‌ చంద్రబోస్‌ పలు ప్రధాన శాఖలకు సైన్యాధికా రులుగా లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ అజీజ్‌ అహమ్మద్‌, లెఫ్టినెన్ట్‌ కల్నల్‌ ఎం.జడ్‌ కియానిలకు బాధ్యతలు అప్పగిస్తూ, బషీర్‌ అహమ్మద్‌ను ప్రభుత్వ ప్రత్యేక సలహాదారునిగా నియమించారు. లెఫ్టినెంట్‌ కల్నల్‌ షానవాజ్‌ ఖాన్‌ సాయుధ దళాల ప్రతినిధిగా నియక్తుల య్యారు. ఆ తరువాతి క్రమంలో భారత జాతీయ సైన్యానికి సంబంధించిన మూడు డివిజన్లకు గాను రెండిటికి మేజర్‌ జనరల్‌ షా నవాజ్‌ ఖాన్‌, ఎం.జడ్‌ కియానిలు ప్రధానాధి కారులుగా బాధ్యతలు చేపట్టగా, రెజిమెంటల్‌ కమాం డర్లుగా ఐ.జె కియాని, ఎస్‌. ఎం. హుసైన్‌, బుర్హానుద్దీన్‌, షౌకత్‌ అలీ మలిక్‌ తదితరులు నియక్తులయ్యారు. ఈ సందర్భంగా సుభాష్‌ చంద్ర బోస్‌ ప్రత్యేక ఆసక్తితో ఏర్పాటు చేసిన 'ఝాన్సీరాణి రెజిమెంట్‌'లో ఎం.ఫాతిమా బీబి, సయ్యద్‌ ముంతాజ్‌, మెహరాజ్‌ బీబి, బషీరున్‌ బీబీ లాంటి నారీమణులు పలు బాధ్యతలు నిర్వహించారు.


స్వతంత్ర భారత ప్రభుత్వం, సైన్యం ఏర్పడ్డాక సాగుతున్న కార్యక్రమాలకు అన్నిరకాల సహాయసహకా రాలు అందించాల్సిందిగా సుభాష్‌ చంద్రబోస్‌ చేసిన విజ్ఞప్తికి ప్రతిస్పందిస్తూ రంగూన్‌కు చెందిన ప్రముఖ వ్యాపారి హబీబ్‌ సాహెబ్‌ తన రాజప్రసాదం లాంటి భవంతిని, ఆయనకున్న పొలాలు-స్థలాలు, కోటిన్నర రూపాయల విలువ చేసే ఆభరణాలను ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌కు ధారాదత్తం చేసి కట్టుబట్టలతో నిల్చోగా ఆయనను 'సేవక్‌-ఏ-హింద్‌' పురస్కారంతో నేతాజీ సత్కరించారు. ఈ క్రమంలో బషీర్‌ సాహెబ్‌, నిజామి సాహెబ్‌ అను మరో ఇరువురు సంపన్నులు విడివిడిగా 50 లక్షల రూపా యలను నేతాజీకి అందించగా, మరో ముస్లిం వ్యాపారి తనకున్న మూడు ప్రింటింగ్‌ ప్రెస్‌లను, యావదాస్తిని 'నేతాజీ నిధి' పరం చేశారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం విజయ నగరం జిల్లా వేపాడు (ప్రస్తుతం) నివాసి షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌ అతి కష్టం మీద కూడపెట్టుకున్న 20వేల రూపా యలను స్వయంగా 'నేతాజీ నిధి'కి అప్పగించి, రైఫిల్‌ మన్‌గా భారత జాతీయ సైన్యంలో చేరి సేవలందచేశారు.


'చలో ఢిల్లీ' పిలుపును సాకారం చేయడానికి అరకాన్‌ యుద్ధరంగంలో తొలిసారిగా కల్నల్‌ ఎస్‌.యం మలిక్‌ నేతృత్వంలోని భారతీయ జాతీయ సైన్యం బ్రిటీష్‌ సైన్యాలను మట్టికరిపించి మాతృభూమి మీద అడుగు పెట్టి మణిపూర్‌లోని మొయిరాంగ్‌ వద్ద త్రివర్ణ పతాకాన్ని సగర్వంగా ఎగురవేసింది. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లోని వివిధ శాఖలలో అధికారులుగా బాధ్యతలను నిర్వహించిన యోధులలో దేశం వివిధ ప్రాంతాలకు చెందిన నక్కి అహ్మద్‌ చౌదరి, అష్రాఫ్‌ మండల్‌, అమీర్‌ హయత్‌, అబ్దుల్‌ రజాఖ్‌, ఆఖ్తర్‌ అలీ, మహమ్మద్‌ అలీషా, అటా మహమ్మద్‌, అహమ్మద్‌ ఖాన్‌, ఎ.కె. మీర్జా, అబూ ఖాన్‌, యస్‌. అఖ్తర్‌ అలీ, అహమ్మదుల్లా, అబ్దుర్‌ రహమాన్‌ ఖాన్‌ లాంటి వారున్నారు. చరిత్ర సృష్టించిన ఈ పోరాటంలో ఆంధ్ర పదేశ్‌కు చెందిన ముస్లింలూ భారీ సంఖ్య భాగస్వాముల య్యారు. మన రాష్ట్రం నుండి అబిద్‌ హసన్‌ సప్రానితో పాటుగా ఖమురుల్‌ ఇస్లాం, తాజుద్దీన్‌ గౌస్‌, హైదరాబాద్‌ చార్మినార్‌ సిగరెట్‌ కంపెనీ (వజీర్‌ సుల్తాన్‌ టొబాకో కంపెనీ) యజమాని కుమారుడు అలీ సుల్తాన్‌ కూడా భారత జాతీయ సైన్యంలో పనిచేశారు. హైదరాబాదు సంస్థానానికి చెందిన షరీఫుద్దీన్‌, అబ్దుల్‌ సయీద్‌ ఉస్మా ని, అబ్దుల్‌ లతీఫ్‌, ఇమాముద్దీన్‌, ముహమ్మద్‌ ఖాన్‌ లాంటి పలువురు నేతాజీ బాటలో నిర్భయంగా నడిచారు. ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం జిల్లా వేపాడు గ్రామానికి చెందిన షేక్‌ ఖాదర్‌ మొహిద్దీన్‌, ప్రకాశం జిల్లా దర్శి తాలూకా చెందిన షేక్‌ బాదుషా, చిత్తూరు జిల్లా చంద్రగిరికి చెందిన యస్‌.అబ్దుల్‌ అలీ,చిత్తూరు జిల్లాకు చెందిన మహ మ్మద్‌ అఫ్జల్‌ సాహెబ్‌, పుంగనూరుకు చెందిన పి.పి.మహ మ్మద్‌ ఇబ్రహీం, కడపజిల్లా రాయచోటికి చెందిన అబ్దుల్‌ ఖాదర్‌, పశ్చిమగోదావరి జిల్లా తణుకుకు చెందిన షేక్‌ అహమ్మద్‌ ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌ పోరాటాలలో భాగస్వాములయ్యారు.


ఇంఫాలా-కోహిమాలను ఆక్రమించి అస్సాం లోకి అడుగుపెట్టాలని ముందుకు సాగుతున్న భారత జాతీయ సైన్యానికి ఒకవైపున ప్రకృతి మరోవైపున ఆహారం, ఆయుధాలు, రవాణా తదిరల అవసరాల తీవ్ర కొరత దెబ్బతీసింది. ఈ లోగా భారీ సైనిక బలగాలను సమ కూర్చుకున్న బ్రిటన్‌ దాని మిత్ర పక్షాల సైన్యం దాడులను మరింత తీవ్రతరం చేసింది.


ఆ తరుణంలో భారత జాతీయ సైన్యానికి అరకొరగా నైనా ఆర్థిక-ఆయుధ మద్దత్తు ఇస్తున్న జపాన్‌ దారుణంగా దెబ్బతిన్నది. మరోవైపున జర్మనీ కుప్ప కూలింది. బ్రిటన్‌-ఆమెరికా పక్షాలు విజయం సాధిం చాయి. ఆ కారణంగా 1945 ఆగస్టు 15న జపాన్‌ తన ఓటమిని అంగీకరిస్తూ ప్రకటన విడుదల చేయగా భారత జాతీయ సైన్యం కూడా యుద్దరంగం నుండి తప్పుకోవాల్సి రావడంతో నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ యుద్ధరంగం నుండి తప్పుకుని ఆగస్టు 18న కల్నల్‌ హబీబ్‌తో కలసి నేతాజీ సుభాష్‌ చంద్ర బోస్‌ బాంబర్‌ విమానంలో బయలుదేరారు. ఆకాశంలోకి ఎగిరిన ఆ విమానం ఫోర్‌మొసా ద్వీపంలో కూలిపోవడంతో తీవ్రంగా గాయ పడిన సుభాష్‌ చంద్రబోస్‌ ఆగస్టు 19న కన్నుమూశారు. ఆయనతోపాటు ప్రయాణించిన కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ చికిత్స అనంతరం బతికి బయటపడ్డారు. ఆ దుర్భర క్షణాలలో 'హబీబ్‌, నాకు తుది ఘడియలు సమీపించాయి. జీవితాంతం నేను దేశ స్వాతంత్య్రం కోసం పోరాడాను. నేను నా దేశ స్వాతంత్య్రం కోసం మరణిస్తున్నాను. భారత స్వాతంత్య్ర పోరాటం సాగించమని నా ప్రజలకు తెలియ జెయ్యి. త్వరలోనే భారత దేశం విముక్తి చెందుతుంది' అని సుభాష్‌ చంద్రబోస్‌ కల్నల్‌ హబీబుర్రెహమాన్‌ ద్వారా భారతీయులకు తన చివరి సందేశం పంపారు

Wednesday, August 17, 2011

[జన్మమెత్తితిరా] మనిషియందె మహాత్ముని కాంచగలవురా


జన్మమెత్తితిరా అనుభవించితిరా
బ్రతుకు సమరములో పండిపోయితిరా
మంచి తెలిసి మానవుడుగా మారినానురా [జన్మమెత్తితిరా]

స్వార్థమను పిశాచి మదిని స్వారి చేసెరా
బ్రతుకంతా చెలరేగిన ప్రళయమాయెరా
దైవ శక్తి మృగత్వమునే సంహరించెరా
సమర భూమి నా హృదయం శాంతి పొందెరా [జన్మమెత్తితిరా]

క్రోధ లోభ మోహములే పడగలెత్తెరా
బుసలు కొట్టి గుండెలోన విషము గ్రక్కెరా
ధర్మ జ్యోతి తల్లివోలె ఆదరించెరా
నా మనసె దివ్య మందిరముగా మారిపోయెరా [జన్మమెత్తితిరా]

మట్టియందె మాణిక్యము దాగియుండురా
మనిషియందె మహాత్ముని కాంచగలవురా
ప్రతి గుండెలో గుడిగంటలె ప్రతిధ్వనించురా
ఆ దివ్య స్వరం న్యాయ పధం చూపగలుగురా [జన్మమెత్తితిరా]

--అనిశెట్టి
 

Tuesday, August 16, 2011

mirapakaaya bajji మిరపకాయ బజ్జి

మిరపకాయ బజ్జి
===============

చిన్నదే యనుకొని చిన్న చూపులు వద్దు

మరచి మింగిన ఘాటు మాడ కెత్తు

మేనెల్ల తాకంగ మెత్తమెత్తగ దోచు

అంతరంగమునుండు యసలు కిటుకు

పైపైన రుచిచూసి ఫర్లేదు యనవద్దు

కొరుకంగ గట్టిగ గుణము తెలియు

మరువదెపుడు జిహ్వ మరగెనా రుచిదీని

వద్దనక తినగ సిద్ధ పడును

ఆహ!వోహొ! యనుచు ఆరగింతురెపుడు

నీరు మింగి కనుల నీరు నింపి!

కష్టమనక తినుట కిష్ట పడెడు

ఘనత కలదు మిరపకాయ బజ్జి!

============
విధేయుడు
_శ్రీనివాస్

ఈ జీవనవైభవమంతయు తుదకు నశించుటకేనా?

ఇదేనా ఇంతేనా జీవితసారమింతేనా?

అంతులేని ఈ జీవనవైభవమంతయు

తుదకు నశించుటకేనా?




బోసినవ్వులను కువ్వలుపోసే

పసిపాపల బ్రతుకు ఇంతేనా

జీవితసారమిదేనా

ఆటపాటల నలరించుచు

సెలయేటివోలే వెలివారే బ్రతుకూ ఇంతేనా

కిలకిలనవ్వుచు తొలకరివలపుల పొలకవోయు

జవరాలి వయ్యారము ఇదేనా ఇంతేనా




దాచుకున్న వయసంతయు మగనికి

దోచి యిచ్చుఇల్లాలి గతి ఇదేనా ఇంతేనా

పురిటిపాప చిరుపెదవులతావున

మురిసిపోవు బాలింతబ్రతుకు ఇదేనా ఇంతేనా

తనబలగము ధనధాన్యములనుగని

తనిసే ముదుసలి పేరాశ ఫలము ఇదేనా ఇంతేనా

సకల శాస్త్రములు పారసమిడినా

అఖిల దేశముల ఆక్రమించినా

కట్తకడకు ఈ కాయము విడిచీ

మట్టిగలిసి పోవలెనా?

మట్టిగలిసి పోవలెనా?




--యోగి వేమన.చిత్తూరు వి.నాగయ్య,సముద్రాల రాఘవాచార్యులు 1947

Friday, August 05, 2011

ప్రశ్నలా కాదా ?!



   ప్రశ్నలా కాదా ?!
===============

పైసలిస్తే పనిచేస్తారా?
పని చేస్తే పైసలిస్తారా?

పని చేస్తే పైసలిస్తే జీతం
పైసలిస్తే పని చేస్తే లంచం
పైసలిచ్చినా పని చేయకపోతే ఘోరం!

ఆకలి అయితే తింటారా?
తింటే ఆకలి అవుతుందా?

ఆకలి అయితే తింటే భోజనం
తింటే ఆకలి అయితే జీర్ణం
ఆకలి కాకున్నా తింటే రోగం!

ప్రేమిస్తే పెళ్ళవుతుందా?
పెళ్ళైతే ప్రేమిస్తారా?

పెళ్ళై ప్రేమిస్తే సంతోషం
ప్రేమిస్తే పెళ్ళైతే సుఖాంతం
పెళ్ళైనా ప్రేమించకపోతే విషాదం!

వార్తలొస్తాయని టీవీ చూస్తారా ?
టీవీ చూస్తారని వార్తలొస్తాయా ?

వార్తలొస్తాయని టీవీ చూస్తే ఆశ
టీవీ చూస్తారని వార్తలొస్తే దురాశ
టీవీ చూసినా వార్తలు రాకపోతే నిరాశ!

మాట్లాడటానికి ఫోను చేస్తారా?
ఫోను చేస్తే మాట్లాడుతారా?

ఫోను చేస్తే మాట్లాడుతే పరిచయమున్నవారు
మాట్లాడటానికి ఫోను చేస్తే తెలిసిన వారు
తప్పు నంబరైనా మాట్లాడుతుంటే అంతా నావారే అనుకునేవారు!
==========
విధేయుడు
-శ్రీనివాస్

Tuesday, July 26, 2011

అంధకార చారిత్రిక

 
"అరిగిన సబ్బు
తరిగిన మబ్బు
పెరిగిన గబ్బు
కావేవీ అవార్డులకు అనర్హం"
అనేవారేమో శ్రీశ్రీ!
"Graveyards are full of indispensable men" said Charles DeGaulle. కాదు, బతికినప్పుడు కుడా అన్నట్లు, ఉన్నప్పుడు చూపని గౌరవమంతా లేనప్పుడు గుర్తుకుతెచ్చుకోవడం, వారికి ఫలానా అవార్డులివ్వకపోవడం గురించి మాట్లాడుకోవడం తెలుగువారి ప్రత్యేకతగా మారిపోతుందేమో అని చెడ్డ అనుమానం!

ఎవ్వరైనా ఏడిపించొచ్చు. నవ్వించడం, ఎవ్వరినీ నొప్పించకుండా నవ్వించడం, అదీ అక్షరాలతో సాధించడం నవ్వులాట కాదు. చతురోక్తులతో చిత్రోక్తులతో చిరునవ్వును సరసంగా గుబాళింపజేసిన ముళ్ళపూడివారి మాటలకు ఏ అవార్డులొచ్చినా రాకపోయినా నవ్వును మాత్రం రివార్డుగా ఇస్తూనే ఉంటాయి.

కథలో నవ్వించడం ఒక ఎత్తు. జీవితంలో నవ్వును గుర్తించడం ఇంకో ఎత్తు. క్లిష్ట సమయాల్లో సైతం sense of humor వీడకపోవడం చాలా మందికి అందనంత ఎత్తు. అంతటి ఎత్తులను కూడా పరికించి, గుర్తించి జరిగిన ఉదంతాలను మనసులనుండి జరిగిపోకుండా ఉండే రీతిగా వారు వ్రాసిన కొన్నిటిని పంచుకోవడం మాత్రమే.
[Source: ముళ్ళపూడూ గారి "హాస్యజ్యోతి" నుండి]
-------------------------------
* వేదాంతి, రసతపస్వి అయిన ముట్నూరి కృష్ణారావుగారు మరణ శయ్యపై ఉండగా, ఆయన భార్య పక్కనే కూచుని కంట తడి పెట్టింది. ఆ దశలో కూడా ఆయన చిరునవ్వుతో "అప్పుడే రిహార్సల్స్ మొదలు పెట్టావా" అన్నారట ఆమెతో.

* టైముకి రావడం శాస్త్రీయం, టైముకి రాకపోవడం కృష్ణశాస్త్రీయం- శ్రీశ్రీ

* ఒకసారి జ్వరపడి మంచంలోఉన్న దిగ్గిరాలవారిని పరామర్శించడానికి వెళ్ళారు దువ్వూరి సుబ్బమ్మగారు. ఆయనను పలకరించి "జ్వరం ఎక్కువగా ఉందా" అంటూ చెయ్యిపట్టికు చూడసాగింది.
"అసలే నేను జ్వరంతో బాధపడుతుంటే పైగా పాణిగ్రహణం కూడానా" అన్నారట ఆంధ్రరత్న చలోక్తిగా.

* కట్టమంచి రామలింగారెడ్డిగారు ఆంధ్రవిశ్వవిద్యాలం ఉపాధ్యక్షులుగా చాలా కాలం పనిచేశారు. ఆయన ఆజన్మ బ్రహ్మచారి. ఆంధ్రవిశ్వవిద్యాలయమే తన ప్రేయసీ అని చెప్పుకునేవారు. ఒక సభలో ఆయనను భీషుడు, హనుమంతుడు అంటూ కొందరు వక్తలు ప్రస్తుతించడం ప్రారంభించారు. తర్వాత రెడ్డిగారు అందుకొని "లేనిపోని ఉపమానాలని విశేషాణలను ఎందుకు దురివినియోగం చేస్తారు?" "అవివాహితుడు" అంటే
సరిపోతుంది" అన్నారు.

* శ్రీపాద వారు "స్మశాని వాటికి" రచనను ప్రాణం మీదికి వచ్చిన రోగిన చూడడానికి వెళ్తున్న డాక్టర్ ఆచంట లక్ష్మీపతి గారికి ఇచ్చారట. "శాస్త్రిగారూ మీకి బొత్తిగా లొక్యం లేదండీ" అన్నారటాయన.

* 1949 లో హైదరాబాదు నిజాం పాలనను అంతమొందించడానికి భారత ప్రభుత్వాం "పోలీసు చర్య" అమలు జరిపింది. తర్వాత దానికి అయిన ఖర్చూ ఏ పద్దుకింద చేర్చాలో ప్రభుత్వానికి అర్థం కాక తికమక పడింది. అది పోలీసు చర్య కనుక భార్త రక్షణ శాఖ ఆ ఖర్చుని భరించడానికి నిరాకరించింది. పోలీసు బలగాన్ని వినియోగించలేదని, అంతా మిలిటరీ వారే పాల్గొన్నారని, కాబట్టి ఆ ఖర్చుతో తమకి సంబంధంలేదని హోంశాఖ
తరస్కరించింది. పైగా అది క్రమశిఖణ చర్య కనుక ఆ ఖర్చుని విద్యాశాఖకి బదలాయించమని సలహా ఇచ్చింది. కేంద్ర విద్యాశాఖ అందుకు నిరాకరించి "హైదరాబాదుపై పోలీసు చర్య దేశానికి పట్టుకున్న వ్యాధినిర్మూలన పథకంలో భాగం కనుక ఖర్చు ఆయోగ్య శాఖపరణ్గా వ్రాయించ" మన్న సూచనను పాటించి ఆ ఖర్చుని ఆరోగ్యాశాఖ భరించింది."
---------
అంధకార చారిత్రిక సంఘటనలో సైతం హాస్యాన్ని వెతికి పట్టుకోవడం ముళ్ళపూడివారికే చెల్లు.
=======================================
విధేయుడు
-శ్రీనివాస్


అట జని కాంచె భూసురుడు

 
==================================================
ఈ నెల "తెలుగునాడి"లో రెండు మంచి పద్యాలున్నాయి. ఒకటి సుమతి శతకం, ఇంకొకటి మనుచరిత్ర నుండి.
---------------------
"మాటకు ప్రాణము సత్యము
కోటకు ప్రాణంబు సుభట కోటి ధరిత్రిన్
బోటికి ప్రాణము మానము
చీటికి ప్రాణంబు వ్రాలు సిద్ధము సుమతీ!"
నోటి మాటకు సత్యం, పెద్ద దుర్గానికి గొప్ప సైన్య సమూహం, స్త్రీకి అభిమానం, పత్రానికి చేవ్రాలు ముఖ్యమైన ఆధారాలు.
---------------------
"చీటికి" బదులు "చీకటి" అని ఉంది. టైపో అనుకుంటాను.

పెద్దన విరచిత మనుచరిత్ర లోని పద్యాన్ని శ్రీ పాపినేని శివశంకర్ గారు పరిచయం చేసిన దాని నుంచి కొంత పంచుకోవడం
----------------------------------------------
[Source: TeluguNaaDi - Feb-March 2011 Issue]
"అట జని కాంచె భూమిసురు డంబర చుంబి శిరస్సరజ్ఝరీ
 పటల ముహుర్ముహుర్లుఠ దభంగ తరంగ మృదంగ నిస్వన
 స్ఫుట నటనానుకూల పరిపుల్ల కలాప కలాపి జాలమున్
 గటక చరత్కరేణు కరకంపిత సాలము శీతశైలమున్"
 భూమిసురుడు = బ్రాహ్మణుడైన ప్రవరుడు
 అటన్+చని = అక్కడికి వెళ్ళి
 అంబర చుంబి = ఆకాశాన్ని తాకుతున్న
 శిరస్ = శిఖరాల నుండి
 సరత్ = జారుతున్న
 ఝరీపటల = సెలయేళ్ళ సమూహంలో
 ముహుః + ముహుః = మాటి మాటికి
 లుఠత్ = దొర్లుతున్న
 అభంగ = ఎడతెగని
 తరంగ = అలలు అనే
 మృదంగ = మద్దెలల యొక్క
 నిస్వన = ధ్వనుల చేత
 స్ఫుట = స్పష్టమైన
 నటన + అనుకూల = నాట్యమునకు తగినట్లుగా
 పరిపుల్ల = మిక్కిలి విప్పారిన
 కలాప = పురులుగల
 కలాపి జాలమున్= ఆడ నెమళ్ళు గల దానిని
 కటక చరత్ = పర్వత మధ్యప్రదేశాల్లో తిరిగే
 కరేణుకర = ఆడ ఏనుగుల తొండాల చేత
 కంపిత = కదిలించబడిన
 సాలమున్ = మద్దిచెట్లు గల దానిని
 శీతశైలమున్ = మంచుకొండను
 కాంచెన్ = చూశాడు

మంచుకొండ కొమ్ములు నింగిని తాకుతున్నాయి. వాటి నుండి సెలయేళ్ళు జారుతున్నాయి. వాటిలో లేచిపడే
 అలల సవ్వడి మద్దెలమోతల్లాగా ఉన్నాయి. వాటికి పరవశించిన నెమళ్ళు పురివిప్పి ఆడుతున్నాయి.
 ఏనుగుల తొండాలతో అక్కడి మద్దిచెట్లను పెకలిస్తున్నాయి. అటువంటి మంచుకొండను చూశాడు ప్రవరుడు.

ఇంత సరళంగా చెప్పగలిగిన సంగతిని ఎందుకింత ప్రౌఢగంభీరంగా వర్ణించాడు కవి? హిమాలయ పర్వతం
 అసామాన్యమైనది. మహోన్నతమైనది. ఆ మహత్వాన్ని, మహాద్భుత దృశ్యాన్ని స్ఫురింపజేయటానికి అంత
 సంస్కృత పదాటోపం అవసరమైంది. పద్యంలో ముచ్చెం మొదటి మూడూ మాటలు తప్ప (అట, చని, కాంచె)
 తక్కినవన్నీ సంస్కృతం నుండి దిగిన తత్సమపదాలే.

 కేవలం శబ్దం ద్వారానే అర్థస్ఫురణ గావించటం ఈ పద్యంలో విశేషం. "అంబరచుంబి శిరస్సరజ్ఝరీ పటల"
 మన్నప్పుడు నింగినంటిన కొండల నుండి జాలువారే సెలయేళ్ళ ధారాప్రవాహం మనో నేత్రం ముందు
 కనబడుతుంది.

 మద్దెల చప్పుళ్ళకి, మేఘధ్వనులకి నెమళ్ళు ఆహ్లాదంతో పురివిప్పి ఆడతాయని ప్రసిద్ధి. ఆ సెలయేటి అలలు
 రాళ్ళకు కొట్టుకొని మద్దెలలాగా మోగుతున్నాయి. అభంగ, తరంగ, మృదంగ అనే పదాల ద్వారా ఆ మద్దెలల
 మోత వినిపించాడు కవి. "స్ఫుటనటనానుకూల" అనేచోట నాట్యం స్ఫురింపజేస్తున్నాడు. అక్షరాలు
 నర్తిస్తున్నట్టు, ఆయా అర్థాలను స్ఫురింజేస్తున్నట్టు రచించటం వికటత్వం. (వికటత్వ ముదారతా- వామనుడు)
  వికటత్వం గల కూర్పు ఔదార్యం. ఈ పద్యంలో ఔదార్యం అనే గుణం ఉంది. దీనికి తోడు దీర్ఘసమాసాలతో కూడిన
 గాఢబంధం వల్ల ఓజోగుణం కూడా చేకూరింది.

"అంబరచుంబి, శిరస్సరత్, ముహుర్ముహుః, అభంగ తరంగ మృదంగ, స్ఫుట నటనానుకూల, కలాపకలాపి,
సాలము శీతశైలము" - ఈ చోటుల్లో వృత్త్యనుప్రాస, ఛేకానుప్రాస, అంత్యప్రాస, యమకంలాంటి
 శబ్దాలంకారాలున్నాయి. తరంగ ధ్వనుల్ని మృదంగధ్వనులుగా నెమళ్ళు భ్రమించినట్టు వర్ణించటం చేత
 భ్రాంతిమదలంకారం అవుతుంది.

 "అల్లసాని వాని అల్లిక జిగిబిగి" పేరు గాంచింది. అల్లిక అంటే పద్యమల్లటమే. జిగి అంటే తళుకు. బిగి అంటే
 బిగువు. మృధుమధురమైన పదప్రయోగం, వ్యర్థ పదాలు లేని దృఢమైన పదబంధం - ఇదే అల్లిక జిగిబిగి.
----------------------------------------------
 ఎన్నో విషయాలు ఆసక్తికరంగా అందించిన శివశంకర్ గారికి చాలా కృతజ్ఞతలు.

 చిన్న సందేహం. ప్రతిపదార్థంలో "కలాపి" అంటే ఆడనెమళ్ళు అన్నారు. ద్వా.నా.శాస్త్రిగారి "తెలుగు సాహిత్య
 చరిత్ర"లో మగనెమళ్ళు నాట్యం చేస్తున్నాయి అని ఉంది. నిఘంటువులో "కలాపి"కి నెమలి అనే ఉంది.
 మామూలుగా మగనెమళ్ళ నాట్యమే ప్రసిద్ధం. తెలిసిన వారు దయచేసి వివరించ మనవి.
=============
 విధేయుడు
 -శ్రీనివాస్

సీత నవ్వు

 
 సీత నవ్వు
 =====
"వామాంకస్థిత జానకీ పరిలసత్ కోదండ దండాంకరే" అన్న శ్లోకం, భద్రాద్రి రామున్ని సీతా సమేతంగా సౌమిత్రి యుక్తంగా కోదండ ధారిగా మనస్సులో నిలుపుతుంది.
అంతే అందంగా, అంతకంటే అదనంగా, ఆంజనేయసహితంగా, తెలుగులో శ్రీనమశ్శివాయగారి వెంకట నరసింహులు గారి ఈ పద్యం ఆకట్టుకుంది.
--------------------------------------------
"తమ్ముడు లక్ష్మణుండు పెదతమ్ముడు యా భరతుండు చేరి వి
  ల్లమ్ములు దాల్చి నిల్వ చరణంబులనంటియు నాంజనేయుడా
 నమ్మిన బంటు కొల్వ విభవమ్మున బంగరు గద్దె మీద సీ
 తమ్మ సమేతుడౌ దశరథాత్మజు శ్రీరఘురాము గొల్చెదన్"
--------------------------------------------
 శ్రీరామనవమి సందర్భంగా వ్రాసిన ఒక పద్యం

సీ.
 నవ్వగాను తరులు పువ్వులై వికసించె
 విరుల నవ్వులుజిమ్మె పరిమళాలు
 గిరులన్ని నవ్వంగ ఝరులు పరుగులెత్తె
 నాట్యమాడె యలలు నదులు నవ్వ
 మంద్రంగ నవ్వుచు మలయమారుతమేగె
 కోకిల నవ్వుచు కూయగాను
 పుడమియే నవ్వంగ పులకించె ప్రకృతి
 నింగి నవ్వినపుడు నీల కాంతి

 ఆ.
 రాము చేత విల్లు రయముగ విరుగంగ
 పుడమి బెదిరి కొంత కడలి తొణక
 చిర్నగవుల తోడ సీతరాముని జేర
 సీత నవ్వుకెల్ల సృష్టి నవ్వె!
 ===========
విధేయుడు
 -శ్రీనివాస్